Thursday 12 September 2019

విచ్ఛిన్న శక్తులున్నాయ్‌.. జాగ్రత్త! - ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌

విచ్ఛిన్న శక్తులున్నాయ్‌.. జాగ్రత్త!
13-09-2019 02:35:53

హిందువులంతా శక్తిమంతులం కావాలి!
ఎవరినో భయపెట్టడానికి కాదు..
దాడి చేస్తే ఎదుర్కోవడానికే!
వినాయకుడి స్ఫూర్తితో ఆలోచించాలి
గణేశ్‌ నిమజ్జనోత్సవంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ వ్యాఖ్యలు
గణేశ్‌ నిమజ్జనోత్సవంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు
హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘హిందువులంతా శక్తిమంతులం అవుతున్నామంటే ఎవరినో బెదిరించడానికి, భయపెట్టడానికి కాదు. మనపై ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికే’ అని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. వినాయకుడు బుద్ధితో ఆలోచించిన శక్తిమంతుడని, అదే స్ఫూర్తితో మనం ఆలోచించాలని పిలుపునిచ్చారు. భాగ్యనగర్‌ గణేశ్‌ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గణేశ్‌ చౌక్‌ (మొజంజాహీ మార్కెట్‌ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గణేశ్‌ చౌక్‌లో భాగవత్‌ మాట్లాడుతూ.. వినాయక పూజను కేవలం ఉత్సవంలా మార్చకూడదన్నారు. దీనిద్వారా హిందువులంతా సంస్కారం, సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పారు. కేవలం మంచితనం ఉంటే సరిపోదని, దాంతోపాటు శక్తి కూడా ఉండాలని అన్నారు.

ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాదని, ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కోవడానికి అవసరమని స్పష్టం చేశారు. హిందువులందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. వినాయకుడు బుద్ధ్దికి బృహస్పతి అని చెప్పారు. బుద్ధి లేని శక్తి వ్యర్థమన్నారు. ఆయన తన బుద్ధి కుశలతతో ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహిస్తారని తెలిపారు. మంచి చేసే వారికి ఆశ్వీరాదం ఇస్తాడని, చెడు చేసే వారిపై తన అంకుశాన్ని ప్రయోగిస్తారని చెప్పారు. గణేశుడు తన బుద్ధి బలంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విశ్వాధిపత్యాన్ని పొందాడన్నారు. మనమంతా తల్లిదండ్రులను గౌరవించుకోవాలని.. తల్లిపై, భారత మాతపై భక్తి భావం ఉన్న వారికే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు సమాజంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో భారీ స్థాయిలో గణేశ్‌ ఉత్సవాలు చూడాలంటే భాగ్యనగరంలోనే సాధ్యమవుతుందన్నారు.

ప్రజ్ఞానంద్‌ మహరాజ్‌జీ మాట్లాడుతూ.. మన దేశం, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. వినాయకుడు లేనిదే కంప్యూటర్‌ లేదని, ఆయన వాహనమైన ‘మౌస్‌’ లేకుండా కంప్యూటర్‌ పనిచేయదు కదా.. అని వ్యాఖ్యానించారు. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ 1500 మండపాలతో వినాయకుని శోభాయాత్రకు శ్రీకారం చుట్టామని గుర్తు చేసుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌.. అక్కడికి చేరుకుని మోహన్‌ భాగవత్‌కు అభివాదం చేశారు.

No comments:

Post a Comment