అన్యాయపు అరెస్టులకు పాల్పడుతున్న నేరస్త రాజకీయాలకు చెక్ పెడదాం.
ఎవరో కొద్ది మంది, కొన్ని సంస్థలు తప్ప ఎవరూ మాట్లాడని విషయం. దేశవ్యాప్తంగా గత వారంగా 200వందల మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను, నాయకులను అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయి. మొన్న కడప, కర్నూల్ లలో, ఈ రోజు గుంటూరులో. తెల్లవారు ఝామున 3 గంటల నుండి జరిగిన NIA సోదాల తరువాత గుంటూరులో నలుగురిని అరెస్టు చేశారు. రియాజ్, జఫ్రుల్లా ఖాన్, రహీమ్, అబ్దుల్ వాహెద్. వీళ్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు. నిజానికి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు. వాళ్ల దగ్గర లక్షల్లో డబ్బు దొరికిందని, ఆ డబ్బు విదేశాల నుండి వచ్చిందనే కథనాలు చెబుతున్నారు. అన్నట్లు లక్ష అంటే ఎంత? పోనీ 10 లక్షలు అంటే ఎంత? ఆడానికి కట్టబెట్టిన వేల కోట్ల రూపాయల్లో అవి ఎన్నో వంతు? ‘జకాత్’ పేరుతో ముస్లిములు తమ ఆదాయంలో కొంత భాగాన్ని దానధర్మాలకు వినియోగిస్తారు. తమ ఆదాయంలో వందకు రెండున్నర రూపాయలు చెల్లిస్తారు. ఈ చెల్లింపు గోధమ ధరను బట్టి ఒక్కోసారి పెరగటం, తరగటం జరుగుతుందని చెప్పారు. దాన ధర్మాలు చేసేవాళ్లు సహజంగా తమ డబ్బు నిజాయితీపరులైన వ్యక్తుల ద్వారా అవసరం అయిన వాళ్లకు అందాలని కోరుకుంటారు. అలాంటి నిజాయితీ ఉన్న సంస్థగా పి ఎఫ్ ఐ కి పేరు ఉండటంతో ఎక్కువమంది ముస్లిములు తమ జకాత్ ను ఆ సంస్థకు అందిస్తారు. కర్ణాటకాలోని భట్కల్ అనే గ్రామం జనాభా 5 వేలు. ఆ ఒక్క గ్రామం నుండి ఏడాదికి 15 కోట్ల జకాత్ వసూలు అవుతుందని, ఆ డబ్బు పి ఎఫ్ ఐ ద్వారానే పంపిణీ అవుతుందని తెలిసింది. దీన్ని బట్టి ఎన్ని కోట్ల డబ్బును దానధర్మాలకు వెచ్చిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ దానధర్మాలు చేసేవాళ్లూ, ఆ డబ్బును పంపిణీ చేసే వాళ్లూ -ఎవరూ ధనవంతులు కారు. చాలా సామాన్యులు. విద్యార్థుల చదువులకు, ఆసుపత్రుల, బడుల నిర్మాణానికి మామూలుగా ఈ డబ్బుని వెచ్చిస్తారు. ఇప్పుడు హటాత్తుగా పి ఎఫ్ ఐ మీద ఈ జాతీయ విచారణా సంస్థలు పడటానికి కారణం ఏమిటి? ఒక మిత్రుడితో మాట్లాడితే అనేక ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు. షాహీన్ బాగ్ ఉద్యమానికి బాక్ బోన్ గా ఉన్నది పి ఎఫ్ ఐ. ఇతర ముస్లిం సంఘాలు కూడా పని చేసినా, ఎక్కువ యాక్టివ్ గా ఈ సంస్థ పని చేసింది. న్యాయపరమైన అవకాశాలను వేటినీ వదులకుండా రాజ్యాంగ పరిధిలో వీళ్ళు పని చేస్తున్నారు. సిఏఏ, ఎన్ ఆర్సీలకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల నుండి 33 కేసులు ఈ సంస్థ వాళ్లు సుప్రీం కోర్టులో వేసి ఉన్నారు. హిజాబ్ విషయంలో కూడా అనేక ఇతర సంస్థలతో బాటు వీళ్లు కూడా కోర్టుకు పోయారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రాలలో యాక్టివ్ గా ఈ సంస్థ పని చేస్తుంది. ఈ ఏడాది కర్ణాటకాలో ఈ సంస్థ నిర్వహించిన మూడు సభల్లో ఒక్కో సభకు 9 లక్షల మంది ముస్లిములు హాజరైనట్లు తెలిసింది. ఎన్నికలు జరిగితే కనీసం ఆరు ఎమ్మెల్యే సీట్లు SDPI కు (ఈ సంస్థ రాజకీయ వింగ్ ) వస్తాయని తెలిసింది. ఇటీవల కర్ణాటకాలో హత్యలు జరిగాయి. 