Tuesday, 4 February 2020

షాహీన్ బాగ్ బీజేపీని గెలిపిస్తుందా?

షాహీన్ బాగ్ బీజేపీని గెలిపిస్తుందా?
05-02-2020 03:33:34

భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారానికి దూరమయింది. మోదీ ప్రభంజనమూ దేశ రాజధాని వాసులను కదల్చలేకపోయింది. వారి జీవన పరిస్థితులే అందుకు కారణమని చెప్పక తప్పదు. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు తాగునీరు, విద్యుత్, మురికినీటి పారుదల, ప్రాథమిక ఆరోగ్యం, ప్రజారవాణా, నాణ్యతగల విద్య వంటి వాటికోసం సంఘర్షించాల్సిన పరిస్థితి. కేజ్రీవాల్ ఈ పరిస్థితులను అర్థం చేసుకుని వాటిపై దృష్టి కేంద్రీకరించారు. అందువల్ల షాహీన్ బాగ్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందనడాన్ని పూర్తిగా నమ్మక్కర్లేదు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జనవరి 20న జగత్ ప్రకాశ్ నడ్డా ఎన్నికైనప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా యే ఆ బాధ్యతలను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన, కోర్ కమిటీల నియామకం, బూత్ కమిటీలతో చర్చలు, సభల నిర్వహణ పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి పొద్దు పోయే వరకూ ఆయన దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లోని బిజెపి జాతీయ కార్యాలయంలో ఎన్నికల వ్యూహరచన తీరుతెన్నులను సమీక్షిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, ఆయన ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతూ రోజుకు కనీసం ఆయిదారు సభల్లో పాల్గొంటున్నారు.

మంగళవారం ఒక్క రోజే ఆయన ఆరు సభల్లో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇక కేంద్రమంత్రులు, పార్టీ నేతలు ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అమిత్ షా కేవలం ఢిల్లీ నేతలపైనే నమ్మకం పెట్టుకునే వ్యక్తి కాదు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలనుంచి వందలాది మందిని ఆయన ఢిల్లీకి పిలిపించి ఇంటింటికీ తిప్పుతున్నారు. ఇది చాలదన్నట్లు ఆర్‌.ఎస్‌.ఎస్. పూర్తి స్థాయి ప్రచారకులు తమ బలగాన్ని దింపి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాల మనసు ఢిల్లీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నది.

మధ్యాహ్నం అయ్యే వరకూ వారు పార్లమెంటులో ఉండి ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సార్వత్రక ఎన్నికల స్థాయిలో బిజెపి నేతలు, కార్యకర్తలు, సంఘ్ పరివార్ సభ్యులు తమ గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తున్నారు. ‘ఇదొక పానిపట్టు యుద్ధంలా ఉన్నది.’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో గెలవడం భారతీయ జనతా పార్టీకి ఎందుకు ముఖ్యం? 2014లో జరిగిన ఎన్నికల్లో దేశమంతటా నరేంద్రమోదీ ప్రభంజనం వీచిన సమయంలో కూడా బిజెపి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. మోదీని చూస్తే ప్రజలు ఉర్రూతలూగిన రోజులవి. ‘నాతో కరచాలనం చేసి నా కళ్లలోకి చూస్తే కనపడేది నరేంద్రమోదీ కాదు, భారత ప్రజలే నా కళ్లలో ప్రతిఫలిస్తారు..’ అని ఆయన రామ్ లీలా మైదానంలో మాట్లాడినప్పుడు జనం పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఢిల్లీని ప్రపంచ రాజధానుల కంటే గొప్ప రాజధానిగా మారుస్తానని ఆయన ప్రకటించారు. అప్పుడు కూడా అమిత్ షా పూర్తిగా ఢిల్లీ నేతలపై ఆధారపడలేదు. పోలింగ్ స్టేషన్లలో కూడా బయట నుంచి మనుషులను రప్పించి ఏజెంట్లుగా నియమించారు. అయినా ఫలితం లేకపోయింది.

ఢిల్లీ ఎన్నికల్లో ఏ అంశాల ఆధారంగా ప్రజలను ఓట్లు అడగాలో భారతీయ జనతా పార్టీకి అంతుబట్టట్లేదు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ అభివృద్ధిని ప్రధానాంశంగా చూపించి ప్రచారం చేసినా ఫలితం రాలేదు. 2015లో ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత మాజీ పోలీసు అధికారి కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించారు. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను బిజెపి ఢీకొనలేకపోయింది. కేవలం 3 సీట్లు మాత్రమే సాధించింది. ఇప్పుడు కూడా కేజ్రీవాల్‌ను ఓడించడం అంత సులభం కాదని ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే బిజెపికి తెలుసు.

