Saturday 7 May 2022

ఉన్మాదం, దుర్మార్గం (ఆంధ్రజ్యోతి సంపాదకీయం 7.5.2022)

ఉన్మాదం, దుర్మార్గం (ఆంధ్రజ్యోతి సంపాదకీయం 7.5.2022)
బుధవారం రాత్రి హైదరాబాదు సరూర్‌నగర్‌లో జరిగిన దారుణహత్య దేశవ్యాప్త సంచలనానికి, చర్చకు దారితీసింది. నడిరోడ్డు మీద ఒక యువకుడు, అతని భార్య సమక్షంలోనే హత్యకు గురయ్యాడు. హతుడు దళిత హిందూ యువకుడు నాగరాజు. అతని భార్య ముస్లిమ్ యువతి అస్రిన్ సుల్తానా. దారుణానికి పాల్పడింది అస్రిన్ సోదరుడు, బంధువులు. దాడి నుంచి రక్షించమని అస్రిన్ ఆర్తనాదాలు చేస్తున్నా, చోద్యం చూస్తున్న జనం కల్పించుకోలేదు. రక్తం మడుగులో ఉన్న తన భర్త మీద మరోసారి దాడికి దిగుతున్న సోదరుడిని గొంతు పట్టుకుని నిలువరించడానికి అస్రిన్ ప్రయత్నం చేసినప్పుడు, గుమిగూడిన ప్రజలలో చలనం కలిగింది. దుండగులను ప్రతిఘటించారు కానీ, అప్పటికే నాగరాజు ప్రాణం పోయింది.
నాగరాజు, అస్రిన్ ప్రేమ వివాహం చేసుకోవడమే ఈ హత్యకు కారణం అని చెబితే అది పాక్షిక సత్యమే అవుతుంది. నాగరాజు హిందూమతంలో అట్టడుగు కులానికి చెందినవాడని, అస్రిన్ ముస్లిములలో కులీనులలో ఒకరిగా పరిగణించే సయ్యద్ శ్రేణికి వంశీకురాలని చెబితే కూడా వాస్తవం పూర్తిగా చెప్పినట్టు కాదు. భారతీయ సామాజిక నిర్మాణంలోని ఒక అమానవీయ సంక్లిష్టత ఈ హత్యను అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తున్నది. స్థూలంగా చెప్పాలంటే, అంతరాలను వ్యతిరేకించే ఒక పురోగామి వివాహంపై, ఛాందసవాద, దుర్మార్గ దాడి. అంతే కాదు, ఇదొక ఉన్మాదచర్య. ఏ ఉన్మాదం? మతోన్మాదమా? కులోన్మాదమా? భారతీయ సమాజంలో కులం అన్నది మతాతీత వాస్తవమని, మతం మారినా విడిచిపోని అస్తిత్వమని ఈ సంఘటన మరొకమారు స్పష్టం చేసిందనిపిస్తుంది.
కులాంతర వివాహాలను, ముఖ్యంగా ఆడపిల్లలు చేసుకునే విలోమవివాహాలను పెద్దకులాల పెద్దలు సహించకపోవడం ఈ మధ్య తరచు వింటున్నాము. ఆ హత్యలకు ‘పరువు హత్యలు’ అని పేరు పెట్టి మరీ గౌరవించుకుంటున్నాము. సమాజంలోని వివిధ శ్రేణుల యువతీయువకుల మధ్య కలివిడికి, సహవిద్యకు, సహోద్యోగితకు అవకాశం పెరుగుతున్న కొద్దీ, సామాజిక సరిహద్దులను అధిగమించి మానవ సంబంధాలు విస్తరించడం సహజం. వేర్వేరు సామాజిక శ్రేణులకు చెందిన యువతీయువకులు పరస్పరం ఇష్టపడి, వివాహానికి సిద్ధపడినప్పుడు, కులం తన కత్తి ఝళిపిస్తున్నది. మరొకవైపు మతోన్మాదం కూడా వేరువేరు మతాలకు చెందిన స్త్రీపురుషుల మధ్య స్నేహాన్ని, ప్రేమభావాన్ని నిషేధిస్తున్నది. మతపరమయిన ఉద్దేశ్యాలతోనే హిందూ యువతులను ముస్లిమ్ యువకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అంటూ, ఆ పేరుతో ప్రభుత్వాలు చట్టాలు కూడా చేస్తున్నాయి. వేరువేరు మతాలకు చెందిన స్త్రీపురుషులు కలిసి వీధుల్లో కనిపిస్తే దాడులు చేసే మూకలు కూడా దేశంలో పెరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా, మతాంతర వివాహాల గురించి ఎంతో ఆందోళన చెందే సంఘాలు, బృందాలు కులోన్మాద హింస గురించి పెద్దగా పట్టించుకోవు.
