Tuesday, 25 December 2018

‘రెహమాన్‌, ఫర్మాన్‌, జీషాన్‌, ఖుర్బాన్‌ లాగా హనుమాన్‌

హనుమంతుడి ముందు బీజేపీ కుప్పిగంతులు.. అందుకే తగలబడుతోంది..!
25-12-2018 10:43:42

ఆల్వార్: పురాణ పురుషుడు, శ్రీరాముని భక్తుడు అయిన హనుమంతుడికి కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తూ దైవత్వానికి భంగం కలిగిస్తున్న బీజేపీ నేతలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ మండిపడ్డారు. జనం నిత్యం ఆరాధించే హనుమంతుడిని రాజకీయాల్లోకి రాగడం వల్లే బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఓటమి చవిచూసిందని రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఆయన మాట్లాడుతూ అన్నారు.

హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమధ్య ప్రకటించడంతో పలువురు నేతలు హనుమంతుడెవరనే దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యాలు చెప్పారు. కుల, మతాలను ఆపాదించేందుకు పోటీ పడ్డారు. క్రికెటర్ చేతన్ చౌహన్ ఏకంగా హనుమంతుడిని మల్లయోధుడని చెప్పగా, యూపీ మంత్రి లక్ష్మీనారాయణ ఆయనను ఓ జాట్‌గా, బీజేపీ ఎమ్మెల్యే బుక్కల్ నవాబ్ హనుమంతుడిని ముస్లింగా అభివర్ణించారు. అంతకంతకూ ఈ వేడి పెరుగుతుండటంపై రాజ్ బబ్బర్ బీజేపీపై నిశిత విమర్శలు చేశారు. 'హనుమంతుడిని మరింత చిక్కుల్లో పెట్టకండి. ఆయన తోక దెబ్బకు బీజేపీ ఇప్పటికే మూడు ఎన్నికల్లో తుడిచిపెట్టుకు పోయింది. ఇప్పుడు వారి (బీజేపీ) లంక తగులబడుతోంది' అని రాజ్‌బబ్బర్ చురకలు వేశారు. ఇప్పటికైనా బీజేపీ ఇలాంటి  రాద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు.



హనుమంతుడి పేరుతో ఓట్ల వేట.. పండితులు, సాధువుల ఆగ్రహం
25-12-2018 04:14:18

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది
..అన్నట్టుగా, ఆంజనేయుడు తన కులంపై జరుగుతున్న రాజకీయ రగడను చూసి నవ్వుకుంటూ ఉండి ఉంటాడేమో బహుశా! నది మూలం, రుషి మూలం అడగకూడదంటారు పెద్దలు! కానీ, ఓట్ల వేటలో మన రాజకీయ నాయకులు.. ముఖ్యంగా బీజేపీ నేతలు ఆ వానరశ్రేష్టుడి కులం ఫలానాదంటూ కుంపటి రాజేశారు.

దీనికి ఆద్యుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబరులో అక్కడి మల్‌పుర నియోజకవర్గంలో పర్యటించిన యోగి.. హనుమంతుడు దళిత గిరిజనుడని, ఆయనకులానికి చెందినవారంతా బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హనుమంతుడు అందరికన్నా పెద్ద ఆదివాసీ, వనవాసి అంటూ ఓట్ల వేట కొనసాగించారు. ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీకే చెందిన మరో నేత.. ఎంపీ సావిత్రీబాయి పూలే మరింత వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు.

హనుమంతుడు దళితుడు, మానవుడు అని.. కానీ ఆయనను మనువాదులకు బానిసగా మార్చారని.. రాముడి కోసం ఎంతో చేసినప్పటికీ కేవలం దళితుడైన కారణంగా హనుమకు తోక తగిలించి, ఆయన ముఖానికి మసి పూసి కోతిగా చేశారని ఆరోపించారు. ఇంతలో.. ఆచార్య నిర్భయ్‌ సాగర్‌ మహరాజ్‌ అనే జైన మతగురువు ఒకరు రంగంలోకి దిగి అసలు ఆంజనేయుడు జైనుడని తేల్చిచెప్పేశారు. జైనమతం గుర్తించిన 169 మంది మహాపురుషుల్లో హనుమ ఒకరని పేర్కొన్నారు. ఆ వెంటనే.. బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్‌ నవాబ్‌ కాస్తా హనుమంతుణ్ని ముస్లిం చేసేశారు. ‘రెహమాన్‌, ఫర్మాన్‌, జీషాన్‌, ఖుర్బాన్‌ లాగా హనుమాన్‌ అని ఉన్నది కాబట్టి ఆయన ముస్లిమే’ అని తేల్చారు. ముస్లింల పేర్లన్నీ ఆయన పేరు నుంచి వచ్చినవేనన్నారు. ఆ మర్నాడే.. యూపీకి చెందిన బీజేపీ మంత్రి హనుమంతుణ్ని ‘జాట్‌’ చేశారు. రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకుపోతే ఏ సంబంధమూ లేని హనుమంతుడు మధ్యలో జోక్యం చేసుకున్నాడని.. ఎవరు కష్టాల్లో ఉన్నా జోక్యం చేసుకునే లక్షణం జాట్లదే కాబట్టి, ఆయన జాట్‌ అని తన వాదన చెప్పారు.

