Saturday, 10 November 2018

మైనార్టీలకు డబుల్‌ ధమాకా!

మైనార్టీలకు డబుల్‌ ధమాకా!
11-11-2018 02:29:44

ఫరూక్‌కు మంత్రిగా అవకాశం
కీలక ఆరోగ్య శాఖ అప్పగింత?
షరీఫ్‌కు చైర్మన్‌ బాధ్యతలు?
ఇంటి పెద్దను కోల్పోయిన
గిరిజన కుటుంబానికి చోటు
మంత్రివర్గంలోకి శ్రావణ్‌
గిరిజన సంక్షేమ బాధ్యతలు?
నేడు 11.45కు కేబినెట్‌ విస్తరణ
అమరావతి, పాడేరు, కర్నూలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమయింది. టీడీపీకి తొలినుంచీ అండగా ఉన్న మైనారిటీ సామాజికవర్గానికీ, ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికీ, ఎదుగుతున్న నేతను పోగొట్టుకొన్న గిరిజన సామాజికవర్గానికీ ప్రభుత్వంలో పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎన్‌ఎండీ ఫరూక్‌, దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌లను తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, ఆరోగ్య శాఖలు, కిడారి శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించనున్నారు. ఆదివారం ఉదయం 11.45 నిమిషాలకు ఉండవల్లి ప్రజావేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరితో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. కాగా, రెండేళ్ల క్రితం ఒకసారి మంత్రివర్గ విస్తరణ జరగ్గా... ఇది రెండో విస్తరణ. మంత్రివర్గ విస్తరణ అంశంపై శనివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కొందరు మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ప్రస్తుతానికి ముస్లిం మైనార్టీ సంక్షేమం సీఎం వద్దే ఉండగా...గిరిజన సంక్షేమం నక్కా ఆనంద్‌బాబు వద్ద ఉంది. ఆ శాఖలను ఫరూక్‌, శ్రావణ్‌కు కేటాయించాలని నిర్ణయించారు.

అదేసమయంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య, ఆరోగ్యశాఖను ఫరూక్‌కు ఇవ్వనున్నారు. అలాగే, శ్రావణ్‌ను రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలపాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం ఫరూక్‌, శ్రావణ్‌లను చంద్రబాబు శనివారం తన నివాసానికి పిలిచి.. మంత్రివర్గంలోకి తీసుకొంటున్న విషయం స్వయంగా తెలిపారు. మంత్రివర్గంలోకి రానున్నందున ఫరూక్‌ శాసనమండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

మైనారిటీలకు మరింత చోటు
ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రిగా తీసుకోవాలని నిర్ణయించడంతో, ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న చర్చ జరిగింది. ‘ముస్లింలకు డబుల్‌ ధమాకా ఇద్దాం’ అని నేతలతో చంద్రబాబు అన్నారు. శాసనమండలి చైర్మన్‌ పదవి కూడా ఆ వర్గానికే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో షరీ్‌ఫకు శాసనమండలి చైర్మన్‌ పదవి దక్కనుంది. మరో మైనారిటీ ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు విప్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా, జియావుద్దీన్‌ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా, మహ్మద్‌ హిదాయత్‌ ఏపీఎంఎ్‌ఫసీ చైర్మన్‌గా, నౌమాన్‌ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. నెల్లూరు మేయర్‌గా అజీజ్‌, ఏలూరు మేయర్‌గా నూర్జహాన్‌ ఉన్నారు. చంద్రబాబు నిర్ణయమే తమకు శిరోఽధార్యమని, అసంతృప్తి ఏమీలేదని జలీల్‌ఖాన్‌, చాంద్‌ బాషా అన్నారు.

No comments:

Post a Comment