Tuesday, 14 June 2022

రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీని జగన్‌ వ్యతిరేకిస్తే... హోదాతో సహా అన్నీ వస్తాయి: ఉండవల్లి

రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీని జగన్‌ వ్యతిరేకిస్తే... హోదాతో సహా అన్నీ వస్తాయి: ఉండవల్లి


ఏపీలో 25 ఎంపీ సీట్లూ బీజేపీకి ఉన్నట్లే... ఎవరు గెలిచినా ఆ పార్టీతోనే

పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించరు..బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్‌

ఆ పార్టీ పెరిగితే దేశానికి ప్రమాదమని ఆయనకు పూర్తి అవగాహన ఉంది

దేశంలో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు..

ప్రతిపక్షం బలంగా ఉండాలిబీజేపీ విధానాలకు నేనూ వ్యతిరేకినే..కాబట్టే నన్ను పిలిచి మాట్లాడారుమాతో ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఉన్నారు.. కానీ, చర్చలో పాల్గొనలేదు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వెల్లడి

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి  సీఎం జగన్‌ అనుకూలంగా లేకుండా నిలబడితే ప్రత్యేక హోదాతోపాటు అన్నీ సాధించుకోవచ్చు.

మోదీ దేశంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగి మాట్లాడితే వాళ్లమీద పాత కేసు కూడా తిరగదోడి ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే కొత్త కేసులు పెట్టి నోరు మూయించే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి (కేసీఆర్‌) తనకు దమ్ముందని మాట్లాడడం నచ్చింది.- ఉండవల్లి అరుణ్‌కుమార్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ‘కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ కాదు. ఏపీలో ఏ పార్టీ నెగ్గినా బీజేపీనే. జగన్‌ పార్టీ నెగ్గినా, చంద్రబాబు పార్టీ, పవన్‌ పార్టీ నెగ్గినా బీజేపీతోనే ఉంటాయి. వాళ్లకు ఓట్లు లేకపోవచ్చు. ఇక్కడ నెగ్గే 25 ఎంపీ సీట్లూ వాళ్లవే’ అని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆదివారం సమావేశమైన ఆయన.. సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దానిపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ.. ‘మొన్నటివరకు చంద్రబాబు కేసులకు భయపడి మోదీని వ్యతిరేకించడం లేదని జగన్‌ అన్నారు.. ఇవాళ జగనే కేసులకు భయపడి వ్యతిరేకించడం లేదని చంద్రబాబు అంటున్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ బీజేపీతోనే కలసి ఉన్నారు’ అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా లేకుండా సీఎం జగన్‌ నిలబడితే ప్రత్యేక హోదాతోపాటు అన్నీ సాధించుకోవచ్చన్నారు.

‘ఈ దేశం, ఈ మత రాజకీయాలు నాకెందుకు.. ఈ రాష్ట్రానికి మేలు జరిగితే చాలని జగన్‌ భావిస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఇక పవన్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించదని.. ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగల శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు. బీజేపీ వ్యతిరేకులను లీడ్‌ చేయగల సత్తా కూడా ఆయనకు ఉందని చెప్పారు. ఆయనకు క్లారిటీ ఉందని.. బీజేపీ ఇంకా ఎదిగితే చాలా ప్రమాదమనే విషయంపైనా పూర్తి అవగాహన ఉందన్నారు. తాను కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకిని కావడంతో మాట్లాడడానికి తనను పిలిచారని చెప్పారు. ‘పది రోజుల కిందట నాకు ఫోన్‌ చేశారు. పిలుస్తాను.. రావాలన్నారు. ఆదివారం లంచ్‌కు పిలిచారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలపాటు చర్చించుకున్నాం. మొత్తం మూడు గంటల సమయంలో రెండున్నర గంటలు ఆయనే వివరించారు. నేనో అరగంట మాట్లాడా. మీరనుకుంటున్నట్లుగా ఆయన పెట్టబోయే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ గురించి గానీ, అందులో నాపాత్ర గురించి గానీ ఏమీ మాట్లాడుకోలేదు’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. 

