Tuesday 12 May 2020

అయోమయంలో ఉన్నావు ఎక్బాలూ! = SKY

అయోమయంలో ఉన్నావు ఎక్బాలూ!
~~~
ఇక్బాల్‌చంద్‌ పేరు విన్నారా ఎపుడైనా? ఇన్నాళ్లు ఎక్కడికి పోయాడు? సాహిత్యం నుంచి ఎందుకు పారిపోయాడు? ఒక్క ఆరోవర్ణం కవిత తప్ప ఇతనిది ఒక్క ముస్లిం కవిత కూడా ఎందుకు గుర్తుకురాదు? ఇలాంటి అందరూ వేసే ప్రశ్నలు నేను వేయబోవడం లేదు.

కాని ఇక్బాల్‌ ను ఒక ప్రశ్న అడగాలి- అతను ముస్లిం కవా? కాదా? జవాబు సూటిగా ఉండాలి. డొంకతిరుగుడు పూలొద్దు. ఎందుకంటే మనలో చాలామంది ముస్లిం రచయితలుగా కాక జనరల్‌ రచయితలుగా గుర్తింపు పొందడానికే ఎక్కువ తాపత్రయపడ్డారు. ఇక్బాల్ కూడా అదే కోవ!

పద్దెనిమిదేళ్లు తెలుగు సాహిత్యం నుంచి మాయమైపోయి ఇప్పుడొచ్చి బరిలోకి దూకిన ఇక్బాల్ కు ముస్లింవాదం మీద కనీస అవగాహన లేకుండా పోయింది. ఎప్పటికి ఏది తోస్తే అది రాసేయగల 'బహదూర్‌'! మైనారిటీ వాదం అని వాడడం 1997 ముచ్చట. అక్కడే ఆగిపోయాడు ఇతను! ఇన్నాళ్లకు ఈ అవాకులు చెవాకులు పేలుతున్నాడు? ఎటూ కాకుండా పోయానని తన ఉనికి గురించి బెంగపట్టుకుందేమో!

రాత్రి రెండు గంటలకు పోస్టు పెట్టి దాన్ని గడికింత గడికింత చేరుస్తూ వచ్చినట్లు తెలిసింది. చివరికి నలుగురు నాలుగు చీవాట్లు పెడితే మల్లి ఆ తప్పులన్నీ పొద్దంతా సర్దినట్లున్నాడు. మైనారిటీ, ముస్లిం కవులు అని బహువచనంలో ఎత్తుకొని పొద్దటినుంచి సాయంత్రానికి వచ్చేసరికి నేనొక్కడినే మిగిలాను! సరే, నేను ఈవెంట్ మేనేజర్ నే అనుకుందాం. అకవినే అనుకుందాం. ఇతగాడిలాగా 18 ఏళ్ళు మాయమైపోయి ఉజ్జోగం చేసుకొని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని, సంపాయించుకొని మళ్ళా రంగంలోకి దూకి పేరుకోసం పాకులాడడం నాకు చేతకాలేదు.. ఏం చేద్దాం చెప్ప0డి ?!

ఇతనికి అసలు ముస్లింవాద సాహిత్యం మీద సదభిప్రాయమే లేదట! అయినప్పుడు ఈ సోదంతా ఎందుకు? అని చదివినవాళ్లకు అనిపించడం సహజమే! కాని అతనికే ఆ క్లారిటీ లేదు. అఫ్సర్‌ను పొగడాలి. అందుకు ఏదో ఒకటి రాయాలి. పనిలో పనిగా కొందరిని తను అసలు గుర్తించడమే లేనట్లు ఫోజు కొట్టాలి. ఈ ప్రాసెస్‌లో పెన్ను ఎటు తడబడితే అటు అడుగేసి నాలుగు వాక్యాలు గెలికాడు. పాపం, మొదటి నుంచి ముస్లింవాదం గురించి తెలీనివాళ్లు నిజమే కాబోలు అనుకోవాలి!

తనకు నచ్చిన అఫ్సర్‌ గురించి, నస్రీన్‌, వాహెద్‌ గురించి ఒక మంచి వ్యాసం లేదా విడి విడి వ్యాసాలు రాస్తే బాగుండేది. వారి కోసం ముస్లింవాదాన్నే తూలనాడుతున్నాననే సోయి కోల్పోయాడు. దాంతోనే ఈ గందరగోళ రాత!

తెలుగు సాహిత్యంలో ముస్లింవాద సాహిత్యం ప్రాముఖ్యత తెలిసిందే. స్త్రీ, దళిత వాదాల వరుసలో ముస్లింవాదం ఒక వాదంగా స్థిరపడి ఇవాళ దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా ఈ సాహిత్యముంది. ముస్లింవాదం ఒక కొత్త ఎరుక. ఒక కొత్త ఒరవడి. అదొక ఒక పెనుప్రకంపన. ఒక జల్‌జలా! అలావాగుండం! అజాఁ! రజ్మియా! ముల్కీ ఉద్యమం! తమ వతన్‌ ఇదని, ఈ దేశ 'ముఖామీ'లం మేమని నినదించడం ముస్లింవాదం. ముఖానికి వేలాడేసిన 'నఖాబ్‌' ఎత్తిచూపింది ముస్లింవాదం. ముస్లింలకు ఇదొక 'జగ్‌నే కీ రాత్‌' అని మేల్కొలిపింది. 'ఫత్వా'ల్ని ధిక్కరించడం ముస్లింవాదం ప్రత్యేకత.

