Friday, 20 May 2022

Nikhat Zareen

 Published: Fri, 20 May 2022 04:41:26 IST

పడి లేచిన కెరటం

twitter-iconwatsapp-iconfb-icon

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌):  బాక్సింగ్‌ రింగ్‌ కూడా లేని నిజామాబాద్‌ పట్ణణం నుంచి భారత స్టార్‌ బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ ఎదిగిన తీరు ప్రశంసనీయం. పదేళ్ల వయసులో వేసవి సెలవుల్లో తండ్రితో కలిసి సరదాగా ఫిట్‌నెస్‌ కోసం మైదానం బాట పట్టిన నిఖత్‌ తొలుత అథ్లెటిక్స్‌లో ప్రవేశించి ఆ తర్వాత బాక్సింగ్‌ను కెరీర్‌గా మలుచుకుంది. నిజామాబాద్‌లో సాఽధన చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో నిఖత్‌ కోసం కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు మకాం మార్చింది. కోచ్‌ చిరంజీవి వద్ద రింగ్‌లో రాటు దేలిన నిఖత్‌ 2011లో వరల్డ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవగానే తన జీవిత లక్ష్యమేంటో స్పష్టంగా చెప్పింది.

పడి లేచిన కెరటం

2014లో యూత్‌ చాంపియన్‌గా అవతరించాక నిఖత్‌ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. తర్వాతి ఏడాదే 52 కిలోల విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 2016లో  భుజానికైన గాయంతో దాదాపు ఆరు నెలలు రింగ్‌కు దూరమైంది. గాయం నుంచి కోలుకున్నాక కూడా నిఖత్‌ తిరిగి ఫామ్‌ను దొరకబుచ్చుకోవడానికి చాలా శ్రమించింది. బళ్లారిలోని జెఎస్‌డబ్ల్యూ శిక్షణ కేంద్రంలో విదేశీ కోచ్‌ జాన్‌ వద్ద ట్రైనింగ్‌ ఆరంభించాక నిఖత్‌ మునుపటి కంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైంది. బల్గేరియా వేదికగా 2019లో జరిగిన ప్రతిష్ఠాత్మక స్ట్రాండ్జా ఓపెన్‌లో నిఖత్‌ స్వర్ణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన పవర్‌ రుచి చూపించింది.


బీఎఫ్‌ఐతో కిరికిరి..

ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్య ఒలింపిక్స్‌ వెయిట్‌ కేటగిరీలను మార్చడంతో అప్పటివరకు 48 కిలోల విభాగంలో పోటీ పడిన దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌.. నిఖత్‌ ఆడే 52 కిలోల కేటగిరీకి మారింది. అప్పటి కేంద్ర క్రీడా మంత్రి, మేరీకోమ్‌ ఈశాన్య రాష్ట్రానికి చెందిన వారే కావడంతో జాతీయ బాక్సింగ్‌ సమాఖ్యలో మేరీకోమ్‌కు అడ్డు చెప్పే సాహసం కూడా ఎవరు చేయలేకపోయారు. అలాంటి తరుణంలో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ 52 కిలోల విభాగానికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీలకు నిర్వహించేందుకు బాక్సింగ్‌ సమాఖ్య సిద్ధమైంది. మేరీకోమ్‌ను నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించడంతో అప్పటివరకు గమ్మునున్న నిఖత్‌ తొలిసారిగా గొంతెత్తింది. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ బరిలోకి దిగి పతకం సాధించాలని పదేళ్లుగా కంటున్న కలలను పక్షపాతంతో నాశనం చేయడం అన్యాయమని జాతీయ స్థాయిలో తన వాణి వినిపించింది. మాజీ క్రికెటర్‌ గంభీర్‌ సహా పలువురు ప్రముఖులు నిఖత్‌కు మద్దతుగా నిలవడంతో చేసేదేమీ లేక బీఎఫ్‌ఐ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో నిఖత్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫలితం మేరీకోమ్‌కు అనుకూలంగా వచ్చిందని అప్పట్లో పెద్ద ఎత్తున విశ్లేషకుల నుంచి విమర్శలు చెలరేగాయి.

 

చాలెంజ్‌గా తీసుకొని..

యుద్ధం చేయకుండా మోకరిల్లడం కంటే యుద్ధం చేసి ఓడిపోవడం గౌరవంగా భావిస్తానని.. తక్కువలో తక్కువ తనకింకా మరో పదేళ్ల కెరీర్‌ ఉన్నందున కచ్చితంగా తదుపరి ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున బరిలోకి దిగుతానని నిఖత్‌ సరిగ్గా ఏడాది కిందట శపథం చేసింది. ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో ఊహించని పరాజయం ఎదురైన తర్వాతి నుంచి నిఖిత్‌లో కసి, పట్టుదల రెట్టింపు అయ్యాయి. తన గేమ్‌లోని లోపాలను వేలెత్తి చూపడానికి ఎవరూ సాహసం కూడా చేయలేని విధంగా రాటుదేలింది. తొలుత కిందటి ఏడాది జరిగిన జాతీయ చాంపియన్‌షి్‌పలో ఆడిన ఐదు బౌట్లలో ఒక్క రౌండ్‌ కూడా ఓడిపోకుండా హరియాణా, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మేటి బాక్సర్లను చిత్తు చిత్తుగా ఓడించి చాంపియన్‌గా నిలవడంతో పాటు స్ట్రాంజా ఓపెన్‌కు కూడా అర్హత సాధించింది.


బల్గేరియాలో జరిగిన ఈ పోటీల్లో సెమీఫైనల్‌లో నిఖత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం దక్కించుకున్న టర్కీ బాక్సర్‌ బసనాజ్‌ కకిరొగ్ల్‌ ఎదురైంది. తనని 4-1తో చిత్తుగా ఓడించి ఫైనల్‌ చేరిన నిఖత్‌ కెరీర్‌లో రెండోసారి స్ట్రాంజా మెడల్‌ను కైవసం చేసుకుని శభాష్‌ అనిపించింది. ఇక, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన అన్ని బౌట్లలో ఒక్క రౌండ్‌ కూడా ఓడిపోకుండా 5-0తో నిఖత్‌ నెగ్గడం సాధారణ విషయం కాదు. మొత్తంగా ఈ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌తో భారత బాక్సింగ్‌ చరిత్రలో నిఖత్‌ శకానికి నాంది పడింది.

పడి లేచిన కెరటం

మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత విజేతలు

మేరీ కోమ్‌: 2002, 2005, 

 2006, 2008, 2010, 2018

సరితా దేవి: 2006

ఆర్‌ఎల్‌ జెన్నీ: 2006

కేసీ లేఖ: 2006

నిఖత్‌ జరీన్‌: 2022

No comments:

Post a Comment