Monday, 29 October 2018

జిన్నా అడుగుజాడల్లో ఆరెస్సెస్‌ !

జిన్నా అడుగుజాడల్లో ఆరెస్సెస్‌ !
27-10-2018 00:03:53

జాతీయ అస్తిత్వం విషయమై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ భావన, పాకిస్థాన్‌ సంస్థాపకుడు జిన్నా జాతి భావనకు సంపూర్ణంగా ఒక జిరాక్స్‌ కాపీ. సంఘ్‌ పరివార్‌ దృష్టిలో ఒకరు కచ్చితంగా భారతీయుడు కావాలంటే అతడు హిందూ మతస్థుడై వుండాలి; నిజమైన భారతీయుడు హిందీ భాషను మాట్లాడగలిగివుండాలి. అదృష్టవశాత్తు, పాకిస్థాన్‌ గురించి ఎమ్‌.ఎస్.అలీ ఆలోచించినట్టుగా తమ దేశం గురించి ఆలోచించే భారతీయులు చాలా మందివున్నారు. మతపరమైన, భాషా పరమైన అధిక్యతావాద ధోరణులను ప్రబల నివ్వకూడదు.

స్వాతంత్ర్య భానుడు ఉదయించిన రోజుల్లో (1947 ఆగస్టు– సెప్టెంబర్‌) కలకత్తాలో మహాత్మా గాంధీ పర్యటనల గురించిన పత్రికా వార్తలను (మైక్రోఫిల్మ్‌ పై) చదువుతుండగా ఒక అజ్ఞాత భారతీయుడు రాసిన ప్రశంసాయోగ్యమైన పాఠక లేఖ ఒకటి నా దృష్టికి వచ్చింది. డమ్‌డమ్‌లో నివశించే ఎమ్‌. ఎస్‌.అలీ అనే వ్యక్తి రాసిన ఆ లేఖ 1947 ఆగస్టు 12న ‘ ది స్టేట్స్‌మన్‌’ ఎడిటోరియల్‌ పేజీలో ప్రచురితమయింది. ఆ అజ్ఞాత భారతీయుడు ఇలా రాశాడు: ‘ సర్‌, పాకిస్థాన్‌లో ఐదు రాష్ట్రాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికీ దాని సొంత, విలక్షణ భాష ఒకటి ఉన్నది. వీటిలో బెంగాలీ బాగా అభివృద్ధి చెందిన భాష. సమున్నత పదసంపద ఉన్న బెంగాలీతో పోలిస్తే మిగతావి బాగా వెనుకబడిన భాషలు. ఉర్దూ బాగా అభివృద్ధిచెందిన భాషే అయినప్పటికీ భారత్‌ లేదా పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల వ్యవహారంలో ఉన్న భాష కాదు. పశ్చిమోత్తర రాష్ట్రాలలోని విద్యావంతులైన భారతీయులకు మాత్రమే ఉర్దూ వాడకం పరిమితమయింది. కనుక ఉర్దూను పాకిస్థాన్‌ రాజభాషగా చేయకూడదు. అంతేకాదు పాకిస్థాన్ విశ్వవిద్యాలయాలలో అది బోధనా భాష కూడా కాకూడదు. ఏదైనా ఒక విదేశీ– యూరోపియన్‌ లేదా భారతీయ– భాషను పాకిస్థాన్‌ రాష్ట్రాలపై రుద్దితే, ఆ భాషను మాట్లాడే కులీన వర్గాలవారు ఇతర వర్గాల వారిపై పెత్తనం చెలాయిస్తారు. ఇది పాకిస్థాన్ పురోగతికి ఎంతైనా ఆటంకమవ్వగలదు. వివిధ భాషలలో నిపుణులైన వారితో ఒక బోర్డును ప్రతి రాష్ట్రమూ ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇతర అంతర్‌–సంబంధిత వ్యవహారాలను నిర్వహించే బాధ్యతను ఈ బోర్డు్‌కు అప్పగించాలి. దీనివల్ల భాషాపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కేంద్రం కూడా, రాష్ట్రాలవలే తన సొంత భాషా నిపుణుల బోర్డ్‌ నేర్పాటు చేసుకోవాలి. ఏ ఒక్క భాషనూ తన అధికార భాషగా చేసుకోకూడదు. ఏ ఒక్క భాషనైనా తన అధికార భాషగా చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి అయితే అది ఆంగ్ల భాష మాత్రమే కావాలని నేను సూచిస్తున్నాను’.

ఈ లేఖా రచయిత బెంగాలీ భాషీయుడైన ముస్లిం. పాకిస్థాన్‌ ఏర్పాటైన తరువాత ఆయన బహుశా తూర్పు బెంగాల్‌కు వలసపోయివుంటారు. పాకిస్థాన్‌లో భాగంగా ఉండే ఏ రాష్ట్రంలోనూ ఉర్దూ ప్రజల భాష కాదన్న వాస్తవం ఆయనకు బాగా తెలుసు. పంజాబ్‌లో పంజాబీ, సింధ్‌లో సింధీ, వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో పస్తో, బెలుచిస్తాన్‌లో బెలూచీ ప్రధాన భాషలు. వీటిలో ప్రతి ఒక్కదాన్నీ గౌరవించి ప్రోత్సహించాలని అలీ సూచించారు. భావి పాకిస్థాన్‌లో అత్యధిక ప్రజలకు పూర్తిగా విదేశీ భాష అయిన ఉర్దూను వారిపై రుద్ద కూడదని ఆయన నొక్కి చెప్పారు.