ముస్లింవాదం తెలుగు సాహిత్యానికి కొత్త జీవితాలను పరిచయం చేసింది. కొత్త సంస్కృతిని, కొత్త నుడికారాన్ని, కొత్త భాషను, కొత్త ఇమేజరీని ఇచ్చింది. కొత్త ట్రెండ్స్‌ని ఎన్నింటినో అందించింది. ముస్లింవాదంలో ముస్లిం స్త్రీల కవిత్వం, దూదేకుల కవిత్వం, ముస్లిం సంస్కృతి కవిత్వం, ఛాందసత్వాన్ని ఎత్తిచూపే కవిత్వం, సంస్కరణ కోరే కవిత్వం, ముస్లిం పేదరికంపై ప్రత్యేకమైన కవిత్వం, మూలవాసి కవిత్వ0, బహుజన మిత్ర కవిత్వం, ఇలా ఎన్నెన్నో కోణాలున్నాయి. ఎందరో కవులు తమ ప్రత్యేక శైలీ శిల్పాలతో సృజించిన కవిత్వాన్ని ఆస్వాదిస్తాం. సున్నితత్వం, ఆ సొగసు, తాజాదనం, అవసరమైన చోట తీవ్రత ఎన్నో ముస్లింవాదంలో చూడొచ్చు.

ముస్లింవాదానికి భారతదేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఏ రాష్ట్రంలోనూ ముస్లిం వాయిస్‌ ఒక వాదంగా స్థిరపడలేదు. ఒక ప్రాంతీయ భాషలో ముస్లిం కవులు, రచయితలు తమ రచనల ద్వారా తమ సాహిత్యాన్ని ఒక వాదం స్థాయిలో నిలబెట్టడం మామూలు విషయం కాదు.

అస్తిత్వవాదాలంటే బాహిర్‌ యుద్ధమే కాదు అంతర్యుద్ధం కూడా చేయడమని ముస్లింవాదం స్పష్టం చేసింది. తమ మధ్యే ఉంటున్న మరో ప్రపంచాన్ని ముస్లిమేతరులకు చూపిన వాదం. ముస్లింల గురించి సమాజంలో పెంచిపోషించబడుతున్న అపోహలను, అపార్ధాలను, అబద్ధాలను తునాతునకలు చేస్తూ ముస్లింల పట్ల మిగతా సమాజాన్ని సెన్సిటైజ్‌ చేసింది ముస్లింవాదం. ముస్లింలను సెన్సిటైజ్‌ చేయడం అంతర్యుద్ధం అయితే ముస్లిమేతర సమాజాన్ని సెన్సిటైజ్‌ చేయడమే పెద్ద పని. ఆ పని విజయవంతంగా చేసింది ముస్లింవాదం. నిజానికి ఆ పని చేయడం ముస్లింలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మేలు చేసిన అంశం. మెజారిటీ భావజాలం, మనువాద భావజాలం పర్సెంటేజీల తేడాతో చాలామందిలో ఉంటుందనే స్పష్టతను ఇచ్చింది ముస్లింవాదం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్‌ పొందడంలో దీని ప్రభావముంది. అలాగే నేటి రెండు రాష్ట్రాల్లో బహుజన, విప్లవ ఉద్యమకారులు, సాహిత్య జీవులంతా ముస్లింవాద ప్రభావంతో ముస్లింలకు ఎంతో దగ్గరయ్యారు.

అలాంటి ముస్లింవాదం మీద తనకు సదభిప్రాయం లేదని వాగేవాడిని ఎలా అంచనా వేద్దాం?

మొదట్లో తన ముస్లిం కవిత్వం 'బ్లాక్‌ వాయిస్‌' పేరుతో అచ్చేశాడు ఇక్బాల్‌. తన అకడమిక్‌ గురువు ఈ పుస్తకం బయటికి వస్తే నీకు ఉద్యోగం రాదని భయపెడితే అచ్చయిన పుస్తకాన్నే పాతిపెట్టేసుకున్నాడు. ఇట్లాంటి గాలి మనిషి, ఎంతో ముస్లింవాద సాహిత్యం సృజించడమే కాకుండా పెద్ద యుద్ధమే చేసి వాదాన్ని నిలబెట్టుకున్నవారిని అవహేళన చేస్తుండడం, అందుకు పుస్తకాలేసి, సభలు సదస్సులు పెట్టిన వారిని ఈవెంట్ మేనేజర్లని, ముస్లింవాదానికి వెన్నుదన్నుగా నిలబడ్డ విమర్శకులు మాయ చేశారని దిగజారుడు మాటలనడాన్ని ఎలా అర్ధం చేసుకుందాం? ముస్లింవాదంపై చర్చోపచర్చలు నడుస్తుంటే, మాలాంటి వాళ్లం యుద్ధరంగంలో పోరాడుతుంటే పద్దెనిమిదేళ్లు కనిపించకుండా పోయిన ఈ తాలు మనిషి ఇప్పుడొచ్చి ముస్లింవాదుల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం ఎందుకు? ముస్లింవాదాన్ని తూలనాడడం ఎందుకు?

