Friday, 29 January 2016

పాకిస్థాన్‌లో హిందూ వివాహ చట్టాలు లేవు.. అందుకే మత మార్పిడి

పాకిస్థాన్‌లో హిందూ వివాహ చట్టాలు లేవు.. అందుకే మత మార్పిడి
29-01-2016 16:36:39

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నివసిస్తున్న లక్షలాది మంది హిందువుల కోసం ప్రత్యేకంగా హిందూ వివాహ చట్టం లాంటిదేమీ లేదని, దీనివల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాకిస్థాన్‌లోని ప్రముఖ దినపత్రిక డాన్ తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. హిందూ మ్యారేజ్ బిల్‌పై రాసిన సంపాదకీయంలో డాన్ పలు విషయాలు పేర్కొంది. పాకిస్థాన్‌లోని మైనర్టీలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని రాజకీయ నాయకులు బోలెడన్ని హామీలు ఇస్తున్నారని, కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఒక్కటి కూడా అమలు జరగడం లేదని, ఇందుకు ఉదాహరణ హిందూ వివాహ చట్టమేనని పేర్కొంది. ‘‘ఇక ప్రస్తుతానికి వస్తే పాకిస్థాన్‌లో నివసిస్తున్న లక్షలాదిమంది హిందువుల కోసం ప్రత్యేక వివాహ చట్టం లేదు. దీనివల్ల పలు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది’’ అని రాసింది.
 
చట్టం లేని కారణంగా పురుషులతో తమ సంబంధ బాంధ్యవ్యాలను నిరూపించుకోవాల్సి రావడం మహిళలకు కష్టంగా మారిందని, ముఖ్యంగా భర్తలను కోల్పోయిన మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని డాన్ పేర్కొంది. ప్రభుత్వంతో ఏవైనా పనులు ఏర్పడినప్పుడు, బ్యాంకులో ఖాతాలు తెరిచే సమయంలో, వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు తమ బంధాలకు(రిలేషన్) సంబంధించి అధికారిక ధృవపత్రాలు అక్కడి హిందువులు సమర్పించడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇన్ని సమస్యలను హిందువులు ఎలా భరిస్తున్నారంటూ డాన్ పత్రిక ఆశ్చర్యం వెలిబుచ్చింది.
 
ధ్రువపత్రాలు లేకపోవడానికి బలవంతపు మార్పిడులు కూడా ఒక కారణమని కొందరు మేధావులు అభిప్రాయపడినట్టు పేర్కొంది. బుధవారం ఇస్లామాబాద్‌లో నేషనల్ అసెంబ్లీస్ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో హిందూ వివాహ చట్టం, వారి సమస్యలపై ప్రస్తావించారు. హిందూ వివాహ చట్టాన్ని ఈ కమిటీ ఆమోదించాల్సి ఉంది. అయితే ఇందుకోసం వారిని ఒప్పించడం చైర్మన్‌కు కష్టతరంగా మారింది. ‘‘హిందూ వివాహచట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా చట్టసభ దానిని అమలు చేయలేకపోయింది’’ అని డాన్ పేర్కొంది.
 
హిందూ వివాహ చట్టంపై బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా తీర్మానాలు చేసినా సింధ్, పంజాబ్ ఇంతవరకు దీనిపై పట్టించుకోలేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం, రాజకీయ సంకల్పం లేకపోవడం సమర్థించరానిదని పత్రిక తప్పుబట్టింది. సింధ్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రముఖ రాజకీయ పార్టీలు మైనార్టీ హక్కులపై గట్టిగా పోరాడితే ప్రభుత్వంతో తీర్మానాలు పెట్టించడం అంత కష్టమేమీ కాదని పేర్కొంది. పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల్లో ఎక్కువ శాతం మంది సింధులోనే నివసిస్తున్నారు. తప్పిదాలను సరిదిద్దుకుని త్వరగా చట్టాన్ని తీసుకొస్తే దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు తెరపడుతుందని డాన్ పేర్కొంది.

No comments:

Post a Comment