ఎమ్‌ ఎస్‌ అలీవి ప్రశంసనీయమైన ఆలోచనలు. ఆయన సూచనలు దూరదృష్టితో చేసినవి.అయితే పాకిస్థాన్‌ సంస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా వాటిని పట్టించుకోలేదు. తాను ఉనికిలోకి తీసుకురానున్న దేశంలో ఒక మతానికి, ఒక భాషకు మాత్రమే అధికారికంగా ప్రత్యేక స్థానముండాలని ఆయన విశ్వసించారు. ఈ విషయంలో ఆయన, జాతి నిర్మాణంలో పాశ్చాత్య పద్ధతులతో ప్రభావితులయ్యారు. యూరోపియన్‌ దేశాలలో ఒక నిర్దిష్ట ప్రాం త ప్రజలను మత లేదా భాషా ప్రాతిపదికన సమైక్యం చేయడం జరిగింది.

జిన్నా సమకాలికుడైన మహాత్మా గాంధీ జాతి నిర్మాణంలో పాకిస్థాన్‌ జాతిపిత మార్గానికి పూర్తిగా విరుద్ధమైన మార్గాన్ని అనుసరించారు. భారతీయ సమాజంలోని వైవిధ్యాన్ని గాంధీజీ పూర్తిగా గౌరవించారు. భారతీయ పౌరసత్వాన్ని ఏ ఒక్క మతం లేదా భాషా ప్రాతిదికన గుర్తించడాన్ని మహాత్ముడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

పాకిస్థాన్‌ ఆవిర్భవించిన ఆరు నెలల అనంతరం, ఆ కొత్త దేశ గవర్నర్‌–జనరల్‌ జిన్నా తూర్పు పాకిస్థాన్‌ను సందర్శించారు. 1948 మార్చి 21న ఢాకాలో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ జిన్నా ఇలా అన్నారు: ‘బెంగాల్‌ రాష్ట్ర, పాకిస్థాన్‌ అధికార భాషగా బెంగాలీ లేదా ఉర్దూ అవుతుందా అనే విషయమై దేశప్రజలలో కొంత ఉత్కంఠ, ఆదుర్దా నెలకొని వున్నది. ఈ విషయమై కొన్ని స్వార్థ శక్తులు విద్యార్థులను ఉపయోగించుకొని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు జేయడానికి ప్రయత్నిస్తున్నాయి’. జిన్నా ఇంకా ఇలా అన్నారు: ‘పాకిస్థాన్‌కు, మీ రాష్ట్రానికి పొంచివున్న ప్రమాదాలగరించి మిమ్ములను ముందుగా హెచ్చరించదలుచుకున్నాను. పాకిస్థాన్‌ ఆవిర్భావాన్ని అడ్డుకోవడంలో విఫలమై, తీవ్ర అసంతృప్తితో ఉన్న స్వార్థ శక్తులు, పాకిస్థానీ ముస్లింలలో విభేదాలను రెచ్చగొట్టి కొత్త దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా పాకిస్థాన్‌ను దెబ్బ తీయడానికి అవి ప్రయత్నిస్తున్నాయి’.

భాషా సమస్యపై జిన్నా ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: తూర్పు పాకిస్థాన్ అధికార భాష బెంగాలీ లేదా మరొకటా అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకొనే వారు నిర్ణయిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు అభిమతానికి అనుగుణంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. బెంగాలీని అధికార భాషగా చేసే విషయమై వ్యాప్తి అవుతున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీకు నేను స్పష్టం చేస్తున్నాను. ఈ రాష్ట్రానికి ఏది అధికార భాషా కావాలనే విషయమై అంతిమ నిర్ణేతలు మీరేనని కచ్చితంగా చెప్పుతున్నాను’.

బెంగాలీల మనోభావాలను జిన్నా అర్థం చేసుకున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. బెంగాలీలు తమ మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించారు. అయితే ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘ మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పాకిస్థాన్‌ అధికారభాషగా ఉర్దూ మాత్రమే ఉంటుంది. మరే ఇతర భాషకు ఇటువంటి హోదాను కల్పించడం జరుగదు, జరుగబోదు. ఈ విషయమై మిమ్ములను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించేవారు కచ్చితంగా పాకిస్థాన్‌ శత్రువులే. ఒక అధికార భాష లేకుండా ఏ జాతి ప్రజలూ సమైక్యంగాఉండలేరు, ఏ రాజ్యవ్యవస్థా సక్రమంగా పనిచేయలేదు. ఇతరదేశాల చరిత్రను చూడండి. మీకు ఈ వాస్తవం అర్థమవుతుంది . కనుక పాకిస్థాన్‌ అధికార భాష ఉర్దూ మాత్రమే’.