ముస్లింవాదంపై దాడి చేస్తూ వచ్చిన ఒక గ్రూప్‌ తమ పుస్తకానికి ఇతనితో ముందుమాట రాయించింది. అందులో ముస్లింవాదులు బెల్లం చుట్టూ ఈగలు అని సులువుగా రాసేసిన బాధ్యతారహితుడు ఈ మనిషి.

ఇప్పటి ఈ రైటప్‌ లో తన పేరు కోసం పాకులాట కనిపిస్తోంది. కవి సొంత సమూహం ఒప్పుకోకుంటే అది కవిత్వం కాదని స్టేట్ మెంట్ ఇస్తున్నాడు. ఉదా.కు ఈయణగారు కోట్ చేసిన కొందరు కవులు మద్యం మీద మంచి కవిత్వం రాశారు. దాన్ని ముస్లింలు ఒప్పుకుంటారా?

ముస్లింవాదాన్ని ముస్లింలు ఒప్పుకోనిదే ఇవాళ ఇంతమంది కొత్త కవులు రచయితలు పుట్టుకొచ్చారా? ఇవాళ రాస్తున్న నస్రీన్‌ ఖాన్‌ కావచ్చు, వాహెద్‌ కావచ్చు ఇంకా చాలామంది ముస్లింవాదాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వారసులే!

ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ నుంచి ఖాజా, స్కైబాబ, షాజహానా, అఫ్సర్, హనీఫ్, యాకూబ్, ఖదీర్ బాబు, బా రహమతుల్లా, వేంపల్లె షరీఫ్, సయ్యద్ గఫార్, అలీ, షంషాద్ మహమ్మద్, అన్వర్, నస్రీన్ ఖాన్ పుస్తకాలేసిన ముస్లింవాదులు. వీరందరికన్నా ముందుగానే షేక్ హుసేన్ సత్యాగ్ని 'పాచికలు' కథలు వేశారు. కరీముల్లా, వాహెద్ పుస్తకాలేశారు. వీరు ముస్లింవాదులో కాదో వారే చెప్పాలి. ఇక్బాల్ ఆరోవర్ణం పేర కవిత్వం వేశాడు. మరి ఆ ఒక్క కవితను ముస్లింవాదం లెక్కలోకి తీసుకోవాలా వద్దా? ఆయనే చెప్పాలి. అసలు ఆయన ముస్లింవాదో కాదో కూడా చెప్పేస్తే మాకు కాస్త క్లారిటీ వస్తుంది. ఊరికెనే తేనె తుట్టె ను కదిపి వదిలేస్తే కుదరదు.

ఇంకా పుస్తకాలేయనివారు నబి కరీమ్ ఖాన్, షేక్ పీర్ల మహమూద్, సయ్యద్ ఖుర్షీద్, రెహానా, వతన్, జల్ జలా, అజా, ముల్కి, అలావా, ముఖామి, కథామినార్ సంకలనాల్లో దాదాపు 100 మంది దాకా ముస్లిం రచయితలున్నారు.

ఎక్బాలూ.. చంద్‌ ముక్త్‌ లు రాసుకుంటూ ముక్తి పొందు నాయనా! నీకెవరైనా అడ్డం పడ్డారా చెప్పూ!? ఎన్నడూ ముస్లింల గురించి చింతించని నువ్వు, ఏవో రెండు కవితలు, ఓ కథ రాసిన నువ్వు ఎన్ని కుట్ర రాతలు రాసినా పెద్దగా ఫరక్‌ పడేదేమీ లేదు. కాని నువ్వు ఏకంగా ముస్లింవాదాన్నే టార్గెట్ చేయాలని చూశావు చూడూ.. అది నీలోని మనువాదిని పట్టిస్తున్నది. నువ్వు చాలా డేంజర్‌ గాడివని సాహిత్యకారులకు తెలియజేస్తున్నది. అందుకే ఈ మాత్రం స్పందన.

కాకపోతే నువ్వు కూడా సక్సెస్ ఫుల్ ఈవెంట్ మేనేజర్ వి కావచ్చు. నువ్వనుకునే స్థాయిలో కవిత్వం ఉన్న పుస్తకాలు వేయొచ్చు. సమస్యలు వదిలి ఫక్తు కవిత్వం చర్చలు చేయొచ్చు. నీకిష్టమైన గ్రూపును, ముస్లింలను వెనక్కు నడిపించే గ్రూపును మెయిన్ టెయిన్ చేయొచ్చు. మైదానం ఖాళీగుంది ఎక్బాల్ ! నువ్వు బొందపెట్టిన బ్లాక్ వాయిస్ ను మళ్ళా బయటికి తేవచ్చు. ఎవరైనా ఏమైనా చేయొచ్చు.. చేసేవాళ్ల మీద పడి ఏడవకుండా ఉంటే చాలు! సరేనా!
*

నోట్ : ముస్లింవాద సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచే కవితా సంకలనాలు అతని దగ్గర లేనట్లుంది. జల్‌జలా, అజాఁ, అలావా, ముఖామి వెతుక్కుని మరోసారి చదవడం మంచిది. అలాగే వతన్‌ లో అతని మంచి కథ కూడా ఉంది, వతన్ కూడా మరోసారి చదవడం మంచిది.
