పౌరసత్వంపై అసత్యాల అఘాయిత్యం
24-01-2020 01:16:25
ప్రభువులు ప్రజలకు అవాస్తవాలు చెబుతారని అందరికీ తెలుసు. కాని, మరీ ఇన్ని అవాస్తవాలా? అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించడం ప్రజాస్వామ్యానికే ద్రోహం. పౌరసత్వ సవరణపై వారు చేస్తున్న ప్రకటనలు, వాటికి సంబంధించిన నిజానిజాలు...
పౌరసత్వ సవరణ చట్టం – 2019తో జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధం లేదు. రెండూ విడివిడిగా చూడాలి. వాటిని పోల్చి చెప్పడం అసత్యం
– ప్రధాని
‘మొదట సిఎబి వస్తుంది, వలసవచ్చిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది. తరువాత ఎన్‌ఆర్‌సి వస్తుంది. కనుక వలస వచ్చిన వారెవరూ భయపడాల్సిన పని లేదు. చొరబాటు దార్లంతా భయపడాలి. ఏది ముందు వస్తుందో జాగ్రత్తగా గమనించండి, ముందు సిఎబి, తరువాత ఎన్‌ఆర్‌సి. ఎన్‌ఆర్‌సి కేవలం బెంగాల్‌కు మాత్రమే కాదు. మొత్తం దేశంలో అమలుచేస్తాం’ అని 2019 ఏప్రిల్‌లో హోంమంత్రి ప్రకటించారు. 2019 డిసెంబర్ 9న కూడా హోంమంత్రి పార్లమెంట్‌లో ‘దేశమంతటా జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలు చేసేముందే సిఎఎ సిద్ధమవుతుందనీ. దేశవ్యాప్తంగా పౌరుల పట్టిక రూపొందు తుందనీ, ఒక్క చొరబాటుదారుడు కూడా తప్పించుకోలేడు’ అనీ ప్రకటించారు. 2019 డిసెంబర్ 19న జెపి నడ్డా ఇదే చెప్పారు. ఎవరు చెప్పింది అవాస్తవం?
నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్‌ఆర్‌సి గురించి ఎక్కడా చర్చించనే లేదు
– డిసెంబర్ 22న ప్రధాని
రాష్ట్రపతి ఏం చెప్పారో చూడండి. 2019 జూన్ 20వ తేదీ నాడు పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ‘...నా ప్రభుత్వం ప్రపథమంగా జాతీయ పౌరసత్వ రిజిస్టర్ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా చొరబాటుదారులతో నిండిన ప్రాంతాలలో ఈ విధానం అమలు అవుతుంది’. నవంబర్ 21న రాజ్యసభలో హోంమంత్రి ఇదేరకంగా ప్రకటించారు. ఎవరు చెప్పింది అవాస్తవం?
దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని ఇంతవరకు నోటిఫై చేయలేదు.
– 2019 డిసెంబర్‌లో కేంద్రహోం శాఖ సహాయమంత్రి
2003లో చేసిన పౌర సవరణ చట్టం ప్రకారం జాతీయ పౌరపట్టిక (రిజిస్టర్) శాసనంలో భాగం. అందులోని క్లాజ్ 14ఎ (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర పట్టికను రూపొందించాలి. అందుకోసం జాతీయ పౌర నమోదు అధికారి రిజిస్ట్రేషన్ అధికారసంస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేయాలి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియానే జాతీయ రిజిస్ట్రేషన్ అథారిటీగా ప్రకటించారు. పౌరుల నమోదు కార్యక్రమానికి ఆయనే రిజిస్ట్రార్ జనరల్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ కోసం నియమాలను (రూల్స్) కూడా 2003లోనే ఏర్పాటు చేశారు. ఏది అవాస్తవం?
జాతీయ స్థాయిలో ఎన్ఆర్‌సి ని ప్రకటించలేదు
– హోంశాఖ సహాయమంత్రి
2019 జులై 31న ఎన్‌ఆర్‌సి జాతీయ స్థాయిలో రూపొందించం ఆరంభమైందని అధికారిక గెజిట్‌లో నోటిఫై చేశారు. పౌర నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ నియమాలు 2003 రూల్ 3(4) ప్రకారం జనాభా పట్టిక (పాపులేషన్ రిజిస్టర్)ను తయారుచేయడానికి, నవీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 2020 ఏప్రిల్ 1 నుంచి 2020 సెప్టెంబర్ 30వరకు స్థానిక పరిధిలో నివసించే వారి పేర్లను ఇంటింటికీ తిరిగి నమోదు చేస్తూ స్థానిక రిజిస్టర్‌ను తయారు చేసే క్షేత్ర కార్యాలను అస్సాంలో తప్ప, దేశమంతటా నిర్వహించాలని నిర్ణయించింది అని ప్రకటించింది. నోటిఫికేషన్ ఇంత స్పష్టంగా ఉంటే లేదంటున్నారు. 2014 జులై 23 నాడు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇటువంటి ప్రకటనే చేశారు. 2019 జులై 31న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ జనరల్‌గారు, ఇంటింటి ప్రజల పేర్ల నమోదు చేసే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1, నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు కొనసాగించాలని ప్రకటన చేసారు. ఎవరు చెప్పింది అవాస్తవం?
