Wednesday, 19 April 2017

తలాకు మతలబులు - Wahed

తలాకు మతలబులు - Wahed 
- వాహెద్
బే పర్దా నజర్ ఆయేం జో కల్ చంద్ బీబియాం
అక్బర్ జమీన్ మేం గీరత్ ఖౌమీ సే గడ్ గయా
పూఛా జో మైం నే ఆప్ కా పర్దా వో క్యా హువా
కహనే లగేం కీ అఖల్ పర్ మర్దోం కే పడ్ గయా
- అక్బర్ అలహాబాదీ
ఇది చాలా మందికి అర్ధమయ్యే ఉంటుంది. అర్ధం కాని వారి కోసం అనువాదం :
బురఖా (పరదా) లేకుండా కొందరు మగువలు కనిపించారు, జాతి మర్యాద తగ్గిపోవడం చూసి నేలలో కూరుకుపోయాను, మీ పరదా ఏమైందని అడిగాను, మగవాళ్ళ బుద్ధిపై పడిందని వాళ్ళన్నారు.
నేటి ఈ పరిస్థితికి మగవాళ్ళ బుధ్ధులు బురఖా తొడుక్కోవడం ఒక కారణమైతే, వార్తలు బురఖా తొడుక్కుని మన ముందుకు రావడం మరో కారణం. ఇప్పుడు నగ్నసత్యాలనేవి లేవు. బురఖా తొడుక్కున్న వార్తలే రోజూ మీడియాలో కనిపిస్తున్నాయి.
అక్బర్ అలహాబాదీ బ్రిటీషు కాలంలో సెషన్స్ జడ్జిగా పనిచేసిన కవి. పంకజ్ ఉధాస్ పాడిన ఒక గజల్లో ఈ ఖతాను ఆలాపనగా వాడుకున్నాడు. ’’నికలో నా బే నకాబ్ జమానా ఖరాబ్ హై‘‘ అంటూ పంకజ్ పాడిన ఆ గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్లలో ఒకటి. అందులో ఒక మిశ్రా కూడా నేటి పరిస్థితికి సరిపోతుంది.
మతలబ్ ఛుపా హువా హై యహాం హర్ సవాల్ మేం
దో సోచ్ కర్ జవాబ్, జమానా ఖరాబ్ హై
(ప్రతి ప్రశ్నలోను మతలబుంది. కాస్త ఆలోచించి జవాబివ్వు, కాలం బాగోలేదు.)
రామాయణంలో పిడకలవేటలా, తలాకు గొడవలో కవిత్వం గోలెందుకంటే ఒక్కోసారి సంక్లిష్టమైన విషయాలు కూడా కవిత్వం వల్ల చాలా సులభంగా అర్ధమైపోతాయి. మగాళ్ళ బుద్ధులు బురఖా తొడుక్కున్నాయి కాబట్టే ఈ తలాక్ గొడవ వచ్చింది. వార్తలు బురఖా తొడుక్కుని మన ముందుకు వస్తున్నాయి కాబట్టే నిజాలు నగ్నంగా మన ముందుకు రావడం లేదు.
ఇప్పుడు మళ్ళీ త్రిపుల్ తలాక్ సమస్యను రాజేయడం జరుగుతోంది. ఈ విషయమై కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం.
తలాక్ అంటే విడాకులు. కాని షరియా పరిభాషలో (ముస్లిమ్ పర్సనల్ లా అంటే పూర్తి షరియత్ కాదు. అది షరియత్ లో ఒక భాగం మాత్రమే) తలాక్ అంటే భర్త తరఫున విడాకులివ్వడం.
భర్త తన భార్యకు విడాకులివ్వాలంటే దివ్యఖుర్ఆన్ చెప్పిన సరయిన పద్ధతి:
1. భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోతే వారిద్దరు కలిసి మాట్లాడుకుని పరిష్కార ప్రయత్నం చేయాలి.
