మోదీ వ్యతిరేక ‘ఫ్రంట్’ సఫలమయ్యేనా?
అస్థిరత, అసమతుల్యత, కల్లోలాల మధ్య స్థిరత్వం ఏర్పడుతుందని భౌతికశాస్త్రంలో నోబెల్ గ్రహీత ఇల్యా ప్రిగోజిన్ రచించిన ‘ఆర్డర్ అవుట్ ఆఫ్ కేయాస్’ పుస్తకానికి ముందు మాట రాసిన అల్విన్ టాఫ్లర్ అన్నారు. మనం సమస్యల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవడంలో సమర్థులం కాని వాటిని మళ్లీ కలిసికట్టుగా మార్చుకోవడం మరిచిపోతామని ఆయన చెప్పారు. భారతదేశం ఎప్పటికప్పుడూ ఈ అస్థిరతల మధ్య స్థిరత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఎప్పటికప్పుడు అసాధ్యంగా మారుతోంది. భారత రాజకీయాలకు స్థిరత్వాన్ని, ప్రశాంతతను తేవడంలో రాజకీయ నాయకులు విఫలం కావడం వల్లనే దేశం ఎప్పుడూ అస్థిరంగా మారుతోంది. ప్రతి దశాబ్దానికోసారి ఒక దశ ముగిసి మరో కొత్త దశను అన్వేషించాల్సిన పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
భారత రాజకీయ దృశ్యం ఇప్పుడు అస్థిరంగా ఉన్నదా? అత్యధిక మెజారిటీతో బిజెపిని ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్నప్పటికీ దేశంలో స్థిరత్వం సాధించడంలో, వివిధ రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, వివిధ పార్టీలను, వివిధ భావజాలాలు గల వారిని, వివిధ వర్గాలను మెప్పించడంలో, అందరికీ ప్రయోజనకరమైన విధానాలను అమలు చేయడంలో, ముఖ్యంగా దేశాన్ని ఒకే త్రాటిపైకి తేవడంలో సఫలమైందా? భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతామని, భారతీయతకు ప్రాధాన్యతనిస్తామని చెప్పే భారతీయ జనతా పార్టీ అందుకు కావల్సిన సామరస్య దృక్పథాన్ని అనుసరించే బదులు ఆధిపత్య ధోరణిని అనుసరిస్తోందా, అధికారమే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను నాశనం చేయడం లక్ష్యంగా భావిస్తోందా, విమర్శించిన వారిని శత్రువుల గాట కడుతోందా అన్న చర్చలు సాగుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఒకే మతం వారు ఉన్న భారతదేశంలో అధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే బిజెపియే ఒక సమతుల్యత సాధించకపోతే ఇంకెవరు సాధించగలరు? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ ప్రశ్నలతోనే బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఇవాళ సంఘటితమవుతున్నాయి. అవి సఫలం కాగలవా, లేదా అన్న చర్చ అటుంచితే, గతంలో కూడా ఇలాంటి పరిణామాలకు దృష్టాంతాలు ఉన్నాయి.
నిజానికి నరేంద్రమోదీకి ముందు కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీకి కూడా అంతే ఆకర్షణ, అంతే మెజారిటీ లభించింది. అయితే ఆమె ఒక నియంతగా వ్యవహరించడం మూలంగా దేశంలో అస్థిరత ఏర్పడింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఒక శక్తిగా జనతాపార్టీ ప్రభవించింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీలను కలిసికట్టుగా ఒకే వేదికపైకి తేవడంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఉద్యమానికి కారణమైన ప్రధానాంశాలకు సిద్ధాంతంతో సంబంధం లేదు కాని ఉద్యమంలో పాల్గొంటున్న వారందరికీ ఒక స్థిరమైన, సంస్థాగత ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాలనకు ప్రజలు కోరుకుంటున్న ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించకపోతే ఉద్యమ లక్ష్యాలు నెరవేరవు. ‘ఈ ఉద్యమంలో ఉన్న వారందరూ తమ వేర్వేరు గుర్తింపులను వదిలిపెట్టి ఒకే పార్టీగా విలీనం కావాలి, కాంగ్రెస్ పార్టీని గద్దె దించడంపై దృష్టిని కేంద్రీకృతం చేయాలి’ అని లాల్ కృష్ణ ఆడ్వాణీ 1975లో పిలుపునిచ్చారు. ఉమ్మడి కార్యక్రమం ద్వారా, ఒకే ఎన్నికల గుర్తింపు ద్వారా, కాంగ్రెస్‌కు సంస్థాగత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని నాడు వివిధ పార్టీలు నిర్ణయించాయి. కేవలం కాంగ్రెస్ వ్యతిరేకత పైనే మాత్రం కాకుండా కార్యక్రమాలపై కూడా ఐక్యత ఏర్పడాలని ఆ పార్టీలు భావించాయి. ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీ ఆవిర్భవించింది. జనసంఘ్, కాంగ్రెస్(ఓ), సోషలిస్టు పార్టీ, లోక్‌దళ్‌కు చెందిన సభ్యులంతా కొత్త పార్టీగా విలీనమయ్యేందుకు అంగీకరించారు. వేర్వేరు భావజాలాలకు చెందిన మధులిమాయే, రాంధన్, సురేంద్ర మోహన్‌తో పాటు ఆడ్వాణీని కూడా జనతాపార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు. మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడుగా చరణ్‌సింగ్ ఉపాధ్యక్షుడుగా 28 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గ కమిటీని ప్రకటించారు. దళిత నేత జగ్జీవన్ రామ్ లాంటి నేతలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ అనే పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ఇందిరా విధేయులుగా ఉన్న బహుగుణ, నందినీ శతపథి వంటి నేతలు కూడా చేరారు. ఈ పార్టీని కూడా జనతాపార్టీలో విలీనం చేశారు. నాడు ప్రజలు జనతాపార్టీకి 542 సీట్లలో 295 సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి 34.52 శాతం ఓట్లు రాగా, జనతాపార్టీకి 41.32 శాతం ఓట్లు లభించాయి. రాయబరేలీలో ఇందిరాగాంధీ, అమేథీలో సంజయ్ గాంధీ ఓడిపోయారు. ఇవాళ బిజెపికి ఉన్నదానికంటే ఎక్కువగా నాడు జనతాపార్టీకి, మిత్రపక్షాలకు 364 సీట్ల భారీ మెజారిటీ లభించింది, అందువల్ల ఎమర్జెన్సీ కాలంలో ప్రవేశపెట్టిన క్రూరమైన చట్టాలను ఎత్తివేయడం పెద్దగా కష్టం కాలేదు.
నిజానికి జనతాపార్టీ ఒక గొప్ప ప్రయోగం. దేశ ప్రజలకు ఆకాంక్షలు, ప్రయోజనాలను సమాఖ్య స్ఫూర్తితో అమలు చేసేందుకు అవకాశం ఆ పార్టీకి లభించింది. కాని ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చినప్పటికీ అది అంతర్వైరుధ్యాల వల్ల, సైద్ధాంతిక విభేదాల వల్ల కుప్పకూలిపోయింది. నాడు ఆడ్వాణీ కోరుకున్నట్లు ప్రభుత్వ పాలనకు ప్రత్యామ్నాయ మార్గం చూపించడంలో అది ఎందుకు విఫలమైంది? అందులో బిజెపి పాత్ర ఎంతవరకు ఉన్నది అన్నది వేరే చర్చనీయాంశం. కాని కాంగ్రెస్ మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెసేతర ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలన్న ప్రతిపక్షాల కలలు ఫలించలేదు.
మళ్లీ దశాబ్దం తర్వాత చరిత్ర పునరావృతమైంది. ఇందిర మరణానంతరం రాజీవ్‌గాంధీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినా ఆయనా స్థిరత్వం సాధించలేకపోయారు. 1988 ఆగస్టులో బిజెపి, వామపక్షాలతో సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో కలిసికట్టుగా ముందుకు వచ్చాయి. ఎన్టీరామారావును అధ్యక్షుడుగా, విపి సింగ్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. విపి సింగ్ నేతృత్వంలోని జనమోర్చా, చంద్రశేఖర్ నేతృత్వంలోని జనతాపార్టీ, లోక్‌దళ్‌లోని దేవీలాల్, అజిత్‌సింగ్ వర్గాలు విలీనమై జనతాదళ్‌గా ఆవిర్భవించాయి. 1989 ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పతనమై జనతాదళ్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి మద్దతుతో ప్రధానమంత్రి అయిన విపి సింగ్ కూడా ప్రభుత్వాన్ని సాగించలేకపోయారు. ఆ రకంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఏర్పర్చడంలో బిజెపి, ఇతర కాంగ్రెసేతర ప్రతిపక్షాలు మరోసారి విఫలమయ్యాయి. విపి సింగ్ ప్రభుత్వం కొనసాగి ఉంటే దేశంలో ఎలాంటి మార్పులు జరిగేవి అన్నది మరో చర్చనీయాంశం.
ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ ప్రభుత్వం అయినా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలైనా కాంగ్రెస్ మద్దతుతోనే కొనసాగాయి కనుక వాటి కొక సైద్ధాంతిక భూమిక లేకపోయింది. యునైటెడ్ ఫ్రంట్ కొంతలో కొంత ఉమ్మడి కార్యాచరణ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలని ప్రయత్నించింది. నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలతో చర్చలు జరిపి అన్నిటి ఆమోదంతో నిర్ణయాలు జరిపిన సమాఖ్య స్ఫూర్తి యునైటెడ్ ఫ్రంట్ కాలంలో కనపడేది. పెట్రోల్ ఒక్క రూపాయి పెంచాలన్నా సుదీర్ఘ చర్చలు జరిగేవి. కానీ కాంగ్రెస్ అధికార దాహం యునైటెడ్ ఫ్రంట్ కొనసాగేందుకు ఆస్కారం ఇవ్వలేదు. కాంగ్రెస్ కుత్సిత వ్యవహారాల మూలంగానే బిజెపి దేశంలో క్రమంగా బలపడేందుకు అవకాశం ఏర్పడిందనడంలో సందేహం లేదు. తన ప్రాభవం పడిపోయినందువల్లే బిజెపి నుంచి తనను తాను రక్షించుకునేందుకు అనేక పార్టీలతో కలిసి యుపిఏ ప్రభుత్వాన్ని నిర్వహించక తప్పలేదు. ఈ పదేళ్ల కాలంలో బిజెపి క్రమంగా పుంజుకుంటూ ఒక మెజారిటీ పార్టీగా అవతరించడానికి యుపిఏ ప్రభుత్వ వైఫల్యాలే కారణమయ్యాయనడంలో సందేహం లేదు. నిజానికి వివిధ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించిన యుపిఏ దేశంలో సమాఖ్య స్ఫూర్తిని గౌరవించే నిర్మాణాత్మకమైన పార్టీగా ప్రజల ఆమోదం పొందేందుకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు.
2014లో నరేంద్రమోదీ అతి పెద్ద మెజారిటీతో అధికారంలోకి రావడానికి వెనుక దేశంలో స్థిరత్వం కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజల నిరీక్షణ ఉందనడంలో సందేహం లేదు. కాని మోదీ ప్రజల మనోభావాలకు అనుకూలంగా పనిచేయగలిగారా, ప్రజల్లో ఆయన పాలన పట్ల ఏర్పర్చుకున్న ఆకాంక్షలు సడలిపోతున్నాయా అన్న అంశాలపై చర్చ ప్రారంభమైంది. ఆయన ఉపన్యాసాలు కూడా యాంత్రికంగా మారిపోతున్నాయని ఎన్నికల సభల్లో కనపడుతున్న ప్రతిస్పందనను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన జనతాపార్టీ, నేషనల్ ఫ్రంట్ ప్రయోగాలు పునరావృతమవుతాయా అన్న చర్చ ప్రారంభమైంది. ఈ ప్రయోగాలు నిజానికి విఫలమయ్యాయి. ఒకరకంగా ప్రజల ఆకాంక్షలను అవి వమ్ము చేశాయి.
ఈసారి కూడా మమతా బెనర్జీ, కెసిఆర్, స్టాలిన్ తదితరులు సమావేశమై భావి కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫలితాల సరళితో నిమిత్తం లేకుండా వారు సన్నద్ధమవుతున్నప్పటికీ యూపీ ఎన్నికల ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా మారితే వారికి మరింత ఊపు లభిస్తుందనడంలో సందేహం లేదు. నరేంద్ర మోదీని ఎంతవరకు ఢీకొనగలరో వారికి స్పష్టత ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ గురించి వారు ఆలోచించడం లేదు. వారిది జనతా ప్రయోగం అవుతుందా, నేషనల్ ఫ్రంట్ ప్రయోగం అవుతుందా, దేశం కనీవినీ ఎరుగని వినూత్న ప్రయోగం అవుతుందా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. ఒక్కటి మాత్రం వాస్తవం. ఇప్పటివరకు కాంగ్రెస్ లేదా బిజెపి మద్దతు లేకుండా కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు 30 నెలలు కూడా అధికారంలో లేవని భావి ప్రయోగాలు చేయనున్న వారు తెలుసుకోవాలి. అందువల్ల గత అనుభవాల నుంచి దేశానికి ఏది ముఖ్యమో తేల్చుకునే విజ్ఞతను ఏర్పర్చుకోవాల్సిన చారిత్రక అవసరం మాత్రం ఉన్నది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనేం, దేశానికి సుస్థిరత, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడగలగిన సమాఖ్య స్ఫూర్తిగల ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడడం అవసరం. అల్విన్ టాఫ్లర్ అన్నట్లు అస్థిరతల నుంచే స్థిరత్వం ఏర్పడక తప్పదు.
No comments:
Post a Comment