తొలినాటి పాకిస్థాన్‌లో విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ మొదలైన అంశాలలో ఉర్దూకు ప్రధాన స్థానం లభించగా బెంగాలీకి గౌణ స్థానం మాత్రమే దక్కింది . ఒకే ఒక అధికార భాష ఉండాలని గట్టిగా చెప్పడంలో జిన్నా ఒక విధమైన భయోన్మాదాన్ని ప్రదర్శించారు. పౌరసత్వానికి నిర్దిష్ట ఉమ్మడి ప్రమాణాలు లేకపోతే దేశం విచ్ఛిన్నమై పోగలదని ఆయన భావించారు. పాకిస్థాన్‌ను ముస్లిం దేశంగానే కాదు, ఉర్దూ మాట్లాడే జాతిగా కూడా రూపొందించాలని జిన్నా ఆకాంక్షించారు.

జిన్నాకు భిన్నంగా గాంధీ, ఆ తరువాత నెహ్రూ పౌర సత్వం విషయంలో ఒక విశాల వైఖరిని అనుసరించారు. రాజ్యవ్యవస్థ ఏ ఒక్క మతానికి , మిగతా మతాల కంటే అధిక ప్రాధాన్యమివ్వకూడదని వారు భావించారు. ఈ భావననే వారు కచ్చితంగా అనుసరించారు. అలాగే భారతీయ భాషలలో ఏ ఒక్కదానికీ మిగతా వాటికంటే సర్వోన్నత స్థానం ఇవ్వకూడదని గాంధీ, నెహ్రూలు భావించారు. భారత రాజ్యాంగం ఈ భావనలను ఔదలదాల్చింది . భారత్‌ హిందూ దేశం కాబోదు. హిందీని దక్షిణ భారతావని, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలపై బలవంతంగా రుద్దరు. భారత రాజ్యానికి అధికార భాష ఉండదు. తన సొంత భాషా సంప్రదాయాలను పెంపొందించుకోవడానికి ప్రతి రాష్ట్రానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది.

బెంగాలీని నిర్లక్ష్యం చేసి ఉర్దూకు అమిత ప్రాధాన్యమివ్వడమే, తూర్పు పాకిస్థాన్‌లో ప్రాంతీయ భావాలు పెంపొందడానికి బహుశా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బెంగాలీలలో వేర్పాటువాద ధోరణులు క్రమంగా బలపడి, అంతిమంగా స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారణమయ్యాయి. పాకిస్థాన్‌కు ఒకే అధికార భాష ఉండాలని జిన్నా నొక్కి చెప్పారు. ఉర్దూ పాకిస్థాన్‌ అధికార భాష అయింది. అయితే అది పాకిస్థాన్‌ ప్రజలను సమైక్యంగా ఉంచడంలో విఫలమయింది. ఎమ్‌ఎస్‌అలీ లేఖను పాకిస్థాన్‌ సంస్థాపకుడు చదివివున్నట్టయితే, ఆ లేఖలోని సూచనలను పాటించే వివేకాన్ని ఆయన చూపివున్నట్టయితే బంగ్లాదేశ్‌ అసలు ఉనికిలోకి వచ్చేదే కాదు.

సరే, నేను చేయదలుచుకున్న చివరి వ్యాఖ్య ఒకటి వున్నది. అది, జాతీయ అస్తిత్వం విషయమై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ భావన. ఈ భావన, మహమ్మద్ అలీ జిన్నా జాతి భావనకు సంపూర్ణంగా ఒక జిరాక్స్‌ కాపీ. సంఘ్‌ పరివార్‌ దృష్టిలో ఒకరు కచ్చితంగా భారతీయుడు కావాలంటే అతడు హిందూ మతస్థుడై వుండాలి; నిజమైన భారతీయుడు హిందీ భాషను మాట్లాడగలిగివుండాలి. ఆరెస్సెస్‌ ప్రస్తుత సర్‌సంఘ్‌చాలక్‌ సమస్త భారతీయ మతాలన్నిటిలోకి హిందూ ధర్మ సర్వోత్కృష్టత గురించి మాట్లాడుతుంటారు. యువ సంఘీయులేమో హిందువులు కాని వారిపై హింసాత్మక చర్యలకు పాల్పడుతూ, వీధుల్లో తమ అధినేత భావాలను కార్యాచరణలోకి తెస్తుంటారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమేమో ఇతర భారతీయ భాషలను విస్మరించి గుట్టుగా హిందీ భాషను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. అదృష్టవశాత్తు, పాకిస్థాన్‌ గురించి ఎమ్‌.ఎస్.అలీ భావించినట్టుగా తమ దేశం గురించి ఆలోచించే భారతీయులు చాలా మందివున్నారు. మతపరమైన, భాషా పరమైన అధిక్యతావాద ధోరణులను ప్రబల నివ్వకూడదు.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు) 

No comments:

Post a Comment