Saturday, 5 October 2019

ఆనాటి కుబేరుడు - మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

ఆనాటి కుబేరుడు - మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
04-10-2019 23:00:17

నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా నిజాంల ‘రాజ ముద్ర’ కనిపిస్తుంది. కోటలు తలపించే భవంతులు... విభిన్న నిర్మాణ శైలులు... సువిశాల సంస్థానానికి ఆఖరి నిజాంగానే కాదు... ప్రపంచంలోనే సంపన్నుడిగా మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నాడు చరిత్ర లిఖించారు. తాజాగా పాకిస్తాన్‌కు ఆయన పంపిన పది లక్షల పౌండ్ల నగదుపై ఏడు దశాబ్దాలుగా సాగుతున్న కేసులో తాజాగా భారత్‌ విజయం సాధించింది. మరి స్వాతంత్ర్యానికి ముందు... తరువాత కూడా వార్తల్లో నిలిచిన మీర్‌ ఉస్మాన్‌ సంపద ఎంత?

ఓసారి ప్యాలెస్‌ సెల్లార్‌లోని ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన 30 లక్షల డాలర్ల పాత నోట్లు ఎలుకలు కొట్టేశాయి. విషయం తెలుసుకున్న నిజాం దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నిజాం ఎంత ధనవంతుడో చెప్పడానికి ఇదో మచ్చుతునక.

1911లో పట్టాభిషిక్తుడైన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మూడున్నర దశాబ్దాలకు పైగా పాలించారు. సుదీర్ఘ కాలం హైదరాబాద్‌ను ఏలిన ఆయన మహా భాగ్యవంతుడిగానూ వెలుగొందారు. 1937 ఫిబ్రవరి 22న ‘టైమ్‌ మ్యాగజైన్‌’ కవర్‌ పేజీపై మీర్‌ ఉస్మాన్‌ చిత్రాన్ని ప్రచురించింది. ఆయనను ప్రపంచంలోకెల్లా ధనవంతుడిగా అందులో పేర్కొంది. ఆ కథనం ప్రకారం 1940ల్లో ఆయన సంపద 2 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం అది 35.8 బిలియన్‌ డాలర్లకు సమానం. ఆ మొత్తం నాటి అమెరికా ఆర్థిక బలంలో 2 శాతం. అప్పట్లో కొత్తగా ఏర్పాటైన స్వతంత్ర భారత ప్రభుత్వ వార్షిక ఆదాయం ఒక బిలియన్‌ డాలర్లు మాత్రమే.

నిజాం వద్దనున్న ఆభరణాల్లో చెప్పుకోదగినది 185 క్యారెట్ల జాకబ్‌ డైమండ్‌. దీన్ని ఆయన పేపర్‌ వెయిట్‌గా వాడేవారు. దాని విలువ 50 మిలియన్‌ డాలర్లు.
 1967లో నిజాం మరణించే వరకు దక్షిణాసియాలోకెల్లా సంపన్నుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తరువాత నిజాం, ఆయన పిల్లలకు చెందిన సంపదలో 97 శాతానికి పైగా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నిజాం మరణానికి ముందు వేసిన అంచనా ప్రకారం ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ 110 మిలియన్‌ డాలర్లు. అందులో బంగారం, ఇతర ఆభరణాల విలువే 40 మిలియన్‌ డాలర్లు. వాటిని ‘నిజాం ఆభరణాల ప్రదర్శన’ పేరిట భారత ప్రభుత్వం ప్రదర్శనకు ఉంచింది. వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రత్నాలు పొదిగిన కంఠాభరణాలు, వడ్డాణాలు, బెల్టులు, బకిల్స్‌, బటన్స్‌, చెవి రింగులు, ముక్కెరలు, బ్రేస్‌లెట్ల వంటివెన్నో మురిపిస్తాయి.

నిజాం ప్యాలెస్‌ తోటలో టార్పాలిన్లు కప్పి, తుప్పు పట్టిన లారీలు బారులు తీరి ఉండేవి. అవన్నీ బంగారు కడ్డీలు, వజ్రవైఢూర్యాల వంటి విలువైన రాళ్లతో నిండినవి. విప్లవోద్యమం రగులుతున్న ఆ సమయంలో అవసరమైతే వాటితో పరారైపోవచ్చని ఆ ఏర్పాట్లు చేశారట.

వీటన్నింటినీ మించి నిజాం ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారు. ఆయన రక్షణ కోసం ఉత్తర ఆఫ్రికా నుంచి 3 వేల మంది రక్షణభటులను నియమించుకున్నారు. రాజ భవంతిలోని షాండ్లియర్స్‌ను తుడవడానికి 38 మంది, ఆయన తాగునీటి అవసరాలు చూసుకోవడానికి 28 మంది పనివారు ఉండేవారు. వీరుకాక నిజాంకు ఇష్టమైన అక్రోట్‌కాయలను పగులగొట్టి ఇవ్వడానికి మరికొంతమందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు.

నేటికీ నిజామే..!
గత ఏడాది బ్రిటిష్‌ పత్రిక ‘ద ఇండిపెండెంట్‌’ ఓ ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. 2018 నాటికి హైదరాబాద్‌ నిజాం మొత్తం ఆస్తుల విలువ 236 బిలియన్‌ డాలర్లుగా ఆ పత్రిక పేర్కొంది. 2018 ‘ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌ జాబితా ప్రకారం ముఖేశ్‌ అంబానీ ఆస్తుల విలువ 49 బిలియన్‌ డాలర్లు. ఇక ప్రపంచంలో ధనవంతుడు జెఫ్‌ బెజోస్‌ ఆస్తుల మొత్తం 112 బిలియన్‌ డాలర్లు. ఈ లెక్కన 2018లో కూడా నిజాం రాజే ప్రపంచంలోకెల్లా ధనికుడనేది ఆ పత్రిక కథనం.

తాజాగా బ్రిటన్‌ హైకోర్ట్‌ వెలువరించిన తీర్పుతో నిజాం వారసులకు 307 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. 71 ఏళ్లుగా బ్రిటన్‌ నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో మగ్గుతున్న ఈ మొత్తానికి ప్రధాన వారసుడు, నిజాం మనవడు ముఖరంజా. ఈ కేసు మొదలైనప్పుడు చిన్న పిల్లవాడు. ఇప్పుడాయన 80 ఏళ్ల వృద్ధుడు.

ఎలిజబెత్‌కు పెళ్లి కానుక...
1947లో బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌కు పెళ్లి కానుకగా నిజాం వజ్రాలు పొదిగిన కిరీటం, నెక్లెస్‌ బహూకరించారు. ‘నిజాం ఆఫ్‌ హైదరాబాద్‌ నెక్లె్‌స’గా పిలిచే ఆ కంఠాభరణాన్ని వేడుకల్లో రాణి ధరిస్తుంటారు. ఇవే కాదు... ఏడో నిజాం వెలకట్టలేని కానుకలు, విరాళాలు ఎన్నో ఇచ్చారు. 1965లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ‘జాతీయ రక్షణ నిధి’ కింద ఐదు వేల కిలోల బంగారాన్ని నిజాం విరాళంగా ఇచ్చినట్టు కొన్ని కథనాలున్నాయి. పాకిస్తాన్‌తో యుద్ధం తరువాత నిధుల కోసం శాస్త్రి దేశ పర్యటన చేసిన తరుణంలో నిజాం ఈ విరాళం అందించినట్టు చెబుతారు. అయితే అలాంటి విరాళమేదీ రక్షణ నిధికి అందలేదని సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఆ మధ్య సమాధానం ఇచ్చింది.

No comments:

Post a Comment