Wednesday 6 May 2020

లక్నోలో 8 మసీదులే కరోనా హాట్ స్పాట్లు

లక్నోలో 8 మసీదులే కరోనా హాట్ స్పాట్లు...
 కరోనాకు యోగి సర్కారు మతం రంగు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన లక్నోలో 8 మసీదుల పేర్లను కరోనా హాట్ స్పాట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంచలనం రేపింది. లక్నో నగరంలోని 18 కరోనా హాట్ స్పాట్లలో 8 మసీదులున్నాయని అధికారులు ప్రకటించారు. లక్నో నగరంలోని సదర్ బజార్ లోని అలీజాన్ మసీదు, వజీర్ గంజ్ లోని ముహమ్మదీయ మసీదు, త్రివేణి నగర్ లోని ఖజూర్ వాలీ మసీదు, కైసర్ బాగ్ లోని నజర్ బాగ్ మసీదు, గుడుంబా ప్రాంతంలోని రాజౌలీ తదితర 8 మసీదులను కరోనా  హాట్ స్పాట్స్ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రాబల్య ప్రాంతాలను గుర్తించడంలోను యోగి సర్కారు మతం రంగు పులిమిందని ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. మసీదుల పేరిట కరోనా హాట్ స్పాట్లు అంటూ ప్రకటించడం దురదృష్టకరమని యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ విమర్శించారు. కరోనా ప్రత్యేకించి ఓ మతానికి రాదని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ఇలా కరోనా హాట్ స్పాట్లకు మతం రంగు పులుముతూ మసీదుల పేర్లను పేర్కొనడాన్ని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాజ్ పాల్ కశ్యప్ విమర్శించారు. కరోనా హాట్ స్పాట్లకు మసీదుల పేర్లు పెట్టి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నరని రాజ్ పాల్ కశ్యప్ ప్రశ్నించారు. లక్నో నగరంలో 226 మందికి కరోనా సోకగా వారిలో ఒకరు మరణించారు. కరోనా వైరస్ ను కూడా అధికార బీజేపీ రాజకీయప్రయోజనాల కోసం వాడుకుంటుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

No comments:

Post a Comment