4గురు పి ఎఫ్ ఐ సభ్యులు, 8మంది ఆర్ ఎస్ ఎస్ వాళ్లు హత్యకు గురి అయ్యారు. ఆర్ ఎస్ ఎస్ చేతిలో హత్యకు గురి అయిన ఒక పి ఎఫ్ ఐ యువకుడి అంత్య క్రియలకు రెండు లక్షల మంది హాజరు అయ్యారు. గూగుల్ లో ఈ హత్యల గురించి వెతికితే, ముస్లిం యువకుల హత్యల గురించి కనబడవు. టెర్రరిస్టులు అనే ముద్రతో మొదలు పెట్టి, వాళ్ల అరెస్టు పట్ల మెజారిటీ సమూహంలో ఉదాసీనతను నాటేస్తున్నారు. ఇక టెర్రరిస్టు డబ్బులు అనగానే ఎవరో గడ్డం, ముసుగు వేసుకున్న వాళ్లు కోట్ల డబ్బును ఇక్కడకు పంపుతున్నారనే ఊహాచిత్రం మనసులో కదిలి పోతుంది. కరోన సమయంలో సహాయానికి వందల కోట్ల డబ్బుని ముస్లిం సమాజం నుండి వెచ్చించింది. ఆ డబ్బుని ఇచ్చిన వాళ్లు మెకానిక్కులు, ఆటో డ్రైవర్స్, బడ్డి కొట్ల వాళ్లు, పండ్ల కూరగాయ బండ్ల వాళ్లు. చండీగఢ్ లో ముస్లిములు చాలా తక్కువ వుంటారు. ఊరి చివర 20 ఏ సెక్టార్ లో వాళ్లకో మసీదు ఉంది. పేరు జామా మసీద్ . ఆ చిన్న మస్జిద్ నుండి 38 లక్షల డబ్బు కేరళ తుఫాన్ బాధితులకు పంపిణీ అయ్యింది. ఎక్కువ మంది నుండి వచ్చే చిన్న చిన్న మొత్తాలు కలిసి ఎక్కువ మొత్తంగా ప్రజల్లోకి వెళ్లగలవని చెప్పటానికి ఇదో ఉదాహరణ. పి ఎఫ్ ఐ నేషనల్ సెక్రెటరీ అనీస్ అహమ్మద్ ను కూడా అరెస్టు చేశారు. అతను 2018లో పాలస్తీనాలో జరిగిన ఒక శాంతి సమావేశానికి వెళ్లి వచ్చాడు. అక్కడ నుండి టెర్రరిస్టు ఫండ్ ని తెచ్చాడని, ఆ వంకతో ఈ రైడ్స్ మొదలు పెట్టారు. అసలు విషయం అది కాదు. వాళ్లు పిల్లలకు కరాటే నేర్పించటం కూడా కాదు. (ఆ ఎస్ ఎస్ కత్తి సాము నేర్పిస్తుంది మరి). అసలు విషయం పీఎఫ్ ఐ వెనుక ముస్లిం ప్రజలు సమీకృతం అవుతున్నారు. ఆ సంస్థ చాలా దూకుడుగా హిందుత్వ రాజకీయాలను సవాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు మెజారిటీ ప్రజల నుండి గట్టి మద్దతు రావాల్సి ఉంది. అది నిషిద్ద సంస్థ కాదు. ప్రజల మధ్యన పని చేస్తున్న సంస్థ. ఫండమెంటలిస్టులనో, ఇంకేదో నామకరణం చేసి వారికి నైతిక మద్దతును తిరస్కరించి, ఆ సంస్థ అరెస్టులను ఖండించక పోవటం ఆత్మహత్యా సదృశ్యం. వాళ్ల మత ఆచరణల మీద వేరే అభిప్రాయం ఉంటే అది తరువాత సంగతి. ఇవి NIA దాడులు కావు. బీజేపీ దాడులు ప్రతి అన్యాయానికి గొంతెత్తాలి. అన్యాయపు అరెస్టులకు పాల్పడుతున్న నేరస్త రాజకీయాలకు చెక్ పెట్టాలి. Rama sundari facebook wall నుండి.
No comments:
Post a Comment