*
మచ్చుకు అతని మొఖాన కొన్ని ముస్లింవాద కవితలు, కవితా పంక్తులు విసురుతున్నా-షాజహానాను భావుకురాలు మాత్రమే అన్నాడు కదా, తను రాసిన కాలీ దునియా చదివితే అతనికి దిమ్మతిరగడం ఖాయం!

కాలీ దునియా
– షాజహానా

బురఖా వేసుకున్నపుడు
ప్రపంచం నల్లగ అవుపించేది
బుర్ఖాలని చీల్చేసి
శరీరాలతో సహా తగలబెడుతున్నపుడు
బిత్తర పోయిన ప్రాణాలకు ఒక్క సారిగా
ఈ దునియా మొత్తం నల్లగా … ఎండిన రక్తం ముద్దలా

ఇప్పుడు బురఖా వేసినా వేయకున్నా
ప్రపంచమంటే కాషాయ శిల
కత్తి మొన
పొడుచుకొచ్చిన ........

ఇంత క్రూరత్వం దాగుంటుంది అనే కదా
మమ్మల్ని బయటికి రానివ్వడం లేదంటున్నారు
ఈ భయానక నిజం స్వప్నమైతే
కళ్ళు, బూసుల్ని దులుపుకున్నట్టు తుడిచేసేవి
కానీ, నిజం నిప్పై కాల్చింది
నీరై ముంచింది
కాషాయమై దింపుడు గల్లెం లేకుండా చేసింది

ప్రపంచం ‘మాయిపొర’ లో ఇరుక్కుని
ఉమ్మ నీరు తాగి
ఇవ్వాళ కాషాయం కక్కుతోంది

***
మా కాళ్ళ సందుల్లోంచి వొచ్చి
మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారు
నీ యింట్లో ఆడది కూడా
రహస్యంగా మా కోసం కన్నీళ్లు కార్చి వుంటుంది
మగ నా కొడుకుల ఊపిరి
బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్క సారైనా
మీ అమ్మ అనుకునే వుండాలి

స్త్రీకి పురుషుడి నగ్నత్వం ఎంత పాతో
అరాచకం అమానుషం క్రూరత్వం అంతే పాత
సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని
నీకూ నాకు మధ్య రక్త సంబంధం లేదంటావా ?

గుండెల్ని పెకిలించి
పొట్టలు చీల్చి
యోనుల్లో ఆయుధాలు పొడిచి
ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకుని ఉండొచ్చు
కానీ ‘నన్ను’ హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేను బతకడమే కాదు
నిన్ను పుట్టించి బతికించేది నేనే

అయినా స్త్రీ తప్ప మగవాడిని క్షమించేది యెవరు?
ఎప్పటికీ ప్రపంచం నా రొమ్ము తాగుతున్న బిడ్డే !

*

రెహాల్
- స్కైబాబ

కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ
తరాల చీకటి కమ్మేసిన గోషా లో
పాలిపోయిన చంద్రశిలా దేహంతో
అనుక్షణం
'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్

మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని
'వజూ' నీళ్ళతో పుక్కిలించి
తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని
నమాజ్ చదువుతున్నపుడు...

మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో
రాలిన కన్నీటి తడిపై
ఏ దేవుడూ సాక్షాత్కరించడు
ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది

అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ
మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ

మాకోసం 'దువా' చేసి చేసి
అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప...
ముందు కూర్చున్న నీడ విస్తరించి
కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప...
....... ......... ......... ......... .......!

'తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు'
మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతిసారీ
చెమరిన నా చూపు
ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది

అబ్బాజాన్ అసహాయత చెల్లిని ఎవడికో
రెండో పెళ్ళాంగా అంటగడితే
ఆ చిట్టితల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద
వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే

కాన్వెంట్ కు బదులు కార్ఖానా కెళ్ళే తమ్ముడు
సాయంత్రానికి కమిలిన దేహంతో అల్లుకుపోతే
పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేదీ అమ్మే

కడుపులో మా భారాన్ని మోసి
కష్టాల మా బాధ్యతలు మోసి
కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనక పాతివ్రత్యాన్ని మోసి
తన కనుబొమ్మల నెలవంకల మీద
చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ
చివరకు
ఖురాన్ ను మోసే 'రెహాల్' మిగిలిపోవలసిందేనా ?

(రెహాల్ : వ్యాస పీఠం)

*
నరం తెగిన కవాను
-ఖాజా

సెంచురీ నా కంచంలోని అన్నం ముద్దని తన్నుకుపోయింది
పాలిష్డ్‌ స్పాంజ్‌ పిల్లో
నా గొంతుమీద తన సుతిమెత్తని చేతులుంచి నులుముతుంది

నా ఊపిరి చుట్టూ ఒక ఉచ్చు
దేశ సరిహద్దుల్లో పాతిన ముళ్ల కంచెలా బిగుసుకుంటుంది
నైపుణ్యం నిండిన నా చేతివేళ్ల మీద
ఒక విదేశీ ఫోమ్‌ పాదం నాడా బూట్లతో నృత్యం చేస్తుంది

పగలని పత్తికాయలా నా కవాను తీగల్లో ఒక అత్యాధునిక అపశృతి
పంటి కింద పలుకు రాయిలా తగులుతుంది
ముడి దూదిని మీటే నరం తెగి
గుండె పరుపులోంచి రక్తం ధారలు కడుతుంది
పోలియో సోకిన పసిబిడ్డలా
వాలుదూది వెలిసిపోయి సతికిలబడుతుంది
* * *
'ఒక కాలంలో పని లేకపోతే
ఇంకో కాలం కోసం ఎదురు చూడొచ్చు,
ఉన్న ఊళ్లో పని దొరక్క పోతేమరో ఊరికి వలస పోవచ్చు
-నమ్ముకున్న వృత్తే పోతే...'
