శివమొగ్గ ఉద్రిక్తతలు: కొనసాగుతున్న బజరంగ్ దళ్ నిరసనలు.. వాడివేడిగా రాజకీయ విమర్శలు
Feb 21, 2022, 15:31 IST
Protest Over Karnataka Shivamogga Amid Bajrang Dal Man Murder - Sakshi
Shivamogga Tensions: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతం కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని గత రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి, బెంగళూరు: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండురోజులపాటు విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది.
‘హిజాబ్’తో సంబంధం లేదు!
ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుండడం కలకలం రేపింది. దీనిని ఖండిస్తూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ హత్యకు కారణం వేరే ఉంది. పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు.
No comments:
Post a Comment