ఇప్పటివరకూ జాతీయ మీడియా ప్రచురించిన ప్రతి కథనంలోనూ కేజ్రీవాల్‌దే విజయం అని అర్థమయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కేజ్రీవాల్ మరింత బలంగా తయారయ్యారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రజల్లో విపరీత జనాదరణ పొందాయి. మరో వైపు మోదీ అభివృద్ధి నినాదం అంతగా పేలేలా కనపడడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ నిరాశాజనక స్థితిలో ఉండడం, అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలను మోదీ పరిష్కరించ లేకపోతున్న విషయం వారికి అర్థమవుతోంది .

అయితే నరేంద్రమోదీ, అమిత్ షాల వద్ద బ్రహ్మస్త్రాలు లేకపోలేవు. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, త్రిపుల్ తలాఖ్ రద్దు, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయంపై సానుకూల ప్రచారం చేసే అవకాశాల మూలంగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి సానుకూలంగా మారతారని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనపడుతోంది. పౌరసత్వ చట్టం ప్రవేశ పెట్టిన తర్వాత జామియా, జెఎన్‌యుల్లో జరిగిన ఘటనలు, షాహీన్ బాగ్‌లో రోజుల తరబడి జరుగుతున్న నిరసన ప్రదర్శనలు కూడా ప్రజలను మత ప్రాతిపదికగా తమ వైపుకు తిప్పుకునే అవకాశాలు లేకపోలేదని బిజెపి భావిస్తోంది. అయినా సరే, కేజ్రీవాల్ ప్రభుత్వం వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలియడంతో బిజెపి నేతలు సంచలన ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు.

షాహీన్ బాగ్‌ను లక్ష్యంగా పెట్టుకుని ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను రెచ్చగొట్టేందుకు కూడా ప్రయత్నించారు. కేంద్ర సమాచారమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ ఎంపి పర్వేశ్‌తో పాటు పలువురు నేతలు నిరసన ప్రదర్శనలకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జవదేకర్ కేజ్రీవాల్‌ను టెర్రరిస్టుగా అభివర్ణిస్తే కేజ్రీవాల్ ప్రదర్శన కారులకు బిర్యానీ పొట్లాలు పంచిపెడుతున్నారని, ఇమామ్‌లకు జీతాలు ఇస్తున్నారని పర్వేశ్ ప్రకటనలు చేశారు.

సిఏఏని వెనక్కు తీసుకోవడానికి తమది రాజీవ్ ఫెరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ 96 గంటల పాటు నిషేధం ప్రకటించిన పర్వేశ్‌ను లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన వక్తగా బిజెపి రంగంలోకి దించడం గమనార్హం.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఈ చర్చలో పాల్గొన్నప్పుడు మరెన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారో వేచిచూడాలి. ‘నిరసన ప్రదర్శనకారులను కాల్చి చంపాలి’ అని అనురాగ్ ఠాకూర్, ‘మాటలతో వినకపోతే బుల్లెట్లతో జవాబు చెప్పాలి’ అని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు ముగ్గురు యువకులు తుపాకులతో వీరంగం సృష్టించారు.

షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉద్రిక్తత పెంచేందుకు వారికి వ్యతిరేకంగా మిగతా ప్రజలను మార్చేందుకు తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకూ పోలీసులు షాహీన్ బాగ్ వద్ద జనం ప్రదర్శనలు చేస్తుంటే దూరంగా కునికిపాట్లు పడుతూ కనిపించేవారు. ఇప్పుడు పోలీసుల మోహరింపు, అడుగడుగునా తనిఖీలు పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా తమ ప్రసంగాల్లో షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శన, సిఏఏ గురించే అధికంగా మాట్లాడుతున్నారు. ఈ నిరసన ప్రదర్శనను ప్రతిపక్షాల రాజకీయ కుట్రగా మోదీ అభివర్ణించారు. ఢిల్లీ ఎన్నికలు జాతీయవాదులకూ, షాహీన్ బాగ్‌కూ మధ్య జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు.

షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శన నిజంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మారుస్తుందా? ప్రజల్లో భావోద్వేగం ఎలా కల్పించాలో బిజెపి నేతలకు తెలిసినంత మరెవరికీ తెలియకపోవచ్చు. జామియా యూనివర్సిటీలో ప్రవేశించి లాఠీ ఛార్జీ జరిపిన పోలీసులు తలుచుకుంటే షాహీన్ బాగ్‌లో నిరసన ప్రదర్శన కారులను తొలగించడం పెద్ద కష్టం కాదు. పైగా ప్రదర్శన కారుల్లో అత్యధికులు మహిళలు, బాలికలే. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలోనే ఉన్నారు. కాని పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు ఇవాళ ఢిల్లీలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతున్నందువల్ల ఢిల్లీలో అణిచివేస్తే దేశమంతటా దాని ప్రభావం ఉంటుందని బిజెపికి ఇప్పటికే అర్థమయింది.

