Thursday, 22 September 2022

Umar Khalid Jail Letter

 ఒకింత నిరాశ, మరింత ఒంటరితనం – ఉమర్ ఖాలిద్ ఉత్తరం

(అబద్ధపు ఆరోపణలపై, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులో రెండు సంవత్సరాలుగా తిహార్ జైలులో నిర్బంధంలో ఉన్న విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ కు రచయిత రోహిత్ కుమార్ ఆగస్ట్ 15న ఒక బహిరంగ లేఖ రాశారు. దానికి జవాబుగా ఉమర్ ఖాలిద్ రాసిన ఉత్తరం ఆయనకు సెప్టెంబర్ 12న అందింది. ఆ ఇద్దరి అనుమతితో ది వైర్ ప్రచురించిన ఆ ఉత్తరానికి తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్)
ప్రియమైన రోహిత్,
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పినందుకు, అసలు నాకు ఉత్తరం రాసినందుకు కృతజ్ఞతలు. నువ్వు బాగున్నావని ఆశిస్తాను. నా ఈ బంధిత ఆవరణలోపల నీ బహిరంగ లేఖ చదవగలిగినందుకు సంతోషిస్తున్నాను. నీకు జవాబు రాయడానికి కూచున్నప్పుడు ఇవాళ రాత్రి విడుదల కానున్న వారి పేర్లు లౌడ్ స్పీకర్ మీద ప్రకటిస్తూ ఉన్నారు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి రిహాయి పర్చాలు – విడుదల ఉత్తర్వులు – న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు అందుతాయి. రాత్రి చీకటి జైలు మీద వ్యాపించి, జైలును ముంచేసినాక, కొందరు ఖైదీలు స్వేచ్ఛ అనే వెలుగు చూస్తారు. వాళ్ల ముఖాల మీద నాకు ఆనందం, పరమానందం కనబడుతున్నది.
రెండు సంవత్సరాలుగా నేను ప్రతి రాత్రీ ఈ ప్రకటన వింటూనే ఉన్నాను – నామ్ నోట్ కరే, ఇన్ బందీ భాయియోంకీ రిహాయీ హై (పేర్లు గుర్తుంచుకోండి, ఇవాళ ఈ ఖైదీలు విడుదల కాబోతున్నారు). ఆ ప్రకటనలో నా పేరు ఎప్పుడు వినబడుతుందా అని నేను ఎదురు చూస్తుంటాను, ఆశ పడుతుంటాను. ఈ చీకటి సొరంగం ఇంకా ఎంత దూరం ఉంది అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను. కనుచూపు మేరలో వెలుగు ఉందా? నేను చివరికి చేరానా లేక ఇంకా మధ్య దారిలోనే ఉన్నానా? లేక నా కడగండ్లు ఇప్పుడే మొదలయ్యాయా?
మనం మన స్వాతంత్ర్యపు అమృతకాలంలో ప్రవేశించామని వాళ్లంటున్నారు. కాని స్వాతంత్ర్యాన్ని పరిరక్షించేవాళ్లు కడగండ్లకు గురి కావడం చూస్తుంటే మనం మళ్లీ బ్రిటిష్ పాలన రోజులకు తిరోగమిస్తున్నామని అనిపిస్తున్నది. వలసపాలన కాలంనాటి బానిసత్వ చిహ్నాలను తొలగించాలని ఈ మధ్య చాల మాటలు వినబడుతున్నాయి. ఈ మాటలు సరిగ్గా పాత వలస పాలన కాలపు దుర్మార్గ చట్టాలను మళ్లీ పదునుపెట్టి కార్యకర్తల మీద, విద్యార్థుల మీద, అసమ్మతి వాదుల మీద, రాజకీయ ప్రతిపక్షం మీద ఆయుధాలుగా