Wednesday, 5 February 2020

బోల్ కే లబ్ ఆజాద్ హై - వాహెద్


’’తూ షాహీన్ హై పర్వాజ్ హై కామ్ తెరా
వాహెద్


బోల్ కే లబ్ ఆజాద్ హై
వాహెద్


’’భాయ్ నాల్ భాయ్ లార్రెం నీ దేనా, సన్ సంతాలీ బనాం నీ దేనా‘‘
మాలెర్ కోట్లలో వినిపించిన నినాదం ఇది. పంజాబ్ మాలేర్ కోట్లలో సిఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా 20 వేల మంది రైతులు, మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పంపించారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నదేమిటి?
ఈ నిరసనలు, ఈ ఆందోళనలు, ఈ ప్రదర్శనలు ....

            చాలా చిన్న ఉదాహరణ ద్వారా దేశంలో ఏం జరుగుతుందో, దేన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారో తెలుసుకోవచ్చు. భారతదేశంలో చాలా మందికి తెలిసిన వంటకం పోహా. తెలుగులో చెప్పాలంటే అటుకులు. అటుకులతో పోహా తయారు చేస్తారు. ఇది చాలా సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ప్రజలు తినే వంటకం. కానీ, భారతీయ జనతాపార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ గారు ఇటీవల ఒక విచిత్రమైన ట్వీటు చేశాడు. ఆయన ఇంటి దగ్గర పనిచేసే నిర్మాణ కూలీలు కొందరి ఆహార అలవాట్లు విచిత్రంగా కనబడ్డాయట. వారు కేవలం పోహా మాత్రమే తింటున్నారట. వాళ్ళు బంగ్లాదేశీయులై ఉంటారని అన్నాడు.

            అఫ్ కోర్స్ ... ఈ పిచ్చివాగుడును నెటిజన్లు తిప్పికొట్టరు... మా చాకలి పిజ్జా తింటున్నాడు.. బహుశా వాడు అమెరికన్ అని నా అనుమానం అన్నారు కొందరు. కాని గమనించవలసిన విషయమేమంటే, ఇదేదో పిచ్చివాగుడు కాదు. జనంలో మతతత్వం పిచ్చి పట్టించే వాగుడు. బీజేపీ నేతల ప్రసంగాలు గమనించండి, యోగీ, అమిత్ షా, మోడీ ఇంకా అనేకమంది నేతల ప్రసంగాల్లో బిరియానీ అనే పదం ఎన్నిసార్లు వస్తుందో ఒక్కసారి లెక్కపెట్టండి. ప్రజల ఆహారానికి మతం రంగు పులిమే ఫాసిస్టు ప్రయత్నాలివి.
ఇలాంటి వ్యాఖ్యలు నేతలు చేసినప్పుడల్లా దానికి జవాబుగా ట్విటరులో వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ’’ఇప్పుడు కొత్తగా పోహా యాంటీ నేషనల్‘‘ అని కొందరు వ్యాఖ్యానించారు. కాని ఇది హాస్యాంగా భావించి నవ్వుకుని వదిలేసే చిన్న విషయం కాదు. ఇలాంటి వ్యాఖ్యలే సమాజంలో మతోన్మాద విషాన్ని కలిపాయని గమనించాలి.

            ఇప్పుడు పోహా గురించి తీసుకుంటే, విజయవర్గీయకు మహారాష్ట్రలో ప్రజలు ఎక్కువగా పోహా తింటారని తెలియదా? ఆ మాత్రం తెలియని అజ్ఞానంలో ఆయన లేడు. దుస్తులను బట్టి, ఆహారాన్ని బట్టి ప్రజలను విడగొట్టే ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ’’మనం‘‘ వేరు ’’వాళ్ళు‘‘ వేరు అనే విభజన విషాన్ని ప్రజల నరనరాల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇంటి వద్ద పనిచేస్తున్న ఒక నిర్మాణ కూలీ పోహా తింటున్నాడు, మనం ... ఉత్తరాది వాళ్ళయితే రొట్టెలు తింటున్నాం, దక్షిణాది వాళ్ళయితే అన్నం తింటున్నాం.. మనం శుధ్ద భారతీయులం, వాడు బంగ్లాదేశీ కావచ్చు. ఇలా మనకు భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉన్న బంగ్లదేశీలను గుర్తించాలి. అసలు భారతదేశంలో సగం బంగ్లాదేశ్ ఉందని చెప్పే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి బుర్రల్లో విషాన్ని మరింత ఎక్కించడానికే ఈ వ్యాఖ్యలు.

            ’’మనం‘‘ వేరు, ’’వాళ్ళు‘‘ వేరు – ఇలా దేశాన్ని రెండు శిబిరాలుగా విడగొట్టడమే ఈ వ్యాఖ్యల అసలు లక్ష్యం. ఈ విషం నరాల్లోకి చేరిన వాళ్ళు ఆ తర్వాత ఈ సోకాల్డ్ ’’మనం‘‘ శిబిరానికి, ’’వాళ్ళు‘‘ శిబిరానికి మధ్య తేడాలు గమనించడం మొదలు పెడతారు. వాడు పోహా తింటున్నాడా? వాడు మనవాడు కాదు, వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టాలి. అవసరమైతే చట్టాలు చేయాలి. యస్.. చట్టాలు చేయాలి. వాడి ఓటు హక్కు రద్దవ్వాలి, వాడి పౌరసత్వం రద్దవ్వాలి.

            అర్రర్రె ... మన వాదన దారి తప్పుతుందనుకుంటున్నారా? సిఏఏ.. పౌరసత్వం ఇస్తుందే కాని ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతుంటే .... ఇదేమిటి? అసలు మతలబు ఇక్కడే ఉంది. నిజాయితీగా మాట్లాడడం, నిజాలు చెప్పడం అనేది ఫాసిస్టు వ్యూహాల్లో ఎన్నడూ ఉండదు.

            బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రమే పోహా తింటారా? అలా అనుకున్నా.. అక్కడ ముస్లిములు, హిందువులు అందరూ పోహా తినాలి కదా... సో... ఇలా గుర్తించిన (బంగ్లాదేశీలను గుర్తించడానికి పోహా తినడం కొలబద్ద???) బంగ్లాదేశీల మతం ఏమిటో నిర్ధారించి వారికి పౌరసత్వం ఇవ్వవచ్చు కదా? నో...నో...నో.. అలా అనుకోడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక్కసారి కాస్త నిదానంగా ఆలోచించండి. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారమేమిటి? పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీలు ఇండియాకు వచ్చేశారు అనే కదా? లక్షల్లోనో, కోట్లలోనో చెదల్లా భారతదేశాన్ని తినేస్తున్నారనే కదా (చెదలనే మాట అమిత్ షా వాడింది. నేను వాడింది కాదు). వాళ్ళందరిని పారదోలుతామనే కదా. ... అక్రమ చొరబాటుదారుడు ఒక్కడిని కూడా వదిలిపెట్టేది లేదనే కదా చెబుతూ వచ్చారు. రైట్... కాస్త ఆలోచిద్దాం ... పారదోలుతాం అంటూ బీజేపీ నేతలు ఎవరి విషయంలో అంటున్నారు. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిముల విషయంలో. కాబట్టి ఆకలేసి పోహా అనబడే అటుకులు తింటున్న ఆ నిర్మాణ కూలీ బంగ్లాదేశీ ముస్లిం అన్నదే ఘనత వహించిన బీజేపీ నాయకుల వారి అనుమానం. బంగ్లాదేశీ అనే పదం బీజేపీ నేతలు ఎక్కడ ఉపయోగించినా అది ముస్లిములను ఉద్దేశించి తప్ప బంగ్లాదేశీ హిందువులను ఉద్దేశించి కాదు.

            ఇప్పుడు ఆలోచించవలసిన విషయమేమంటే, సగం బంగ్లాదేశ్ భారతదేశంలోకి వచ్చేసిందనే ప్రచారం మరోవైపు తీవ్రంగా చేస్తున్న నేపథ్యంలో, బంగ్లాదేశీ (అనగా ముస్లింలు) అక్రమ చొరబాటుదారులను ఒక్కడిని కూడా వదలకుండా తరిమేస్తాం అంటూ నేతలు వీరంగాలు వేస్తున్న వాతావరణంలో, పోహా గురించి ఈ అనుమానం బీజేపీ నాయకుల వారికి వచ్చింది. అంటే, ఆయన ఏదో పిచ్చివాగుడు వాగలేదు. ప్రజల్లో తాము పెంచి పోషిస్తున్న అనుమానాన్ని మరింత పెద్దది చేయడానికి, దేశంలో ’’మనం‘‘ వేరు ’’వాళ్ళు‘‘ వేరు అనే విభజన మరింత పెంచడానికి ఒక వ్యూహం ప్రకారమే ఈ మాటలు చెప్పాడు. మధ్యలో రుచికరమైన పోహా బలిపశువయ్యింది. నిజానికి మహారాష్ట్రవాళ్ళు చాలా ఇష్టంగా పోహా తింటారు.

            ఇప్పుడు మరో కోణంలో కూడా ఆలోచిద్దాం... బంగ్లాదేశ్ నుంచి కుప్పలు తెప్పలుగా జనం ఇండియాకు వచ్చేస్తుంటే, ఇండియాలో బీజేపీ అధికారంలో ఉందన్న భయం కూడా లేకుండా, మూకహత్యలకు పాల్పడిన నేరస్తులకు పూలమాలలేసి, స్వీట్లు తినిపించి సన్మానం చేసే జయంత్ సిన్హా వంటి మంత్రులు ఇక్కడ ఉన్నా కూడా భయం లేకుండా బంగ్లాదేశీ ముస్లిములే ఇక్కడికి వచ్చేస్తుంటే, బంగ్లాదేశ్ లో మతపరమైన పీడన ఎదుర్కుంటున్న హిందువులు కూడా ఇక్కడికి వచ్చి ఉండాలి కదా? ఖచ్చితంగా వచ్చి ఉంటారు. కాని ఎక్కడ కూడా అక్రమ చొరబాటుదారులు, అక్రమ బంగ్లాదేశీలు అనే మాటలు సిఏఏకు ముందు బీజేపీ నేతలు వాడినప్పుడు, ఎన్నడూ బంగ్లాదేశీ హిందు చొరబాటుదారుల గురించి ఎన్నడూ చెప్పలేదు. ఇది గమనించవలసిన విషయం.

