Thursday 26 May 2022

ఇప్పుడు మౌనంగా ఉంటే ఎప్పటికీ నోరు విప్పలేం!!

 ఇప్పుడు మౌనంగా ఉంటే ఎప్పటికీ నోరు విప్పలేం!!

 గొంతెత్తి నిలదీయండి!

వ్యాసకర్త ఫ్రంట్‌లైన్‌ ఎడిటర్‌ 

May 26,2022 06:33

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ముస్లింలను బుజ్జగించడమే విధానంగా కొనసాగిందన్న విమర్శను ఇంతకాలమూ సంఘపరివార్‌ చేస్తూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇక ఆ విమర్శ లేదు. ఇప్పుడు మెజారిటీ మతస్థుల పెత్తనమే చెల్లుబాటు కావాలన్న విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేసేవారిని బుజ్జగించడం మొదలైంది. ముస్లింలను వెంటాడి వేధించడానికి అనుమతించడం, వారి ప్రార్ధనా స్థలాలపై దాడులు చేయడాన్ని సమర్ధించడం, వారి ఇళ్ళను బుల్డోజర్లతో నేలమట్టం కావించడం, వారి జీవనోపాధిని దెబ్బ తీయడం, వారి సాంస్కృతిక చిహ్నాలను నాశనం కావించడం, వారి ఆహారపుటలవాట్లపై, వేషభాషలపై దాడి చేయడం ప్రస్తుత విధానంగా కొనసాగుతోంది. ఈ విధమైన విపరీత ధోరణే సంఘపరివారం దృష్టిలో లౌకికతత్వం అంటే.

సాంస్కృతిక జాతీయవాదం పేరిట వందేళ్ళ క్రితం మొదలైన ఒక పథకం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. 'భిన్నత్వం లో ఏకత్వం' ప్రాతిపదికన భారత భూభాగంలో అందరినీ కలుపుకుపోయే జాతీయవాదాన్ని ఆనాడు స్వాతంత్య్రోద్యమ నేతలు ఆవిష్కరించారు. దానికి భిన్నమైన భావనతో సంఘపరివారం ముందుకు సాగుతోంది. ద్విజాతి సిద్ధాంతానికి (హిందువులు ఒక జాతి, ముస్లిం లు ఒక జాతి అన్నది ద్విజాతి సిద్ధాంతం) మొదట సైద్ధాంతిక పునాది వేసినవాడు వినాయక దామోదర్‌ సావర్కార్‌. మహమ్మద్‌ ఆలీ జిన్నా ఇదే వాదనను ప్రతిపాదించడానికి రెండు సంవత్సరాలు ముందే సావర్కార్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. 1923లో దేశం అంటే అర్ధం ఏమిటో, ఎవరు ఈ దేశానికి చెందుతారో తన అభిప్రాయంగా ఈ విధంగా వివరించాడు:

'' ప్రతీ హిందువుకూ ఈ భరతభూమి పితృభూమిగా, అదే సమయంలో పుణ్యభూమిగా ఉంది. అందుచేతనే ....ఈ దేశంలోని మహమ్మదీయులు, క్రైస్తవులు -- వీరు బలవంతంగా హిందూ మతం నుండి వేరే మతాలకు మార్చబడ్డవారే-- హిందువులుగా గుర్తింపు పొందలేరు. వారికి ఆ గుర్తింపు ఇవ్వడం కుదరదు. హిందువుల మాదిరిగానే హిందూస్థాన్‌ వారికి కూడా పితృభూమి అయినప్పటికీ, ఇది వారి పుణ్యభూమిగా లేదు. వారి పుణ్యభూమి ఎక్కడో సుదూరంగా అరేబియా లోనో, పాలస్తీనాలోనో ఉంది.''

ఆ తర్వాత అంతకన్నా మొరటు నిర్వచనంతో వచ్చాడు ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌. ''తన తల్లి కడుపులో ఉండగానే హిందువుకి మొదటి సంస్కారం అబ్బుతుంది. అందుకే మనమంతా హిందువులుగానే పుడతాం. ఇక తక్కినవారి వరకూ చూస్తే, వారంతా ఊరూ, పేరూ లేని మానవులుగానే జన్మిస్తారు. ఆ తర్వాత సున్తీ చేయించుకునో, బాప్టిజం తీసుకునో ముస్లింలుగా గాని క్రైస్తవులుగా గాని అవుతారు. ఆ విధంగా చూసినప్పుడు ఎటువంటి రాజీకీ ఆస్కారమే లేదు.''

ఆ తర్వాత వచ్చాడు మోహన్‌ భగవత్‌. ''జర్మనీ ఎవరికి చెందుతుంది? జర్మన్లకే చెందుతుంది. బ్రిటన్‌ బ్రిటిష్‌ వారికే చెందుతుంది. అమెరికా అమెరికన్లకే చెందుతుంది. అదే విధంగా హిందూస్థాన్‌ హిందువులకే చెందుతుంది. భారతమాత సంతానం అందరూ హిందువులే. భారతీయ పూర్వీకుల వారసులే. హిందువులంటే భారతీయ సంస్కృతికి అనుగుణంగా (నిజానికి హిందూ సంస్కృతి అన్న అర్థంలో వాడాడు) జీవించేవారు మాత్రమే.''