హిందూ రాజకీయాలు మంచిది కాదు..హిందూమతం పేరిట దేశంలో రాజకీయాలు మంచిది కాదు. నేను బీజేపీకి వ్యతిరేకిని కాదు. మోదీ ప్రధాని అయినా నాకు నష్టం లేదు. కానీ వాళ్ల విధానాల వల్ల దేశానికి ప్రమాదం ఉంది. నాలుగైదు దేశాల్లో నేరుగా హైకమిషన్‌ పిలిచి క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల మీద మనం ఆధారపడి ఉన్నాం. మన మీద ప్రపంచమూ ఆధారపడి ఉంది. అమెరికాలో 77 శాతం ప్రజలు క్రిస్టియన్లే. అక్కడ హిందువులు గుండ్లు కొట్టించుకుంటున్నారు. బొట్టు పెట్టుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇస్లామిక్‌ దేశా లు కూడా హిందూ దేవాలయాల నిర్మాణానికి అనుమతిస్తున్నాయి. కానీ ఈ వేళ గల్ఫ్‌ దేశాలు ఇచ్చిన తాఖీదు వల్ల మన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన గుడ్‌విల్‌ పోయింది. హిందూ మతం పేరుతో మనపై దాడి చేస్తారని ప్రపంచం భావిస్తే మనకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. దీనికి చెక్‌ పెట్టడానికి ప్రశ్నించే ప్రతిపక్షం బలంగా ఉండాలి.

కేసీఆర్‌ మంచి వక్త..కేసీఆర్‌ వంటి మనిషి ఫోన్‌ చేసి సామాన్యుడినైన నన్ను పిలిచారు. ఆయన ఒక ఎజెండాతో ఉన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపాలని, ఈ దేశంలో ఎంత వాటర్‌ ఉంది.. ఎంత పవర్‌ జనరేషన్‌ ఉంది.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయాలపై చాలా హోంవర్కు చేశారాయన. వాటిని ఒక్కొక్కటి చెబుతూ నన్ను అడుగుతుంటే ఆశ్చర్యపోయాను. ఇంత గౌరవం ఇచ్చి, ఎక్స్‌ప్లెయిన్‌ ఎందుకో చేశారో ఆయన్నే అడగాలి. నేను రాజకీయాల్లో లేనని, రిటైరైపోయానని ఆయనకు మొదట్లోనే చెప్పాను. నేను చాలా హ్యేపీగా ఉన్నానని.. రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదని.. ఆ శక్తీ లేదని వివరించాను. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతుంటానని, ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదని కూడా చెప్పాను. టీవీల్లో మరింత ఎక్కువగా మాట్లాడాలని కేసీఆర్‌ అన్నారు. బీజేపీ ఓట్లు పెరగకూడదని, అది పెరిగితే చాలా ప్రమాదమని, అసలు బీజేపీ కాన్సెప్ట్‌ ఏంటనేది ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు.

త్వరలో మళ్లీ పిలుస్తానన్నారు. తప్పకుండా వస్తానన్నాను. మాతోపాటు ప్రశాంత్‌కిశోర్‌ కూడా ఉన్నారు. అన్నీ విన్నారు. కానీ చర్చలో పాల్గొనలేదు. మరో ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ ఉన్నారు. హరీశ్‌ రావు నన్ను రిసీవ్‌ చేసుకుని అరగంట మాట్లాడిన తర్వాత కేసీఆర్‌ వచ్చారు. ఆయన మంచి కమ్యూనికేటర్‌.. అన్నీ చాలా క్లారిటీగా చెప్పారు. కేసీఆర్‌ మంచి వక్త. ఆంగ్లం, తెలుగు, హిందీలో కూడా మాట్లాడగలరు. మమతా బెనర్జీ అంతగా మాట్లాడలేరు. మోదీలా అందరినీ ఆకట్టుగోగల శక్తి కేసీఆర్‌కు ఉంది. కచ్చితంగా బీజేపీ వ్యతిరేక వైఖరితో అందరినీ లీడ్‌ చేయగల శక్తీ ఉంది. బీజేపీ కాన్సెప్ట్‌ వల్ల దేశానికి నష్టం. వాజ్‌పేయి ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇవాళ సోనియాగాంధీ, రాహుల్‌కు కూడా సమన్లు ఇచ్చారు. మాట్లాడే పరిస్థితిలో ఎవరూలేరు. ఈ  పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడినప్పుడు, అది నచ్చినవారంతా ఆయనకు సపోర్టు చేయాలి. కాంగ్రెస్‌ బలం తగ్గింది. ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకోవాలి. మోదీ ఓ రాజులా పాలిస్తున్నాడు. ఎదురుతిరిగితే నరికేస్తాఅన్నట్లు ఉంది. 

No comments:

Post a Comment