            స్వరం ఎప్పుడు మారిందనేది గమనించడం కూడా చాలా అవసరం ఎన్నార్సీ, బంగ్లాదేశీ చొరబాటుదారులను తరిమేస్తాం అనే నినాదాలు అస్సాంలో ఎన్నార్సీ జరక్కముందు బలంగా వినిపించాయి. అస్సాంలో విదేశీయుల సమస్య పైనే రాజకీయాలు అనేక దశాబ్దాలుగా నడుస్తు వచ్చాయి. నలభై లక్షల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు, యాభై లక్షల మంది బంగ్లాదేశీలు ఇలా అనేక వాదనలు వినిపించాయి. వీటన్నింటిని బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుని అక్కడ పాగా వేయగలిగింది. ఎన్నార్సీ మొత్తానికి జరిపించారు. ఇప్పుడు అస్సాం ఎన్నార్సీ  గురించి బీజేపీ మాట్లాడడం లేదు. అసలు అస్సాం ఎన్నార్సీని ఒప్పుకునేది లేదంటుంది. సుప్రీంకోర్టు జరిపించిన ఎన్నార్సీని భారత ప్రభుత్వంలోని మంత్రులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే, ఎన్నార్సీలో పేరులేని పందొమ్మిది లక్షల మందిలో అత్యధికశాతం హిందువులు, ముస్లిమేతరులే. వాళ్ళు బంగ్లాదేశీలని చెప్పలేము. బెంగాల్ నుంచి వలస వెళ్ళిన వారు కావచ్చు. అలాగే ముస్లిములు కూడా బంగ్లాదేశీలని చెప్పలేము. వారు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతబట్టుకుని అక్కడకు వెళ్ళిన వారు కావచ్చు. చాలా మంది వద్ద పత్రాలు లేకపోవచ్చు. పత్రాలు లేనివారిలో సైన్యంలో పని చేసిన వారున్నారు. మాజీ రాష్ట్రపతి బంధువులున్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఇది పరిస్థితి. అస్సాం ఎన్నార్సీ ఫలితం తర్వాత బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ తర్వాత వచ్చింది సిఏఏ అనేది మరిచిపోరాదు.

            సిఏఏ మొదటి లక్ష్యం, అస్సాం ఎన్నార్సీలో పేర్లు లేనందువల్ల పౌరసత్వం కోల్పోతున్న లక్షలాది హిందూ బెంగాలీలకు పౌరసత్వం కల్పించడం. అఫ్ కోర్స్ ... ఈ దొడ్డిదారి వ్యవహారాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు నచ్చడం లేదు. ముస్లిములైనా, హిందువులైనా ఎవరైనా సరే ఎన్నార్సీలో పేరు లేకపోతే అస్సాంలో ఉండరాదంటున్నారు. అందుకే సిఏఏపై ఈశాన్యరాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు జరిగాయి.

            సో... సిఏఏ అనేది పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిందే... అందులో అనుమానం లేదు. కాని ఎవరికి పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించింది? అనేది ఆలోచించవలసిన ప్రశ్న. మూడుదేశాల ముస్లిమేతర అల్పసంఖ్యాకులకు అనేది పాలకవర్గాల జవాబు. కాని వారిని పిలిచి పౌరసత్వం ఇవ్వరు. అక్కడి నుంచి మతపీడన వల్ల పారిపోయి ఎవరైనా వచ్చి ఇక్కడి అధికారులకు మొరపెట్టుకుని పౌరసత్వం ఇవ్వమంటే ఇస్తారా? వెంటనే ఇవ్వడం జరగదు. కటాఫ్ తేదీ ఒకటి ఉంది. అంటే ... అర్థం... వాళ్ళు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు, కనీసం ఐదు సంవత్సరాల కాలంగా నివసిస్తున్న ప్రజలై ఉండాలి. ఇక్కడ ఉంటున్న ప్రజల్లో ఎవరైతే అక్రమ చొరబాటుదారులని చెప్పుకుని, ఒప్పుకుని, పౌరసత్వం ప్రసాదించాలని తమ మతం ధృవీకరణలు కూడా సమర్పించుకున్న వారికి మాత్రమే ఈ పౌరసత్వం లభిస్తుంది.

            ఇప్పుడు ఆలోచించవలసిన విషయమేమంటే, ఇలా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఏవో పనులు చేసుకుంటూ బతుకుతున్నవారు, అలాంటి వారిలో చాలా మందికి ఇక్కడ ఆధార్ కార్డులు కూడా ఉండొచ్చు, ఓటరు ఐడీ కార్డులు కూడా కొందరికి ఉండొచ్చు. ఇలాంటి వారికి కొత్తగా ఇచ్చే పౌరసత్వం వల్ల వచ్చే ప్రయోజనమేమిటి? వారికి ఉద్యోగాలు ఇస్తారా? ఉపాధి ఇస్తారా? వారి పిల్లల కోసం కొత్తగా బడులు కడతారా? వారికి నివాసగృహాలు కట్టిస్తారా? ఇవేవీ కొత్తగా వారికి ఇచ్చే పౌరసత్వం వల్ల లభించడం జరగదు. అధికారికంగా ఒక పత్రం, వారిని భారతపౌరులుగా గుర్తించడం జరిగిందని మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత వారి బతుకు వారిదే. కాబట్టి దేశంలో అక్రమంగా ఆల్రెడీ వచ్చేసిన బంగ్లదేశీ హిందువులకు ఈ చట్టం వల్ల ఏమైన గొప్ప ప్రయోజనం కలుగుతుందా? ఆలోచించండి. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వారికి ఈ చట్టం వల్ల వారి బతుకులేమీ మారవు. కాని వాళ్ళను ఉద్ధరించడానికి ఈ చట్టం చేశామని ప్రభుత్వం చెబుతోంది.

            కానీ, చట్టం చేయవలసిన అవసరమేమొచ్చింది.

            అవసరం అస్సాంలో వచ్చింది. ఎన్నార్సీలో పేరులేని లక్షలాది బెంగాలీ హిందువులకు ఊరటగా ఈ చట్టం చేశారు. అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి పేరు ఇప్పుడు ఎన్నార్సీలో లేదు. అంటే సాంకేతికంగా ఆవిడగారు అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారు. నమ్మగలమా? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ జనం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం అనేది ఎంత కష్టమో ఆలోచించండి. అందరూ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. ఏ ప్రాంతంలో ఏ సమాజిక సముదాయం ఆధిపత్యం చెలాయిస్తుందో, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా అధికారయంత్రాంగంలో ఉంటారో వారికి అనుకూలంగా, ఇతరులకు ప్రతికూలంగా నిర్ణయాలు జరగవచ్చు.

            ఇక్కడే క్రోనాలజీ అనేది అర్థం చేసుకోవాలి. బీజేపీకి అస్సాంలో క్రోనాలజీ అవగాహనకు వచ్చింది. ఏది ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలనేది అర్థమైంది. ఆ క్రోనాలజీనే అమిత్ షా చట్ట సభలో చెప్పారు. ఎన్నార్సీ కన్నా ముందు సిఏఏ, సిఏఏ తర్వాత ఎన్నార్సీ. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నార్సీ జరిపిస్తాం, అస్సాంలో మళ్ళీ కొత్తగా ఎన్నార్సీ జరిపిస్తాం అన్నారు.

            స్వరం అప్పుడు మారింది. సిఏఏ గురించి ప్రజలకు నచ్చచెప్పడం ప్రారంభమైన తర్వాత బంగ్లాదేశ్ నుంచి మతవివక్ష వల్ల వేధింపుల వల్ల వచ్చేసిన బంగ్లాదేశీలను మనం కాకపోతే మరెవరు కాపాడతారనే వాదనతో ముందుకు వచ్చారు. చాలా సింపుల్ గా ఒక పని చేయవచ్చు ... బంగ్లదేశ్ లోని మన దౌత్యకార్యాలయాల్లో అక్కడి అల్పసంఖ్యాకులు ఎవరైనా మతవివక్ష వల్ల భారతదేశం వచ్చేయాలనుకుంటే ధరఖాస్తు చేసుకోవచ్చని చెప్పవచ్చు. వారిని శరణార్థులుగా గుర్తించి ఇండియా తీసుకువచ్చి పౌరసత్వం కట్టబెట్టవచ్చు. కాని ఆ నిజాయితీ ఈ చట్టంలో లేదు. భారతదేశంలో ఆల్రెడీ వచ్చేసి నివసిస్తున్న బంగ్లాదేశీలు లేదా మరో రెండు దేశాల వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు. ఇందులోనే తిరకాసు ఉంది. ఇందులోనే క్రోనాలజీ ఉంది.

            మానవతావాదంతో సిఏఏ అని నచ్చచెప్పేయగలిగితే. ఆ తర్వాత ఎన్నార్సీ చేయిస్తే కోట్లాది మంది పౌరసత్వం లేనివారుగా మిగిలిపోతారు. వారిలో తమకు అనుకూలమైన వారికి సిఏఏ ద్వారా శరణార్థులుగా గుర్తించి పౌరసత్వం ఇస్తారు. ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసిన క్రోనాలజీ ఇది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల్లో తన ఓటర్లను మాత్రమే ఎన్నుకుని వారికి మాత్రమే ఓటుహక్కు కల్పిస్తుంది. ఎన్నార్సీ గురించి ఎలాంటి నిర్ణయమూ ఇప్పటి వరకు చేయలేదనే ప్రకటనలు నమ్మగలమా? ఇప్పటి వరకు చేయలేదంటే, భవిష్యత్తులో చేస్తామనే కదా? అసలు ఎన్నార్సీ అనేది లేనే లేదు.. ఎన్నటికీ చేయడం జరగదని చట్టసభలో ఎందుకు చెప్పడం లేదు?

            సో.. మనం పోహ నుంచి మొదలుపెట్టి ఎన్నార్సీ వరకు వచ్చాం. పోహా ప్రాముఖ్యం ఇక్కడే ఉంది. దేశంలో అక్రమ బంగ్లాదేశీ ముస్లిములు ఎంత మంది ఉన్నారో చూడండనే భావన కల్పించడానికే ఈ బీజేపీ నాయకుడు గారు ఈ కూలీలు విచిత్రంగా పోహా తింటున్నారు... బహుశా బంగ్లాదేశీలు కావచ్చు అన్నాడు. వాళ్ళు ముస్లిములా, ముస్లిమేతరులా తేల్చి, ముస్లిమేతరులైతే అర్జంటుగా వారికి పౌరసత్వం కల్పించవచ్చుకదా? నో... అలాంటి ఆలోచన లేదు. ఒక భయాన్ని ప్రజల్లో సృష్టించడం... బంగ్లాదేశీ ముస్లిములు ఇలా ఎంతమంది దేశంలోకి చొరబడ్డారో ఏమిటో.. ఎంతమంది ఇలా అక్రమంగా ఉన్నారో ఏమిటో.. వీళ్ళందరినీ ఏరి పారేయడానికి ఎన్నార్సీ అవసరమే అనే అభిప్రాయం కల్పించడం ఈ వ్యాఖ్య వెనుక అసలు ఉద్దేశ్యం. ఆయనేదో పిచ్చివాగుడు చేయలేదు.

