Friday, 24 January 2020

తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన

తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన
24-01-2020 01:19:08

రాజ్యాంగంలో ప్రవేశిక ఎంత ముఖ్యమైనదో ప్రాథమిక హక్కుల భాగం (భాగం మూడు, అధికరణం 12 నుంచి 30) అంతే ముఖ్యమైనది. అందులోనూ ‘భావప్రకటనా స్వేచ్ఛ, తదితర హక్కుల పరిరక్షణ’ గురించి చెప్పే అధికరణం 19 చాల కీలకమైనది. ఈ అధికరణం మాట్లాడే హక్కు, వ్యక్తీకరించే హక్కు, శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశమంతటా ఎక్కడికైనా స్వేచ్చగా తిరిగే హక్కు, దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కు, ఏ వృత్తి, ఉపాధి అయినా చేపట్టే హక్కులకు హామీ ఇచ్చింది.

ఈ ఆరు హక్కులతో పాటు ఆస్తి కలిగి ఉండే హక్కు అనేది కూడ ఉండేది గాని 44వ రాజ్యాంగ సవరణతో 1978లో అది రద్దయింది. ఈ హక్కులను రాజ్యాంగం ఇచ్చిందనే మాట తరచుగా వినిపిస్తుంది. కాని, ఈ హక్కులన్నీ మనిషికి నైసర్గికంగా ఉన్నాయనీ, మనిషైనందువల్ల మాట్లాడే, తిరిగే, సహమానవులతో కలిసి పనిచేసే నైసర్గిక లక్షణాలున్నాయనీ, వాటిని ఎవరూ రద్దు చేయకుండా, కత్తిరించకుండా, ఆంక్షలు పెట్టకుండా హామీ ఇవ్వడమే రాజ్యాంగం చేసిన పని అని కాళోజీ తరచుగా చెపుతుండేవారు.

అయితే రాజ్యాంగ నిర్మాతలే ఈ అధికరణం 19లోని హక్కులను బేషరతుగా ఇవ్వలేదు. ఈ హక్కుల నిబంధన కిందనే ఐదు ఉప నిబంధనలలో ఈ హక్కుల మీద ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి హక్కు ఇచ్చారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రాజ్య భద్రత, విదేశాలతో సంబంధాలు, ప్రజా భద్రత, సభ్యత, నైతికతలకు భంగం వాటిల్లినప్పుడు మాత్రమే ఆ ఆంక్షలు విధించాలని అన్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే, ఆ సందర్భాలలో కూడ ‘సకారణమైన పరిమితులు’ విధించవచ్చునని మాత్రమే అన్నారు గాని అసలు హక్కులనే రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదు.

ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడ అధికరణం 19ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ‘సకారణమైన పరిమితులు’ విధించడానికి రాజ్యాంగం నిర్దేశించిన పరిస్థితులు ఏమీలేకపోయినా, ‘సకారణ మైన పరిమితులు’ విధించడానికి మాత్రమే ఉన్న అధికారాన్ని అన్ని హక్కులనూ రద్దు చేయడానికి వినియోగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులలో పౌరహక్కుల విషయంలో కర్కోటమైన పాలనలుగా చరిత్రకెక్కిన సందర్భాలలో కూడ జరగనంత పెద్దఎత్తున హక్కుల హననం గత ఐదేళ్ళుగా సాగుతున్నది.మరీ ముఖ్యంగా గత మూడు నెలలుగా నమోదైన నాలుగైదు కేసులు, అరెస్టులు, దర్యాప్తు పేరిట జరుగుతున్న అక్రమాలు, అప్రజాస్వామిక, నిరంకుశ ధోరణులు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పట్ల, అధికరణం 19 పట్ల కనీస గౌరవం ఉన్నదా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి.

భిన్నాభిప్రాయాల మీద, అసమ్మతి మీద ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రనే తాను మరిచిపోతున్నట్టున్నది. ఫజలలీ కమిషన్ నాటి అసమ్మతి, పెద్దమనుషుల ఒప్పందం నాటి అసమ్మతి, 1969 జై తెలంగాణ ఉద్యమ అసమ్మతి, 1996–2014 మలిదశ తెలంగాణ ఉద్యమ అసమ్మతి, ఆ అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడి ఉండేది కాదు. భిన్నాభిప్రాయ ప్రకటనకూ, సమీకరణకూ అవకాశాలు లేకపోతే ఇవాళ పాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉనికిలో ఉండేదే కాదు. కాని ఆశ్చర్యకరంగా అసమ్మతి వల్ల, భిన్నాభిప్రాయ ప్రకటనకు ఉండిన అవకాశాల వల్ల పుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసమ్మతిని, భిన్నాభిప్రాయ ప్రకటనను ఎంతమాత్రమూ అనుమతించనని చూపుతున్నది.

