Thursday, 5 July 2018

మతతత్వానికి మానవత్వం ఉండదు - వాహెద్

మతతత్వానికి మానవత్వం ఉండదు  - వాహెద్

ప్రపంచంలో అమ్మాయిలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం భారతదేశమని ఇటీవల థాంసన్ రాయిటర్ ఫౌండేషన్ సర్వే ప్రకటించింది. ఈ సర్వే అబద్దం అని మనం వాదించవచ్చు. కాని రోజు వస్తున్న వార్తలను ఎలా కాదనగలం? పసిపాపలపై అత్యాచారాలు హత్యాలు జరుగుతున్న యదార్థాలను ఎలా కాదనగలం?
ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటే, పసిపాపలపై జరిగిన అమానుష మానభంగం, హత్యాలను కూడా మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వాడుకుని సమాజాన్ని అగ్నిగుండంగా మార్చే రాక్షసుల మధ్య బతుకుతున్నాం.
వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ పై ఉన్న వారు ఇటీవల వస్తున్న కొన్ని పోస్టులు చూసే ఉంటారు. మంద్ సౌర్ బాలిక మానభంగంపై నిరసన ర్యాలీలు ఎందుకు లేవు? ఇది కథువా వంటి భయంకరమైన నేరం కాదా? బాలిక హిందువు అయితే, ముస్లిం నిందితుడైతే నిరసనలు ఉండవా? వంటి ప్రశ్నలు చదివే ఉంటారు. నిజమే కదా, మానభంగం, అత్యాచారం ఎవరిపై జరిగినా నిస్సందేహంగా నేరస్తులకు కఠిన శిక్షలు పడాలి కదా? కథువా విషయంలో ఇన్ని ప్రదర్శనలు చేశారు. మంద్ సౌర్ విషయంలో ప్రదర్శనలు లేవేమిటి? అనే మనం అంతా ఆలోచిస్తాం? ముస్లిముల విషయంలో సెక్యులరిస్టులుగా చెప్పుకునేవాళ్ళు మౌనంగా ఉంటున్నారన్న అభిప్రాయానికి వచ్చేస్తాం. ఇలాంటి అభిప్రాయాలు సృష్టించడానికే ఈ ప్రచారం జరుగుతుందని మరిచిపోతాం.
కాని మన సమాజంలో చాపక్రింద నీరులా వ్యాపిస్తున్న మతోన్మాదాన్ని గ్రహించాలంటే కొన్ని వాస్తవాలను చూడాలి. అసలు మంద్ సౌర్ లో ఏం జరిగిందో చూద్దాం.
జూన్ 26వ తేదీన ఏడేళ్ళ ఒక స్కూలు బాలికను అపహరించి, అమానుషంగా మానభంగానికి గురిచేసి చంపేశారు. ఇది అత్యంత పైశాచికమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన వాడెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కూలిగా పనిచేసుకునే ఇర్ఫాన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. బాధిత బాలిక హిందూ, నేరస్తుడు ముస్లిం. వెంటనే దీనికి మతం రంగు పులమడం ప్రారంభమైంది. పైన చెప్పిన పోస్టులు అలాంటివే. కాని జరిగిందేమిటంటే, స్థానిక ముస్లిములు వెంటనే ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్తుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు తీశారు. నేరస్తుడిని ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. నేరస్తుడికి మరణశిక్ష విధించాలని, మరణశిక్ష తర్వాత అతనికి స్థానిక స్మశానంలో అంత్యక్రియలకు కూడా అనుమతి ఇవ్వమని ప్రకటించారు. జిల్లా అధికారులను కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే నేరస్తుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తు మెమొరాండం సమర్పించారు.
ఇప్పుడు కాస్త పైన మనం చెప్పుకున్న పోస్టుల గురించి ఆలోచిద్దాం. కథువాలో ఇలాగే జరిగిందా? అక్కడ నేరస్తులకు మద్దతుగా లాయర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు ర్యాలీలు తీశారు. పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకుండా లాయర్లే అడ్డుపడ్డారు.
ఈ తేడా అర్థమవుతుందా?
