Saturday, 4 June 2022

ముస్లింలను కాంగ్రెస్‌ ఆకర్షించాలి

 

ముస్లింలను కాంగ్రెస్‌ ఆకర్షించాలి

twitter-iconwatsapp-iconfb-icon

కేసీఆర్‌ను పూర్తిగా నమ్మని ముస్లింలు 

దేశవ్యాప్తంగా మోదీకి వారు వ్యతిరేకం 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం

ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నివేదిక 


న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ముస్లింలపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీనిని కాంగ్రె్‌సకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో భాగంగా ముస్లింలను తమవైపు తిప్పుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సోనియాగాంధీ ఇటీవల నియమించిన రాజకీయ వ్యూహరచన కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలకు సునీల్‌ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో హిందూ ఓటర్లు విడిపోయినప్పటికీ ముస్లిం ఓటర్లు అత్యధికంగా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, అయితే వారు సీఎం కేసీఆర్‌ పాలన పట్ల పూర్తి సంతృప్తితో లేరని ఆయన చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినప్పటికీ ఆయన వైఖరిని ముస్లింలు పూర్తిగా విశ్వసించే అవకాశాలులేవన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు కోటా రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటనను కేసీఆర్‌ ఖండించకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.


మోదీకి అనుకూలంగానే కేసీఆర్‌...!

2004లో యూపీఏలో ఉన్న కేసీఆర్‌.. 2009లో ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే నాటి బీజేపీ అధ్యక్షుడు ఆడ్వాణీతో కలిసి లూథియానాలో ఎన్నికల సభలో పాల్గొన్న విషయాన్ని, ఆ కూటమిలో చేరతానని చెప్పిన విషయాన్ని సునీల్‌ కనుగోలు గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్‌.. మోదీ శిబిరంలో చేరిపోయారని, ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ హడావుడి చేసినప్పటికీ.. మోదీకి స్నేహహస్తం చాచారని తెలిపారు. పార్లమెంట్‌లో మోదీ ప్రవేశపెట్టిన అనేక బిల్లులను నిన్నమొన్నటి వరకూ సమర్థించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు పూర్తి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

No comments:

Post a Comment