జర్మనీలో ‘రేప్’ప్యూజీ సంక్షోభం
30-01-2016 01:14:16
- ఏకులా వచ్చి మేకుల్లా మారిన శరణార్థులు..
- స్థానిక మహిళలపై సామూహిక లైంగిక దాడి..
- తహర్రష్ బెంబేలెత్తిపోతున్న జర్మన్ మహిళలు..
- చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌పై ఆగ్రహం..
- పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్
ఈజిప్టులో మొదలై..
ఈజిప్టులో 2005 నుంచి బాగా పాపులర్ అయిన సామూహిక లైంగిక వేధింపుల దాడి ఆట. 2012లో ఈజిప్టు రాజధాని కైరోలోని సుప్రసిద్ధ తాహ్రిర్ స్క్వేర్‌లో రాజకీయ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అమెరికన్, డచ్ మహిళా జర్నలిస్టులపై కొందరు దుర్మార్గులు సాగించిన ఈ సామూహిక దాడి గురించి ఆ పాత్రికేయుల ద్వారా ప్రపంచానికి తెలిసింది!! మళ్లీ ఇప్పుడు జర్మనీలో అమ్మాయిలను వణికిస్తోంది. అరబ్, ఆఫ్రికా దేశాల నుంచి వలస వస్తున్న ముస్లిం శరణార్థులకు రెండు చేతులా ఆహ్వానం పలుకుతున్న జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పదవికే ఎసరు పెడుతోంది. ఈ ఏడాది తొలిరోజునే జర్మనీలో ‘తహర్ర్‌ష’కు బీజం పడింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జర్మనీలోని కొలోన్ నగరంలో సంబరాల్లో మునిగిన అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని దాదాపు 500 మంది కుర్రాళ్లు సామూహిక వేధింపుల పర్వానికి తెర తీశారు. దీనికి సంబంధించి 516 కేసులు నమోదయ్యాయి. అలాగే.. హ్యాంబర్గ్, ఫ్రాంక్‌ఫర్ట్, డార్ట్‌మండ్, డస్సెల్‌డోర్ఫ్, స్టట్‌గార్ట్ తదితర నగరాల్లో పలువురు మహిళలు ఇదే తరహా లైంగిక దాడికి గురయ్యారు. ఈ దారుణాలకు పాల్పడింది అరబ్, ఆఫ్రికా దేశాల కుర్రాళ్లేనని ప్రాథమిక విచారణలో తేలింది.
కొలోన్ దాడుల కేసులో 30 మంది కుర్రాళ్లను అరెస్టు చేయగా.. వారిలో 15 మంది జర్మనీకి ఇటీవలే వలస వచ్చిన శరణార్థులుగా తేలింది. అయితే.. ఈ వార్తలను ప్రచురించడం వల్ల శరణార్థులపై వ్యతిరేకత పెరిగిపోతుంది, జాతుల మధ్య ఘర్షణగా మారుతుందన్న ఉద్దేశంతో జర్మన్ మీడియా తొలుత ఈ ఘటనల గురించి ప్రముఖంగా ప్రచురించలేదు. కానీ, సోషల్ మీడియాలో యువత జరిగిన దారుణాల గురించి పోస్టులు పెట్టడంతో ప్రపంచానికి తెలిసింది. దీంతో, మీడియా కూడా ఈ దాడుల గురించి ప్రచురించక తప్పలేదు. ఇలా బిబి విల్‌హైల్మ్ అనే జర్మన్ టీనేజర్ యూట్యూబ్‌లో పెట్టిన 20 నిమిషాల వీడియో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ‘‘జర్మనీ వీధుల్లో మాలాంటి అమ్మాయిల జీవితాలకు రక్షణ లేకుండా పోయింది. మునుపటి జర్మన్ జీవితాన్ని అనుభవించే వీల్లేకపోయింది. మాకు మా పాత జీవితం కావాలి’’ అంటూ ఆమె పెట్టిన వీడియో రాత్రికిరాత్రి వైరల్‌గా షేర్ అయింది. ‘అరబ్ రేప్ గేమ్ తహర్రష్ యూర్‌పలోకి ప్రవేశించింద’టూ జర్మన్ పత్రిక డైవెల్ట్ ప్రముఖంగా ప్రచురించింది. పెరుగుతున్న తహర్రష్ ఘటనల నేపథ్యంలో స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ ప్రభుత్వాలు అత్యవసరంగా యూరోపియన్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చాయి. కాందిశీకులను పెద్దమనసుతో ఆదుకోవాలంటూ ఏంజెలా మెర్కెల్ 2015లో 11 లక్షల మంది శరణార్థులను అరబ్, ఆఫ్రికా దేశాల నుంచి జర్మనీలోకి అడుగుపెట్టేందుకు అంగీకరించడమే ఇందుకు కారణమని జర్మన్లు మండిపడుతున్నారు.
మెర్కెల్‌పై ఒత్తిడి..
శరణార్థుల నుంచి జర్మన్ మహిళలకు రోజురోజుకూ రక్షణ లేకపోతుండడంతో జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌పై ఆ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఫోకస్ అనే న్యూస్ మేగజైన్ నిర్వహించిన ఒపీనియన్‌పోల్‌లో 40 శాతం మంది.. 2005 నుంచి అధికారంలో ఉన్న మెర్కెల్ ఇక పదవి నుంచి వైదొలగాలని అభిప్రాయపడ్డారు. అయితే.. అదే సమయంలో 45 శాతం మంది ఆమెకు మద్దతునిచ్చారు. ఈ పోల్‌లో మెర్కెలాకు మద్దతునిచ్చినవారి సంఖ్యే ఎక్కువగా కనపడొచ్చుగానీ.. ఒకప్పుడు ఆ 40శాతం మంది కూడా మెర్కెలా మద్దతుదారులే కావడం పరిస్థితిలో మార్పునకు అద్దం పడుతోంది. అంతేకాదు.. మెర్కెల్‌ను వ్యతిరేకించినవారిలో 27శాతం సొంతపార్టీ వారే కావడం గమనార్హం. వచ్చే మార్చిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతుండడంతో మెర్కెలా.. జర్మనీలోకి శరణార్థుల రాకకు సంబంధించిన విధానాలను మరింత కట్టుదిట్టం చేసేందుకు అంగీకరించారు. గురువారం ఇందుకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ కొత్త ఒప్పందం వల్ల సిరియా తదితర దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు జర్మనీలోకి అంత సులభంగా ప్రవేశం దొరకదు. ఇప్పటికే జర్మనీలో కాందిశీకులుగా ఉంటున్నవారు తమ బంధువులను ఆయా దేశాల నుంచి ఇదివరకటిలాగా తేలిగ్గా తెచ్చుకోలేరు. అలాగే.. ఇన్నాళ్లుగా శరణార్థులను వారివారి దేశాలకు డీపోర్ట్ చేస్తే అక్కడ వారిని చంపేస్తారేమోననే భయంతో తిరిగి పంపించట్లేదు. కానీ, తాజా ఒప్పందం ప్రకారం మొరాకో, అల్జీరియా, ట్యునీసియా దేశాలను రక్షణ గల దేశాలుగా ప్రకటించడంతో ఆయా దేశాల శరణార్థులను సులభంగా పంపేయవచ్చు.