అంతేకాదు. ఇంకా వుంది. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు మరో అడుగు ముందుకు వేశారు. ఆ ఫేక్ వార్త ఏమంటే, మంద్ సౌర్ లో ముస్లిములు ఏడేళ్ళ బాలికను రేప్ చేసిన నేరస్తుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారని వార్త ప్రచారంలో పెట్టారు. మంద్ సౌర్ లో నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ముస్లిములు తీసిన ర్యాలీలో ప్లాకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ’’నహీ సహేంగే బేటీ పర్ వార్. బంద్ కరో యే అత్యాచార్‘‘ అని రాసి వున్న ప్లాకార్డులు. ఫోటోషాప్ ద్వారా ఆ ఫోటోలను మార్చి ’’ఇర్ఫాన్ కో రిహా కరో‘‘ అని ప్లాకార్డులు పట్టుకున్నట్లు ఫోటోషాప్ చేసిన ఫోటో వేసి, ఈ వార్త రాశారు. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేస్తున్న ఈ మతోన్మాద శక్తులకు సిగ్గు లజ్జ లేవని అర్థమవుతూనే ఉంది. ఈ ఫేక్ న్యూస్ వీరులను ఫాలో అవుతూ డిజిటల్ ఆశీర్వాదాలు ఎవరందజేస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
ఈ అబద్దం అంతటితో ఆగలేదు. ఈ పోస్టుకు ఒక వెబ్ సైటు లింక్ ఇచ్చారు. ఆ లింకులో ఇతర ధర్మాల అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం తప్పుకాదని ఖుర్ఆన్ చెబుతుంది కాబట్టి నేరస్తుడు ఇర్ఫాన్ ను విడుదల చేయాలంటూ ముస్లిములు ర్యాలీ తీశారని రాశారు. ఖుర్ ఆన్ లో అలాంటి ఒక్క వాక్యం కూడా లేదు. ముస్లిములు నేరస్తులను శిక్షించాలని ర్యాలీ తీస్తే ఆ ఫోటోను వాడుకుని, ఫోటో షాప్ చేసి, అబద్దాలు రాసి, ఇస్లామ్ పై ముస్లిములపై బురదజల్లుతూ రాసిన ఫేక్ వార్త ఇది. అంతటితో ఆగలేదు ఈ ర్యాలీని కాంగ్రేసు నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా సమర్ధించాడని, సిబిఐ విచారణ డిమాండ్ చేశాడని (కథువాలో సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసినవాళ్ళెవరు?) రాశారు. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా నేరస్తులకు ఉరిశిక్ష వేయాలంటూ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇన్ని అబద్దాలు ఎలా చెబుతున్నారంటే, నిజాలేవో తెలుసుకునే ఓపిక ప్రజలకు ఉండదు. వాట్సప్, ట్విట్టర్లలో వచ్చిన ప్రతి లైను పరమసత్యంగా నమ్మేస్తారన్న నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కావడం లేదని ఇటీవల జరుగుతున్న లించింగ్ సంఘటనలు చెబుతున్నాయి.
అంతటితో ఈ మతోన్మాదుల అబద్దాలు ఆగలేదు. మరో రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక పోస్టు ఇర్షాద్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టు. అందులో ’’హిందూస్తాన్ కా షేర్ జిస్నే ఆ..... కా బదలా లియా‘‘ అనే వ్యాఖ్యతో పాటు నేరస్తుడి ఫొటో పెట్టి వాడిని పొగిడే పోస్టు. అంటే కథువా హత్యాచారానికి ఈ నేరస్తుడు ప్రతీకారం తీర్చుకున్నాడంటూ ఇర్షాద్ అనే వ్యక్తి హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టు. అసలీ పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందని ఈన్యూస్ రూమ్ సైట్ విచారణ ప్రారంభించింది. ఇది ఫేక్ ఐడి అని, సోషల్ మీడియాలో విద్వేషం ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని అర్ధమైంది. ఇర్షాద్, కరాచీగా చెప్పుకున్నప్పటికీ ఈ వ్యక్తి ఇండియాకి సంబంధించిన పోస్టులనే లైక్ చేస్తున్నాడు. అతడి ఫ్రండ్సందరూ ఇండియన్లే. ఇండియాకు సంబంధించి మాత్రమే పోస్టులున్నాయి. పైగా దేవనాగరిలో రాస్తున్నాడు. ఉర్దూలో కాదు. గూగుల్ రివర్స్ సెర్చిలో ఈ ఇర్షాద్ అనే వ్యక్తి పెట్టుకున్న ప్రొఫైల్ పిక్చర్ గురించి పరిశోధిస్తే, ఈ ఫోటో 2016లో న్యూయార్కుకు చెందిన బంగ్లాదేశీ ముజీబుర్రహ్మాన్ అనే వ్యక్తిదని తేలింది. అంటే ఇది ఫేక్ ఐడి. ఇదే మెస్సేజ్ మరో ఫేక్ ఐడి రజీయాబాను పేరుతో వైరల్ అయ్యింది. అయినా ఉర్దూ వాడే పాకిస్తానీ దేవనాగరిలో అంతబాగా ఎలా రాస్తాడని కూడా సాధారణంగా ఎవరు ఆలోచించరు. ఇది నేటి పరిస్థితి. ఇక రెండవ ఐడి రజియాబాను విషయానికి వస్తే, ఫిలిప్పిన్స్ లోని లేడి ఫాతిమా యూనివర్శిటీలో ఫాకల్టీ మెంబర్ ఫొటో వాడుకున్నారు. ఈ ఐడిని తర్వాత డియాక్టివేట్ చేశారని ఈన్యూస్ రూమ్ రాసింది.
