ఐఎస్ సైతాన్: అసద్
08-01-2016 01:46:49
- మళ్లీ చెబుతున్నా.. అదో దుష్టశక్తి
- దాని బెదిరింపులకు భయపడేది లేదు
- హిందూ, ముస్లింలం కలిసి ఎదుర్కొంటాం
- మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఉద్ఘాటన
- ఐఎస్ ఇస్లాంకు వ్యతిరేకం: హురియత నేత గిలానీ
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఒక సైతానీ శక్తి. దాని బెదిరింపులకు భయపడేది లేదు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశాను. భారతదేశానికి ఐఎస్‌తో ప్రమాదం ఏర్పడితే ఇక్కడి హిందువులు, ముస్లింలు, ఇతర మతాల తో కలిసి ఎదుర్కొంటాం’’ అని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షు డు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఐఎస్ చర్యలపై అసదుద్దీన్ ఇటీవల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఐఎస్‌ను ఒక దుష్టశక్తిగా అభివర్ణించిన ఆయన.. ఐఎస్ ముష్కరులను హంతకులు, రేపిస్టులు అని తిట్టారు. ఐఎస్‌కు అసలు ఇస్లాంతో సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై @abotalout అనే పేరుతో ఐఎస్ సానుభూతిపరులెవరో ట్విటర్‌లో ఆయనను బెదిరిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇస్లామిక్ స్టేట్ గురించి నిజం తెలియకపోతే నోరు మూసుకోవడం మంచిది. ఇస్లామిక్ స్టేట్ త్వరలోనే భారతపై దాడి చేయబోతోంది’ అని ఆ ట్వీట్‌లో ఉంది.
ఈ ట్వీట్‌పై అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఆ ట్వీట్ చేసిన వ్యక్తిని మతభ్రష్టుడిగా సంబోధిస్తూ.. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని, తన వాదనను ఎదుర్కొనే సత్తా అతడికి లేదన్నారు. గురువారం ఈ ట్వీట్‌పై ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
భారత ముస్లింలు దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు. మనుషులను చంపడం ఇస్లామిక్ ధర్మం కాదని, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకమని.. తోటివారికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకోవడమే ఇస్లాం ధర్మమని అన్నారు. ‘మళ్లీ చెబుతున్నా ఐసిస్ ఒక దుష్టశక్తి’ అని పునరుద్ఘాటించారు. ట్విటర్ బెదిరింపులను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పని కూడా లేదని అన్నారు. అమాయకులైన పిల్లలను, మహిళలను బలిగొంటున్న ఐఎస్ చర్యలను వ్యతిరేకిస్తున్నానని.. భారతదేశంలో ఉన్న 17 కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ఐఎస్, తెహ్రిక్ సంస్థలు ఇస్లాంకు వ్యతిరేకం: గిలానీ
శ్రీనగర్, జనవరి7: ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్, తెహ్రిక్-ఈ-తాలిబన్ లు ఇస్లాంకి చెందినవి కాదని కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ విమర్శించారు. అవి ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ జెండాలు తరచూ కనిపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘దాయేశ్(ఐఎస్ఐఎస్ మరోపేరు) ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ సంస్థ.. పాకిస్థాన్‌ను అంతర్గతంగా బలహీనపరుస్తోంది’’ అని ఆరోపించారు.
No comments:
Post a Comment