Monday, 29 October 2018

దమ్ముంటే ఆర్డినెన్స్ తెండి: ఒవైసీ

దమ్ముంటే ఆర్డినెన్స్ తెండి: ఒవైసీ
29-10-2018 15:42:55

న్యూఢిల్లీ: అయోధ్య వివాదం అశంపై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే 'ఆర్డినెన్స్' తేవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంకెంతమాత్రం జాప్యం చేయకుండా కేంద్రం రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ శివసేన, షియా వక్ప్‌బోర్డు, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నుంచి డిమాండ్లు పెరుగుతుండటంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

'మీరు ఆ పని (రామాలయ నిర్మాణం ఆర్డినెన్స్) ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం చేస్తారో చేయండి. ప్రతిసారీ ఆర్డినెన్స్ తెస్తామంటూ వాళ్లు బెదిరిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలో ఉన్న ప్రముఖులంతా ఇదే మాట చెబుతున్నారు. అలాగే కానీయండి. మీరు అధికారంలో ఉన్నారు. ఆర్డినెన్స్ తెండి. ఎలా తెస్తారో మేమూ చూస్తాం' అంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు.

అయోధ్యపై ఆర్డినెన్స్ తెస్తారా? లేదా?
29-10-2018 15:20:49

న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసుపై విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డినెస్ తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. శివసేన ఆర్డినెన్స్ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, షియా వక్ఫ్ బోర్డు సైతం గొంతు కలిపాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశాయి.

ప్రధానిని కలుస్తాం: షియా వక్ఫ్ బోర్డు
రామ మందిర విషయంలో ఆర్డినెన్స్ రూట్ తొక్కాలని కోరేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరనున్నట్టు షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రజ్వీ తెలిపారు. 2019లో కోర్టు ఎప్పుడు తీర్పు ప్రకటించినా బాబ్రీ మసీదు ప్రతినిధులకు ఓటమి తప్పదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆర్డినెన్స్‌కే మా మద్దతు: శివసేన
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావలన్నదే తమ డిమాండ్ అని, ఇందుకు తాము ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీ తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సైతం నవంబర్ 25న అయోధ్య వెళ్తున్నారని చెప్పారు.

చట్టం చేయాలి: ఆర్ఎస్ఎస్
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వెసులుబాటు కలిగించేలా చట్టం తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది. ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు ఇదే తగిన తరుణమని, రామమందిర నిర్మాణం మతసామరస్యానికి ప్రతీక అని ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

పార్లమెంటు సమావేశాల్లోనే ఆర్డినెన్స్ : వీహెచ్‌పీ
ఆర్డినెన్స్ తీసుకు రావాలన్నదే తమ అభిమతమని వీహెచ్‌పీ సైతం ప్రకటించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఆర్డినెన్స్ చేయాలని సూచించింది. రామాలయం నిర్మాణం కోసం తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా పేర్కొంది.

హిందువుల సహనం పోతోంది: కతియార్
అయోధ్యపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడంపై బీజేపీ నేత వినయ్ కతియార్ అసంతృప్తి వ్యక్తం జచేశారు. రామాలయ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యంతో హిందువులు సహనం కోల్పోతున్నారని, రాముడు పుట్టిన చోటే ఆలయం కట్టాలన్న తమ పోరాటంలో సహేతుకత ఉందని అన్నారు.

No comments:

Post a Comment