2. అప్పటికి సయోథ్య సాధ్యపడకపోతే ఇరువురి బంధువులు, సన్నిహితులు వారి మధ్య సయోథ్యకు ప్రయత్నించాలి.
3. అప్పటికి సయోథ్య కుదరకపోతే భార్య తరఫున ఒక మధ్యవర్తి, భర్త తరఫున ఒక మధ్యవర్తిని నియమించుకుని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి.
4. అప్పటికి వారిద్దరు కలిసి ఉండడం కుదరని పక్షంలో అప్పుడు విడాకుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
5. భర్త తలాక్ ఇవ్వాలనుకుంటే, క్రింది షరతులు వర్తిస్తాయి
- కోపంలో తలాక్ ఇవ్వకూడదు. కోపంలో మూడు సార్లు కాదు ముప్పయి సార్లు చెప్పినా తలాక్ కాదు
- మత్తులో తలాక్ ఇవ్వరాదు. (మద్యపానం నిషిద్ధమైనా, చట్టపరంగా అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ మద్యం మత్తులో తలాక్ ఇవ్వరాదని స్పష్టంగా చెప్పడం జరిగింది)
- భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు తలాక్ ఇవ్వరాదు.
- భార్య రుతుకాలంలో లేనప్పుడైనా సంభోగం తర్వాత వెంటనే తలాక్ ఇవ్వరాదు.
6. భర్త పై షరతులను దృష్టిలో ఉంచుకుని భార్యతో తాను తలాక్ ఇస్తున్నట్లు చెప్పాలి. ఇది సాక్షుల సమక్షంలో జరిగి తలాక్ నామా రాయించడం ఉత్తమం.
7. అలా చెప్పిన తర్వాత మూడు నెలల కాలం అంటే భార్య మూడు రుతుస్రావాల కాలం వరకు ఆమె అతని ఇంటనే ఉంటుంది. అయితే వారి మధ్య దాంపత్య సంబంధం ఉండదు. ఈ మూడు నెలల కాలంలో భర్తలో మార్పు వచ్చి తలాక్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే తలాక్ అమలు కాదు. భర్త ఆ విషయాన్ని సాక్షులకు తెలియజేయాలి.
8. ఒకవేళ భర్తలో మార్పు రాకుంటే, మూడు నెలల తర్వాత తలాక్ అమలవుతుంది. విడాకులు అమలై నట్లే. మూడు సార్లు తలాక్ చెప్పవలసిన అవసరం లేదు. ముప్పయి సార్లు చెప్పవలసిన అవసరమూ లేదు.
అంటే ఒక్కసారి తలాక్ చెప్పినా సరిపోతుంది. మూడుసార్లు తలాక్ చెప్పాల్సిన పనేలేదు. ఇది సరయిన పద్ధతి.
మరి ఈ త్రిపుల్ తలాక్ ఏమిటి .. ఎక్కడి నుంచి వచ్చిందంటే...
అలా ఒకసారి భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ భర్త అదే భార్య కావాలనుకుంటే అప్పుడు ఆమెను మళ్ళీ నికాహ్ చేసుకోవలసి ఉంటుంది. అయితే కొత్తగా మళ్ళీ మెహర్ చెల్లించాలి.
అలా ఆ దంపతులు ఒకసారి విడిపోయి మళ్ళీ అంటే రెండవసారి నికాహ్ చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య ఘర్షణలు మొదలైతే చివరకు విడాకుల వరకు వెళితే మళ్ళీ తలాక్ ప్రక్రియ మొదట చెప్పినట్లు మొత్తం జరగవలసిందే. అది ఆ దంపతులకు రెండవ తలాక్ అవుతుంది.
అలా రెండవ తలాక్ అయిన తర్వాత ఆ భర్త మళ్ళీ అదే భార్య కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఆమెను వివాహం చేసుకోవచ్చు. అయితే మళ్ళీ మెహర్ చెల్లించవలసి ఉంటుంది.