వాడుతున్నప్పుడు వినబడుతున్నాయి. మేం ఇప్పుడు జైళ్లలో మగ్గిపోతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టానికీ, మన స్వాతంత్ర్య యోధుల మీద బ్రిటిష్ పాలకులు వినియోగించిన రౌలట్ చట్టానికీ ఉన్న పోలికను జనం చూడడం లేదా? ప్రజల హక్కులనూ స్వాతంత్ర్యాలనూ ఉల్లంఘించడానికి అవకాశం ఇస్తున్న, వలస పాలన ‘వారసత్వం’గా కొనసాగుతున్న శిక్షాసాధనాలను కూడ మనం తొలగించవలసి ఉంది గదా? మాలో చాల మందిని, మావంటి వాళ్లు చాల మందిని ఎటువంటి విచారణా లేకుండా సుదీర్ఘకాలం నిర్బంధించి ఉంచుతున్న, కనుచూపు మేరలో విచారణ మొదలవుతుందనే ఆశ లేని వాస్తవాన్ని చూసినప్పుడు నాకు దిగ్భ్రాంతి కలుగుతున్నది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున, సాయంకాలం వేళ, నేను మరికొందరితో కలిసి నా జైలుగది బైట కూచుని ఉన్నాను. మా జైలు ఆవరణ పైన ఆకాశంలో చాల ఎత్తున ఎగురుతున్న గాలిపటాలను చూశాం. మా చిన్నతనంలో ఆగస్ట్ 15న ఏమి జరిగిందో గుర్తు చేసుకున్నాం. మేమసలు ఇక్కడికి ఎలా చేరాం? దేశం ఎంతగా మారిపోయింది?
యుఎపిఎ ఉపయోగిస్తే చాలు, మమ్మల్ని ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధించి ఉంచవచ్చు. మమ్మల్ని ఇరికించినవాళ్లు ఏమీ రుజువు చేయనక్కరలేదు. కాని న్యాయస్థానాలలో తమ అభూతకల్పనలను రుజువు చేయలేని వాళ్ల అశక్తత ఈ కాలంలో మాగురించి అబద్ధ కథనాలు అల్లడానికి వాళ్లకేమీ అడ్డురాదు.
ఒక రోజు సాయంత్రం ఒక జైలు వార్డెన్ నా కేసు గురించి నాతో సంభాషణ ప్రారంభించాడు. ఆయన నన్ను 2020లో జైలులో మొదటిసారి చూసినప్పుడు, నా మీద ఆరోపణలను నమ్మడం కష్టమైందట. అదంతా రాజకీయాల ఫలితమనీ, కొద్ది రోజుల్లో నన్ను వదిలిపెడతారనీ అనుకున్నాడట. కాని ఇప్పుడు 2022లో నేను లౌడ్ స్పీకర్ మీద నా పేరు ఎప్పుడు వినబడుతుందా అని ఎదురుచూస్తుంటే, ఆయనకే అనుమానం వస్తున్నదట. “నీకు బెయిల్ ఎందుకు దొరకదు? కిసాన్ ఆందోళన్ వాళ్లకు కూడ కొద్ది రోజులు కాగానే దొరికింది గదా” అన్నాడాయన. నేనిక ఆయనకు యుఎపిఎ అంటే ఏమిటో, ఐపిసి తో పోలిస్తే యుఎపిఎ కింద బెయిల్ దొరకడం ఎంత కష్టమో వివరించడం మొదలుపెట్టాను. కాని అలా వివరిస్తుండగానే, నాకు అర్థమైంది, మధ్యలోనే ఆయనకు ఆసక్తి పోయిందని. ఆయన నా మాటలు వినడమే లేదు. అవును, చట్టంలోని అంత సూక్ష్మమైన వివరాలు వినడానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది? న్యాయశాస్త్ర నిపుణులు, ఈ తలకిందుల ప్రపంచంలో బాధితులుగా చిక్కిన నాబోటి దురదృష్టవంతులైన బాధితులు మినహా మరెవరికైనా ఈ విషయాలు అసలు అర్థమవుతాయా?