ఆంధ్రప్రదేశ్ పాలనా కాలంలో ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు, విధానాలు అమలైనప్పటికీ, వాటిలో ఏ ఒక్కటీ నిరసన, ప్రతిఘటన, చర్చ లేకుండా అమలులోకి రాలేదు. ఆ ఆరు దశాబ్దాల చరిత్రలో ప్రజాసంఘాలు, మేధావులు, ప్రతిపక్షాలు దాదాపు ప్రతి నిర్ణయానికీ, విధానానికీ, విధానాల అమలుకూ తమ నిరసన ప్రకటించారు. చివరికి అధికారపార్టీ లోపల కూడ భిన్నాభిప్రాయాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. కాని గడిచిన ఐదున్నర సంవత్సరాలలో నిరసన ప్రదర్శనలను అరికట్టడానికి ముందస్తు అరెస్టుల పర్వం ప్రారంభించారు.

ఎవరైనా ప్రభుత్వ విధానం పట్ల తమ నిరసన తెల్పడానికి ప్రదర్శన జరుపుతామని ప్రకటించగానే, ఆ ప్రదర్శన జరగడానికి కొద్ది గంటల ముందే, ప్రదర్శన స్థలానికి నిరసనకారులు చేరకముందే వారిని అరెస్టు చేసి, రోజంతా అక్రమ నిర్బంధంలో ఉంచడం సర్వసాధారణమైపోయింది. నిరుద్యోగుల ప్రదర్శన పిలుపు ఇస్తే, కొన్ని గంటల ముందే కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. అటువంటి ఉదాహరణలు డజన్ల కొద్దీ ఉన్నాయి. ధర్నాచౌక్ ప్రహసనం చెప్పనక్కరలేదు. ఇది ఎంతమాత్రమూ ‘సకారణమైన పరిమితులు విధించడం’ కాదు.

నిరసన ప్రదర్శన అనేది ప్రత్యక్షంగా ప్రభుత్వ విధానం మీద విమర్శ గనుక దాన్ని ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సహజమేనని అనిపించవచ్చు. కాని అంతకన్న ఘోరంగా, ఈ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేని విద్యాసంబంధమైన, రాజకీయార్థిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాల మీద, చివరికి మృతులను సంస్మరించుకోవడానికి ఏర్పాటయ్యే సభలను, సమావేశాలను కూడ జరగనివ్వని నిరంకుశ రాజ్యం ఐదున్నర సంవత్సరాలుగా సాగుతున్నది.

అధికారపార్టీ, ఒకటి రెండు పార్లమెంటరీ పార్టీలు మినహా ఈ ఐదున్నర సంవత్సరాలలో హైదరాబాదుతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఒక బహిరంగ సభ, ఊరేగింపు జరపడానికి అనుమతి లభించలేదు. నిజానికి బహిరంగ సభకూ, ఊరేగింపుకూ కూడ చట్టప్రకారం కావలసింది ప్రభుత్వ, పోలీసుల అనుమతి కాదు. ఊరేగింపు, బహిరంగ సభ జరుపుకోవడం ప్రజల హక్కు. ఆ ఊరేగింపు, బహిరంగ సభ వల్ల ప్రజా రవాణా ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి పోలీసులకు సమాచారం మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమాచారం ఇవ్వాలనే నిబంధనను అనుమతి కోరడంగా, అది కూడ పాలక పక్షానికి భిన్నమైన అభిప్రాయాలకు అనుమతి నిరాకరించడంగా మార్చిన ఘనమైన రాజకీయ వ్యవస్థ మనది!

ఈ స్థితిలో అన్ని ప్రజా సంఘాలు హాలు సమావేశాలతోనే, కొన్ని వందల మందితోనే, అది కూడ కొన్నిసార్లు న్యాయస్థానం జోక్యంతో, సరిపెట్టుకోవలసి వస్తున్నది. నిజానికి హాలులో, ప్రాంగణంలోపల జరుపుకునే సమావేశం ప్రజా రవాణాకు ఆటంకాలు కల్పించదు గనుక పోలీసులకు సమాచారం కూడ ఇవ్వనక్కరలేదు, అనుమతి అనే ప్రశ్నే తలెత్తదు. కాని తెలంగాణ పోలీసు రాజ్యం హాలు సమావేశాలకు కూడ అనుమతి అనే ఆచారాన్ని దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ఫలానా సంస్థలకు, ఫలానా వ్యక్తులు ఉపన్యసించే సభలకు హాలు ఇవ్వగూడదని హాలు యజమానులను ఆదేశిస్తున్నారు, బెదిరిస్తున్నారు.

పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన పార్టీ పాలనలో అటువంటి వ్యతిరేకతనే చెప్పడానికి కన్నయ్య కుమార్ సభ ఏర్పాటు చేస్తే హాలు యజమానులను బెదిరించి సభ జరగకుండా చేశారు. చిన్న పట్టణాల సంగతి చెప్పనే అక్కరలేదు, హైదరాబాద్ లోనే ప్రధానమైన హాళ్లన్నిటికీ హాలు ఇవ్వగూడని సంఘాల జాబితాను పోలీసులు అందజేశారు. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ, ఏడు ప్రజా సంఘాలు మాత్రమే చట్టప్రకారం నిషేధానికి గురై ఉండగా, సమావేశాల హాళ్లకు పోలీసులు సరఫరా చేసిన ఈ అక్రమ, చట్టవ్యతిరేక జాబితాలో మరొక ముప్పై సంస్థల పేర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆ ముప్పై సంస్థల నాయకుల మీద, కార్యకర్తల మీద, ఏ సంస్థలో లేకపోయినా పాలక విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్న వ్యక్తుల మీద అబద్ధపు కేసులు బనాయించడం రాష్ట్ర పోలీసుల కొత్త దాడిగా సాగుతున్నది. గడిచిన మూడు నెలల్లో అటువంటి అబద్ధపు కేసులు నాలుగు నమోదయ్యాయి. ఒక్కొక్కదానిలో పది నుంచి అరవై మంది దాకా ఇప్పటికి మొత్తం దాదాపు ఎనబై మందిని నిందితులుగా చూపారు. ప్రతి కేసులోనూ నలుగురైదుగురు అజ్ఞాత విప్లవ నాయకుల పేర్లు చేర్చడం, వారితో సంబంధాలున్నాయనే అబద్ధపు ఆరోపణలతో పది మందినీ, ఇరవై మందినీ, నలబై మందినీ బహిరంగ ప్రజా జీవితంలో, సొంత ఉద్యోగాలలో, వృత్తులలో ఉన్నవారిని చేర్చడం, వారి మెడమీద కత్తి వేలాడదీయడం జరుగుతున్నది.

వారు విభిన్న ప్రజా సంఘాలలో పనిచేస్తూ ప్రభుత్వ విధానాల పట్ల, సామాజిక జీవనం పట్ల తమ భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. భిన్నాభిప్రాయ ప్రకటన ఎప్పుడూ నేరం కాదు. అది రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కు. నిషిద్ధ పార్టీ సభ్యులూ నాయకులూ అయినా సరే, నిర్దిష్టమైన నేరపూరిత చర్యలో పాల్గొన్నారని నిస్సందేహమైన సాక్ష్యాధారాలు ఉన్నంతవరకూ నిర్బంధించగూడదని, నేరారోపణ చేయగూడదని సుప్రీం కోర్టు, ఎన్నో హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడ పోలీసుల చెవికెక్కడం లేదు.

అలా భిన్నాభిప్రాయాలు ఉన్నవారందరి పేర్లూ నిందితులుగా చూపుతూ, దాని కొనసాగింపుగా వారిలో అప్పుడొకరి ఇంటిమీద, ఇప్పుడొకరి ఇంటిమీద చట్టవ్యతిరేక దాడులు, సోదాలు నిర్వహిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన వారు చెప్పినట్టుగా ‘ఒప్పుదల ప్రకటన’ (కన్ఫెషన్ స్టేట్ మెంట్) తామే తయారుచేసి, అందులో మరికొన్ని పేర్లు చేర్చి, వారి మీద దాడికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి భారత న్యాయవ్యవస్థ మౌలిక సూత్రాల ప్రకారమే పోలీసులు దాఖలు చేసిన ఒప్పుదల ప్రకటన చెల్లదు.

పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, ఒత్తిడి చేసి, వేధించి తప్పుడు ఒప్పుదల ప్రకటనలు తయారు చేస్తారనే నమ్మకంతోనే న్యాయవ్యవస్థ ఆ ఒప్పుదల ప్రకటనలను అంగీకరించడం లేదు. కాని తెలంగాణ పోలీసులు ఒకరిమీద మరొకరికి అనుమానాలు రేకెత్తించడానికి, అంతకంతకూ ఎక్కువమందిని ఇరికించడానికి, తమ అబద్ధాలకు తామే నగిషీలు చెక్కుతూ కొత్త కొత్త ఒప్పుదల ప్రకటనలు తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ అరెస్టు చేసిన వ్యక్తుల ఒప్పుదల ప్రకటనలన్నీ ఒక ప్రొఫార్మా లాగ ఒకే విషయాలతో, ఒకే వాక్య నిర్మాణాలతో, ఒకే ఆరోపణలతో, కేవలం పేర్లు, స్థలాల మార్పుతో మాత్రమే ఉన్నాయంటేనే అవన్నీ కూటసృష్టి అని, ఒకే రచయిత కల్పనాశక్తి ఉత్పత్తులనీ తేటతెల్లమవుతుంది.

ఇలా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు, వారిని అలా సాగనిస్తున్న పాలకులు ఇప్పటికైనా ఒకసారి రాజ్యాంగాన్ని, అధికరణం 19ని చదువుకుంటారా? తెలంగాణకు ఉన్న ఘనమైన భిన్నాభిప్రాయ, అసమ్మతి, ధిక్కార చరిత్రను తెలుసుకుంటారా? బంగారు తెలంగాణ సంగతి సరే, రాజ్యాంగ బద్ధమైన తెలంగాణ ఇస్తారా?

ఎన్ వేణుగోపాల్

No comments:

Post a Comment