అలా ఆ దంపతులు రెండుసార్లు విడిపోయి మళ్ళీ కలిసిన తర్వాత మూడవసారి మళ్ళీ ఘర్షణలు మొదలై విడాకుల వరకు వెళితే (ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి) అప్పుడు జరిగేది మూడవ తలాక్. అలా ఆ దంపుతుల మధ్య మూడవ తలాక్ జరిగిపోతే వారిద్దరు మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం లేదు.
వివాహాన్ని ఒక ఆటగా మార్చి మాటి మాటికి విడాకులిచ్చి మళ్ళీ కలిసిపోవడం అనేది లేకుండా చేయడానికే ఈ ఏర్పాటు. ముఖ్యంగా విడాకుల్లో భర్త తరఫునే కోపంతో విడిపోయే నిర్ణయాలుంటాయి. కాబట్టి ఆ భర్తను శిక్షించడానికే మూడవసారి విడాకులన్నావా, ఇక ఆ భార్య మళ్ళీ దొరకదని చెప్పడానికే ఈ ఏర్పాటు. మూడు సార్లు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆ భర్త అదే భార్య కావాలనుకుంటే కఠినమైన షరతులున్నాయి. ఆమె మరొకరిని వివాహం చేసుకుని ఆ భర్త చనిపోవడమో, విడాకులివ్వడమో జరిగితే తప్ప ఆమెను ఆ భర్త మళ్లీ వివాహం చేసుకోలేడు.
ఇది సరయిన తలాక్ పద్ధతి. ఈ పద్ధతిని పాటిస్తే విడాకులనేవి చాలా అరుదై పోతాయి. కోపంలోనే సాధారణంగా విడాకుల ప్రస్తావన వస్తుంది. కోపంలో తలాక్ ఇచ్చే అవకాశమే లేనప్పుడు మొక్కలోనే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత కూడా కొనసాగితే మూడునెలల కాలం ఇద్దత్ అంటారు ఈ కాలంలో సయోథ్యకు పూర్తి అవకాశాలుంటాయి.
కాని దురదృష్టవశాత్తు ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఒకేసారి మూడు తలాక్ లు చెప్పేసి పూర్తి స్థాయి తెగతెంపులు, అంటే మళ్ళీ వివాహం చేసుకోడానికి అవకాశం లేని తెగతెంపులు ఇప్పుడ అమల్లోకి వచ్చాయి.
ఇదంది మూడు తలాక్ ల కథ. అయితే .. అక్బర్ అలహాబాదీ కవిత ముందు చెప్పాను కదా.. అలా మగవాళ్ళ బుద్ధులపై పడిన బురఖా వల్ల, కొంత అజ్ఞానం వల్ల, కొంత అవగాహన లేకపోవడం వల్ల మూడు తలాక్ లు ఒకేసారి చెప్పడం జరుగుతోంది. అంటే మూడవ వివాహం అదే భార్యతో జరిగితే చెప్పవలసిన మూడవ తలాక్ కూడా మొదటే చెప్పేసి పూర్తిగా తెగతెంపులు, అంటే మళ్ళీ వివాహానికి అవకాశం లేకుండా తెగతెంపులు చేసుకుంటున్నారు.
నిజానికి ఇలా ఒకేసారి మూడు తలాక్ ఇవ్వడం ధార్మికంగా చాలా తప్పని పెద్ద పెద్ద ధర్మవేత్తలు కూడా చెబుతారు. ముస్లిముల్లో ఈ పద్ధతి తప్పుడు పద్ధతన్న ఏకాభిప్రాయం ఉంది. షియా వర్గంలో ఈ తలాక్ చెల్లదు. ఇది ధర్మవిరుద్దమైనది. అందుకే దీన్ని తలాకె బిదాఅత్ అంటారు. అహ్లె హదీస్ మూడు తలాకులు చెప్పినా ఒకే తలాక్ గా పరిగణించాలని అంటారు. అంటే మూడుసార్లు కాదు ఒకే సిట్టింగులో మూడువందల సార్లు తలాక్ చెప్పినా అది ఒకే తలాక్ క్రింద పరిగణిస్తారు. కాని కొందరు త్రిపుల్ తలాక్ ధర్మవిరుద్దమైనదే అయినా టెక్నికల్ గా చెల్లుతుందని భావిస్తారు. ముఖ్యంగా హనఫీ సంప్రదాయాన్ని అనుసరించేవారు ఈ తలాక్ చెల్లుతుందని భావిస్తారు.
దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటే –
చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మనకు ఉంది. బాల్యవివాహాలు చట్టవిరుద్దం. కాని ఒకవేళ బాల్యవివాహం అయిపోతే ఏమిటి? ఆ వివాహం చెల్లుతుందా? లేదా?
ఆ వివాహం చెల్లుతుంది? త్రిపుల్ తలాక్ విషయం కూడా అంతే.
అది సరయిన పద్ధతి కాకపోయినా, అలా చేస్తే విడాకులు అయిపోయినట్లేనని ముఖ్యంగా హనఫీ సంప్రదాయం భావిస్తుంది.
నిజానికి ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో ఇలా ఒకేసారి మూడు తలాక్ లు చెప్పడం లేదు. ఖలీఫా అబూబక్ర్ (రజి) కాలంలో కూడా లేదు. ఖలీఫా ఉమర్ (రజి) కాలంలోని మొదటి సంవత్సరాలలో కూడా లేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కొత్త ఆచరణ ప్రారంభమైంది. అందుకే దాన్ని బిద్ఆత్ అన్నారు. ఖలీఫా ఉమర్ (రజి) అలా ఒకేసారి మూడు తలాక్ లు ఎవరైనా ఇస్తే బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష విధించేవారు. అంటే దాన్ని నేరంగా భావించేవారు. కాని అలా చెప్పిన తలాక్ చెల్లుతుందని ఖలీఫా ఉమర్ (రజి) భావించారు. ఇప్పుడు అలాంటి శిక్షలు విధించే అవకాశం లేదు. షరియత్ లోని క్రిమినల్ చట్టాలకు ఇప్పుడు అవకాశం లేదు. కాని, కనీసం ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించడం జరిగితే బహుశా ఈ విధంగా త్రిపుల్ తలాక్ చెప్పేవారిని అరికట్టవచ్చు.
ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు ఉన్నాయి.
ఒకటి : త్రిపుల్ తలాక్ అంటే ఒకే సిట్టింగులో మూడు తలాక్ లు ఇవ్వడం చెల్లదని చెబితే. ఏం జరుగుతుంది. అది సరయిన పద్ధతి కాకపోతే సరయిన పధ్ధతిలో ఒక నెలరోజుల నిరీక్షణ తర్వాత మొదటి తలాక్ రూపంలో విడాకులు అమలవుతాయి కదా. అంటే విడిపోవాలనే నిర్ణయించుకున్నప్పుడు అది త్రిపుల్ తలాక్ కానీయండి, లేదా ఒకే తలాక్ చెప్పడం ద్వారా సరయిన పద్ధతిలో కానీయండి, వేర్పాటు అనేది జరిగేదే. కానీ, త్రిపుల్ తలాక్ చెల్లదని చెప్పిన తర్వాత ఆ భర్తపై ఎలాంటి నేరం మోపడానికి వీలుండదు.
రెండు: ఎలాగూ తలాక్ అనేది అనివార్యంగా కనబడుతున్నప్పుడు, త్రిపుల్ తలాక్ చెల్లుతుందని భావించినట్లయితే, అప్పుడు భర్త అక్రమమైన పద్ధతిలో తలాక్ ఇచ్చిన నేరస్తుడవుతాడు. ఆ నేరానికి భర్తను శిక్షించవచ్చు.
ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, తలాక్ అనివార్యమైనప్పుడు, త్రిపుల్ తలాక్ చెల్లదని చెప్పి, భర్తకు సక్రమమైన పద్ధతిలో తలాక్ ఇచ్చుకో అని అవకాశం ఇవ్వడం మంచిదా? లేక త్రిపుల్ తలాక్ చెల్లుతుందని స్వీకరించి, అక్రమమైన పద్ధతిలో తలాక్ ఇచ్చిన నేరానికి భర్తను శిక్షించడం మంచిదా? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. వివాహం నిలబడుతుందని అనుకున్నప్పుడు తలాక్ చెల్లదని కొంతసమయం ఇవ్వడం మంచిదనిపిస్తుంది. కాని వివాహమే నిలబడని పరిస్థితి ఉంటే అది భర్తకు అవకాశంగాను, భార్యకు మరింత క్షోభగాను మారవచ్చు.
ఇక్కడ మరొక విమర్శ కూడా ఉంది మగవారికి మాత్రమే ఏకపక్షంగా తలాక్ చెప్పే అవకాశం ఉందని ఆడవారికి అలాంటి అవకాశం లేదని చెప్పడం. ఇది కూడా అవగాహన లేని వాదనే.
ఇస్లామ్ లో విడాకులనేవి వాటి స్వభావాన్ని బట్టి వివిధ పేర్లతో ఉండడం వల్ల ఈ అయోమయం ముస్లిమేతరుల్లో కలుగుతోంది. భర్త విడిపోవాలనుకుని విడాకులిస్తే అది తలాక్. భర్త తలాక్ ఇచ్చినప్పుడు మెహర్ పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. తాను భార్యకు ఇచ్చిన ఇతర కానుకలను కూడా వెనక్కి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. భార్య విడాకులివ్వాలనుకుంటే ఆమె కూడా ఇవ్వవచ్చు. ఒక పద్ధతి నికాహ్ నామాలో దీనికి సంబంధించిన స్పష్టమైన షరతు రాయించి ఉన్నట్లయితే భార్య తన తరఫున ఏకపక్షంగా విడాకులివ్వవచ్చు. దీనిని ఇస్మా అంటారు. మరో పద్ధతి భర్త సరిగా చూడకపోతే, క్రూరంగా వ్యవహరిస్తుంటే, హింసిస్తుంటే ఆమె ఖాజీ వద్దకు వెళ్ళి తన కారణాలు చెప్పి నికాహ్ రద్దు చేయించుకోవచ్చు. దీనిని ఫిస్క్ నికాహ్ అంటారు. ఈ సందర్భంలో ఖాజీ ద్వారా ఆమె పూర్తి మెహర్ ను పొందవచ్చు. భర్త ప్రేమగా చూస్తున్నప్పటికీ, చాలా మంచివాడైనప్పటికీ భార్య అతనితో కలిసి ఉండడాన్ని కొన్ని సందర్భాల్లో ఇష్టపడకపోవచ్చు. ఇంటెలెక్చువల్ కంపాటిబిలిటీ లేదా భర్త అనాకారిగా ఉన్నాడని భావించడం లేదా మరో సమస్య కావచ్చు. మంచివాడైన భర్తను కూడా భార్య ఇష్టపడకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా భార్య విడాకులు తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఆమె భర్తను తలాక్ ఇవ్వమని కోరవచ్చు. దీనిని ఖులా అంటారు. భర్త తలాక్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆమె ఖాజీ ద్వారా విడాకులు పొందుతుంది.
కాబట్టి భర్తకు మాత్రమే ఏకపక్షంగా విడాకులిచ్చే అవకాశం ఉందనడం తప్పు.
ఇస్లామ్ లో జుడిషియల్ సెపరేషన్ వంటివి లేవు. ఇస్లామ్ లో వివాహం ఒక సివిల్ ఒప్పందం వంటిది. ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఒప్పందం నిలబడదు.
ఇస్లామ్ లో తలాక్ గురించి కాస్త వివరణ ఇవ్వడానికే ఈ పోస్టు.

No comments:

Post a Comment