హిందూమతంలో ఉన్నతీరులో ముస్లిములలో కులాలు లేకపోవచ్చును కానీ, ఇక్కడి సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థ ప్రభావం వారి మీద కూడ ఉంటుంది. కుల పరిగణనల దృష్టితో చూసినప్పుడు, ముస్లిములను హిందూ అగ్రవర్ణాలు తగినంత గౌరవంతోనే చూస్తారు. అది ముస్లిములలో అనివార్యంగా, హిందూ నిమ్నవర్ణాల మీద తక్కువ భావానికి ఆస్కారం ఇస్తుంది. ఇదొక సార్వజనీన, సార్వత్రక సూత్రంగా చెప్పలేము కానీ, సాంప్రదాయ సమాజంలో ముస్లిములను, దళిత కులాలను ప్రాబల్యకులాల వారు సమానంగా చూడరు. ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా అనేక సందర్భాలలో స్పృశించారు. నాగరాజు తాను మతం మారతానని చెప్పినప్పటికీ, అస్రిన్ కుటుంబం వివాహానికి సమ్మతించకపోవడాన్ని చూస్తే, క్రైస్తవం లాగానే, ఇస్లామ్ కూడా మతాంతరీకరణ ద్వారా కులన్యూనతను తగ్గించలేదని అనిపిస్తుంది.
దళిత, బహుజన, మైనారిటీ ఐక్యత అంటూ రాజకీయ నినాదాలు వింటుంటాము. కానీ, ఈ అస్తిత్వాల మధ్య కూడా అంతరాలున్నాయని గుర్తించాలి. ఆ వైరుధ్యాలను ఆసరా చేసుకుని మతోన్మాద ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి, పరస్పర హింసకు దారితీస్తున్న వైరుధ్యాలను, హీన ఉన్నత పరిగణనలను పరిష్కరించుకోకపోతే, ఐక్యతా నినాదాలకు అర్థం ఉండదు. అట్లాగే, నాగరాజు దారుణ హత్యను ప్రస్తావిస్తూ, దళితులకు, ముస్లిములకు మధ్య వైరుధ్యాన్ని పెద్దదిగా చూపేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నాగరాజు హత్యను కేవలం మతహత్యగా చూసేవారు, అన్ని రకాల మతాంతర వివాహాలను తాము బేషరతుగా సమర్థిస్తామని ముందుగా ప్రకటించాలి.
ఈ హత్యా సంఘటనను అన్ని మహిళాసంఘాలు, కులనిర్మూలన సంస్థలూ ఖండించినప్పటికీ, హంతకులు ముస్లిములు అయినందువల్ల లౌకికవాదులు పెదవి విప్పడం లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రతి పరిణామాన్ని విభజనదృష్టితో వ్యాఖ్యానించి, మరింత అగాధాలను సృష్టించేవారి వ్యాఖ్యలను పట్టించుకోనక్కరలేదు కానీ, నాగరాజు హత్యను అన్ని సామాజిక, రాజకీయశక్తులు కేవలం ఖండించడం మాత్రమే కాక, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నడిరోడ్డు మీద మత–కులోన్మాదానికి మాత్రమే ధైర్యం ఉండి, తక్కిన సమాజమంతా నిస్సహాయంగా మిగిలిపోయిన సన్నివేశం అందరూ తలదించుకోవలసింది. ఈ సమాజం మీద ఉమ్మేయాలని ఉంది అన్న అస్రిన్ వ్యాఖ్యలో ఆవేశం మాత్రమే కాదు, వర్తమాన దుస్థితి తీవ్రత కూడా వ్యక్తం అవుతున్నది. దుర్మార్గాన్ని నిలువరించే ధైర్యం ఈ సమాజానికి అలవడాలి. ఆనాడు అమృత కానీ, ఇప్పుడు అస్రిన్ కానీ తమ సామాజిక అస్తిత్వాలను అధిగమించి, బాధితులయిన స్త్రీలు. తమపై దౌర్జన్యం చేసినందుకు తమ వారిని వదులుకున్న ధీరలు. కుల నిర్మూలనకు, మతాతీత సామాజిక జీవనానికి వారిని స్ఫూర్తి చిహ్నాలుగా పరిగణించాలి.

No comments:

Post a Comment