            సిఏఏని వ్యతిరేకిస్తున్న వారు ఈ క్రోనాలజీని బాగా ఆర్ధం చేసుకున్నారు. ఈ రోజు నిరసనల వల్ల కాస్త వెనక్కు తగ్గి అస్సలు ఎన్నార్సీ గురించి ఇప్పటి వరకు నిర్ణయం ఏదీ జరగలేదు అనే మాటలు, ఇప్పటి పరిస్థితికి మాత్రమే వర్తిస్తాయని, భవిష్యత్తులో ఈ నిర్ణయం జరగవచ్చని, అప్పుడు దేశంలోని ముస్లిములే కాదు, బడుగు బలహీనవర్గాలందరు ఎన్నార్సీలో పేరు కోసం దేబేరించే పరిస్థితి వస్తుందని, ఎన్నార్సీలో పేరు లేని ముస్లిములు అక్రమ చొరబాటుదారులుగాను, ఎన్నార్సీలో పేరు లేని ఇతరులు అక్రమంగా వచ్చిన శరణార్థులుగాను గుర్తింపు పొందుతారని వారికి బాగా తెలుసు. ఇది దేశంలోని ప్రజలకు సంబంధించిందే, పొరుగున ఉన్న మూడుదేశాల్లో పీడనకు గురైన వారికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇక్కడి ప్రజలనే రెండు శిబిరాలుగా విడగొట్టడం, ’’మనవాళ్ళు‘‘, ’’పరాయివాళ్ళు‘‘ అనే రెండు శిబిరాలుగా తయారు చేయడం దీని వెనుక ముఖ్యోద్దేశ్యమనేది కూడా నిరసనలు చేస్తున్న వారికి బాగా తెలుసు. అందుకే నిరసనలు ఆగడం లేదు.

            ’’మనవాళ్ళు‘‘, ’’పరాయివాళ్ళు‘‘ అనే విభజనే రాజకీయంగా ఇప్పుడు మారింది. ఆజాదీ అనే నినాదం ఇప్పుడు యాంటి నేషనల్. ఆజాదీ అనేది నిరుద్యోగం, పేదరికాల నుంచి స్వేచ్ఛను కోరే నినాదమైనా సరే అది యాంటీ నేషనల్. సిఏఏను విమర్శించే నాటకం చిన్నపిల్లలు వేసినా అది యాంటీ నేషనల్, వారిపై దేశద్రోహం కేసు. తల్లిని జైలులో పెడతారు. శాంతియుతంగా షాహీన్ బాగ్ లో నిరసన ప్రదర్శన చేస్తున్న వారికి మద్దతివ్వడం కూడా ఇప్పుడు యాంటీ నేషనల్. అలాంటి దేశద్రోహులను కాల్చి చంపాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెబుతాడు. ఆ మరుసటి రోజు జామియా వద్ద కాల్పులు జరుగుతాయి. ఒక విద్యార్థి గాయపడ్డాడు. ’’పరాయీకరణ‘‘ అనే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాల్లో భాగమే ఈ అనురాగ్ ఠాకూర్ లాంటి వారి నినాదాలు, ఈ చర్యలు, ఈ వ్యాఖ్యలు.

            షాహీన్ బాగ్ ను పాకిస్తాన్ తో పోల్చడం అందులో భాగమే. కర్నాటకలోని బీదరులో షాహీన్ విద్యా సంస్థ నడుపుతున్న స్కూలులో పిల్లలు సిఏఏకు నిరసనగా నాటకం వేశారు. అందులో ఒక పాత్ర చెప్పిన డైలాగులు ప్రధాని మోడీ గారి ప్రతిష్ఠను భంగ పరిచేవిగా ఉన్నాయట. ఆమె తల్లి ఇప్పుడు దేశద్రోహం కేసులో జైల్లో ఉంది. ఆ చిన్నపిల్లను కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. స్కూలు పిల్లలను దేశద్రోహం కేసులో ఇంటరాగేషన్ చేయడం అంటే పరాయీకరణ ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. జామియా మిల్లియా వద్ద కాల్పులు జరిగినప్పుడు, షాహీన్ బాగ్ వద్ద కాల్పులు జరిగినప్పుడు దేశద్రోహం కేసులు లేవు. ఎందుకంటే వాళ్ళు మహా అయితే మామూలు నేరస్తులు. మనవాళ్ళే... కాస్త దుడుగ్గా వ్యవహరించారు అంతే. కాని వీళ్ళు దేశద్రోహులు. వీళ్ళు మనవాళ్ళు కాదనే వాతావరణం ఇప్పుడు దట్టంగా అలుముకుంటోంది.

            పంజాబ్ శాసనసభ సిఏఏ రద్దు చేయాలని తీర్మానం చేసింది. కేరళ ప్రభుత్వం సిఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. రాజస్థాన్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు అదే బాటన నడిచాయి. కేంద్రప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం, నిరసన తెలపడం, రద్దు చేయాలని డిమాండ్ చేయడం దేశద్రోహమా?

            జాతీయతత్వాన్ని నాశనం చేసే కుట్రతో షాహీన్ బాగ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు బీజేపీ మాట్లాడే ఒకే ఒక్క అంశం షాహీన్ బాగ్. సిఏఏపై ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసనలు ఆగిపోవలసిందని ప్రధాని అన్నారు. కాని ఆయన ఇచ్చిన హామీ ఏమిటి? ఎన్నార్సీ, దానికి ముందస్తు ఏర్పాటుగా చేపట్టిన ఎన్ఫీఆర్ జరపడం లేదని, భవిష్యత్తులో కూడా జరిపేది ఉండదని ఖచ్చితమైన హామీ ఏమైనా ఇచ్చారా? అలాంటిదేమీ లేదు. ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారు. ఈ కుట్ర ఇలాగే కొనసాగితే ఢిల్లీలో ట్రాఫిక్ ఏ రోడ్డుపై అయినా స్తంభించేలా చేస్తారని హెచ్చరించారు.

            భారతదేశంలో ట్రాఫిక్ అడ్డంకులు ఏమైనా కొత్తా? నిరసన ప్రదర్శనల్లో రాస్తారోకోలు, రైల్ రోకోలు ఎన్ని జరగలేదు. రాజస్థాన్ లో గుజ్జార్లు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ 2008లో అనేక నెలల పాటు ఢిల్లీ ముంబయిల మధ్య రాస్తారోకో, రైల్ రోకో నిర్వహించారు. 2011లోను గుజ్జర్ రిజర్వేషన్ ఆందోళన సందర్భంగా కూడా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 2008లో జమ్ములో హిందువులు జమ్ము శ్రీనగర్ హైవే రెండు నెలల పాటు ట్రాఫిక్ నడవకుండా అడ్డుకున్నారు. అది కూడా ఒక భూవివాదానికి సంబంధించిన సమస్య. ఇలాంటి ఎన్ని ఉదాహరణలు లేవు. రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసనలు దేశంలో చాలా మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. నిరసన ప్రదర్శనల్లోనే కాదు, అనేక పండగలు, ఉత్సవాల సందర్భంగా కూడా రోడ్లపై ట్రాఫిక్ అతలాకుతలం అవుతుంది. రాజకీయ పార్టీల మహాసభల సందర్భంగా కూడా సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. కాని ఇప్పుడు మాత్రం సిఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో జరుగుతున్న నిరసన ఒక ఎక్స్ పెరిమెంటు, ఒక రాజకీయ కుట్ర. అని ప్రధాని ప్రజలను నమ్మమంటున్నారు. ఎందుకంటే, ఈ నిరసనలు నిర్వహిస్తున్న వారు ’’పరాయివారు‘‘ అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడమే అసలు ఉద్దేశ్యం.

            ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను మత ప్రాతిపదికన విభజించడానికి షాహీన్ బాగ్ ఒక మంచి అవకాశంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ర్యాలీలో బీజేపీకి బలంగా ఓటేయండి, కరంటు దెబ్బ షాహీన్ బాగ్ కు తగలాలి అన్నారు. అంటే అర్థమేమిటి, షాహీన్ బాగ్ ఢిల్లీలో భాగం కాదా? అదేమన్నా శత్రుదేశమా? అనురాగ్ ఠాకూర్ దేశద్రోహులను కాల్చిపారేయాలనే నినాదాలు ఇచ్చాడు. గిరిరాజ్ సింగ్ తదితర నేతలు షాహీన్ బాగ్ మతతత్వ సమస్యగా మార్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ ఒక్కసారయినా షాహీన్ బాగ్ కు అనుకూలంగా మాట్లాడితే చాలన్నట్లు ఎదురు చూస్తున్నారు. కేజ్రీవాల్ షాహీన్ బాగ్ కు అనుకూలంగా మాట్లాడితే ఆయన్ను హిందూ వ్యతిరేకిగా ముద్రవేసి హిందువుల ఓట్లు సంపాదించాలనే ఆలోచనే ఎన్నికల ప్రచారంలో కనబడుతోంది.

            సిఏఏ వ్యతిరేక నిరసనల పట్ల బిజేపీ ప్రభుత్వం ఇప్పుడు బెంబేలెత్తుతుందా? ఈ చట్టం చేసిన తర్వాత నిరసనగా తన పదవికి ఉత్తరప్రదేశ్ లోని ఐజి స్థాయి అధికారి అబ్దుర్రహ్మాన్ రాజీనామా చేశారు. కశ్మీరుపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఐపియస్ కన్నన్ గోపీనాథ్ రాజీనామా చేసినట్లే. అబ్దుర్రహ్మాన్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సభకు హాజరు కాకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు సిఏఏ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి షాహీన్ బాగ్ ఉపయోగపడుతుందని బీజేపీ నమ్ముతోంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే సిఏఏ, ఎన్నార్సీలను ప్రజలు సమర్ధించారని చెప్పుకోడానికి కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన కూడా ఉంది. హోంమంత్రి అమిత్ షా ఈ విభజనను స్పష్టంగా తన ప్రసంగాల్లో చెప్పారు. మీరు మాతో ఉన్నారా? లేక షాహీన్ బాగ్ తో ఉన్నారా? అంటూ మాట్లాడారు.

            షాహీన్ బాగ్ లో నిరసనకారులు ఢిల్లీ ప్రజల ఇండ్లలో చొరబడి అత్యాచారాలు హత్యలు చేస్తారని బీజేపీ నాయకుడు పర్వేష్ వర్మ హెచ్చరించాడు. షాహీన్ బాగ్ లో నిరసనలు చేస్తున్నది మహిళలనే జ్ఞానమైనా ఈయనకు ఉందా? ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నది ప్రజలను రెచ్చగొట్టడానికి. ’’పరాయీకరణ‘‘ బలంగా అమలు చేయడానికి, సిఏఏ క్రోనాలజీ అర్థమయ్యేలా చేయడానికి, పరాయీకరణ పూర్తయితే ప్రజలు ఎన్నార్సీకి సంతోషంగా ఒప్పుకుంటారు. బీజేపీ ఎన్నికల ప్రచారం యావత్తు మతతత్వం చుట్టు తిరుగుతుందన్నది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. జామియా విశ్వవిద్యాలయం వద్ద కాల్పుల సంఘటన జరిగిన తర్వాత హోంమంత్రి అమిత్ షా ఒక సభలో మాట్లాడుతూ, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన నరేంద్రమోడీని ఎన్నుకుంటారా? లేక షాహీన్ బాగ్ సమర్థకులను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న వారిని కుక్కల్లా కాల్చి పారేయాలని దిలీప్ ఘోష్ అన్నాడు. సిఏఏ నిరసనకారులను దేశ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నాలు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. నిరసన ప్రదర్శనల్లో మహిళలే ప్రధానంగా ముందున్నారన్నది కూడా గమనించాలి. దేశంలోని మహిళలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలివి. దిలిఫ్ ఘోష్, పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు అసలు ఉద్దేశ్యాలను కూడా బట్టబయలు చేశాడు. తాము గెలిస్తే రాష్ట్రం నుంచి 50 లక్షల మంది ముస్లిం చొరబాటుదారులను తరిమేస్తామని అన్నాడు. చొరబాటుదారులనేది బీజేపీ వేసే ముద్ర. ఎన్నార్సీ అమలు చేసి, ముస్లిముల పేర్లు అందులో రాకుండా చేసి, చొరబాటుదారులుగా ముద్రవేసి వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలించే ఆలోచనను ఆయన తన మాటల్లో చెప్పాడు. 

            ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్  ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మూడే మాటలు వినిపిస్తున్నాయి. షాహీన్ బాగ్ బిరియానీ పాకిస్తాన్. ఢిల్లీ పాలకపక్షానికి పాకిస్తాన్ తో లోపాయికారి సంబంధాలున్నాయని ఆయన మాట్లాడతాడు. శత్రుదేశంతో సంబంధాలుంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చూస్తూ ఎలా ఊరుకుంటోంది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికరణ 370 రద్దును ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థించింది. కాని యోగీ ఆదిత్యనాథ్ కు వాస్తవాలు అవసరం లేదు. అబద్దాలు చెప్పడమే ఆయనకు తెలిసిన విద్య. ఆప్ పార్టీ అధికరణ 370 రద్దును వ్యతిరేకించిందని చెబుతాడు. షాహీన్ బాగ్ నిరసనకారులకు కేజ్రీవాల్ బిరియానీ పెడుతున్నాడని విమర్శిస్తాడు. దానికి సంబంధించిన ఆధారాలు ఆయన ఏవీ చూపించడు. బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం ఎలా ఉందో అర్ధం చేసుకోవాలంటే, యోగీ ఆదిత్యనాథ్ 48 సెకన్ల కాలంలో 8 సార్లు పాకిస్తాన్ పేరు చెప్పాడని వార్త వచ్చింది. ఇది పరిస్థితి.

            ఇది ’’పరాయీకరణ‘‘ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న వ్యవహారం. కేజ్రీవాల్ పాకిస్తాన్ భాష ఎందుకు మాట్లాడతాడు? రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష ఎందుకు మాట్లాడతాడు? కాని వాళ్ళు అలా మాట్లాడారని నమ్మమంటారు బీజేపీ నేతలు. అసలు మహాత్మా గాంధీ పాకిస్తాన్ జాతిపిత అని ఒక బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించాడు. మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా సెల్ అధిపతి అనిల్ సౌమిత్ర  మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. జాతిపితగా గౌరవించే నాయకుడి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఇప్పుడు సస్పెండ్ చేసి తర్వాత మరో పదవి కట్టబెట్టడం జరుగుతుంది. గాంధీజీ కూడా వీరి దృష్టిలో పాకిస్తాన్ భాష మాట్లాడి నాయకుడే.

            గాంధీని ద్వేషించడం, గాడ్సేను పూజించడం ఒక పరంపరగా కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు కొందరు నాయకులు గాంధీజీ గురించి అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం. బీజేపీ కంటితుడుపు చర్యలు తీసుకోవడం.. ఇలా దీన్ని సాధారణ స్థాయికి తీసుకొస్తున్నారు. అంటే గాంధీజీని తీవ్రంగా తులనాడినా ఫర్వాలేదు అనే వాతావరణం సృష్టించే ప్రయత్నాలివి. కర్నాటకుకు చెందిన బీజేపీ అగ్రనాయకుడు అనంత్ కుమార్ హెగ్డే స్వతంత్ర పోరాటాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. భారత స్వతంత్ర పోరాటంలో బీజేపీ, ఆరెస్సెస్ ఎక్కడా లేరన్నది వేరే విషయం. కాని స్వతంత్ర పోరాటలో అనేక త్యాగాలు చేసిన వారిని తూలనాడుతూ మాట్లాడడం గమనించాలి. స్వతంత్ర పోరాటం అంతా ఒక డ్రామా అన్నాడు. బ్రిటీషు వారితో చేసుకున్న సర్దుబాటు అన్నాడు. ఇదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లా జరిగిందని చెప్పాడు. వారెవ్వరు పోలీసుల లాఠీ దెబ్బలు తినలేదని చెప్పాడు. సత్యాగ్రహం వల్ల స్వతంత్రం వచ్చిందని కాంగ్రెసును సమర్థించేవారు చెబుతారు, కాని బ్రిటీషు వారు సత్యాగ్రహంవల్ల దేశాన్ని వదిలి వెళ్ళలేదు, ఫ్రస్ట్రేషన్ వల్ల ఇచ్చారట. అలాంటి నాయకులు మహాత్ములైపోయారు, నా నెత్తురు ఉడికిపోతుంది అన్నాడు ఈ బీజేపీ నాయకుడు.

            శిక్ష తప్పించుకోడానికి బ్రిటీషు ప్రభువులకు క్షమాపణలు కోరుకున్న సావర్కర్ గురించి ఈయన అభిప్రాయాలేమిటో చెప్పాలేదు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, అష్ఫాకుల్లా ఖాన్, వంటి వారు బ్రిటీషు వారికి క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదన్నారు. కాని బీజేపీ హిందూత్వ సిద్దాంత, ద్విజాతి సిధ్ధాంత పితామహుడైన సావర్కర్ మాత్రం క్షమాపణ పత్రం రాసిచ్చాడు. ప్రభుత్వానికి విధేయంగా ఉంటానని మాట ఇచ్చాడు. ఈ విషయాలు చదివినప్పుడు ఈ హెగ్డే గారి రక్తం ఉడికిపోవడం జరగలేదా? ... మామూలుగానే బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తాను అస్సలు గాంధీజీ పేరెత్తలేదని ఆయన జవాబిచ్చాడు. నిజమే ఆయన గాంధీజీ పేరెత్తలేదు. కాని ఆయన మాట్లాడింది గాంధీ గురించి, దేశస్వతంత్ర పోరాటం గురించే కదా. కర్నాటక బీజేపీ నేతలు ఈ హెగ్డేగారి ప్రసంగం దేశస్వతంత్రపోరాటం గురించి కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందని సమర్ధించారు.

            మహాత్మా గాంధీజీని కించపరచడం అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం జరుగుతూనే వస్తోంది. గాడ్సేకు గుడులు కడుతున్నారు. గాడ్సే దేశభక్తుడని బీజేపీ ప్రముఖ నాయకుడు సాక్షి మహారాజ్ ఒకసారి చెబితే, మరోసారి ప్రజ్ఞాఠాకూర్ చెబుతుంది. బీజేపీ నేతలు గాడ్సేను విమర్శించడంగానీ గాంధీజీ హంతకుడిని ఖండించడంగానీ ఇంతవరకు ఎక్కడా వినబడలేదు.

            అనంతకుమార్ హెగ్డే గతంలో దళిత నిరసనకారులను కుక్కలతో పోల్చాడు. ప్రజలు తమ మతం లేదా కులంతో గుర్తింపు పొందాలని, సెక్యులర్ అని చెప్పుకోరాదని ఒకసారి చెప్పాడు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని మరోసారి చెప్పాడు.

            గాంధీజీపై వ్యతిరేకత, ముస్లిముల పట్ల ద్వేషం, దళితుల పట్ల చులకన ఈ మూడు అంశాలు మనకు ఈ ప్రసంగాలు, వ్యాఖ్యలను విశ్లేషిస్తే కనబడతాయి. వీటిని మరింత విశ్లేషిస్తున్న క్రమంలో ఒక పుస్తకం ముందుకు వచ్చింది. ఐ కుడ్ నాట్ బి ఏ హిందూ అనే పేరుతో రాసిన పుస్తకం. నేను హిందువు నెట్లయిత అని ఐలయ్యా గారు రాసిన పుస్తకం వంటిది కాదు. ఎందుకటే ఐలయ్యకు ఆరెస్సెస్ తో సాంగత్యమేమీ లేదు. ఆయన హిందూ చతుర్వర్ణ వ్యవస్థ వల్ల ఎదురైన కష్టాల గురించి రాసుకున్నారు. కాని భంవర్ మేఘవంశీ ఆరెస్సెస్ తో సుదీర్ఘకాలం నడిచిన వ్యక్తి. ఆయన రాసిన ఈ పుస్తకం గురించి రివ్యూ దివైర్ లో వచ్చింది.

            1987లో రాజస్థాన్ లోని ఒక ఊరికి చెందిన 13 సంవత్సరాల భంవర్ రాజవంశీ ఆరెస్సెస్ శాఖలో చేరాడు. అంటరాని కులానికి చెందినవాడయినప్పటికీ కార్యవాహ్ స్థాయికి ఎదిగాడు. 1992 బాబరీమస్జిద్ విధ్వంసానికి ముందు భిల్వారా జిల్లా కార్యాలయానికి హెడ్ అయ్యాడు. ఆరెస్సెస్ లో కులవివక్ష లేదని అనుకున్నాడు. ముస్లిములతో ఎవరితోను ఆయనకు పరిచయం లేదు. అయినా ముస్లిములంటే ద్వేషం పెంచుకున్నాడు. అయోథ్యకు వేలాది కరసేవకులతో వెళ్ళాడు. ములాయం సింగ్ ను ముల్లా యాం సింగ్ అని హేళన చేసేవాడు. అల్లర్లలో కూడా పాల్గొన్నాడు. జైలుకు వెళ్లాడు. హిందూరాష్ట్ర కోసం ప్రాణాలర్పించే కార్యకర్తగా మారాడు. కాని ఇప్పుడాయన తాను ఇంత చేసినా తక్కువ స్థాయి హిందువుగానే ఉన్నానని వివరించాడు. చివరకు సంఘ్ ను తీవ్రంగా విమర్శిస్తూ పుస్తకం రాశాడు. అంబేద్కరైట్ గా మారాడు. హిందుత్వ లోని కాపట్యాన్ని బట్టబయలు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

            అసలు ఆరెస్సెస్ వచ్చింది ముస్లిములకు వ్యతిరేకంగా కాదు, అంబేద్కర్ రాజకీయాలకు వ్యతిరేకంగా అని కొందరి అభిప్రాయం. మహద్ సత్యాగ్రహం, మందిర ప్రవేశం ఉద్యమాల వంటి వాటికి వ్యతిరేకంగా, వ్యూహాత్మకంగా ఆరెస్సెస్ ఏర్పాటైందని అంటారు. ఇదంతా మహారాష్ట్రలోనే జరిగింది. 1920ల్లో మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాల వారిని కూడా కలుపుకోకపోతే బ్రాహ్మణ వ్యతిరేకతను, కులవ్యవస్థను కాపాడ్డం కష్టమవుతుందని భావించారంటూ ఈ పుస్తకం రివ్యూ రాసిన క్రిస్టఫర్ జెఫర్లాట్ పేర్కొన్నారు.

