Friday 24 May 2024

Election Commission : హద్దు దాటొద్దు

 Election Commission : హద్దు దాటొద్దు

ABN , Publish Date - May 23 , 2024 | 06:00 AM


బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తమ స్టార్‌ క్యాంపెయినర్ల ప్రసంగాల్లో కనీస మర్యాద పాటించేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. పార్టీల నేతల ప్రసంగాల తీరుపై లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ ముగిసిన తర్వాత ఈసీ స్పందించింది. కాంగ్రెస్‌ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచేస్తుందంటూ

ప్రచారంలో శ్రుతి మించొద్దని మీ ‘స్టార్‌ క్యాంపెయినర్ల’కు చెప్పండి

బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్‌ హెచ్చరిక

కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు

మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం

ముస్లింలీగ్‌, శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం

రక్షణదళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన

‘‘ఎన్నికల ప్రచారంలో ‘హద్దు’ దాటొద్దని మీ ‘స్టార్‌ క్యాంపెయినర్ల’కు చెప్పండి’’ అంటూ ఎన్నికల కమిషన్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు హెచ్చరిక జారీ చేసింది. ఇరు పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లూ చేస్తున్న ప్రసంగాలు గాడితప్పుతున్నాయంటూ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపైనే ఉన్నదని గుర్తు చేసింది.

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తమ స్టార్‌ క్యాంపెయినర్ల ప్రసంగాల్లో కనీస మర్యాద పాటించేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. పార్టీల నేతల ప్రసంగాల తీరుపై లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ ముగిసిన తర్వాత ఈసీ స్పందించింది. కాంగ్రెస్‌ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచేస్తుందంటూ మోదీ.. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్‌ గాంధీ.. ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఇరు పార్టీలూ ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వాటిపై వివరణ ఇవ్వాలంటూ రెండు పార్టీలకూ ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాటిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన వివరణలను తిరస్కరిస్తూ.. తాజాగా వారికి లేఖలు రాసింది. కులం, మతం, జాతి, భాషల ఆధారంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతలు సంయమనం పాటించేలా చూడాలని ఆ లేఖల్లో సూచించింది. వివిధ కులాలు, మతాలు, తెగలు, భాషలకు చెందిన ప్రజల నడుమ ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత పెరిగేలా, పరస్పర విద్వేషాన్ని కలిగించేలా, ఉద్రిక్తతలను పెంచేలా ఏ పార్టీ, ఏ అభ్యర్థీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని, ఎలాంటి చర్యలూ చేపట్టకూడదని ఎన్నికల నియమావళి పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేసింది. క్యాంపెయినర్లు ఆ నియమావళిని అనుసరించేలా చూసే బాధ్యత పార్టీలదేనని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ తాత్కాలికమని.. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి, పోతాయని.. కానీ ప్రసంగాల ప్రభావం ఎక్కువ కాలం ఉండే ప్రమాదం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వెలిబుచ్చింది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలు ఆపాలని బీజేపీకి స్పష్టం చేసింది. మతపరమైనర ప్రచారం చేయకుండా తమ స్టార్‌క్యాంపెయినర్లను నియంత్రించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో సూచించింది.

ముస్లిం లీగ్‌, శక్తి వంటి పదాల వినియోగంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచారంలో ప్రసంగాలు చేేసటప్పుడు అధికార పార్టీగా ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని తెలిపింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకీ ఎటువంటి మినహాయింపులు ఉండవని, అంతే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కాంగ్రె్‌సపై ఉన్నదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం రద్దవుతుందని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయొద్దని కాంగ్రె్‌సకు సూచించింది. తాము అధికారంలోకి వస్తే ‘అగ్నీవీర్‌’ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించిన నేపథ్యంలో.. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం తప్పని.. ఎన్నికల వ్యవస్థపై ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే తాము సహించబోమని హెచ్చరించింది.

No comments:

Post a Comment