* * *
నా జాతి జాతినంతా నిట్టాడిగా కాసిన కుదప
ఇవాళ నడివికి విరిగిపోయి బిక్కచచ్చింది
నా బడుగుతనానికి గంజినీళ్లై నిలిచిన పడుగు పేక
ఫారిన్‌ పరిశ్రమల పదఘట్టనలో నలిగి అవిదైంది

నిన్నటి దాకా
నా చీనీ పళ్లెంలో అన్నం ముద్దయిన తెల్ల దూది
ఇవాళ నా కళ్లలో ఘనీభవించిన తెల్లపొరైంది
నా బతుక్కొక ఆమీ అయిన ఊతకండె
పాత డబ్బాను తన్నినట్టు నన్ను సాచి తన్నింది
* * *
సుతిమెత్తని దూదేకిన చేతులతోనే
ఇప్పుడు సుతారి పనిలో గమేలా మోస్తూ-
అందమైన చమ్కీ పరుపులు కుట్టిన చేతులతోనే
ఇప్పుడు ఇటుకలు పేర్చిమట్టి పోసి దిమ్మెస కొడుతూ -

(కాయర్‌ పరిశ్రమల ధాటికి కులవృత్తిని కోల్పోయిన నా వేలాది దూదేకుల కార్మికులకు)

*

అవ్వల్‌ కల్మ
-యాకూబ్‌

మీ ఇళ్ళల్లో నీళ్ళు నింపి 'బెనిస్తీ' లమై
గుడ్డలుతికి 'దోబీ, ధోబన్‌' లమై
జుట్టు గొరిగి 'హజ్జామ్‌' లమై
దొడ్లు కడిగి 'మెహతర్‌', 'మెహతరానీ' లమై పోయాం

లద్దాఫ్‌, దూదేకుల, కసాబు, పింజారీ-
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం

చెప్పకుంటే నమ్మరు కానీ
చెబితే పలుచనై పోతామని భయం

షేక్‌, సయ్యద్‌, పఠాన్‌....
మీ దర్పాల హోదాల కాంథానులదగ్గరికైనా చేరనిచ్చారా!

మా బాధనెవరూ మాట్లాడ్డం లేదు
మీరు కోల్పోయిన వైభవాల తలపోతల్నే
అందరి భాషగా మాట్లాడుతున్నారు

రెక్కకూ డొక్కకూ బతుకు బందిఖానా అయిన వాళ్ళం
ఎప్పుడూ మిగుల్చుకోవడానికే ఏమీలేనివాళ్ళం
చెప్పుకోడానికి మాకేం మిగుల్తుంది

హవేలీ, చార్‌దివారే, ఖిల్వత్‌, పరదాలంటే ఏమిటో
మా తడికెల అంత:పురం గాళ్ళ కేమెరుక

నమాజులంటే వంగిలేవటమేనని మా తాత చెప్పేవాడు
ఈ బిస్మిల్లా యిర్రహిమాన్‌....., అల్లాహో అక్బర్‌, జీహాద్‌ల
భాషనెప్పుడూ నేర్వనేలేదు
మాదనే భాష మాకు రాదు
కన్నీళ్ళు తెలుగే ఆర్తనాదం తెలుగే
ఆకలై అన్నం అడిగితే తెలుగే
తెలుగులో మ్లాడి వెలివేయబడ్డాం

'దు ఆ' లు చేయమంటే దిక్కులు చూశాం
'సూరా' ల శృతుల్లో రాగాలు మాత్రమే వెతుక్కున్నాం

పెదమౌలా, చిన ఆదాం, నాగులూ, దస్తగిరి, లాలు, పెంటుసాబు
షేకు శ్రీనివాసూ, పాటికట్ట మల్సూరు, బేతంచెర్ల మొయిను
మీరన్నట్లు అందరమూ 'ముసల్మాన్‌'లమే
కాని ఈ వివక్ష సంగతేమిటి ?

ఉమ్మడి శత్రువు సరే
ఉమ్మడి మితృత్వ మర్మమూ తేలాలి
అణచివేయబడ్డ వాళ్ళంతా దళితులే
అణచి వేతల నిర్వచనమూ తేలాలిప్పుడు
*
ఆత్మగౌరవం అందరిముందు పరిచిన దస్తర్‌ఖాన్‌
అది అయినింటివాళ్ళు మాత్రమే అనుభవించే హక్కు కాదు

*

మరికొన్ని ముస్లింవాద కవితా పాదాలు:

''మాదిగ వాడలూ తురక బజార్లూ
మురిక్కాలువల్ని 'నీసు కంపు'ల్నీ ఒక్కలాగే మోస్తుాంయ్‌ ఆని గుడిసెలో ఎండు తునకలై మా సాయమాన్లో కవాబులై
దండేనికి వేలాడే 'కౌసువాసన' మా బంధుత్వాన్ని చెబుతోంది''
***
పిన్నీసుతో అంటు కట్టిన హవాయి చప్పల్‌
గూడల మీద పిగిలిన కుర్తా పైజామాల జవానీ..