ఎన్‌ఆర్‌సి కి జాతీయ ప్రజా పట్టికకు మధ్య ఏ సంబంధమూ లేదు. ఎన్‌పిఆర్‌తో ఎన్‌ఆర్‌సి ముడిపడి లేదు
అమిత్ షా
ఎన్‌ఆర్‌సి కోసం 2003 నియమాలలో జాతీయ పౌర పట్టికను రూపొందించే ప్రక్రియ మొదలవుతుందని స్పష్టంగా ఉంది. క్లాజ్ 4 ప్రకారం ప్రజా పట్టిక కోసం ఇంటింటా వివరాల సేకరణ మొదలవుతుందనీ ఉంది. రూల్ 3 ప్రకారం భారత జాతీయ పౌర రిజిస్టర్ ప్రతిపౌరుడికి సంబంధించి ఈ కింది వివరాలను సేకరించాలి. 1. పేరు, 2. తండ్రిపేరు, 3. తల్లి పేరు, 4. లింగం, 5. పుట్టిన తేదీ, 6. పుట్టిన చోటు, 7. నివాసం (శాశ్వత లేదా తాత్కాలిక), 8 వివాహితులా కాదా, భాగస్వామి పేరు, 9. కనిపించే గుర్తింపు చుక్క, 10. పౌరుడుగా నమోదయిన తేది, 11. రిజిస్ట్రేషన్ సంఖ్య, 12 జాతీయ గుర్తింపు సంఖ్య. భారత జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్ఐసి దిశలో ప్రజల పట్టిక రూపకల్పన గెజిట్ నోటిఫికేషన్ తొలి అడుగు. 2003 నియమాల్లో ఈ అంశం రూల్ 3(5) లో ఉంది. ఏది అవాస్తవం?
జాతీయ జన పట్టికకు ఎన్‌ఆర్‌సి పౌరసత్వ పట్టికకు ఏ సంబంధమూ లేదు’
– కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్
హోం మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2018-–19 అధ్యాయం 15, పేరాగ్రాఫ్ 15.40 లో ‘సాధారణంగా నివసించే వారందరి ప్రత్యేక వివరాలతో జాతీయ జన పట్టికను దేశవ్యాప్తంగా రూపొందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన’ట్టు చెప్పారు. ఎవరు చెప్పింది అవాస్తవం?
ఈ దేశంలో నిర్బంధ కేంద్రాలు (డిటెన్షన్ సెంటర్లు) లేవు
-– ప్రధాని
రాజ్యసభలో 2019 డిసెంబర్ 11న హోంమంత్రి అక్రమ చొరబాటు దారులను లేదా విదేశీయులుగా నిర్ధారింపబడి వారి దేశాలకు పంపేంత వరకు బంధించడానికి అన్ని రాష్ట్రాలలో డిటెన్షన్ కేంద్రాలను నిర్మించాలని ఆదేశాలు పంపించినట్లు సమాధానం చెప్పారు. 2019.1.9.న, 2014 24–-29 ఏప్రిల్, మళ్లీ 2014 సెప్టెంబర్ 9-–10 తేదీల్లో కూడా ఆదేశాలు పంపామని వారే చెప్పారు. 2018లోనే ఒక నమూనా డిటెన్షన్ సెంటర్, ఆ సెంటర్లను నడిపే నియమావళి (మాన్యువల్)ను అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపారు. కర్నాటక హైకోర్టులో నవంబర్ 28 కేంద్రం దాఖలుచేసిన ఒక అఫిడవిట్‌లో ‘అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2014లో, 2018లో కూడా డిటెన్షన్ సెంటర్లను నిర్మించాలని అందులో అక్రమ వలసదారులైన విదేశీయులను బంధించడం గురించి రాసా’మని చెప్పారు. కేంద్ర హోం మంత్రి లోక్‌సభలో 2019 జులై 9న ప్రశ్న నెంబర్ 2660కు జవాబుగా, అస్సాంలో, గోల్పురాలో 267 మంది బందీలకోసం డిటెన్షన్ సెంటర్‌కు 46 కోట్ల 51 లక్షల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కర్నాటక ప్రభుత్వం ఇటువంటి బందీ కేంద్రాలను నిర్మిస్తున్నది, ఫడ్నవీస్ ప్రభుత్వం మహారాష్ట్రలో బందిఖానాలు నిర్మించడానికి స్థలాలను కేటాయించింది. ఎవరు చెప్పింది అవాస్తవం?