            భంవర్ మేఘవంశీ హిందీలో రాసిన ఈ పుస్తకంలో ఆరెస్సెస్ లోని కులవ్యవస్థను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిన్నవయసులోనే ఆరెస్సెస్ లో చేరాడు. ఎక్సర్ సైజులు చేయడం, సాంప్రదాయిక క్రీడలు సరదాగా ఉండేది. తర్వాత చరిత్ర బోధించడం ప్రారంభించారు. అసలైన భూమిపుత్రులు ముస్లిం దాడుల వల్ల ఎలా పవిత్రభూమిలో బాధలు అనుభవించారో, అనుభవిస్తున్నారో బోధించడం ప్రారంభమైంది. ప్రచారక్ అని పిలవబడే గురువులు ఈ బోధనలు చేసేవారు. వారంతా పవిత్రమైన హిందూధర్మసేవకు అంకితమైన వారు. వారిపట్ల స్వయంసేవకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఈ ప్రచారక్ లు చాలా నిరాడంబరంగా, చాలా పవిత్రమైన జీవితం గడిపేవారు. తన కాలంలో జిల్లా ప్రచారక్ శివ్ జీ భాయిసాబ్ చాలా నిరాడంబరమైన, నియమాలను పాటించే మనిషని భంవర్ మేఘవంశి చెప్పాడు. రెండు జతల సాధారణ దుస్తులు మాత్రమే ఆయనకు ఉండేవనీ, ఒక గుడ్డ సంచి ఉండేదని, చాలా మితంగా తినేవాడని, నేలపై పడుకునేవాడని, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడని, ఆయనకు వ్యక్తిగత జీవితం ఏదీ ఉండేది కాదని, జిల్లాలో పర్యటనలు చేస్తూనే గడిపేవాడని భంవర్ వివరించారు. ఇప్పటి ప్రచారకుల మాదిరిగా అప్పట్లో రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఉండేది కాదన్నాడు. అప్పట్లో ప్రచారక్ ల పట్ల తనకు చాలా భక్తిశ్రద్ధలు ఉండేవని వివరించాడు.

            ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, ఈ నిరాడంబరత, నియమబద్ద జీవితం, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా నిజానికి గాంధీజీ ప్రారంభించినవే. వాటినే తర్వాత వామపక్ష నేతలు కూడా అనుసరించడం ప్రారంభించారు. ఏది ఏమైనా భంవర్ రాసిన వివరాలను చూస్తే, ప్రచారకులు తమ నిరాడంబర జీవనశైలితో జనాన్ని ఆకర్షించేవారు. వర్తకులు, ఇతర వర్గాల వారు వారిని అభిమానించేవారు. అంతేకాదు, ప్రచారకులు నిమ్నకులాలతోను కలగలిసి మాట్లాడేవారు. స్వయంసేవకుల ఇండ్లకు వెళ్ళి వారి బాగోగులు అడిగి తెలుసుకునేవారు. ఈ వైఖరి దళితులకు, నిమ్నకులాల వారికి నచ్చింది. సమాజంలో దూరంగా ఉంచబడిన ఈ వర్గాలు ఆరెస్సెస్ ప్రచారకుల పట్ల ఆకర్షితులయ్యారు. అప్పట్లో అగ్రకులాల వారు నిమ్నకులాల వారిని కలవడం కూడా జరిగేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రచారక్ వచ్చి తమతో మాట్లాడడం వారికి చాలా సంతోషం కలిగించేది.

            దళిత గుర్తింపునకు బదులు, కొత్తగా లభిస్తున్న, ఆరెస్సెస్ ఇస్తున్న సంస్కృతీకరణ గుర్తింపును నిమ్నకులాలు ఇష్టపడడం ప్రారంభించారు. ఆరెస్సెస్ శాఖల్లో నిమ్నకులాల స్వయంసేవకులను మర్యాదగా ’’జీ‘‘ అంటే గారు అని పిలిచేవారని భంవర్ రాశారు. ఆ కాలంలో దళితులను అరె” “ఒరేఅని పిలిచే సమాజంలో భంవర్ గారు అని పిలవడం తనకు చాలా గొప్పగా అనిపించిందని రాసుకున్నారు. తమ ఊళ్ళో చాలా మంది నిమ్నకులస్తులు ఆరెస్సెస్ లో చేరారని చెప్పాడు. బిల్లుల వంటి ఆదివాసీ ప్రజలు కూడా చేరారని వివరించాడు. నెమ్మదిగా సంస్కృతీకరణ జరిగిందని, మన సంస్కృతికి పరాయివారు అంటే ముస్లిములు, క్రైస్తవుల వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని బుర్రల్లోకి ఎక్కించడం జరిగిందన్నది రాశాడు.

            మస్జిదుల నేలమాళీగల్లో ఆయుధాలు ఉంటాయని, బాబరీ మస్జిదును కూల్చడం రెండవ స్వతంత్ర పోరాటం వంటిదని (అసలు స్వతంత్ర పోరాటాన్నే బీజేపీ నాయకుడు హెగ్డే తులనాడాడు) ఇలా అనేక మాటలు శాఖలో తాను విన్నాడట. చాలా గర్వంగా ఆయన రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నాడు. హిందూ ధర్మ రక్షణకు నడుం కట్టాడు. 1990 రథయాత్రలో పాల్గొన్నాడు. రాముడి కోసం ప్రాణాలర్పించడం మహాగౌరవంగా భావించేవాడు. పోలీసులను ఎలా తప్పించుకోవాలి? కట్టడాన్ని ఎలా కూల్చాలి? అయోథ్యలో స్థానికులు ఎలా పలుగులు పారలు సమకూరుస్తారు? వగైరా అన్ని తమకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పాడు.

            వారు ప్రయాణం చేస్తున్న రైలు అజ్మీర్ స్టేషన్ దాటిన తర్వాత ముఖ్యమైన నాయకులు అందరు నెమ్మదిగా రైలు నుంచి దిగిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు వెళ్ళిపోవడం గమనించాడు. పెద్ద పెద్దవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, సంఘ్ ప్రచారకులు, విహెచ్పీ, బీజేపీ నేతలు అందరు ఏదో ఒక కారణం చెప్పి దిగిపోయారు. వాళ్ళంతా ఇళ్ళకు వెళ్ళిపోయారు. తనలాంటి వారు, దళితులు, ఆదివాసీలు నిమ్నకులాలకు చెందిన యువకులు మాత్రమే ఆ రైల్లో మిగిలామని చెప్పాడు. తమతో పాటు కొందరు సాధువులు, సంతులు ఉన్నారని అన్నాడు. పెద్ద నాయకులు, ప్రచారకులు, ఇతరులు అయోథ్యలో వచ్చి మళ్ళీ కలుస్తారని, అయోథ్యకు వస్తున్న అనేక ఇతర బృందాలను వారు కలవవలసి వుందని తమకు ఇంచార్జ్ గా నియమించబడిన వ్యక్తి చెప్పాడట. కాని రైలు దిగిపోయిన వారు రాలేదు. వారు తెలివిగలవారు. ఇంటికి వెళ్ళిపోయారు. మమ్మల్ని వాడుకున్నారు. ఈ అబద్దాలు చెప్పడంలోనే వారి గొప్పదనం ఉందా? అంటే మోసం, దగాలే గొప్పదానికి చిహ్నలా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు.

            ఇప్పుడు కూడా మనం అనేక అబద్దాలు వింటూనే ఉన్నాం. రోజుకో కొత్త అబద్దం. ఎన్నార్సీ తప్పకుండా తెస్తాం అని చెప్పిన నోళ్ళే అసలు ఎన్నార్సీ గురించి చర్చ జరగలేదంటున్నాయి. దేశద్రోహులు అనే మాట మాత్రమే తాను చెప్పానని, కాల్చి పారేయాలని ప్రజలు చెబితే తన తప్పేమిటని అనురాగ్ ఠాకూర్ చెప్పిన మాటల్లోను ఇలాంటి టక్కరి తనమే కనబడడం లేదా? గాంధీజీ పేరు నేను ఎత్తలేదు కదా అంటూ గాంధీజీని, స్వతంత్ర పోరాటాన్ని హేళన చేసిన హెగ్డే మాటల్లోను ఈ జిత్తులమారి తనమే కనబడడం లేదా?

            కాని, ఆ సంఘటన తర్వాత భంవర్ మేఘవంశీలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అయోథ్య వెళ్ళాడు. ఆయన తండ్రి కాంగ్రెసువాది. తండ్రి మాటలు కూడా వినలేదు. ముస్లిముతో పోరాడ్డానికి మాత్రమే ఆరెస్సెస్ దళితులను వాడుకుంటుందని ఆయన తండ్రి చెబితే తనకు కోపం వచ్చిందంట, ఇంటి ముందు హిందువునని గర్వంగా చెప్పు అని బోర్డు పెట్టాడట.

            మరో ప్రమోషన్ ఆయనకు లభించింది. విస్తారక్ హోదా ఇచ్చారు. కాని స్వయంసేవకులను తీర్చిదిద్దే ప్రచారక్ కావాలనుకున్నాడు. కాని అక్కడే కులం అడ్డు వచ్చిందని భంవర్ వివరించాడు. మరో సందర్భంలో సంఘ్ పరివార్ సభ్యుల కోసం భంవర్ ఇంటిలో భోజనం సిద్ధం చేసి, ఇంటికి పిలిచాడట, కాని ఆయన ఇంటికి రావడం కుదరదని, టైము సరిపోదు కాబట్టి ప్యాక్ చేసి ఇస్తే దారిలో తింటామని చెప్పారట, అలా ఇచ్చిన ఆహారాన్ని తర్వాత రోడ్డుపై పారేసి పోయారని చెప్పాడు. ఆరెస్సెస్ హిందువులందరు ఒక్కటే అని చెప్పే మాటల్లో నిజం లేదన్నది తెలిసిందన్నాడు. తాను ఎక్కడి వాడన్నది అర్థమైందని చెప్పాడు. తాను ఎవరికి చెందినవాడో కూడా తెలిసివచ్చిందన్నాడు. తాను హిందూ గుర్తింపును వదిలి, దళిత గుర్తింపును స్వీకరించానని చెప్పాడు.

            ఈ మొత్తం కథనంలో మనకు రెండు వాస్తవాలు తెలుస్తున్నాయి. మొదటిది;  ఆరెస్సెస్ ఎలా విస్తరించింది? ముఖ్యంగా నిమ్నకులాల్లో ఎలా చొచ్చుకుపోయింది? రెండవది; ఆరెస్సెస్ కేవలం ముస్లిములు, క్రయిస్తవులను పరాయీకరిస్తుందనుకుంటే పొరబాటు, దళితులను, నిమ్నకులాలను, ఆదివాసీ ప్రజలను కూడా పరాయీకరణలో పావులుగా వాడుకోవడమే తప్ప తన అక్కున చేర్చుకోవడం అనేది జరగదు. ఆరెస్సెస్ ఏర్పాటులోనే వ్యూహాత్మకంగా నిమ్నకులాలను తమవైపు తిప్పుకునే ఎత్తుగడ ఉందన్నది ఒక విషయమైతే, మరో విషయం గాంధీజీ పట్ల విపరీతమైన ద్వేషం.