అపనిందల భారం
ఈ సత్యానంతర ప్రపంచంలో వాస్తవికత కన్న ముఖ్యమైనది అభిప్రాయం. నేను నీ మీద వేసిన ప్రభావం గురించి నువ్వు నీ ఉత్తరంలో చాల గొప్పగా రాశావు. నీ మెత్తని మాటలకు కృతజ్ఞతలు. నేను నీ మీద వేసిన ప్రభావం లాంటిదే జైలులో ప్రతి రోజూ కలిసిన ప్రతి ఒక్కరి మీదా వేస్తూ ఉండి ఉంటాననీ, అందువల్ల వాళ్లు ప్రచారసాధనాలలో నాగురించి ప్రచారమైన అబద్ధాలను నమ్మడం మానేసి ఉంటారనీ కూడ నువ్వు రాశావు. సరే, నిన్ను మెప్పించడం చాల సులభం. నువ్వెప్పుడూ ప్రచారసాధనాలు చెప్పే అబద్ధాల అవతలివైపు చూడాలనుకుంటావు. కాని ఆ ప్రచారానికి లొంగిపోయి ఉన్నవాళ్లను హెచ్చరించడం చాల కష్టం. మరీ ముఖ్యంగా ఆ ప్రచారం నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు.
రెండు సంవత్సరాలుగా నేను ఈ జైలులో ఉన్నప్పుడు ఏకైక వార్తా వనరు దినపత్రికలు మాత్రమే. వాటిలో నా కేసు గురించి చాల ఎక్కువగానే వస్తుంది. ఇంగ్లిష్ వార్తాపత్రికలైతే తటస్థంగా ఉన్నట్టు నటించడానికి ప్రయత్నిస్తుంటాయి గాని హిందీ వార్తాపత్రికలు మాత్రం అన్ని జర్నలిస్టు నైతిక సూత్రాలనూ గాలికి వదిలేశాయి. జైలులో ఉన్న ఖైదీల్లో 90 శాతం మంది రోజువారీ వార్తల కోసం హిందీ పత్రికల మీదనే ఆధారపడతారు. ఆ పత్రికలు కల్తీలేని విషాన్ని వండి వారుస్తుంటాయి.
ఆ హిందీ పత్రికల్లో నా బెయిల్ విచారణ వార్తలను ఎంపిక చేసి మరీ వేస్తుంటారు. నా న్యాయవాదుల వాదనలు జరిగినప్పుడు, వాళ్లు ఏమన్నారో చాలవరకు రాయవు. లేదా, కొన్ని సార్లు నా మీద దయతో ఉండాలని అనుకున్నప్పుడు కొంచెం దారి మార్చి, ఏ ఐదో పేజీ లోనో ఆరో పేజీలోనో కనీ కనబడకుండా ఆ వార్త వేస్తాయి. కాని ఆ వార్తకు భయంకరమైన శీర్షిక పెడతాయి. ఇక నామీద ఆరోపణలు గుప్పిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడతాడు గదా, ఆ రోజు నా కేసు వార్త మొదటి పేజీ వార్త అవుతుంది. ఆ ఆరోపణలన్నీ కోర్టు నిర్ధారణలేమో అనిపించేంత హడావుడి సాగుతుంది. అటువంటి సందర్భాలలో తమ సంచలనాత్మక శీర్షికలకు తగినట్టుగా భీకరంగా కనిపించే నా ఫొటోలు ఎక్కడెక్కడి నుంచో తవ్వి తీసి వేస్తారు.