ఏ నెలవంక నవ్వునీ అందుకోని నైరాశ్యం...!
***
''అంటరాని వాయిద్యాలన్నీ
స్వరపురి విప్పుకుంటున్న తాన
నిప్పుల్ని తొక్కే అడుగుల గుండెల్లో
అలావా గుండం రాజుకుంటున్న సయ్‌మాన..
ఇక మౌనంగా వేలాడే నెలవంకలం కాదు
నిండు చంద్రుణ్ణే 'మర్ఫా' గా మలుస్తున్నాం''

***
తెల్లని షేర్వాని-ఆకుపచ్చని తలపాగా
దర్పంగా నిలబడి చూస్తుంటది దర్గా!

గుడి అంటని ఇక్కడి మట్టి బిడ్డల కాడికే
నడిచొచ్చిన దేవుళ్ళు సూఫీలు!

***
యాప మండలు ఝళిపిస్తూ నడుస్తున్న మైసమ్మ - ముత్యాలమ్మ - పోలేరమ్మ... మగస్వాముల పునాదుల పెకలింపు... అంటరాని జాతంతా లేస్తోంది - నల్లసముద్రమై... వెంట సూదర్ల ఊరేగింపు... రంజాన్‌ చంద్రుళ్ల కవాతు...
బేచైనీ ...
కాయితాల మీద వ్యోమనౌకనౌతూ...
పీనుగై నిద్రపోతున్న ప్రపంచాన్ని చుడుతూ...''
***
దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం
ఒళ్ళంతా పారకముందే
ఇప్పుడక్కడ ఊరిబైట ముస్లిం వాడలు వెలిశాయి

***
రామ బాణంతో వాళ్ళు
విష్ణు చక్రంతో కృష్ణ చక్రంతో వాళ్ళు
శివుని త్రిశూలంతో వాళ్ళు
హనుమంతుని గదతో వాళ్ళు

అయ్‌ అల్లాహ్‌!
ఈ చేతులు ఉట్టి దువాకేనా?!
-స్కైబాబ

''ఇక్కడి దారం గాళ్ళంతా నన్ను రాక్షసుడని
నాకు లేని కోరల్ని కొమ్ముల్ని తోకల్ని నాకు తగిలించినప్పుడు
అతనొచ్చి నన్నో మనిషిగా ప్రకించాడు
ఇక్కడి బేపనోళ్ళంతా గుడి తలుపులు మూసుకున్నప్పుడు
అతను మజీదులో నాకోసం జానిమాస్‌ పరిచాడు''

''చరిత్ర సాక్షిగా
ఇకపై మతానికి సాయిబునైనా
కులానికి దళితుణ్ణని నిర్ధారిస్తున్నాను.
- ఖాజా

హమ్‌ మర్కేభి జగాతే హై
సోయీ హుయి దునియాకో
***
ఈ దేశపు గోడ మీద
ఉమ్మేసిన పాన్‌ మరకలా నేనిలా...!
-పాన్‌ మరక అలీ

కాకుల గ్లూట్లో పొదగబడ్డా
అది కోకిల అని భ్రమించాం
గొంతు అరువు తెచ్చుకుందని
ఇప్పటిగ్గాని బయట పడలేదు
మావి చిగురు కాదు
మానవ కసరు దాని ఆహారం
-హనీఫ్‌

ఆమె ముఖం
శాశ్వత గ్రహణం పట్టిన చంద్రబింబం
చేయని నేరానికి శిక్షించబడుతున్న
జీవిత ఖైదీ-ఆమె
-షెహనాజ్‌ ఫాతిమా

ఏకుతున్న దూది పింజెలు పింజెలుగా విడిపోయి
అమ్మ ముఖం ముందు గాల్లో ఎగురుతుంటే
చంద్రుని ముందు మబ్బుతునకలు తార్లాడినట్లుంటుంది
-ఖాజా

''రెప్పల కొమ్మల్లోంచి వీచిన వాళ్ళ సుడిగాలుల చూపుల్లో
నేనో దూదిపింజనై హాలు హాలంతా
ఉన్నచోటి నుంచే గిరికీలు కొట్టబడతాను
వాళ్ళ ఉరుదూ జరీ సమూహాల గలగలల మెరుపుల ముందు
నా గొంతు కాటన్‌ చీరై బిక్కుబిక్కుమంటూ
ఒంటరిగా ముడుచుకుంటుంది
దారిద్య్రం నా కలల్ని - ఆకలి కాలన్నీ మింగేస్తుంటే
పరుపులు కుట్టడమే నేర్చుకుంది
నేర్చుకోలేని ఉర్దూ అరబ్బీల గురించి నేనెందుకు దుఃఖించాలి?
అబ్‌ సౌబార్‌ సబ్‌కే సామ్‌నే చిల్లావూంగి
హా.... మై లద్దాఫ్ని హూఁ....!