            ఈ ద్వేషం పదే పదే మన ముందుకు వస్తుంది. గాడ్సేకు గుడులు కట్టాలని చెబుతున్నవారు గాడ్సే దేశానికి చేసిన ఒక్క సేవ కూడా చెప్పలేరు. గాంధీజీని హతమార్చడం అన్నది దేశసేవగా భావిస్తే తప్ప? అలా అని ఒప్పుకునే నిజాయితీ వీళ్ళల్లో లేదు. కాని అంతరాంతరాల్లో ఆదొక్కటే గాడ్సేకు గుడులు కట్టేలా ప్రోత్సహిస్తున్న కారణం. గాంధీజీ పట్ల ఆరెస్సెస్ ద్వేషం ఆరెస్సెస్ ఆరంభం నుండే ఉంది. ఆరెస్సెస్ స్థాపకుడు హెగ్డేవార్ 1925కు ముందు కాంగ్రెసులో ఉండేవారు. సావర్కర్ అప్పటికి అనేకసార్లు బ్రిటీషు వారికి మెర్సీ పిటీషన్లు పంపించాడు. విప్లవ కార్యకలాపాలు మానుకుంటానని, బ్రిటీషు ప్రయోజనాలకు అనుకూలంగా  పనిచేస్తానని, విధేయంగా ఉంటానని రాసిచ్చిన తర్వాత 1921లో సావర్కర్ ను బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. గాంధీజీ హత్యకేసులో సహకుట్రదారుడిగా అతనిపై కూడా కేసు నడిచింది. కాని, సరయిన సాక్ష్యాధారాలు లేనందువల్ల కోర్టు ఆయన్ను విడిచిపెట్టింది.
            ఆరోజుల్లో భగత్ సింగ్ రాసిన లేఖకు, సావర్కర్ రాసిన లేఖకు ఎంత తేడా ఉందో వైర్ వార్తా సంస్థ రెండింటిని ప్రచురించింది. మేం యుద్ధఖైదీలం, ఉరి కాదు, కాల్చి చంపండి అని గర్జించాడు భగత్ సింగ్.

            1921లో సావర్కర్ విడుదలయ్యాక హిందూమహాసభ ద్వారా తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. హిందూరాష్ట్ర అనే కొత్త నినాదం ప్రవేశపెట్టారు. మరోవైపు గాంధీజీ హిందూ ముస్లిం సమైక్యత కోసం పనిచేస్తున్నారు. హిందువులను మాత్రమే సమైక్యం చేయడం గాంధీజీ నాయకత్వంలో సాధ్యం కాదని సావర్కర్ ను కలిసిన తర్వాత హెగ్డేవార్ భావించారు. హిందూ ముస్లిం సమైక్యత అనే భావజాలానికి వ్యతిరేకంగానే హెగ్డేవార్ కాంగ్రెస్ వదిలేశారని అనేకమంది వివరించారు.

            దేశవిభజన అనేక విషాదాలను తెచ్చింది. మతకలహాలు చెలరేగాయి. ఇరువర్గాల్లోను అనేక మంది మరణించారు. హరీష్ ఖేరే ది వైర్ లో రాసిన వ్యాసాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఖేరే ప్రకారం గాంధీజీ హత్యకు ప్రధాన కారణం దేశవిభజన తర్వాత జరిగిన మతకలహాలకు ఇక్కడి ముస్లిములపై ప్రతీకారం తీర్చుకోవాలనే మతోన్మాద శక్తులకు ఆయన అడ్డుగా నిలబడ్డాడు. ఢిల్లీలో మతకలహాలను ఆయన ఆపడానికి ప్రయత్నించారు. గాంధీజీ 1948 జనవరి 12వ తేదీన చివరి నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ మాటలను ఖేరే తన వ్యాసంలో ఇలా రాశారు.

            ’’నా కళ్ళ ముందే ఢిల్లీలో ముస్లిముల హత్యాకాండ చూస్తున్నాను. భారత ప్రభుత్వంలో నా సహచరుడు వల్లభ్ భాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరుగుతోంది. రాజధానిలో శాంతిభద్రతలు కాపాడే బాధ్యత ఆయనపై ఉంది. ఆయన ముస్లిములకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యాడు. ఈ విషయమై ఫిర్యాదులను కూడా ఆయన తేలిగ్గా కొట్టిపారేస్తున్నాడు. ఇక నాకు మరో దారి లేదు. పరిస్థితి మారే వరకు నిరాహారదీక్ష చేయడమే మిగిలింది‘‘

            సహనం, సామరస్యం బోధిస్తున్న గాంధీజీ మతోన్మాదులకు కంటకంగా మారారు. గాంధీజీ హత్య తర్వాత రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్న ’’గాంధీజీ హత్య వల్ల హిందూ మతం, హిందూ సమాజం ఎలా రక్షణ పొందిందో ఎవరైనా చెబుతారా?‘‘. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు జవాబులేదు.

            కాని గాంధీజీ పట్ల ద్వేషం ఇప్పటికీ తగ్గలేదు. కానీ ఈ విషయంలో నిజాయితీ కూడా లేదు. జిత్తులమారి మాటలు, చేతలు మాత్రమే కనబడతాయి. 2019 అక్టోబర్ 6 ఆర్గనైజరు పత్రిక మహాత్మాగాంధీపై ప్రత్యేక సంచికగా తీసింది. గాంధీజీ పట్ల ప్రధాని మోడీ తన గౌరవాదరాలను ప్రకటిస్తూ ఉంటారు. కాని బీజేపీ నేతలు మాత్రం గాంధీజీని చులకన చేస్తూ మాట్లాడుతుంటారు. గత సంవత్సరం హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండే జనవరి 30న గాంధీజీ బొమ్మపై కాల్పులు జరిపి ఈ హత్యాకాండను సెలబ్రేట్ చేసుకుంది. మరోవైపు, ఆరెస్సెస్ అప్పుడప్పుడు గాంధీజీ ఫోటోలను కూడా ప్రదర్శిస్తుంది. గాంధీజీ పట్ల ప్రదర్శించే గౌరవాదరాలన్నీ కేవలం నాటకం మాత్రమే అనేది అనేక సందర్భాల్లో రుజువయ్యింది.
            ప్రధాని మోడీ అమెరికా పర్యటించినప్పుడు ట్రంప్ గారు మోడీగారిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఫాదర్ ఆఫ్ ఇండియా అన్నారు. మోడీ ఆనందంగా విన్నారు. జాతిపిత గాంధీజీ అని అక్కడ చెప్పడానికి నోరు విప్పలేదు. ట్రంప్ మాటలను సమర్థిస్తు జితేందర్ సింగ్ అప్పటి మంత్రి ట్రంప్ చెప్పిందే నిజమన్నాడు.
బిజేపీ ఇండోర్ ఐటి సెల్ ఇంచార్జ్ వికి మిట్టల్ మాట్లాడుతూ భారతదేశంలో గాడ్సే భక్తులు ఎక్కువగా ఉన్నారో, గాంధీ అభిమానులు ఎక్కువగా ఉన్నారో తెలుసుకోవాలంటే గాడ్సే వాడిన రివాల్వర్ వేలం వేయండి, గాడ్సే దేశభక్తుడో, ఉగ్రవాదో ప్రజలు చెప్పేస్తారని అన్నాడు. ఆయన ఉద్దేశ్యం గాంధీజీని హతమార్చిన రివాల్వరుకు ప్రజలు బ్రహ్మరథం పడతారని. 2018లో అమిత్ షా ఛత్తీస్ గఢ్ లో మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో కాంగ్రెసు పాత్రను కించపరుస్తూ మాట్లాడడమే కాదు, గాంధీజీని ’బహుత్ చతుర్ బనియా థా వో‘ అన్నారు. అంటే గాంధీజీ తెలివైన కోమటి అని అర్థం. నిజానికి బనియా అనే పదం గాంధీని ఉద్దేశించి జిన్నా వాడేవాడు. అదే పదం అమిత్ షా వాడారు. గాంధీజీ హత్య తర్వాత స్వీట్లు పంచుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. కే.వీ.సీతారామయ్య గాంధీని అత్యంత దుర్మార్గుడని వర్ణించాడు. పరిత్రాణాయ సాధూనం, వినాశాయ చదుష్కృతాం అన్నట్లు ... ఈ యుగంలో 1948 జనవరి 30 సాయంత్రం శ్రీరామచంద్రుడు నాథూరాం గాడ్సే రూపంలో వచ్చి గాంధీని హతమార్చాడని చెప్పాడు. గాంధీజీని ధర్మద్రోహి, దేశద్రోహి అని వర్ణించాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
గాంధీజిపై సాక్షి మహరాజ్, ప్రజ్ఞా ఠాకూర్, అనంతకుమార్ హేగ్డే ఇలా అప్పుడప్పుడు అనేకమంది చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఆరెస్సెస్ కు, బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియకుండా ఏదో పొరబాటున చెప్పేస్తున్న మాటలు కాదు. ఇలాంటి వివాదం వచ్చినప్పుడు అవసరమనుకుంటే బీజేపీ కంటితుడుపు చర్య ఏదో ఒకటి ప్రకటిస్తుంది. కాని తర్వాత మరొకరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేస్తారు. నెమ్మదిగా సమాజంలో, దేశంలో గాంధీజీని తులనాడడం, హేళన చేయడం, కించపరచడం ఒక సాధారణ విషయంగా మార్చేసే ఎత్తుగడ ఇది.

            గాంధీజీ హత్య జరిగిన కాలం, చరిత్రను కాస్త గుర్తు తెచ్చుకుంటే, యూరపులో ఫాసిజం బుసలు కొడుతున్న కాలం అది. ఇరవయ్యో శతాబ్దపు ఆ హింసాత్మక రాజకీ వాతావరణంలో గాంధీజీ దేశానికి చేసిన గొప్ప సేవ, ఫాసిస్టు భావాలు మన సమాజంలో తలెత్తకుండా కాపాడ్డం. సామరస్యం, సహనం, శాంతియుత సహజీవనాలతో ప్రగతి పథాన దేశాన్ని నడిపించే మార్గం చూపించడం. జర్మనీ, ఇటలీల్లో పెచ్చరిల్లిన ఫాసిస్టు భావాలు మానవాళి చరిత్రలో మహావిషాదాలకు దారితీశాయి.

            ఇదంతా ఇక్కడ ప్రస్తావించడానికి కారణమేమిటంటే, హిందూ ముస్లిం సమైక్యత, సామరస్యాలను ఇష్టపడని వారే ఇప్పుడు సిఏఏ అంటూ హిందువులు వేరు, ముస్లిములు వేరు అనే భాష మాట్లాడుతున్నారు.  సిఏఏ పౌరసత్వం ఇస్తుంది. అందులో అనుమానం లేదు. ఇది భారత ముస్లిములకు సంబంధించింది కాదు, విదేశీయులకు సంబంధించింది. అది కూడా నిజమే.  కాని ఎవరికి పౌరసత్వం ఇస్తుంది అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇప్పటికే దేశంలో నివసిస్తున్న ప్రజలకు పౌరసత్వం ఇస్తుంది, ఇప్పటికిప్పుడు ఏ దౌత్యకార్యాలయంలోనో ఆశ్రయం కోరిన వారికి కాదు. ఇక్కడి ప్రజలు పౌరసత్వం కోరే పరిస్థితి ఎఫ్పుడు వస్తుంది. వారి పౌరసత్వం నిరాకరించబడినప్పుడు.
           