ఒకరోజు ఒక హిందీ దినపత్రిక శీర్షిక ‘ఖాలిద్ నే కహా థా భాషణ్ సే కాం నహీ చలేగా, ఖూన్ బహానా పడేగా’ (మాటలతో పని జరగదనీ, రక్తం చిందించక తప్పదనీ అన్న ఖాలిద్) అని అరిచింది. ఈ శీర్షికలో ఉన్న ఘనమైన విషయం లోపల వార్తలో ఒక్కచోట కూడ లేదు. అంతమాత్రమే కాదు, ఆ శీర్షిక ఒక రుజువు కాని ఆరోపణ మాత్రమేననీ, ఆ ఆరోపణను న్యాయస్థానం విచారించవలసి ఉందనీ కూడ లోపల ఎక్కడా లేదు. ఆ శీర్షిక మరెవరి మాటో అని చెప్పడానికి పెట్టే ఉటంకింపు గుర్తులు లేవు. కనీసం చివర ప్రశ్నార్థక చిహ్నం కూడ లేదు. రెండు రోజుల తర్వాత అదే వార్తా పత్రిక ఇంకా ఎక్కువ సంచలనాత్మకమైన శీర్షికతో ముందుకొచ్చింది. ‘ఖాలిద్ చాహతా థా ముసల్మానోంకే లియే అలగ్ దేశ్ (ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న ఖాలిద్). న్యూఢిల్లీ లోని యమునా తీర ప్రాంతాలలో జరిగిన కల్లోలాలలో చనిపోయిన వారిలో అత్యధికులైన ముస్లింలు తమంతట తామే ముస్లింల కోసం ఒక కొత్త దేశాన్ని సృష్టించదలచుకున్నారట. నిజంగా ఎంత హాస్యాస్పదం, ఎంత విషాదకరం. ఆ శీర్షిక చదివి నవ్వాలా ఏడవాలా తెలియలేదు నాకు. ప్రతిరోజూ ఈ విషాన్ని మింగుతున్నవారికి నేనెట్లా నచ్చజెప్పను?
అంతకు ముందు మరొక సందర్భంలో, ఢిల్లీ కల్లోలాలలో నా భాగస్వామ్యం గురించీ, నా పాత్ర గురించీ ఢిల్లీ పోలీసులకు నేను ‘ఒప్పుదల ప్రకటన’ ఇచ్చానని మరొక హిందీ దినపత్రిక రాసింది. నన్ను పోలీసు కస్టడీలో ఉంచుకున్నప్పుడు నేను ఎటువంటి ప్రకటనా చేయలేదని, ఏ కాగితం మీదా సంతకం చేయలేదని నేను కోర్టులో రెండుసార్లు లిఖితపూర్వకంగా నమోదు చేశాను. మరి ఈ వార్త ఎక్కడి నుంచి పుట్టినట్టు?
ఎంత సాగదీసి చూసినా ఆ పత్రికలు రాస్తున్నది జర్నలిస్టు వార్తా రచన అని చెప్పడానికి వీలు లేదు. వాళ్లు వాదనల్లోంచి తమకు నచ్చిన ముక్కలు ఏరుకుంటున్నారు. తాము ముందుగానే నిర్ణయించుకున్న కథనానికి సరిపోయిన పచ్చి అబద్ధాలను తయారు చేస్తున్నారు. వాళ్లు నన్ను ప్రజాభిప్రాయపు న్యాయస్థానంలో దోషిగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడ చట్టబద్ధ న్యాయస్థానాలు నా కేసును వినడానికి, విచారించడానికి చాల ముందుగానే. అలా చేయడం ద్వారా వాళ్లు అత్యధిక సంఖ్యాక మత సమూహపు అంతరాత్మను సంసిద్ధం చేయదలచుకున్నారు.
కొన్నిసార్లు ఈ ప్రచార సాధనాలు తయారు చేసే అబద్ధాలు చివరికి పోలీసులు తయారు చేసే అబద్ధాలను కూడ మించిపోతున్నాయి. ఒక ప్రముఖ హిందీ దినపత్రికలో వచ్చిన ఒక వార్తా కథనం, కల్లోలాలను రెచ్చగొట్టడానికి అన్ని మార్గాలనూ వాడుకోదలచుకున్న నేను న్యూఢిల్లీలోని జాకీర్ నగర్ లో షార్జిల్ ఇమామ్ ను 2020 ఫిబ్రవరి 16న రహస్యంగా కలుసుకున్నానని రాసింది. ఆ తేదీ సరిగ్గా ఢిల్లీ కల్లోలాలు జరగడానికి ఒక వారం ముందు. వాస్తవమేమంటే ఆ 2020 ఫిబ్రవరి 16 రాత్రి నేను ఢిల్లీకి 1136 కి.మీ. దూరంలో, మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్నాను. చివరికి పోలీసులు కూడ నేను ఆ రోజు అమరావతిలో ఉన్నానని, అక్కడ నా ఉపన్యాసం మీద కేసు పెట్టారు.అట్లాగే ఆ రాత్రి షార్జిల్ ఇమామ్ అప్పటికి ఇరవై రోజుల కింద మరొక కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఖైదీగా ఉన్నాడు. దాన్ని కూడ ఎవరూ కాదనలేరు. అంటే ఆ వార్త వండిన గౌరవనీయ జర్నలిస్టు తన కథనం లోని మౌలిక వాస్తవాలను కూడ పరీక్షించుకోలేదన్నమాట.