ఈ విధంగా 2014 వరకూ భారతదేశం అంటే తమ దృష్టిలో ఏమిటో వివరిస్తూ వచ్చారు ఆరెస్సెస్‌ సైద్ధాంతికులు. నిజానికి భారతదేశాన్ని తాము ఏవిధంగా ఊహించుకున్నారో, ఆ రూపంలోకి దేశాన్ని మార్చివేయడమే వారి లక్ష్యం.

ఆ తర్వాత వచ్చాడు నరేంద్రమోడీ. అతనికి సర్వవేళలా విశ్వసనీయులుగా ఉండే భారతీయ బడా పెట్టుబడిదారులంతా 'అభివృద్థికి ముద్దుబిడ్డ' అని అతడిని పిలుచుకుంటూ వుంటారు. సంఘపరివారపు వందేళ్ళ కాలంనాటి కలను ఆచరణలో ముందుకు తీసుకుపోడానికి తన కన్నా మొనగాడు వేరే ఎవరూ లేరన్న భావనను ప్రచారం చేసుకున్నాడు మోడీ.

'' వేరే ఎవరో కారు నడుపు తున్నారనుకోండి. మనం వెనక సీట్లో కూర్చున్నాం అనుకోండి. కారు చక్రాల కింద ఒక చిన్న కుక్కపిల్ల పడి చచ్చిపోయినా మనకి అది బాధాకరంగా ఉంటుందా ? ఉండదా ? తప్పకుండా బాధగానే అనిపిస్తుంది. నేను ముఖ్యమంత్రినైనా, కాకపోయినా, నేనూ ఒక మనిషినే. ఎక్కడైనా చెడు జరిగితే దానికి బాధ పడడం సహజం.'' - ఈ మాటలు అన్నది ఎవరో పెద్దగా సంబంధం లేని వ్యక్తి కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అన్న మాటలివి. కేంద్రంలో అధికారానికి రావాలనుకుంటున్న వ్యక్తి అన్న మాటలివి. తాను అధికారంలో ఉన్న గుజరాత్‌లో ముస్లింల మీద జరిగిన మారణహోమం గురించి అడిగినప్పుడు మోడీ స్పందించిన తీరు ఇది.

తాను వ్యక్తం చేసిన బాధను ఆ వెంటనే మరపించే విధంగా దాడుల్లో బాధితులై, సహాయ శిబిరాల్లో తల దాచుకుంటున్న ముస్లింల గురించి వేళాకోళంగా ''మేం అయిదుగురైతే, మా పిల్లలు ఏభైమంది'' అన్న అపఖ్యాతిగాంచిన వ్యాఖ్యను చేశాడు మోడీ. సహాయ శిబిరాలు సంతానాన్ని ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నట్టు అపహాస్యంగా మాట్లాడాడు.

ఆ తర్వాత వచ్చిన మార్పు ఏమిటి? ముఖ్యమంత్రి కాస్తా ప్రధానమంత్రి అయ్యాడు. కార్లకి బదులు బుల్డోజర్లు వచ్చాయి. తమ ఆగ్రహాన్ని అణచిపెట్టుకున్న ''కుక్క పిల్లలు'' నిరంతరం భయంతో బతుకుతున్నాయి. అప్రధానమైనది కాస్తా కేంద్ర స్థానంలోకి వచ్చింది. కేంద్ర స్థానంలో ఉండవలసినది కాస్తా పక్కకి పోయింది. న్యాయం కాస్తా దుర్మార్గం అయిపోయింది. దుర్మార్గమే న్యాయం అయింది.

బుల్డోజర్లు తిరుగుతూ వుంటే గౌరవనీయ ప్రధాని మాత్రం మౌనంగా ఉండడానికే నిర్ణయించుకున్నారు. కాషాయ మూకల దాడులు కొనసాగుతూంటే మీడియా లోని కొన్ని సంస్థలు మాత్రం ఆటలో సిక్సర్లకు, బౌండరీలకు చప్పట్లు, కేరింతలు కొట్టడానికి డబ్బు పుచ్చుకునే చీర్‌గర్ల్స్‌ మాదిరిగా అదే విధంగా హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నాయి.

కాని భారతదేశం అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోగలిగినవాళ్ళకు మాత్రం ''మౌనం'' ఏ మాత్రమూ పనికిరాదు. ఇప్పుడు గనుక వారు నిలబడి నోరిప్పి మాట్లాడకపోతే, భవిష్యత్తులో వారెప్పటికీ మాట్లాడలేరు. నిరసన ఇప్పుడు నిజమైన దేశభక్తియుత చర్య అయింది (హోవార్డ్‌ జిన్‌ అన్న మాటలు ఇవి).

బుల్డోజర్‌ బాబాల రాజ్యంలో దేశభక్తియుతంగా వ్యవహరించగలగడం అంత తేలికేమీ కాదు. ''శతాబ్దాలుగా పలు రాజ్య వ్యవస్థలు ఈ విధమైన కుయుక్తులు పన్నుతూనే వున్నాయి. ఏ విధమైన నిరసనలనైనా వ్యతిరేకించడమే సరైన ఆలోచనా విధానంగా భావించేలా ప్రజల్ని ప్రభావితం చేసి వత్తిడి చేస్తాయి ఆ శక్తులు'' అని పీటర్‌ సీగర్‌ అన్నాడు.

అయితే పదార్ధ ధర్మాలు అంత తేలికగా పాలకుల వత్తిళ్లను సాగనివ్వవు. 

నీటిని గుప్పెట్లో పట్టుకోగలమా? నిరసనలూ అంతే.


  (అయిపోయింది)

No comments:

Post a Comment