అందుకే షాహీన్ బాగ్ ప్రదర్శనను బూచిగా చూపెట్టి ఇతర ప్రజలను తమవైపుకు తిప్పుకోవాలనేది బిజెపి వ్యూహంగా మార్చుకుంది. బిజెపి ఈ వ్యూహం విజయం సాధిస్తే మొత్తం దేశంలో ఎన్నికల తీరుతెన్నులు మారిపోతాయి. అయిదేళ్లు ఏమీ చేయకపోయినా, భావోద్వేగాలు సృష్టించి విజయం సాధించడం ఒక కళగా పార్టీలు, ప్రజా ప్రతినిధులు అభ్యసిస్తారు. ‘ప్రజలను ఎలా విడగొట్టాలో మాకు తెలుసు. ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలు వంటి విషయాలు మాట్లాడడం అనేది కాలం చెల్లిన భావజాలం. ఇప్పుడు జనం మారిపోతున్నారు. ముఖ్యంగా యువతను మా వైపుకు తిప్పుకోవడం సులభం’ అని ఒక బిజెపి ఎంపి అన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆలోచనా విధానం దేశ సామాజిక వాతావరణాన్ని అతలాకుతలం చేయక తప్పదు.

కానీ, ఢిల్లీ ప్రజలు అత్యధికంగా స్థానిక సమస్యల పరిష్కారానికే మొగ్గు చూపుతారని, షాహీన్ బాగ్‌ను వారు పట్టించుకోరని చెప్పే రాజకీయ పరిశీలకులు అధికంగా ఉన్నారు. 1998లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం పట్ల జనాదరణ ఉన్నప్పటికీ ఉల్లిపాయల ధరలు పెరగడంతో ప్రజలు బిజెపిని గద్దెదించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కేవలం అభివృద్ధి, జనాకర్షక విధానాలతో 15 ఏళ్లు అధికారంలో ఉండగలిగారు. 2008లో లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు కాల్పులు, బాంబుదాడులతో భీభత్సం సృష్టిస్తున్న తరుణంలో బిజెపి ఉధృత ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కు మూడోసారి పట్టం కట్టారు.

ఆ తర్వాత కేజ్రీవాల్ రంగ ప్రవేశంతో బిజెపికి ఢిల్లీలో ప్రవేశించే అవకాశం లేకపోయింది. కాంగ్రెస్ సామాజిక ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వాధీనం చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. అంటే దాదాపు 22 సంవత్సరాలు బిజెపి ఢిల్లీలో అధికారానికి దూరం అయింది. మోదీ ప్రభంజనం కూడా ఢిల్లీ ప్రజలను కదల్చలేకపోయింది. ఇందుకు కారణం ఢిల్లీలో ప్రజల జీవన పరిస్థితులేనని చెప్పక తప్పదు. దాదాపు 76 శాతం మంది అనధికార కాలనీల్లోను, 50శాతం మంది మురికివాడల్లో గుడిసెల్లోను నివసిస్తున్నారు.

పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు తాగునీరు, విద్యుత్, మురికినీటి పారుదల, ప్రాథమిక ఆరోగ్యం, ప్రజారవాణా, నాణ్యతగల విద్య వంటి వాటికోసం సంఘర్షించాల్సిన పరిస్థితి. కేజ్రీవాల్ ఈ పరిస్థితులను అర్థం చేసుకుని వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఇదే ఆయన విజయ రహస్యం. అందువల్ల షాహీన్ బాగ్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందనడాన్ని పూర్తిగా నమ్మక్కర్లేదు.

అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి వ్యూహరచనను తేలిగ్గా తీసుకోవడం లేదు. పౌరసత్వ చట్టం గురించి కానీ, షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శన గురించి కానీ బిజెపి ఎంత కవ్వించినా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బిజెపి జాతీయ ఎన్నికలుగా మార్చకుండా ఉండేందుకు ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2014 ఎన్నికలకు నరేంద్ర మోదీ తరఫున వ్యూహరచన చేసి గుజరాత్‌లో ఆయన ఇంటి నుంచే తన కార్యాలయాన్ని నడిపిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు.

మోదీ, అమిత్ షాల వ్యూహరచన గురించి ప్రశాంత్ కిషోర్‌కు బాగా తెలుసు. వివాదాస్పద అంశాలపై కేజ్రీవాల్‌ను, ఆప్ నేతలను మాట్లాడకుండా చేసి ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడాలని ఆయన చెబుతున్నారు. ఒక సంధియుగంలో జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఢిల్లీకే పరిమితం కావని, దాని పర్యవసానాలు దేశంపై కూడా పడతాయన్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ అంగీకరిస్తున్నారు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


No comments:

Post a Comment