కాని మరొకసారి చెప్పాలంటే, నిజంగానే వాస్తవాలూ, ఈ వివరాలూ ఎవరికి కావాలి? ఇవాళ భారతదేశంలో సత్యం అనేది ఇంకెంతమాత్రమూ నిజంగా జరిగినది కానేకాదు, ప్రజలకు ఏది చేరుతున్నదో అదే సత్యం. జైలులో నా సహఖైదీల మనసుల్లో లోతైన ముద్రవేసేవి నేను ఏమి చెపుతాననే దానికన్న ఎక్కువగా ఈ పత్రికావార్తల శీర్షికలే. గడిచిన రెండేళ్లుగా నేను గమనించినదేమంటే, జనం తమ కళ్ల ముందు కనిపించినదాని కన్న ఎక్కువగా అచ్చయిన అక్షరం మీద దాదాపు నిర్హేతుకమైన నమ్మకం పెట్టుకుంటారు. పత్రికల్లో వచ్చిందంటే అది నిజమే అయి ఉంటుంది. ‘కుచ్ తో కియా హోగా. పూరా ఝూట్ తోడె లిఖ్ దేంగే’ (ఏదో చేసే ఉంటాడు. పూర్తిగా అబద్ధాలు అచ్చు వేస్తారా?)
సంజయ్ దత్ మీద తీసిన బయోపిక్ ‘సంజు’ లో లోపాలుండవచ్చు గాని, దానిలో ప్రచారసాధనాలను చిత్రించిన తీరు మాత్రం పూర్తిగా నిజం. ప్రచారసాధనాలనేవి నిజం చెప్పాలంటే మాదకద్రవ్యాల లాంటివి. ప్రతి ఉదయమూ ఈ పత్రికల పుటలు ప్రజల మెదళ్లను ఎలా మొద్దు బారుస్తాయో, అవి వాళ్లను ఎట్లా ఒక ప్రత్యామ్నాయ వాస్తవికతా ప్రపంచంలోకి రవాణా చేస్తాయో నేను చూస్తుంటాను. రోజువారీగా ఇంత భారీ స్థాయిలో అబద్ధాల తయారీ జరుగుతున్నప్పుడు జనానికి అసత్యమేదో, సత్యమేదో వేరుచేసి తెలుసుకునే శక్తి కూడ నశించిపోతుంది. ఒకసారి ఆ స్థితికి చేరినతర్వాత ఇక వారికి మంచి అబద్ధాలను సరఫరా చేయవలసిన అవసరం కూడ లేదు. అది ఎంత పిచ్చిదైనా, అది ఏదైనా, ఏది దొరికితే దాన్ని మింగడానికి సిద్ధంగా ఉండేలా వారిని మార్చవచ్చు.
