Tuesday, 27 November 2018

సుప్రీంకోర్టు–రామమందిరం

సుప్రీంకోర్టు–రామమందిరం
28-11-2018 00:23:01

నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సర్వోన్నత న్యాయస్థానం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైన విషయమేనా?

‘రాజ్యాంగ నైతికత అనేదాన్ని మనం పెంపొందించాలే కాని అది సహజంగా జరగదు. మన వాళ్లు దాన్ని ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక అప్రజాస్వామిక సమాజంపై అద్దిన పైమెరుగు మాత్రమే..’ అని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్నారు. సోమవారం నాడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కీలక ప్రశ్నలకు సమాధానం రావల్సి ఉన్నదన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హుందాగా జీవించే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్న చాలా విలువైనదే కాక అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగం పరిధిలో అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? అసలు రాజ్యాంగం ఎవరి కోసం? సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని రాజ్యాంగం మార్చివేసిందా?

అయినప్పటికీ జస్టిస్ గొగోయ్ అన్నట్లు రాజ్యాంగం అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? అన్న ఆవేదనను జస్టిస్ గొగోయ్ వ్యక్తం చేశారు. మనిషి ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా సమానత్వాలను ఆ వ్యక్తి పాదాల క్రింద పణంగా పెట్టలేమని, అతడిని విశ్వసించి, సంస్థలను కాలరాసే అధికారాన్ని ఆ వ్యక్తికి అప్పజెప్పలేమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను, స్వేచ్ఛా సమానత్వాలను పరిరక్షించకపోతే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. గొగోయ్ ఎవర్ని, ఏ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారో మనం ఊహించుకోవాల్సిందే కాని మన దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకూ, ఆయన వ్యాఖ్యలకూ సంబంధం లేదని మాత్రం చెప్పలేం.

రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం కేసులో తీర్పు చెప్పవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కాంగ్రెస్‌ పార్టీ భయపెడుతోందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తామని కూడా హెచ్చరించిందని ఆరోపించారు. ఒక ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టును ఎన్నికల సభల్లో ప్రస్తావనకు తీసుకురావడం అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా రాజకీయాల్లోకి లాగాలని భావిస్తున్నట్లే అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా లేరని, కాంగ్రెస్ భయపెడితే భయపడేవారని చెప్పడమే ఆయన ఉద్దేశమా? ప్రధానమంత్రే ఇలా అంటే న్యాయవ్యవస్థపై ఎవరికి గౌరవం ఉంటుంది? నిజానికి గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టదలుచుకున్న అభిశంసన తీర్మానానికీ అయోధ్యలో రామమందిరం అంశానికీ ఏ మాత్రం సంబంధం లేదు. అవి ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. మరి ప్రధానమంత్రి ఈ అభిశంసన తీర్మానానికీ, అయోధ్యలో రామమందిరానికి సంబంధించిన కేసుకూ ఎందుకు ముడిపెడుతున్నారు? ఇందులో ఏదో మతలబు ఉన్నదన్నమాట. ప్రధానమంత్రి మాటలే నిజమైతే జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే అయోధ్య కేసును తేల్చివేసి రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించిందని, దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకే అభిశంసన తీర్మానాన్ని ముందుకు తెచ్చాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో ఆయనకూ, ప్రభుత్వానికీ మధ్య ఒక అవగాహన ఏర్పడి ఉండవచ్చుననే అనుమానాలకూ ప్రధాని ప్రకటన తావిస్తున్నది.

ఏ కారణాల వల్లనైతేనేం, జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనే లేదు. అయోధ్యపై కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి నిరాకరించి, అక్టోబర్ 29 నుంచి ప్రతి రోజూ విచారణ జరుగుతుందని తీర్పు చెప్పి మరీ ఆయన పదవీవిరమణ చేశారు కాని ఆయన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గొగోయ్ ఆ తీర్పును ప్రక్కన పెట్టారు. ‘మాకింతకన్నా ముఖ్యమైన విషయాలెన్నో ఉన్నాయి.’ అని ఆయన ఈ కేసు విచారణను జనవరి నెలకు వాయిదా వేశారు.

నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి కూడా ఎన్నికల సమయంలో తప్ప అయోధ్య అంత ముఖ్యమైన విషయం కాదని ఆ కేసు విచారణ జరిగిన తేదీలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. అయోధ్య భూ వివాదంపై 2011 మేలోనే సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ స్టే ఎత్తి వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. కోర్టు వెలుపల ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా 2017 మార్చిలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ చెప్పినప్పటికీ నరేంద్రమోదీ కానీ, బిజెపి కానీ, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కానీ అటువంటి పరిష్కారానికి ఆసక్తి ప్రదర్శించలేదు. మళ్లీ జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే 2018లో ఈ కేసులో చురుకుగా కదలిక ఏర్పడింది. కాని జస్టిస్ గొగోయ్ నిర్ణయం వల్ల బిజెపి, సంఘ్ పరివార్ సంస్థలు హతాశులైనట్లు కనపడుతోంది. నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సుప్రీం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైనదా?

నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఎన్నికల ప్రయోజనాలకు సంఘ్ పరివార్ పూర్తిగా అండదండనిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ఆర్ఎస్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, సాధువులు ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తే ముస్లింలు సహనాన్ని కోల్పోతున్నారని కేంద్రమంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అయోధ్యలో శివసైనికులు, విహెచ్‌పి భారీ ఎత్తున లక్షమందికి పైగా సాధువులు, కార్యకర్తలతో బలప్రదర్శన చేయాలని నిర్ణయించడం 1992 డిసెంబర్ 6 నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. అటు కేంద్రంలోనూ, ఉత్తర ప్రదేశ్‌లోనూ బిజెపి సర్కార్ ఉన్నందువల్ల బలసమీకరణ చేయడం ఆ సంస్థలకు అంత కష్టం కాకపోవచ్చు.

తాజాగా నరేంద్రమోదీ చేసిన ప్రకటన రామమందిరం విషయంలో సంఘ్ పరివార్ సంస్థల ఆందోళనకు మరింత బలం చేకూర్చినట్లయింది. రామమందిర నిర్మాణం తాను కావాలని కోరుకుంటున్నానని, కాని కాంగ్రెస్ పార్టీయే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బెదిరించి తీర్పు రాకుండా చేసిందని ఆయన తేల్చేసినట్లు స్పష్టమవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇండోర్‌లో ప్రకటించారు. దీని వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రజల భావోద్వేగాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగబోయే సార్వత్రక ఎన్నికల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భావోద్వేగాలను రేకెత్తించి ప్రయోజనం పొందేందుకు కూడా మోదీ రంగం సిద్ధం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుపై అయోధ్య విషయంలో ఒత్తిడి పెంచుతున్నది ఎవరు? కాంగ్రెసా లేక మోదీ, షా, సంఘ్ పరివార్ పెద్దలా.. అన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు. జనవరిలో సుప్రీం కోర్టు అయోధ్యపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం కాని కోర్టు తీర్పుకు ముందే న్యాయ వ్యవస్థ, చట్టాలకు అతీతంగా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిజానికి మోదీ హయాంలో దేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, స్మార్ట్ సిటీలతో దేశం వర్ధిల్లితే, నిరుద్యోగం, పేదరికం సమసిపోతే, నల్లధనం దేశానికి తిరిగి వస్తే భావోద్వేగాలు కల్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇవాళ మధ్యప్రదేశ్‌లోనూ, రాజస్థాన్‌లోనూ నరేంద్ర మోదీ సభలకు జనం అంతగా ఆకర్షితులు కావడం లేదు. సిబిఐలో జరుగుతున్న పరిణామాలు, రాఫెల్ డీల్ వంటి అంశాలపై సుప్రీం కోర్టు లో సాగుతున్న విచారణ, ప్రతిపక్షాలు ఏకం కావడం మొదలైన అంశాలపై కూడా వారు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తమ దైనందిన సమస్యల గురించి వారు మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి జవాబు చెప్పే ధైర్యం లేనందువల్లే మోదీ, ఆయన అభిమాన సంఘీయులు భావోద్వేగ అంశాలను లేవనేత్తి భయభ్రాంత వాతావరణం కల్పిస్త్తున్నారు. తాను కామ్ ధర్ (నిరంతరం పనిచేసే) ప్రధానినని, అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని మోదీ చెప్పిన మాటలు ప్రశ్నార్థకమవుతున్నాయి.

ఎన్నికల పర్యటనలో భాగంగా ఇండోర్‌లో ఒక బిజెపి మిత్రుడి ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన సోదరుడు, సంఘ్ సీనియర్ నేత, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ బాధ్యతలు చూసే పెద్ద మనిషి కనిపించారు. ‘మా సోదరుడి మాటలతో నేను ఏకీ భవించను. నరేంద్రమోదీ, అమిత్ షా హయాంలో పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది.. ఒకప్పుడు మధ్యప్రదేశ్‌లో బిజెపి సర్కార్ రావడానికి ఎంతో కృషి చేసిన మమ్మల్ని ఎవరూ లెక్కచేయడం లేదు.. ఇండోర్ లో పార్టీకి దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వస్తాయి..’ అని బిజెపి మిత్రుడు చెప్పారు. కాని ఆర్ఎస్ఎస్ పెద్దమనిషి మాత్రం మోదీ హయాంలో దేశంలో హిందూ మత భావనలకు విలువ, హిందువులకు ధైర్యం పెరిగిందని అన్నారు. ‘రాహుల్ గాంధీ కూడా దేవాలయాలకు వెళుతున్నారు.. మాకింకేం కావాలి? మోదీ దేశానికి ఏం చేశారా అని నన్నడగకండి.. మాకు కావల్సింది చేస్తున్నారు..’ అని ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. ఇక ప్రజలు ఏమి చేస్తారో కాలం తేలుస్తుంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

No comments:

Post a Comment