Wednesday, 4 September 2019

Babri Case - రహస్యంగా విగ్రహాల్ని పెట్టేశారు

రహస్యంగా విగ్రహాల్ని పెట్టేశారు
05-09-2019 02:51:33


1949లో ఆలయ ఉద్యోగులు-అధికారులు కుమ్మక్కు
విగ్రహాలు తొలగించలేదు.. ఫైజాబాద్‌ కమిషనరే కారకుడు
నమాజ్‌కు అనుమతివ్వలేదు.. అయోధ్యపై ముస్లిం పార్టీలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: బాబ్రీ మసీదుపై పథకం ప్రకారం దాడి చేసి రహస్యంగా హిందూ విగ్రహాల్ని పెట్టారని, 1949 డిసెంబరు 22-23వ తేదీ అర్థరాత్రి ఈ పరిణామం జరిగిందని ముస్లిం పార్టీలు సుప్రీంకోర్టులో వాదించాయి. ‘‘బాబ్రీ మసీదులో విగ్రహాలు కనబడడం ఓ అద్భుతమో, దైవ ఘటనో కాదు. ఆనాడు కొందరు ఆలయ ఉద్యోగులు, హిందూ అధికారులు కుమ్మక్కై ఈ విగ్రహాల స్థాపనకు ఒడిగట్టారు. దీనికి ఆనాటి ఫైజాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ కేకే నయ్యర్‌ పూర్తిగా సహకరించారు. పెట్టిన విగ్రహాలను తొలగించాలని కోర్టులు ఆదేశించినా నయ్యర్‌ లేక్కచేయలేదు’’ అని సున్నీ వక్ఫ్‌ బోర్డు, అసలు కక్షిదారైన ఎం సిద్దిఖిల తరఫు న్యాయవాది రాజీవ్‌ధవన్‌ పేర్కొన్నారు. ‘‘ఆనాటి చరిత్ర మొత్తం నాకు తెలుసు. నయ్యర్‌ ఓ హిందూవాది. పదవీ విరమణ అనంతరం ఆయన భారతీయ జనసంఘ్‌ తరఫున లోక్‌సభకు కూడా పోటీచేశారు’’ అని బుధవారంనాడు సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వినిపించిన వాదనల్లో ధవన్‌ వివరించారు. ‘‘1949 డిసెంబరు 16న నయ్యర్‌ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. విక్రమాదిత్యుడు కట్టించిన ఓ మహా ఆలయం ఆ ప్రదేశంలో ఉండేదనీ, దానినే 1528లో బాబర్‌ కూల్చేసి బాబ్రీ మసీదును కట్టాడనీ అందులో పేర్కొన్నారు. ఇది నయ్యర్‌ చేసిన ఉపకారం’’ అని ఆయన పేర్కొన్నారు. హిందూ కక్షిదారులు చూపుతున్న ఫోటోలను కూడా ధవన్‌ కొట్టిపడేశారు. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులను బేఖాతరు చేసి నయ్యరే 1950 జనవరి 5న జప్తు చేశారన్నారు. ప్రార్థనలు చేసుకోడానికి ముస్లింలకు అనుమతి ఇవ్వలేదనీ, పైపెచ్చు, 1934 నుంచీ అక్కడ నమాజే జరగడం లేదన్న వాదనలను తెరపైకి తెచ్చారనీ ధవన్‌ ఆక్షేపించారు. అయోధ్య భూ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ధర్మాసనం గత 18 రోజులుగా రోజూ వాదనలు వింటోంది.





No comments:

Post a Comment