ఈ అబద్ధాల, అసత్యాల మహాభీకర యంత్రంతో మనం ఎలా పోరాడగలం? ద్వేషాన్నీ అబద్ధాన్నీ సరఫరా చేసేవాళ్ల చేతుల్లో చాల వనరులున్నాయి. డబ్బుంది. వాళ్లు చెప్పినట్టు వినే ఇరవై నాలుగు గంటల నిరంతర వార్తా స్రవంతులున్నాయి. అవి కూడ లెక్కలేనన్ని ఉన్నాయి. విరుచుకుపడే ఆకతాయి మూకలున్నాయి. చివరికి పోలీసులు కూడ ఉన్నారు. నిజం చెప్పాలంటే, రోహిత్, అప్పుడప్పుడు నాకు చాల నిరాశ కలుగుతుంది. కొన్నిసార్లు చాల ఒంటరితనం అనిపిస్తుంది. ఫాసిజానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో నాతో పాటు కలిసి ఉన్న చాల మంది, నాకన్న ఎక్కువ అవకాశాలున్న చాలమంది, ఇప్పుడు మౌనంగా ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ అబద్ధాలకు నేను ఒక్కణ్ని బలి అయిపోయాను. నేను ఒక అవాంఛితుణ్ని అయిపోయాను. నీ సొంత భూమిలోనే నువ్వొక అపరిచితుడివైపోయినట్టు ఉంది. అటువంటి క్షణాలలో నాకు అందే ఉపశమనం ఒకే ఒక్కటి, ఇందులో ఏదీ వ్యక్తిగతం కాదనే గుర్తింపే. ఇవాళ్టి నా నిర్బంధమూ, ఒంటరితనమూ మరొక విశాలమైన పరిణామానికి ప్రతీకలు మాత్రమే. ఆ పరిణామం ఇవాళ భారతదేశంలో మొత్తంగా ముస్లింలు గురవుతున్న నిర్బంధమూ, ఒంటరితనమూ.
మౌనంలో, ఏకాకితనంలో ఉపశమనం
వాస్తవమేమిటో చెప్పి నా చుట్టూ ఉన్నవాళ్లను ఒప్పించే పని ఇటీవల మానుకున్నాను. ఆ మాటకొస్తే, ఎన్ని అబద్ధాలని నేను ఖండిస్తూ పోవాలి? ఎంత మంది దగ్గర? నేను ఒక అడుగు ముందుకు వేసి నన్ను నేను ఒక ప్రశ్న అడుక్కుంటాను. ఇది కేవలం ప్రచార ధాటికి లొంగిపోయి ప్రజలు తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉండడం మాత్రమేనా? లేక, ప్రజలు అట్టడుగున, వారి సుప్తచేతనల్లో ఉన్న దురభిప్రాయాలకు సరిపోయే ఈ అబద్ధాలను నమ్మదలచుకున్నారా?
వెళ్లి అనవసరంగా గోడకు గుద్దుకుని తలబొప్పి కట్టించుకోవడం కన్న, జైలులో నా సమయంలో ఎక్కువ భాగం ఒంటరిగా ఉంటున్నాను. గత రెండు సంవత్సరాలలో నాలో వచ్చిన పెద్ద మార్పు అది. ఆ మార్పు కొన్నిసార్లు చాల విచారం కలిగిస్తుంది. కాని నేనున్న పరిస్థితులు నన్ను మౌనంలో, ఏకాకితనంలో ఉపశమనం పొందేవైపు నెట్టాయి. నా చిన్న సెల్ లో ఒంటరిగా ఎన్నో గంటలపాటు బంధించి ఉంచితే నాకేమీ ఊపిరి సలపని అనుభూతి కలగడం లేదు. మొదటి రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడైతే నన్ను కోర్టుకు తీసుకుపోతున్నప్పుడు రోడ్లమీద జనాలూ, ట్రాఫిక్ దృశ్యాలూ శబ్దాలూ నాకు ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా ఉంటున్నాయి. ఆ జనసందోహపు కల్లోలం కంటె జైలు గదిలోని నిశ్శబ్దం నాకు సాధారణమైనదిగా అనిపిస్తున్నది. క్రమక్రమంగా నేను బందీగా ఉండడానికి అలవాటు పడుతున్నానా అని నాకు సందేహం కలుగుతున్నది.
అబద్ధపు ఆరోపణలపై 14 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తి రాసిన జ్ఞాపకాలు ఇటీవలనే చదివాను. ఆ పుస్తకంలో తాను జైలులో గడిపిన కాలాన్ని వర్ణించిన తర్వాత ఆయన ‘సాధారణ జీవితానికి’ తిరిగిరావడంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రాశాడు. ఎన్నో ఏళ్లపాటు ఆయన విడుదల కావడం గురించి ఆలోచించాడు. కాని చివరికి విడుదల అయ్యాక, ఆ స్వాతంత్ర్యంతో ఏమి చేయాలో ఆయనకు తెలియలేదు, లేదా మరిచిపోయాడు. ఎన్నో ఏళ్లపాటు ఆయన తన స్నేహితులను కలవాలని కోరుకున్నాడు. కాని విడుదలయ్యాక ఆయన జనాన్నీ, మంది గుమిగూడే స్థలాలనూ తప్పించుకుంటూ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడు. రోహిత్, నాకు కూడ సందేహాలొస్తున్నాయి, సాధారణత్వంలోకి రావడానికి నాకు ఎంతకాలం పడుతుందంటావు?
