మోహన్ భగవత్‌ను ‘జాతి పిత’గా అభివర్ణించిన ముస్లిం మత పెద్ద
Published: Thu, 22 Sep 2022 17:41:13 ISTహోంజాతీయంRSS chief :
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh-RSS) అధిపతి మోహన్ భగవత్‌పై ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ (Umer Ahmed Ilyasi) ప్రశంసల జల్లు కురిపించారు. భగవత్‌ను ‘జాతి పిత’గా అభివర్ణించారు. ముస్లిం మత పెద్దలతో సమావేశాల పరంపరలో భాగంగా భగవత్ గురువారం ఇల్యాసీతో సమావేశమయ్యారు.
మోహన్ భగవత్ గురువారం న్యూఢిల్లీలోని కస్తురిబా గాంధీ మార్గ్‌లో ఉన్న ఓ మసీదును, ఆజాద్‌పూర్‌లోని తజ్వీదుల్ ఖురాన్ మదరసాను సందర్శించారు. ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పెద్దలతో చర్చించారు.
ఉమర్ అహ్మద్ ఇల్యాసీని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘‘నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ గారు నాతో సమావేశమయ్యారు. ఆయన జాతి పిత, జాతి రుషి; ఆయన సందర్శనతో ఓ మంచి సందేశం వెళ్తుంది. మేం దేవుడిని ఆరాధించే విధానాలు వేర్వేరు, అయినప్పటికీ అతి పెద్ద మతం మానవత్వమే. దేశానికే పెద్ద పీట అని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఇల్యాసీ అన్నట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. వీరిద్దరూ ఓ గంటకు పైగానే ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలిపింది.
మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాల్లో ఇది రెండోది. గతంలో ఆయన ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడం కోసం ఆయన ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ మాట్లాడుతూ, నిరంతర చర్చల ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం జరిగిందని చెప్పారు. మోహన్ భగవత్ అన్ని రంగాల్లోని ప్రముఖులతోనూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
No comments:
Post a Comment