Wednesday, 12 September 2018

‘సలీం లంగ్డే పే మత్ రో’

‘సలీం లంగ్డే పే మత్ రో’
ఇంకొకసారి ఈ సినిమా గురించి
Image may contain: 8 people, people smiling, text
Rama Sundari is with Mohan Babu.
September 4, 2017
సినిమా రివ్యూలు రాయటం నాకు రాదు కానీ, రాయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి కొన్ని సినిమాలు. చెత్త సినిమా ఒకటి చూశాక మంచి సినిమా చూడాలని తపించి పోయే రకానికి చెందినదాన్ని కాబట్టి భారతీయ సినిమాల్లో మంచి సినిమాలు వెదికి వెదికి చూస్తున్నాను. అందుకు సహాయపడుతున్న మోహన్ బాబుగారికి థాంక్స్ చెప్పకుండా ఉండలేను.
అందులో ఒకటి ‘సలీం లంగ్డే పే మత్ రో’ (సలీం కుంటితనానికి కన్నీరు కార్చవద్దు. లంగ్డే పదాన్ని తెలుగులో కరక్ట్ గా ఏమంటారో తెలియదు) ఈ సినిమా సయీద్ అక్తర్ మిర్జా బ్రైన్ చైల్డ్(1989). అప్పటికి ఇంకా బాబ్రీ మజీద్ ఘటన కూడా జరగలేదు. బొంబాయ్ లో 1970 భివాల్ది ప్రాంతంలో జరిగిన మత కల్లోలాల ప్రస్తావన ఉంటుంది. ఈ గొడవల్లో 143 మంది ముస్లిములు, 20 మంది హిందువులు చనిపోయారు. అనేక మంది మహిళలు, బాలికల మీద అత్యాచారాలు జరిగాయి. కాబట్టి వీటిని శివసేన ప్రేరిత మత దాడులు అనవచ్చు.
ఈ సినిమాలో ప్రధాన విషయం పేద మహమ్మదీయులు ఈ దేశానికి ఎలా పరాయి వారు అవుతున్నారనే. దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబాలలో నేర జీవితం ఎంత అనివార్యం అవుతుందో టీకా తాత్పర్యంతో సహా అర్ధం అవుతుంది. పేదరికం ముస్లిం పిల్లలకు చదువులు ఇవ్వనివ్వదు. మతం సరైన ఉద్యోగాలనివ్వనివ్వదు. అలాంటి వాతావరణంలో పుట్టిన సలీం నేర జీవితం ఈ కథ. పోలీసులు చేసే అవమానాలను యువకులు కోపాన్ని దిగమింగుకొని భరించాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి సినిమా అంతా. ఈ సినిమాలో దాదాపు అన్ని పాత్రలు ముస్లిములవే. గొప్ప ఫిలసాఫకల్, రియలిస్టిక్ సీనులు, డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఒక పాశ్చాత్య పాత్ర అంటుంది ‘చనిపోవటానికి సిద్దపడిన వారికి భారతదేశం కంటే అనువైన దేశం ఇంకొకటి ఉండదని’. ‘కలిసి ఉండటం అంటే మతాలు కలిసి ఉండటం కాదు, సాహిత్యం సంగీతం, జీవన విధానం కలిసి ఉండటం’ అని కూడా అంటాడు. మూర్ఖంగా, మూఢంగా ఉండే ముస్లిములను ఈ సినిమాలో ఒక అభ్యుదయ ముస్లిం పాత్ర ఈసడించుకొంటాడు. అప్పుడు సలీం అంటాడు ‘ఇక్కడ పేద ముస్లిములు అంతకంటే ఎలా ఎదగగలరని’.
నేరప్రపంచంలో భాగంగా ఉన్న వ్యభిచారం (ఈ సినిమాలో దాన్ని వ్యభిచారం అనలేదు. నృత్యాలు అని మర్యాదగా అన్నారు.) వృత్తిగా ఉన్న ప్రేమికురాలు ముంతాజ్. సలీం ‘చెల్లి పెళ్లి అవగానే మన పెళ్లి అవుతుంది’ అంటాడు. ముంతాజ్ ‘అది అంత సులభం కాదు’ అని వాడిపోయిన ముఖంతో అంటుంది. “అవుతుంది అను” అని బలవంతం పెడతాడు సలీం. ‘అవుతుందిలే’ అంటుంది ఆమె అదే ముఖంతో. “అలా కాదు. నవ్వుతూ అను” అని మళ్ళీ బలవంతం పెడతాడు. అప్పుడు ముంతాజ్ నవ్వు మర్చిపోలేము. నీలిమ అజీమ్ ఆ పాత్ర వేసింది.
అక్తర్ మీర్జా ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ విద్యార్ధి. ఈయన తీసిన చాలా సినిమాలకు అవార్డులు వచ్చాయి. ముస్లిం జీవితాల మీద డాక్యుమెంటరీస్ కూడా తీశారు. నుక్కడ్ లాంటి టీవీ సీరియళ్ళు కూడా తీశారు. నిజ చరిత్రను రికార్డు చేసే ఇలాంటి సినిమాలను ఓపికా, ఆసక్తి ఉన్న వాళ్ళు చూడవచ్చు. చివరిగా ‘ఇలాంటి సినిమాకు నేషనల్ అవార్డు ఇచ్చిన అలాంటి ప్రజాస్వామిక కాలం మనకిక ఉందా?’ అనే ప్రశ్న తప్పక వస్తుంది విజ్నుడైన ప్రేక్షకుడికి.

No comments:

Post a Comment