పౌరసత్వ సవరణ చట్టం – 2019 వివక్షతో కూడింది కాదు
– ప్రధాని, హోంమంత్రి, తదితరులు
భారత సంవిధానంలో ఎక్కడ గానీ, ఆర్టికల్ 5 నుంచి 11 వరకున్న నియమాల్లో గానీ ఎక్కడా మతం ప్రాతిపదికన పౌరసత్వ అధికారాలు నిర్ణయించాలని లేదు. మతం అసలు ఏ అంశంలోనూ నిర్ణాయక కారణం కారాదన్నది రాజ్యాంగ సూత్రం. ఆర్టికల్ 11 ఇచ్చిన అధికారం కింద పౌరసత్వ చట్టం– 1955ను రూపొందించారు. పౌరసత్వసవరణ చట్టం– 2003లో అక్రమ చొరబాటు దారులంటే ఎవరో సెక్షన్ 2(1)బి నిర్వచించింది. అక్రమ చొరబాటు దారులను మతం ప్రాతిపదికపై నిర్ణయించలేదు. ఇక పౌరసత్వం సవరణ చట్టం– 2019 ఆ సెక్షన్‌ను సవరించారు. అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి 2014 డిసెంబర్ 31కు ముందు వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, మతాలకు చెందిన ఏ వ్యక్తి అయినా అక్రమ చొరబాటుదారుడు కాదు అని మార్పు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారి మతం ఒక ప్రాతిపదికగా రాజ్యాంగంలో ప్రవేశించడం ఇదే. భారతదేశంలో ఆరేళ్ల కిందట ప్రవేశించి నివసిస్తున్న ఇద్దరు వలసదారులలో ఒకరికి నివాసానికి రుజువు ఉన్నప్పడికీ వారి పూర్వీకుల గురించి పత్రాలు లేకపోతే అతను సక్రమ వలసదారుడయ్యే అవకాశం ఉంది, కాని అతను హిందువో, సిక్కో, జైనుడో, పార్సీయో, క్రైస్తవుడో, బౌద్ధుడో అయితేనే సక్రమ వలసదారుడవుతాడు. అతను ముస్లిం అయినా, బహాయి అయినా, ఇంకే మతానికి చెందిన వాడయినా అక్రమవలస దారుడిగా మిగిలిపోతాడు. దీన్నే వివక్ష అంటారు. అట్లా వివక్ష చేయడానికి చట్టాన్ని సవరించి ఈ చట్టం ద్వారా వివక్ష జరగదు అంటే అంతకు మించిన అవాస్తవం ఏముంటుంది.
ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019 కానీ ఎన్ఆర్‌సి కానీ పౌరసత్వం ఇవ్వడానికే తప్ప తొలగించడానికి కాదు
– ప్రధాని
సవరణ ద్వారా మత ప్రాతిపదికన అక్రమ లేదా సక్రమ చొరబాటుదారుడిని నిర్ణయిస్తారు. ఆరు మతాల వారికి పౌరసత్వం ఇస్తారు, ఇతర మతాల వారికి ఇవ్వరు. నేపాల్, శ్రీలంక, నుంచి వచ్చిన వలసవాదులలో హిందువులే ఎక్కువ మంది. బర్మా (మ్యాన్మార్) నుంచి కూడా ఎన్నో మతాలవారు వచ్చారు. వారిలో హిందువులు కూడా ఈ సవరణ చట్టం వల్ల సక్రమ చొరబాటుదారులు కాబోరు. శ్రీలంకనుంచి లక్షమంది తమిళ హిందువులు ఈ దేశంలో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు. వారు శరణార్థులే గాని వారికి దిక్కులేదు. భారత్ వారిని వెళ్లగొట్టడమో, డిటెన్షన్ సెంటర్లోనో పెడుతుంది. జాతీయ పౌర పట్టిక నిర్మాణం పేరుతో సర్కారు అడిగే రుజువులు ఇవ్వలేని నిజమైన భారతీయ పౌరుల గతి ఏమిటి? వారికి ఉన్న పౌరసత్వం ఊడ బెరికే ప్రమాదం చాలా స్పష్టం. ఏది అవాస్తవం?
మూడు వేల మంది బందీల కోసం నిర్మించే డిటెన్షన్ సెంటర్‌కు రూ.46 కోట్లు కేటాయించారు. 26 వేల 658 సెంటర్ల నిర్మాణానికి 12 లక్షల 40 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇది 2019 జిడిపి లో 8.8శాతం సొమ్ముతో సమానమని ఒక పాత్రికేయుడు అంచనా వేసారు. ఈశ్వరుని సాక్షిగా, అంతఃకరణ సాక్షిగా రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చెప్పి రాజ్యాంగ వ్యతిరేక విధానాలు రూపొందిస్తున్నారు. ఇదేమని నిలదీస్తే అధికారికంగా అబద్ధాలు చెబుతున్నారు. ఇది నేరం కాదూ? మరి ఈ నేరాలకు శిక్షలున్నాయా?
మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార మాజీ కమిషనర్)
No comments:
Post a Comment