అత్యంత అమానుషమైన నేరాన్ని, పసిపాపలపై జరిగిన అత్యాచారం, హత్యలను కూడా మతోన్మాద విషం విరజిమ్మడానికి వాడుకునే ఈ నైచ్యాన్ని ఏమనాలి?
మరోవిషయం కూడా చూద్దాం. మధ్యప్రదేశ్ మంద్ సౌర్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారం హత్య 26వ తేదీన జరిగాయి. కేవలం కొన్ని రోజుల మందు అంటే 21వ తేదీన అదే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఆరేళ్ళ బాలికను అత్యంత క్రూరంగా మానభంగం చేసి చంపేశారు. ఈ నేరస్తుడిని కూడా సిసి టీవీ ఫుటేజి ద్వారా అరెస్టు చేశారు. నేరస్తుడి పేరు జితేంద్ర కుశ్వత్. ఆ పసిపాప ముఖాన్ని బండరాయితో ఛిద్రం చేశాడు. అంతకు ముందు ఇండోర్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మంద్ సౌర్ సంఘటన జరిగిన తర్వాత ఇదే మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో నాలుగేళ్ళ పసిపాప మానభంగానికి గురైంది. నేరస్తుడి పేరు మహేంద్ర సింగ్. ఇంట్లో నిద్రపోతున్న పసిపాపను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ పసిపాప చచ్చిపోయిందని భావించి, నిర్మానుష్య ప్రదేశంలో పారేసి వెళ్ళిపోయాడు. పాప కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు స్పృహలేని స్థితిలో దొరికింది. ఆసుపత్రిలో కోలుకుంటుంది.
ఈ సంఘటనలు కూడా అత్యంత అమానుషమైన సంఘటనలు. కాని ఎక్కడా ఈ మతోన్మాద ముఠాలు కథువా రేప్ కేసుతో వీటిని పోల్చుతూ ర్యాలీలు తీసిన సెక్యులరిస్టులెక్కడ అంటూ వీరంగాలు వేయలేదు. దానికి కారణమేమిటో వేరే చెప్పనవసరం లేదు. మంద్ సౌర్ లో మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. ఇతర సంఘటనల్లో లేదు. మానభంగాలను కూడా మతోన్మాద విషప్రచారానికి వాడుకుంటున్న ఈ నీచమనస్తత్వాన్ని అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది.
అత్యాచారం ఏదైనా తీవ్రంగా ఖండించవలసిందే. మానభంగాలను కూడా మతోన్మాద విషప్రచారానికి వాడుకోవడం అంతకన్నా తీవ్రంగా ఖండించవలసిన దుర్మార్గం. కథువా విషయంలో ర్యాలీలు తీసిన వాళ్ళెక్కడ అంటూ మంద్ సౌర్ విషయంలో ప్రశ్నించిన వాళ్ళు ఇవే ప్రశ్నలు సత్నా విషయంలోను, గ్వాలియర్ విషయంలోను ఎందుకు అడగలేదు? అనేవి ఆలోచించవలసిన ప్రశ్నలు
కథువాలో మానభంగానికి పాల్పడిన, హత్యచేసిన నేరస్తులకు మద్దతుగా ర్యాలీలు తీశారు. లాయర్లు, రాజకీయనాయకులు, మంత్రులు అందులో పాల్గొన్నారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మంద్ సౌర్ లో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేశారు. కాబట్టి నిరసన ప్రదర్శనలు జరగలేదు. కథువాలో సంఘటన జరిగిన వెంటనే నిరసనలు జరగలేదు. జనవరిలో ఈ దారుణం జరిగింది. మూడు నెలల తర్వాత, జమ్ములో లాయర్లు, రాజకీయ నాయకులు నేరస్తులకు మద్దతుగా ర్యాలీలు తీసిన తర్వాత దాన్ని ఖండిస్తూ నిరసనలు జరిగాయి. అంతకు ముందు ఉన్నవ్ కేసు కూడా జరిగింది. ఉన్నవ్ కేసు విషయంలోను నిరసనలు జరిగాయి. కాని ఈ మతోన్మాద ఫేక్ వార్తల ఫాక్టరీ కేవలం కథువా కేసు ప్రస్తావిస్తుంది కాని ఉన్నవ్ కేసు ప్రస్తావించడం లేదు. కారణమేమిటి? నిజానికి మంద్ సౌర్ కేసులో వెంటనే నేరస్తులను శిక్షించాలని ముస్లిములు ర్యాలీ తీశారు.