లద్దాఫ్ని హీ రహూఁంగీ!!''
- షాజహానా

*ఇంకా ఇక్బాల్ కోరే కవిత్వం ఒలికే కవితలు ముస్లింవాదంలో కోకొల్లలు. వెతికి ఒక వ్యాసం రాస్తే ఉపయోగం!

*
#అనుబంధం : ఈ విమర్శకుల మాయలోనే కదా నేను పడ్డది-

#జి_లక్ష్మీనరసయ్య :
ముస్లింలను ఈ దేశ మూల వాసులుగా ప్రకటిస్తూ రాయడం. బహుజన రాజకీయ అధికారంలో భాగంగా ముస్లిం రాజ్యాధికారాన్ని ధ్వనించడం. ముస్లిం సమాజ చాందసత్వాన్నీ, వెనుకబాటు తనాన్నీ విమర్శించడం, ముస్లిం సమాజం పట్ల బయట చాలామణీలో ఉన్న మిత్ లను భగ్నం చేయడం. ఈ ధోరణులు ఖాజా, స్కైబాబ, షాజహానాల కవిత్వంలో బలంగా వ్యక్తమయ్యాయి.

#కె_శ్రీనివాస్ :
నిర్ణిద్ర కవి
ఇప్పటి రచయితల్లో స్కైబాబ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలు అందుకు కారణం. ముస్లిమ్‌ వాదమయినా, తెలంగాణ వాదమయినా అతను దాన్ని లోపలికి తీసుకుని సంచలిస్తాడు. రచయితగా కూడా అతను కార్యకర్తగా, కార్యకర్తగా కూడా అతను రచయితలా అనిపిస్తాడు...

అస్తిత్వ సంక్షోభాన్ని మనసులోకి జీవితంలోకి తీసుకున్న స్కై తనను తానొక సమూహ జీవిగా చూసుకుంటాడు. సమష్టి ప్రయోజనమే అతనికి ప్రాధాన్యం. అందుకే అతను, మొదట ఇతరుల పుస్తకాలు వేసి ఆ తరువాత తన సొంత పుస్తకానికి పూనుకున్నాడు. కవిత్వంలో కూడా అంతే. ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం?
***
స్కైబాబ స్వేచ్ఛాప్రియత్వం- అతను ఇతర సామాజిక వాస్తవాలపై గ్రహింపు పెంచుకోవడానికి అనుమతించింది. ఫలితంగా కూడా కొన్ని సమస్యలు. అతను స్త్రీ సానుభూతిని, దళిత వర్గాలతో సమీకరణ భావాన్ని, తెలంగాణ వాదాన్ని కూడా ఆశ్రయించాడు. సాధారణంగా, కఠినమైన అస్తిత్వ భావనలో అన్యశ్రేణులతో మమేకతకు ఆస్కారం లేదు. కానీ, అన్ని రకాల ప్రజాస్వామ్య భావనలతో తన దృక్పథాన్ని సంపన్నం చేసుకోవడానికి స్కైబాబ ప్రయత్నించాడు. తాను మిత్ర అస్తిత్వాలపై చూపుతున్న మమేకతను ఆయా అస్తిత్వాలు తన సమస్యలపై ఎందుకు చూపవన్నది స్కైబాబ ప్రశ్న. దానికి కూడా సమాధానం ముస్లిం అస్తిత్వంలో ఉన్న సమస్యాత్మకతలో ఉన్నది. మన అధీనంలో లేకుండా జరిగిపోతున్న పరిణామాలలో ఉన్నది. జాతీయ, అంతర్జాతీయ కుటిల రాజకీయాలలో ఉన్నది.

అన్నిటికి మించి స్కైబాబ ఆధునికుడు కావడం మరొక సమస్య... ముస్లిం అస్తిత్వాన్ని మత ప్రమేయంలేని సామాజిక అస్తిత్వంగా, ఒక రాజకీయార్థిక సమస్యగా చూస్తున్న స్కైబాబ నిజమైన లౌకిక వాది. 'చంద్రవంకల్ని వదిలి సూర్యుడివైపు గమిద్దామనుకునే' ప్రయత్నంలో 'ఏ రంగుకీ బద్ధుణ్ణి కాలేను' అనీ, ప్రస్తుతానికి మాత్రమే 'ఆకుపచ్చ'ను ఆశ్రయిస్తున్నా అనీ చెప్పుకుాండు. అయినా తానెందుకు ముస్లిమో కూడా వివరిస్తాడు. సర్వమానవ సమానత్వాన్ని, అంటుముట్టులు లేనితనాన్ని ఇష్టపడుతున్నందుకే తాను ముస్లింనని చెబుతూ తను ప్రతిపాదించే అస్తిత్వానికి కొత్త నిర్వచనం కూడా ఇచ్చాడు. 'దువా చేసే చేతుల కన్నా హక్కులకోసం పోరాడేవాడే నిజమైన ముస్లిమ్‌'.

#డా_సుంకిరెడ్డి నారాయణరెడ్డి :
confrontation చేయని వేడెప్పుడూ కవి కాలేడు. పైరవీ మార్గం అనుసరించేవాడు సత్యాన్ని అన్వేషించలేడు. సత్యం, కవి పరస్పరం పర్యాయపదాలు. స్కై కూడా.