ఇలా.. హనుమంతుడు హిందూ దళితుడు అని ఒకరు.. జైన్‌ అని మరొకరు.. ముస్లిం అని ఇంకొకరు.. వాదిస్తుంటే, అసలు సైన్సు ప్రకారం ‘హనుమంతుడు’ అనే క్యారెక్టరే ఉండడానికి అవకాశమే లేదన్నారు మరో బీజేపీ నేత. ఆయన పేరు ఉదిత్‌ రాజ్‌. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత.. ‘‘పురాతత్వ శాస్త్రం ప్రకారం, శాస్త్రీయంగా మనం మాట్లాడుకుంటే గనుక హనుమంతుడు ఒకప్పుడు నిజంగానే ఉండి ఉన్నాడనడానికి ఎలాంటి భౌతిక ఆధారాలూ లేవు’’ అని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ వాక్రుచ్చారు.

తన వ్యాఖ్‌యలు.. తమ పార్టీకే చెందిన యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలను ఖండించేలా ఉండడంతో అంతలోనే నాలుక కరుచుకుని.. ‘ఒకవేళ ఈ సత్యాలన్నిటినీ పక్కన పెడితే, హనుమంతుడంటూ ఉంటే ఆయన దళితుడుగానీ గిరిజనుడుగానీ అయి ఉంటాడు’ అని సరిదిద్దుకున్నారు. అంతటితో అయిపోలేదు.. హనుమంతుడు ‘గోండు’ జాతికి చెందినవాడని సమాజ్‌వాదీ పార్టీ నేత.. కులమేదైనా ఆంజనేయుడు గొప్ప క్రీడాకారుడు అని క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ అన్నారు. ఇలా అర్థంపర్థం లేకుండా హనుమంతుడి కులం గోల అంతులేని కథలా కొనసాగుతోంది.

ఇంతకీ ఆంజనేయుడు ఎవరు?
పురాణ గాథల ప్రకారం.. రాముడు నరుడిగా భూమ్మీద అవతరించినప్పుడు, ఆయనకు సహకరించేందుకు దేవతలందరినీ తమతమ అంశలతో భూమ్మీద వెలవాల్సిందిగా బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అలా శివుడి అంశగా హనుమంతుడు అవతరించాడు. శివుడు మంగళప్రదుడు. ఆయనెప్పుడూ శుభాల్నే ఇస్తుంటాడు. ఎప్పుడూ శుభాలను ఇవ్వడానికే రామాయణంలో హనుమ అనే పాత్ర అవతరించింది. ఆయన తల్లి అంజన. పుంజిక స్థల అనే అప్సరస ముని శాపానికి గురై అంజన అనే వానరకాంతగా భూమిపై జన్మించింది. కేసరి అనే వానర వీరుడితో ఆమెకు వివాహమైంది. శివుడి అనుగ్రహంతో రుద్రాంశగా వారికి కలిగిన కుమారుడే ఆంజనేయుడు. పురాణ పురుషులు కీర్తించిన పరమ భాగవతోత్తముడు, చిరంజీవి అయిన ఆ కపీంద్రుడికి కులాన్ని ఆపాదించడం తగదన్నది పండితుల అభిప్రాయం.

రాజకీయ నాయకులు ఇప్పటికైనా ఈ రగడను మానుకోకపోతే సాక్షాత్తూ ఆ స్వామే వచ్చి వారి పని పడతాడని అయోధ్యలోని హనుమాన్‌గఢీ ఆలయ ప్రధానార్చకుడు మహంత్‌ రాజు దాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఇప్పటికే చాలా చేశారని.. వారు ఇలాగే వ్యాఖ్యలు చేస్తూ పోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. హనుమంతుడి కులం గురించి మాట్లాడే నేతలందరికీ మతిపోయిందని 13 హిందూ సంస్థల సమాహారమైన అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.


 హనుమ అంటే?
పురాణగాథల ప్రకారం.. ఆంజనేయుడికి చిన్నప్పుడు ఒకసారి ఆకలి వేస్తే, ఆకాశంలో సూర్యబింబాన్ని చూసి పండు అని భ్రమించి సూర్యుడిని తినడానికి దూసుకెళ్లాడు. ఆంజనేయుడిని చూసి సూర్యుడు తన తీవ్రతను తగ్గించుకున్నాడు. అయితే, అది గ్రహణకాలం కావడంతో అదేసమయానికి రాహువు సూర్యుడిని మింగడానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న బాలాంజనేయుణ్ని చూసి ఇంద్రుడి వద్దకు వెళ్లి సూర్యుడిని మింగడానికి ఎవరో వచ్చారని చెప్పాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం చేయగా అది ఆంజనేయుడి ఎడమ దవడ (హనువు) భాగానికి తగిలి గాయమైంది. అందుకే ఆయనను ‘హనుమ’ అని పిలవాలని ఇంద్రుడే కోరుకున్నాడు

No comments:

Post a Comment