కాని, ఈ కష్టాలన్నీ ఉన్నప్పటికీ, జైలు నా జీవితంలో ఎన్నో ‘సానుకూల’ మార్పులకు కారణమయింది. నేను సిగరెట్ తాగడం మానేశాను. రెండు సంవత్సరాలుగా నేను మొబైల్ ఫోన్ లేకుండా జీవించాను. అంటే సోషల్ మీడియా అనే మరొక మాదకద్రవ్యాన్ని కూడ నేను జయించాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ట్వీట్ ను మించి చూసే ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి నెలా ఎన్నో నవలలు చదవగలుగుతున్నాను. చిట్టచివరిగా, ఎన్నో ఏళ్ల పాటు ప్రయత్నించిన తర్వాత, ఇప్పుడు నా నిద్రా సమయం పాతరోజుల్లోకి వచ్చింది. ఈ మాట వింటే మా అమ్మ సంతోషిస్తుంది. తెల్లవారుతుండగా నిద్రకు పడే అలవాటు నుంచి, ఇప్పుడు నేను సూర్యోదయంతో మేలుకునే స్థితికి వచ్చాను. వేకువజాములు ఎంత అందంగా ఉంటాయి.
ఈ ఉత్తరం ముగించే ముందు ఇవన్నీ జాబితా రాయడం ముఖ్యమని అనుకున్నాను. దేశంలో జైళ్లలో రాజకీయ ఖైదీల సంఖ్య పెరిగిపోతున్న సందర్భంలో ఈ జాబితా అవసరం. ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాదం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం ఎన్ని కష్టాలు ఎదిరించి అయినా పోరాటాలను కొనసాగిస్తున్న ప్రజలందరూ జైలు గురించి చింతించడం మానుకోవాలి. జైలు అనేది మీ దురలవాట్లను కొన్నిటిని అధిగమించడానికి పనికి రావచ్చు. అది మిమ్మల్ని ప్రశాంతం చేయవచ్చు, మీ ఓపిక పెంచవచ్చు, మిమ్మల్ని స్వయం సమృద్ధం చేయవచ్చు. జైలు నాకు ఆ సాయం చేసింది.
చివరిగా, ఖైదీలకు మానసిక సమస్యల సలహాదారుగా నువ్వు చేసిన పని నాకు తెలుసునని చెప్పాలి. రెండు నెలల కిందనే నేను నీ పుస్తకం ‘క్రిస్మస్ ఇన్ తిహార్ అండ్ అదర్ స్టోరీస్’ చదివాను. అబ్బ, ఎంత అద్భుతమైన చిన్న పుస్తకం రాశావు! ఈ చీకటి కొట్టులో కరవు లేనిది ఏదైనా ఉందా అంటే అది కథలు మాత్రమే. అన్ని రకాల కథలూ, పోరాటాల కథలూ, సహిష్ణుత కథలూ, కొనసాగింపు కథలూ, కోరికల కథలూ, అంతులేని ఎదురుచూపుల కథలూ, దారిద్ర్యపు కథలూ, హృదయ విదారకమైన అన్యాయాల కథలూ, స్వేచ్చ కోసం మానవ అన్వేషణ కథలూ మనిషి దుర్మార్గపు అత్యంత విషాదకరమైన కథలూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. త్వరలోనే స్వేచ్చాజీవిగా నీతో కలిసి కూచుని కాఫీ తాగుతూ ఆ కథలు పంచుకోగలనని ఆశిస్తాను.
అప్పటిదాకా, జాగ్రత్త. రాస్తూనే ఉండు.
నీ
ఉమర్ ఖాలిద్

From N Venugopal 's Wall

No comments:

Post a Comment