#డా_అంబటి సురేంద్రరాజు :
'ఎటో దిక్కు ఎనుగు తొక్కి కాలి బాటన్నా ఎయ్యాలె 'కవిగా, సాహిత్యోద్యమకారునిగా స్కైబాబ అంతరంగాన్ని, ఆచరణను పట్టిచ్చే పాదాలివి.

#కాసుల ప్రతాపరెడ్డి :
అనేక ఆధిపత్యాలపై ఒక్కుమ్మడి పోరు స్కైబాబ కవిత్వం. స్కైబాబ కవితా సంకలనం 'జగ్‌నే కీ రాత్‌' చదువుతుంటే సిద్ధులగుట్ట కాడ నిప్పుల గుండం తొక్కుతున్నట్లు వుంటుంది. ఈ తీవ్రత కవిత్వానికి రావడానికి కారణం స్కై అంతరంగంలో ఎడతెరిపి లేకుండా భగభగ మండుతున్న ఆలోచనా స్రవంతే కారణమని అనిపిస్తుంది. ఒక దారం పోగు లాగుతున్న కొద్దీ సాగినట్లు ఆ ఆలోచన ధార ముందుకు సాగుతూ పోతుంటుంది. 'జగ్‌నే కీ రాత్‌' సంకలనంలోని చాలా కవితలు ఈ విషయాన్ని పట్టిస్తాయి...
నిజానికి, సభ్య సమాజం కళ్లు చెదిరే భావతీవ్రత స్కైది. గుండెను మెలి పెట్టే నెత్తురును సుడులు తిప్పే తీవ్రత అతని కవితలది. తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల మనలోని స్థిరీకృత భావజాలం దారం తెగిన పతంగిలా కొట్టుకుంటుంది. అందుకే మనకు స్కై మీద తప్పకుండా కోపం వస్తుంది. మనది సభ్య సమాజపు అసహనమని తెలుసుకోవడానికి కొంత సహనంతో ఆలోచించాల్సి వుంటుంది.

#వరవరరావు :
నేను ఆయన ముస్లింవాదాన్ని లౌకిక, ప్రజాస్వామిక దృష్టి అన్నాను. ఇంకా దానికి ఒక జీవన విధానం, సంస్కృతి నుంచి చూసి చెప్పాలంటే దూదేకులవాదం అనొచ్చునేమో. అత్యంత ప్రాచీన జీవన విధానానికి, నాగరికతకు, సంస్కృతికి పత్తి నుంచి దారం తీయడమే ఆధారమయితే ఆ పని నేతగాళ్లు చేసారు- వాళ్లు ఈ దేశంలో మాలలు, సాలెలు కావచ్చు. ఈ దేశంతో సహా ప్రపంచమంతా ముస్లింలు కావచ్చు. స్కైబాబ ఆ వారసత్వం నుంచి ముస్లింవాద కవిత్వం రాసాడు.

#జిలుకర శ్రీనివాస్‌, చిట్టిబాబు :
స్కైబాబ కవిత్వం మీద జరిగిన దాడి వ్యక్తిగతమైంది కాదు. సైద్ధాంతిక కోణం నుంచి వివేచిస్తే రాజకీయమైన దాడి అని అర్థం అవుతుంది. హిందూత్వవాదుల అమానుషమైన దాడితో అది భావజాలపరమైన అంశంగా మారింది. 'జగ్‌నే కీ రాత్‌'లో ప్రత్యామ్నాయ రాజకీయ సమీకరణం గురించి ప్రతిపాదించడం వల్ల మరొక పార్శ్వం వ్యక్తం అవుతుంది. పరివృతమై వున్న ఇన్ని అంశాలను పరిగ్రహించినపుడు ఒక అంగీకారం కుదరానికి ఆటంక మేదీ వుండదు. స్కైబాబ కవిత్వం మీద జరిగిన దాడి సైద్ధాంతికమైంది. దాన్ని ఎదిరించడానికి మనం అనుసరించాల్సింది కూడా అలాంటి విధానమే. మైనారిటీల అస్తిత్వం గురించి, మరీ ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల్లో ముస్లింల అస్తిత్వం, ఉనికి, గుర్తింపు మీద తగినంత విస్తృతితో, లోతుగా పర్యవలోకనం జరగాలి. ఒక సైద్ధాంతిక అవగాహన అన్ని పార్శ్వాలలోంచి రూపొందాలి. ప్రస్ఫుటమైన అవగాహన ప్రజల్లోనూ సాహితీ రంగంలోనూ పలుకుబడి సాధించినప్పుడే ముస్లింవాద కవిత్వాన్నైనా స్కైబాబ కవిత్వాన్నైనా అర్థం చేసుకోగలం. వ్యాఖ్యానించ గలం. సాహిత్యంలో ఉత్తమ సంస్కారాన్ని, వ్యాఖ్యాన విలువలను, మూల్యాంకన పద్ధతులను ప్రతిష్టించగలం. పరివ్యాప్తం చేయగలం. -సంపాదకులు, 'గవాయి' జగ్‌నే కీ రాత్‌ చర్చ

*స్కైబాబ కవిత్వంపై ఒక వ్యాసం

No comments:

Post a Comment