కథువాతో పోల్చడమే ప్రారంభిస్తే, కథువా కేసులో సంచార ఆదివాసి ముస్లిం తెగకు చెందిన అమ్మాయి కావడం వల్లనే, ఈ సంచార జాతులు జమ్ములో ప్రవేశించకుండా భయభీతులు సృష్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగా, ప్రణాళికాబద్దంగా జరిగిన నేరం. ఈ నేరం విషయంలో మతాన్ని ప్రస్తావించింది సెక్యులర్ శక్తులు కాదు. స్వయంగా మతతత్వ శక్తులే నేరస్తులకు మద్దతుగా ర్యాలీ తీసి మతాన్ని దీనికి జోడించాయి. సంచార తెగలు జమ్ములో అడుగుపెట్టకుండా భయభీతులకు గురి చేయాలన్న ఆలోచనలోనే మతతత్వం ఉంది. నేరస్తులకు మద్దతివ్వడానికి హిందూ ఏక్తా మంచ్ వేదికగా ర్యాలీలు తీయడం ద్వారా మతాన్న ఈ నేరానికి జోడించింది మతతత్వ శక్తులే. దీన్ని వ్యతిరేకించిన వారు మతాన్ని నేరానికి జోడిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. మంద్ సౌర్ లో నేరస్తుడు ముస్లిం అని తెలియగానే ముస్లిం సముదాయం ర్యాలీ తీసి నేరస్తుడికి కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేయడమే కాదు, అంత్యక్రియలకు స్ధానిక స్మశానంలో అనుమతించేది లేదని ప్రకటించింది.
కథువాతో పోల్చితే ఇంత తేడా ఉంది. అయినా మంద్ సౌర్ సంఘటన జరిగిన వెంటనే కథువా కేసులో ర్యాలీలు తీసిన వాళ్ళెక్కడ అంటూ సోషల్ మీడియాలో వీరంగాలు వేస్తున్న వారు దేశానికి మంచి చేస్తున్నారా?
భారతదేశం ప్రపంచంలోనే బాలికలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా చెప్పిన సర్వేలోని నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ మానభంగాన్ని మతోన్మాద విషప్రచారానికి వాడుకునే సమాజంగా కొత్త పేరు సంపాదించుకోబోతోంది. అబద్దాలు ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో పెడితే అప్పటికప్పుడు రెచ్చిపోయే జనం ఉండవచ్చు. కాని అబద్దాలు నిజాలు కావు. ప్రపంచానికి ఈ అబద్దాల ఫాక్టరీల గురించి తెలియకుండా ఉండదు. దేశానికి ఈ మతోన్మాద శక్తులు ఎలాంటి పేరు సంపాదిస్తున్నాయి. ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం మానభంగాలకు గురయ్యే బాధితుల్లో 50శాతం పిల్లలే. 2016లో పిల్లలపై అత్యాచారాల కేసులు దాదాపు 19000 రిపోర్టయ్యాయి. రిపోర్టు కానివి ఎన్నో. కోర్టుల్లో పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు సంబంధించి దాదాపు లక్ష కేసులు పెండింగులో ఉన్నాయి.
లైంగిక నేరాలు లేని సమాజ నిర్మాణం ముఖ్యమా? లేక మానభంగాలను కూడా మతోన్మాదానికి వాడుకుని సమాజంలో చిచ్చు పెట్టడం ముఖ్యమా? కథువా లాంటి నిరసనలు మంద్ సౌర్ లో ఎందుకు లేవన్న పోస్టు ఏదన్నా కనబడితే ఈ ప్రశ్న గురించి అందరూ ఆలోచించాలి.

No comments:

Post a Comment