            అదెలా జరుగుతుంది? క్రోనాలజీ ప్రకారం ఎన్నార్సీ వచ్చినప్పుడు పౌరసత్వ నిరాకరణకు గురయ్యే వారు ఎక్కువగా ఎవరు ఉండవచ్చు? కాస్త లోతుగా ఆలోచిస్తే హిందూ ముస్లిం సముదాయాల మధ్య శాశ్వత స్థాయి వైరాన్ని రెచ్చగొట్టే పన్నాగం దీని వెనుక కనిపిస్తుంది. ఎన్నార్సీ ఆలోచన ఇప్పటికైతే లేదంటూ నిరసనలను చల్లార్చే ప్రయత్నాల్లో దాగి ఉన్న నిజమేమిటంటే, భవిష్యత్తులో ఎన్నార్సీ రావడం తథ్యం. ఎన్నార్సీ రాకపోతే సిఏఏ అవసరమే లేదు.

            కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇంకా ఇతర నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారనడం వెనుక ఉద్దేశ్యం ఇదే. హిందూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం, కేవలం హిందువులను మాత్రమే సమైక్యపరచి ఇతరులను పరాయీకరించడం. పాకిస్తాన్ భాష మాట్లాడుతున్న ఈ కేజ్రీవాళ్ళు, గాంధీలు షాహీన్ బాగ్ నిరసనకారులకు బిరియానీలు తినిపిస్తున్నారనే ప్రచారం ఎందుకంటే, ఇక్కడ షాహీన్ బాగ్ వంటి నిరసనల్లో ఉన్నవాళ్ళంతా ’’పరాయీ‘‘ శిబిరానికి చెందినవారని, అలాంటి వారితో ఈ నేతలు చేతులు కలిపారని ’’మనవాళ్ళకు‘‘ చెప్పడం. ఇది కేవలం ఢిల్లీ ఎన్నికల ఎత్తుగడ కాదు. ఎన్నార్సీ రాకపోతే ఇలాంటి ’’పరాయీ‘‘లను కట్టడి చేయలేమనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం. చివరకు ఎన్పీఆర్ రూపంలో ఎన్నార్సీ అమలుకు రంగం సిద్ధం చేసుకోవడం. అంతిమంగా తమ ఓటు బ్యాంకును పరిరక్షించుకోవడమేగాక పటిష్టం చేసుకోవడం.

            ఇందులో నష్టపోయేది కేవలం ముస్లిములు మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యమే నష్టపోతుంది. దళిత, బడుగు బలహీనవర్గాల ఓటు హక్కు కూడా గల్లంతవుతుంది. వారి రాజకీయాధికారానికి, వారి సామాజిక సంక్షేమ పథకాలకు, రిజర్వేషన్లకు అన్నింటికి ప్రమాదమే. చివరకు వారంతా పౌరసత్వ భిక్ష కోసం క్యూల్లో నిలబడే పరిస్థితి కల్పించడం.

            బాబరీ మస్జిదుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, బీజేపీ ప్రభుత్వం తన విజయంగా చెప్పుకుంది. ముస్లిములెవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. తక్షణ ట్రిపుల్ తలాక్ ను నేరపూరిత చర్యగా పరిగణించే చట్టం వచ్చింది. దాన్ని కూడ ముస్లిం సమాజం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరూ రోడ్ల పైకి రాలేదు. కాని సిఏఏ తర్వాత ప్రభుత్వానికి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థాయిలో ఇంటాబయటా విమర్శలు వస్తాయనీ, నిరసనలు వెల్లువెత్తుతాయని అది ఊహించలేదు.

            యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సిఏఏపై చర్చిస్తోంది. దేశంలేని ప్రజల సంఖ్యను పెంచరాదని లక్సెంబర్గ్ చెప్పింది. డెమొక్రటిక్ కాంగ్రెస్ విమన్ ప్రమీలా జయపాల్ కశ్మీరు విషయంలో తీర్మానం ఇంకా ఉండనే ఉంది. ఇప్పటి వరకు 49 మంది కో స్పాన్సర్లు ఈ తీర్మానానికి ఉన్నారు. విదేశీ మీడియా చాలా తీవ్రంగా విమర్శలు సంధిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో నిరసనలను కఠినంగా అణిచేయాలనే ధోరణి మరింత ఎక్కువయ్యింది. ఇది కొన్ని సందర్భాల్లో హాస్యాస్పదమైన సంఘటనలకు కూడా దారితీస్తోంది.

            ఓక్లాలో ఇండియా ఆర్ట్ ఫెయిర్ 2020 జరిగింది. ఇటాలియన్ ఎంబసీ కల్చరల్ సెంటర్ బూత్ లో వివాదాస్పద చిత్రాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు వచ్చారు. అక్కడ రాసి ఉన్న మహాకవి ఇక్బాల్ కవిత ’’తూ షాహీన్ హై పర్వాజ్ హై కామ్ తెరా, తేరే సామనే ఆస్మాన్ ఔర్ భీ హై‘‘ చూసి ఉలిక్కిపడ్డారు. షాహీన్ అనే పదం వింటేనే ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారనిపిస్తోంది. షాహీన్ అంటే ఇంగ్లీషులో ఫాల్కన్ పక్షి. తెలుగులో డేగ అంటాం. డేగవు నువ్వు, ఎగరడమే నీ పని, నీ ముందు ఆకాశాలు ఇంకా చాలా ఉన్నాయి” అని ఆ కవితకు అర్థం. సారే జహాంసే అచ్ఛా హిందూస్తాన్ హనారా” రాసింది కూడా ఇక్బాలే. ఈ కవిత ఒక గజల్ లోనిది సితారోంకే ఆగే జహాం ఔర్ భీ హై... అభీ ఇష్క్ కే ఇంతిహాం ఔర్ భీ హై అనే గజల్లోని కవిత ఇది. ఈ ఫిర్యాదు రాగానే బెదిరిపోయిన ఇండియా ఆర్ట్ ఫెయిర్ నిర్వాహకులు ఈ ఇటాలియన్ ఎంబసీ కల్చరల్ సెంటర్ లో ఏం జరుగుతుందో తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. విచిత్రమేమంటే ఈ చిత్రాల్లో ఎక్కడా సిఏఏ, ఎన్నార్సీ ప్రస్తావన లేదు. కాని చిత్రంలో కొందరు మహిళలు ముస్లిములుగా కనపించడమేగాక  షాహీన్ అనే పదం కూడా వుండడంతో  ఢిల్లీ పోలీసులు దుకాణం కట్టేయమన్నారు. అదే ప్రదర్శనలో గాల్లరిస్క్ అనే చోట రాజ్యాంగాన్ని సూచించే చిత్రాలు, ప్రస్తుతం జరుగుతున్న చర్చను సూచించేవి ఉన్నా వాటిని పట్టించుకోలేదట.

            ఒక నాయకుడు అనేవాడు లేకుండా, నేరుగా రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, అసలు నాయకుడు / నాయకురాలు అనేవారే లేకుండా హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతాయని బీజేపీ సంఘపరివారం ఊహించలేదు. అంతర్జాతీయంగా కూడా ఇంతటి ప్రతిస్పందన వస్తుందని వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు షాహీన్ బాగ్ అంటే ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతం కాదు. జనవరి చివరి వారం నాటికి దేశవ్యాప్తంగా 150 ‘షాహీన్ బాగ్’ నిరసన శిబిరాలు నెలకొన్నాయి.  నిరసనల్లో ముస్లిం మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ అన్ని మతాల వారు పాల్గొంటున్నారన్నది కాదనలేని వాస్తవం. షాహీన్ బాగ్ వద్ద శిక్కు సోదరులు వచ్చి, మీరు మాకు సోదరీమణులు, మీకు అండగా మేమున్నాం అంటూ ఇచ్చిన భరోసా సోషల్జ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

            షాహీన్ బాగ్ లో కేజ్రీవాల్ బిరియానీ పెట్టడం లేదు, శిక్కు సోదరులు లంగర్ నడుపుతున్నారు. ఈ నిరసనలు సాధారణ ప్రజలు ప్రారంభించినవి. ఎక్కడా మనకు నాయకుడు కనబడడం లేదు. జామియా విశ్వవిద్యాలయం కాబట్టి అక్కడ కనీసం విద్యార్థి నాయకులు ఉన్నారు. షాహీన్ బాగ్ లో నేతలెవ్వరు లేరు. అక్కడకు ఎవరు వచ్చినా మైకు ఇస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. అలా వచ్చేవారిలో ఎవడో ఒకడు, నిరసనను అపఖ్యాతి పాలు చేయడానికి రెచ్చగొట్టే నినాదాలిచ్చి బీజేపీకి సహకరిస్తాడేమో అనే భయాలు కూడా వారిలో ఉన్నాయి. ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్) కన్వీనర్  ఖాన్ యజ్దానీ షాహీన్ బాగ్ శిబిరాన్ని సందర్శించినపుడు  అక్కడి వాళ్ళు ఈ భయాలు వ్యక్తం చేశారు. ఈ నిరసనకారులు ఏ రాజకీయ పార్టీ జెండా కింద లేరు. పరాయీకరణ ద్వారా పరిపాలించాలనుకునే వారికి ఇక్కడ పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. తుకడే తుకడే గ్యాంగ్, అర్బన్ నక్సల్స” “ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వంటి పదాలతో దాడి చేయడం సాధ్యం కాలేదు. ప్రజలు ఇలాంటి మాటలను నమ్మడం మానేశారు. కాబట్టి కొత్త పదాలతో వచ్చారు. వాళ్ళు నిరసనకారులు కాదు, నేరస్తులు, మీ ఇండ్లలో చొరబడి మానభంగాలు, హత్యలు చేస్తారు” అని ఒకడంటే, వాళ్ళు దేశద్రోహులు; వాళ్లను కాల్చిపారేయాలి” అని మరొకడు అంటాడు. అంటే పరాయీకరణ ప్రయత్నాలు జోరుగా జరుగుతూనే ఉన్నాయి.

            చైనాలో తియాన్మేన్ స్వ్కేర్ మాదిరి షాహిన్ బాగ్ ఇప్పుడు మారింది. షాహీన్ బాగ్ ను పరాయీకరించగలిగితే ఢిల్లీ గద్దె దక్కడమే కాదు, ఎన్నార్సీని బలవంతంగానైనా అమలు చేసే సాకు దొరుకుతుంది. కాని కేవలం కొద్దిమంది బురఖాలు ధరించిన మహిళలు ప్రారంభించిన ఉద్యమం అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ఠను గంగలో కలిపిందన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడం కూడా చాలా కష్టం. దేశవ్యాప్తంగా అనేకమందికి స్పూర్తినిచ్చే ఉద్యమంగా ఎలా మారిందన్నది అర్ధం కాని పరిస్థితిలో కమలనాథులు ఉన్నారు. అందుకే కుట్రపూరిత రాజకీయ సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నారు.

            ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కేజ్రీవాల్ వర్సెస్ మోడీ కాదు. మోడీ వర్సెస్ షాహీన్ బాగ్ గా మారిపోయాయి. ఇలా మార్చింది బీజేపీయే. “ఏ లాడాయి హిందూస్తాన్ వెర్సస్ షాహీన్ బాగ్ కా హై” అని కేంద్ర ప్రభుత్వ పెద్దలే అంటున్నారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మోదీజీ ని  దేవుడిచ్చిన అన్నగా మారారని ప్రచారం చేసుకున్న సంఘపరివారం, ఇప్పుడు షాహీన్ బాగ్ శిబిరాన్ని కూల్చడానికి ముస్లిం పురుషుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలెట్టింది. “ముస్లిం పురుషులు తమ  మహిళలను షాహీన్ బాగ్ లో నిరసనలకు పంపి తాము మాత్రం ఇంళ్ళల్లో వెచ్చగా రగ్గులు కప్పుకుని పడుకుంటున్నారు” అని ఎద్దేవా చేస్తున్నారు.  కానీ వాళ్ళ ఈ ప్రయత్నాలు కూడా ఫలితాన్నివ్వలేదు.

            నిన్నటి వరకు పౌరసత్వం అనేది ప్రతి భారతీయుడికి జన్మహక్కుగా భావించే వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ వాతావరణం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఎన్ని సంఘటనలు ఎలాంటివి జరిగినా, మూకహత్యలు జరిగినా, మూకహత్యల నేరస్తులకు మంత్రులు వెళ్ళి సన్మానాలు చేసినా, ఇది నా దేశం అనే నమ్మకం ముస్లిం సమాజంలో చెక్కుచెదరకుండా ఉండేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భయపడుతూనే కొందరు గొంతు విప్పగలిగేవారు. పౌరహక్కులకు కోర్టుల రక్షణ ఉంటుందనే నమ్మకం ఉండేది. నేడు కాలి కింది నేల లాగేస్తున్న భావన కలుగుతోంది. పౌరసత్వమే లేనప్పుడు పౌరహక్కులుంటాయా?

            ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు అందులో కొంత మేలు కూడా జరుగుతుంది. ముస్లిం సమాజంలో నిన్నటి వరకు ఉన్న భయాలు ఇప్పుడు పోయాయి. నిరాశ నిస్పృహల వాతావరణాన్ని ఎదిరించాలనే ఖచ్చితమైన సంకల్పం వారిలో కనబడుతోంది. అంతేకాదు, ముస్లిం గుర్తింపు విషయంలో మొహమాటపడడం, సంకోచించడం అవసరం లేదనే ధోరణితో ముందుకు నడుస్తున్నారు.

            దే స్వతంత్ర పోరాటంలో ముస్లిములు కూడా సమాన భాగస్వాములుగా పోరాడారు. ఉరికంబమెక్కిన భగత్ సింగులే కాదు, అష్పాకుల్లా ఖాన్ లు కూడా ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయిలే కాదు, హజ్రత్ మహళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర పుటల్లోంచి ఈ స్వతంత్ర సమరయోధుల పేర్లను చెరిపేసేందుకు మతతత్వ శక్తుల ప్రయత్నించినంత  మాత్రాన చారిత్రక వాస్తవాలు మరుగున పడిపోవు. ఇండియన్ ముస్లింగా గర్వంగా ప్రకటిస్తూ వాళ్ళు గుంపులు గుంపులుగా నిరసనల్లోకి వస్తున్నారు.  

            ఉత్తరప్రదేశ్ లో నిరసనకారులపై దారుణమైన బలప్రయోగం సాగించారు.  కర్నాటకలో ఆందోళనకారుల్ని క్రూరంగా అణిచివేశారు. జామియాలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అతి హేయమైన పధ్ధతుల్లో హింసించారు. జామియా వద్ద, షాహీన్ బాగ్ వద్ద నాలుగు రోజుల్లో మూడుసార్లు కాల్పులు జరిగాయి. “ఈ దేశంలో హిందువుల మాటే చెల్లుతుంది” దని కాల్పుల దుండగులు నినాదాలిచ్చారు. ఢిల్లీలో సాకేత్ గోఖలే అనేవాడు “దేశ్ కే గద్దారో కో -  గోలీమారో సాలో కో” అనే నినాదాలిస్తూ ప్రదర్శన చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఏకంగా ఢిల్లీ పోలీసు డిప్యూటి కమీషనర్ కు అర్జీ పెట్టుకున్నాడు. ఈ సంఘటనలేవీ నిరసనకారుల ఆత్మబలాన్ని తుంచలేదు. తుంచబోవు.

            ఈ నిరసనల్లో గమనించవలసిన మరో వాస్తవమేమంటే, నిరసనల్లో ఉన్నది మహిళలే. నాయకులెవ్వరు లేరు. ఆందోళనలో అందరూ సమానులే. మహిళల మీద సాగే లింగ వివక్షను ఈ నిరసనలు తల్లకిందులు చేసేశాయి. ముస్లిం మహిళలంటే అణచివేతకు బలవుతున్న ప్రాణులనీ, వేధింపులను మౌనంగా భరించే వాళ్ళని సమాజంలో ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలన్నీ ఇప్పుడు పటాపంచలై పోయాయి.  ముస్లిం మహిళలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బలంగా గొంతువిప్పడమే కాదు, బెదిరింపులకు చెదిరిపోయేది లేదని బలంగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యానికి కావలసింది ఇలాంటి బలమైన అభిప్రాయాలు కలిగిన పౌరులే.
            కొందరు అకడమిక్ సీనియర్ సిటిజన్ మహిళలు టీవీ డిబేట్లలో లాజిక్ తో నచ్చచెప్పడానికి చేసే ప్రయత్నాలు నిన్నటి మాట. వీధుల్లో తమ గొంతు బలంగా వినిపిస్తున్న ఈ హిజాబీ అమ్మాయిలు చెప్పేది నేటి మాట.

            శరీరమంతా కప్పేస్తున్న నల్లటి బురఖా ధరించి కిలోమీటర్ల పొడవు మానవహారం ఏర్పాటు చేసిన మహిళల దృశ్యం గతంలో ఎప్పుడైనా చూశారా? మతపరమైన గుర్తింపు విషయంలో సంకోచాలను ముస్లిం స్త్రీపురుషులు ఇప్పుడు వెనక్కు నెట్టేశారు. సమానస్థాయి పౌరులుగా తమ మాట వినిపిస్తున్నారు. రెండవ స్థాయి పౌరులగా ఉన్నామనే న్యూనతాభావాన్ని వదిలించుకున్నారు. నిన్నటి వరకు నెత్తిన టోపీ పెట్టని వారు, నిన్నటి వరకు బురఖా వేసుకోని వారు కూడా ఇప్పుడు తమ గుర్తింపును ప్రదర్శిస్తూ వస్తున్నారు. హిజాబీ అమ్మాయిల సంఖ్య పెరిగింది. నిరసనకారులతో తమ సంఘీభావాన్ని ప్రదర్శించడానికి హిజాబ్ ధరించని అమ్మాయిలు హిజాబ్ ధరించి వస్తున్నారు. మరో ముఖ్యమైన మార్పు ఏమంటే రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారేది లేదని ఖచ్చితంగా చెబుతున్నారు.

            షాహీన్ బాగ్ వంటి నిరసనల వల్ల బీజేపీకి అవకాశం దొరుకుతుందని, మతపరంగా ఓట్లు చీలిపోతాయని గతంలో సెంట్రిస్ట్ పార్టీలు, వామపక్షాలు కూడా అభ్యంతరాలు చెప్పేవి. ముస్లిములు తమ సమస్యల పరిష్కారానికి ఎవరో ఒకరిపై ఆధారపడక తప్పదనే వాతావరణం ఉండేది. కాని ఇప్పుడు పౌరసత్వమే ప్రమాదంలో ఉన్నప్పుడు, కాలికింది నేల జారిపోతున్నప్పుడు బీజేపీకి లాభం కలుగుతుందా, మరొకరికి నష్టం కలుగుతుందా అనేది తమకు అనవసరమని ముస్లిం సమాజం సమైక్యంగా నిలబడింది. ఇది కొత్త పరిణామం. తమ గుర్తింపును బలంగా చెబుతూ, తమ నిరసనను ప్రకటించడం. భారతరాజ్యాంగం పట్ల నిబద్దత, భారత పతాకం పట్ల, జాతీయగీతం పట్ల తమ అభిమానాన్ని, గౌరవాదరాలను ప్రకటిస్తూ నిరసనకారులు ర్యాలీల్లో మువ్వన్నెల ప్రవాహాలను సృష్టించారు. దేశాభిమానం విషయంలో తమను ఎవరు ప్రశ్నించలేరన్నది స్పష్టంగా చాటి చెప్పారు.

            ముస్లిముల్లో వచ్చిన ఈ మార్పు ఒకవైపు ఉంటే సిఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో ముస్లిమేతరులు పోషిస్తున్న కీలకమైన, ప్రశంసనీయమైన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాది మంది హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తాము అండగా ఉన్నామంటూ వచ్చి నిలబడడం భారత జాతి ప్రత్యేకతను చాటి చెప్పింది. మతం కన్నా ముందు మనమంతా భారతీయులం, భారత రాజ్యాంగానికి కట్టుబడిన వారిమనే సందేశాన్ని బలంగా వినిపించారు. 1970ల నాటి జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అన్నా హజారే ఉద్యమం యుపియే ప్రభుత్వాన్ని పడగొట్టింది. సిఏఏ ఇప్పుడు మూడో ఉద్యమం. దేశవిదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

            అందరం అర్ధం  చేసుకోవలసిన వాస్తవమేమంటే సిఏఏ అనేది దేశంలోని ముస్లిములకు హాని కలిగించేది కాదు అని అంటూన్న మాటలో నిజం లేదు. ఐదేళ్ళకు ముందే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివశిస్తున్నవారిలో ముస్లిమేతరలకు మాత్రమే పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది. ఎన్నార్సీ విషయంలో ఇప్పటివరకు నిర్ణయం జరగలేదంటే భవిష్యత్తులో నిర్ణయం జరగవచ్చనే హెచ్చరిక ఉంది. ఎన్నార్సీ వస్తేనే క్రోనాలజీ పూర్తవుతుంది. ఎన్నార్సీ వస్తేనే దేశంలో ఉంటున్న పౌరుల్లో కొందరు పౌరసత్వం కావాలని ధరఖాస్తు చేసుకునే పరిస్థితి వస్తుంది. మనవాళ్ళు, పరాయీవాళ్ళు అనే విభజన పూర్తవుతుంది. అలా ధరఖాస్తు చేసుకునే అవకాశం ముస్లిములకు లేకుండా చేయడం ద్వారా ’’మనవాళ్ళకు‘‘ మాత్రమే ఓటుహక్కు లభించేలా చేయవచ్చు.





No comments:

Post a Comment