Saturday, 22 June 2019

భారత్‌లో మతస్వేచ్ఛ లేదు

భారత్‌లో మతస్వేచ్ఛ లేదు
23-06-2019 01:22:01

2018 మతస్వేచ్ఛ నివేదికలో అమెరికా తీవ్ర ఆరోపణలు
వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 22: భారత్‌లో మతస్వేచ్ఛ లేదని.. ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలపై హిందూ సంస్థలు దాడులు చేస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆవులను తరలిస్తున్నారనే వదంతులతో ముస్లింలపై దాడులు జరుగుతున్నట్లు పేర్కొంది. 2018 అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘2018 ఏడాదంతా ముస్లింలపై దాడులు కొనసాగాయి. ఆ మూకలకు అధికారులు వత్తాసు పలికారు. భారత్‌కు చెందిన కొన్ని ఎన్జీవోలు ఇదే చెప్పాయి. ఒక్క నవంబరులోనే ఇలాంటి దాడులు 18 వరకూ జరిగాయి. ఏడాదిలో 8 మంది చనిపోయారు. పోలీస్‌ కస్టడీలో ఉన్న ముస్లిం పశువ్యాపారి చనిపోవడంతో జూన్‌ 22న యూపీలోని ఇద్దరు పోలీస్‌ అధికారులపై హత్యానేరం కింద కేసులు పెట్టారు.
 
నగరాలకు ముస్లిం పేర్లు తీసేసే ప్రక్రియ కొనసాగుతోంది. అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌ చేశారు. భారత చరిత్ర నుంచి ముస్లింల పాత్రను చెరిపేసేలా కుట్ర జరుగుతోంది. కావాలనే కొన్ని మతాల వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, దాడులు, దోపిడీలు, వివక్ష కొనసాగుతోంది. మతస్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు’ అని ఆ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికపై బీజేపీ మండిపడింది. ఇది మోదీ ప్రభుత్వంపైనా, బీజేపీపైనా వివక్ష చూపుతూ బురదజల్లే ప్రయత్నమని ఆ పార్టీ ఎంపీ అనిల్‌ బాలౌనీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర ప్రకారం మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొనడం పూర్తిగా సత్యదూరమని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment