Tuesday, 14 May 2019

ఒక్కడి కోసమే అందరూ-మరి అందరి కోసం నిలిచేదెవరు?

ఒక్కడి కోసమే అందరూ-మరి అందరి కోసం నిలిచేదెవరు?
Posted On: Tuesday,May 14,2019

              బిజెపి తన జాతీయతా (దురభిమాన) వాదాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ముస్లింల వెనుకబాటుతనాన్ని సైతం ఏవిధంగా వాడుకుంటున్నదీ చూద్దాం.
గత అయిదు సంవత్సరాలుగా బిజెపి ముస్లిం ప్రజల పట్ల రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒక వైపు 'సబ్‌ కా సాథ్‌-సబ్‌ కా వికాస్‌' అంటూ తాను అన్ని వర్గాల అభివృద్ధికీ పాటు పడతానన్నట్లు ఫోజు పెడుతోంది. ముస్లిం ప్రజల వెనుకబాటుతనానికి సంబంధించిన ప్రశ్న ఎవరైనా లేవనెత్తగానే బిజెపి అధికార ప్రతినిధులు 'అందరి అభివృద్ధి అంటే ఏదో ఒక వర్గాన్ని మంచి చేసుకోవడం కాదు' అంటూ ముస్లింల వెనుకబాటుతనానికి సంబంధించిన చర్చను దాటవేస్తున్నారు. అందరి అభివృద్ధి అంటే ఆ అందరిలో ముస్లింలు కూడా ఉంటారు కదా అని వాదిస్తున్నారు. ముస్లింలపై గోగూండాల దాడులు జరిగినప్పుడు అటువంటి దాడుల లక్ష్యం ముస్లిం మతం కాదని, గో రక్షణ కోసం జరిగే ఉద్యమంగా చూడాలని వాదించేందుకు పూనుకుంటున్నారు.
ఈ దేశంలో ముస్లింలు ఒక మైనారిటీగా దాడులను ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. బిజెపి, ఆరెస్సెస్‌ నియంత్రణలో పని చేసే ఒక హిందూ మతతత్వ పార్టీ అన్నది ఒక పచ్చి నిజం. 2014లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆరెస్సెస్‌ హిందూ రాజ్యాన్ని ఏర్పరచడానికి ప్రజలు తెలిపిన ఆమోదంగా ఆ ఎన్నికల తీర్పుకు భాష్యం చెప్పింది. ముస్లింల పై పెరుగుతున్న దాడులను, ముస్లింల నుంచి ఎన్నికైన ఎంపీల, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడాన్ని చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక స్వభావం స్పష్టమౌతుంది.
ఇప్పుడు మనం మత ప్రాతిపదికన వేరు వేరు ధృవాలుగా సమాజం చీలిపోతున్న స్థితిలో ఉన్నాం. జాతీయత పేరుతో, హిందువులకు అన్యాయం జరిగి పోతోందన్న భావం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. అందుకోసం ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే బిజెపి జాతీయతావాదపు పూర్తి విస్తృతి మనకు అవగతం కావాలంటే మతపరంగా జరుగుతున్న చీలిక దగ్గరే ఆగిపోకుండా బిజెపి వైఖరి ముస్లింల పట్ల ఏవిధంగా ఉందో వివరంగా పరిశీలించాలి.
ముస్లిం ప్రజల వెనుకబాటుతనం పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వపు అధికారిక వైఖరి ఏంటి? సచార్‌ కమిటీ నివేదిక పట్ల అది తీసుకున్న వైఖరి ఏంటి? ఇంకో పక్క బిజెపి రేపుతున్న ముస్లిం వ్యతిరేక చర్చ తీరు ఏంటి? ఈ రెండు వైపులా మనం పరిశీలించాలి.
బిజెపి 2014 ఎన్నికల ప్రణాళికలో ముస్లింల వెనుకబాటుతనాన్ని ఒక ముఖ్యమైన రాజకీయ అంశంగా ప్రస్తావించింది. ముస్లింలు కోరుకుంటున్న విధంగా మదర్సాల ఆధునీకరణ, ఉర్దూ భాష పరిరక్షణ, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణను మెరుగు పరచడం వంటి చర్యలన్నింటినీ చేపడతానని హామీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఎటువంటి అభద్రతకూ, భయానికీ తావు లేని విధంగా శాంతియుతమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని ముస్లింలకు కల్పిస్తానని ప్రకటించింది.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో సచార్‌ కమిటీ నివేదిక గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. అయితే ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రం అన్ని పథకాలకూ, కార్యక్రమాలకూ సచార్‌ కమిటీ నివేదికనే ప్రధానంగా ప్రామాణికంగా తీసుకున్నట్లు వ్యవహరించింది. సచార్‌ కమిటీ నివేదిక అమలు జరిగిన తీరు తెన్నులను అధ్యయనం చేసి సెప్టెంబరు 2014 నాటికల్లా నివేదిక ఇవ్వమని అందుకొక మదింపు కమిటీని నియమించింది. అలాగే ఈ మంత్రిత్వశాఖ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మైనారిటీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన 15 సూత్రాల పథకాన్నే మార్గదర్శకంగా ఇప్పటికీ పరిగణిస్తోంది. నిజానికి ఈ 15 సూత్రాల పథకం అమలును, దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మోడీ ప్రభుత్వం 2016లో ఒక అధ్యయన కమిషన్‌ను ఏర్పరచింది.
కాగితాలపై సాగిన ఈ మైనారిటీ సంక్షేమ చర్యలను మనం మరీ అతిగా చూడకూడదు. సచార్‌ కమిటీ నివేదిక అములుకై తీసుకున్న చర్యల గురించి పార్లమెంటుకు 2018లో సమర్పించిన నివేదిక, సచార్‌ కమిటీ చేసిన కొన్ని కీలక సిఫార్సులను, సున్నితమైన ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించింది.
దళిత ముస్లింలను- (అర్జల్‌ ముస్లింలు) ఎస్‌సిల జాబితాలో చేర్చాలన్న సచార్‌ సిఫార్సును ఈ నివేదిక తోసిపుచ్చింది. రాష్ట్ర, కేంద్ర వక్ఫ్‌ బోర్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అఖిల భారత కేడర్‌ ఆఫీసర్లను నియమించాలన్న సిఫార్సునూ తిరస్కరించింది. తనకు పెద్దగా అభ్యంతరం లేని సిఫార్సులను మాత్రం ఆమోదించింది.
ఈవిధంగా సచార్‌ కమిటీ నివేదిక విషయంలో బిజెపి ద్వంద్వ ప్రమాణాలు మనకి ఆశ్చర్యం కలిగించేవేమీ కాదు. ముస్లిం, క్రైస్తవ మతాలను అవలంబించే దళితులను ఎస్‌సి జాబితాలో చేర్చడంపై బిజెపి వ్యతిరేకత ముందు నుంచీ తెలిసిందే. అయితే బిజెపి నాటకం ఏమంటే అది సచార్‌ నివేదికను గుర్తించడమేగాక, దానిపై 'యాక్షన్‌ టోకెన్‌ రిపోర్టు'ను సైతం ప్రవేశపెట్టింది. బిజెపి, ఆరెస్సెస్‌ నేతలు 'మీరు ముస్లింలను దువ్వుతున్నారు' అని ఇతరులను ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు సచార్‌ నివేదికను గుర్తించడం ద్వారా మోడీ కూడా ముస్లింలను దువ్వుతున్నట్లు అనుకోవాలా?
ఒక పక్క ప్రభుత్వ స్థానంలో ఉన్నవారు ముస్లింల వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూ, ఇంకో పక్క మీడియాలో జాతీయతావాదంపై చర్చను పెద్ద ఎత్తున జరిగేటట్టు చేయడం- ఈ రెండింటికీ పరస్పర సంబంధం ఉంది.
బిజెపి/ఆరెస్సెస్‌ జాతీయవాద సిద్ధాంతంలో రెండు కీలక భాగాలు వున్నాయి. మొత్తం దేశ ప్రజలలో మనమంతా ఒక్కటేనన్న పేరుతో 'భారతీయత'ను పెంపొందిం చడం. యూరపులో జాతీయవాదం బయలుదేరిన రోజుల్లో 'ఒకే భాష-ఒకే సంస్కృతి-ఒకే దేశం' అన్న నినాదం ముందుకొచ్చింది. అదేవిధంగా ప్రజా జీవితంలో 'హిందూత్వ'ను అట్టహాసంగా ప్రదర్శించడం. దేశ భక్తికి, భారతీయతకు మారుపేరుగా చిత్రీకరించేం దుకు పూనుకున్నారు. ఈ 'భారతీయత'కు ప్రధాన లక్ష్యం హిందువులు. ముస్లింలు ఎక్కడా కనపడరు. అయితే విచిత్రమేమంటే వారి 'భారతీయత'లో ఏ భాగమూ దక్కని ముస్లింలు తమ దేశభక్తిని మాత్రం ప్రత్యేకంగా రుజువు చేసుకోవాల్సిందే. ప్రతి ముస్లిం దేశ భక్తినీ అనుమానించాల్సిందే!
సెప్టెంబరు 2018లో ఆరెస్సెస్‌ ముఖ్య నేత మోహన్‌ భగవత్‌ 'హిందూత్వ' పై చేసిన మూడు ప్రసంగాలూ ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. 'ముస్లింలు లేని హిందూత్వ అర్థం లేనిది' అని ఒక పక్క ప్రకటించినా, ఆరెస్సెస్‌కు ముస్లింల పట్ల వున్న దృక్పథాన్నుంచి ఆయన ఎక్కడా పక్కకు పోలేదు. భారత దేశంలో పుట్టిన మతాలు, ఈ దేశానికి వెలుపలి నుంచి వచ్చిన మతాలు అంటూ విడదీసి మాట్లాడి, 'భారతీయత' ఈ దేశంలో పుట్టిన మతాలతో ముడిపడిన అంశంగా ప్రకటించాడు.
ఈవిధంగా మతాలను దేశాల సరిహద్దుల ప్రాతిపదికన వర్గీకరించడం ఆరెస్సెస్‌ జాతీయతావాదపు రెండో పార్శ్వం. దేశ భద్రత, దేశ సరిహద్దుల రక్షణ అన్న అంశాలను ముందుకు తెచ్చి, వాటికీ మతాలకూ ముడిపెట్టడం, ఆరెస్సెస్‌ ఎత్తుగడ. దేశ సరిహద్దులకవతల ఉన్నవారు విదేశీ శత్రువులని, అదేవిధంగా దేశం వెలుపల నుంచి వచ్చిన మతాల వారు అంతర్గత శత్రువులని చిత్రీకరించడం దీని లక్ష్యం. ముస్లింలకు పర్యాయపదంగా 'జిహాదిస్టులు' ముందు కొచ్చింది. మానవ హక్కుల నేతలకు పర్యాయపదంగా 'అర్బన్‌ నక్సల్స్‌' పదం వచ్చింది. లౌకికవాదులను కుహనా లౌకికవాదులని తిడతారు. ఇవన్నీ బిజెపి/ఆరెస్సెస్‌ పరిభాషలోని 'హిందుత్వ'ను జాతీయతావాదంగా మన ముందుకు తేవడం కోసమే చేస్తున్నారు.
ఈ జాతీయతావాదం ముస్లింలను పరాయివారుగా, చిత్రీకరిస్తుంది. అక్కడితో ఆగలేదు. గత అయిదేళ్లలో హిందుత్వ శక్తులు 'ఘర్‌ వాపసీ' (బలవంతపు మత మార్పిడులు) లవ్‌ జిహాద్‌ (మతాంతర వివాహాలు) గోరక్షణ (ఆహారంపై, బతుకుతెరువుపై నిషేధం) ట్రిపుల్‌ తలాక్‌, అయోధ్యలో రామాలయం వంటి అయిదు ప్రధాన అంశాలను ముందుకు తెచ్చాయి. ఒక పథకం ప్రకారమే ఈ అంశాల విషయంలో రెచ్చగొట్టే పలు కార్యక్రమాలను చేపట్టాయి. అయినా ముస్లిం ప్రజల నుంచి వారాశించిన రీతిలో ఎటువంటి ఘర్షణాత్మకమైన ప్రతిస్పందనా రాలేదు.
దీంతో తన 'హిందుత్వ' జాతీయతావాదాన్ని ముస్లిం వ్యతిరేక దిశగా కొత్త పద్ధతిలో రూపొందించవలసిన అవసరం ఏర్పడింది. అనేక రంగాలలో ముస్లింలకు తగిన ప్రాతినిథ్యం లేకపోవడం ఈ కొత్త పథాకానికి ప్రాతిపదిక అయింది.
'ముస్లిం మైనారిటీ' అన్నది రాజకీయంగా ఆమోద యోగ్యమైన పదంగా 1993 నుంచీ ఉంది. దానినే 'హిందుత్వ' శక్తులు తమ 'హిందూ మెజారిటీ' భావనను బలపరుచుకోడానికి వాడడం మొదలుపెట్టాయి. మైనారిటీ లను బుజ్జగించే వైఖరిని అవలంబిస్తున్నాయని ఇతర పార్టీలను విమర్శించడం పెరిగింది. ఆ విమర్శ సారాంశం హిందువులు క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోతారనే ఆందోళనను కలిగించడమే.
యుపిఎ హయాంలో మాదిరిగా మైనారిటీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఏమేమి చర్యలను తీసుకుంటోందో ప్రచారం చేసుకోడానికి మోడీ ఎంతమాత్రమూ తాపత్రయ పడరు. ముస్లింలు ప్రాతినిథ్యం తక్కువగా ఉన్న వాస్తవాన్ని మాత్రం తన రాజకీయ వ్యూహానికి వీలుగా మూడు రకాలుగా ఉపయోగిస్తున్నారు.
'సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌' నినాదంతో అందరి అభివృద్ధి గురించీ మాట్లాడుతూ, అప్పుడే ముస్లింల వెనుకబాటుతనాన్ని కూడా ప్రస్తావిస్తారు. 2019 ఎన్నికల మానిఫెస్టోలో దీనినే 'మర్యాదతో కూడిన అభివృద్ధి' అని మార్చారు.
రెండవది : హిందువులు విశాల హృదయాన్ని దాతృత్వాన్ని ప్రదర్శించడానికి అన్నట్టుగా 'జాతీయ పౌరసత్వ రిజిస్టరు' సమస్య విషయంలో వ్యవహరిస్తున్నారు. పౌరసత్వ బిల్లుకు బిజెపి తెచ్చిన సవరణ ఒకపక్క ముస్లింలను, క్రైస్తవులను వేరు చేస్తూనే ఇతరులను పౌరులుగా స్వీకరించడానికి సిద్ధం అన్నట్లు ఫోజు పెట్టడానికి, హిందువుల విశాల ఐక్యతకు తామే మొనగాళ్లైనట్టు చెప్పుకోడానికి ఉద్దేశించినది.
మూడవది : ముస్లింలు వెనుకబడ్డారు గనుక వీరంతా విడిపోవాలనుకుంటున్నారన్న భయాన్ని ఇతరులలో కలిగించడం. 370 అధికరణ రద్దు కావాలన్న బిజెపి డిమాండ్‌ వెనక వ్యూహం ఇదే. జమ్ము, కాశ్మీర్‌ ప్రాంతంలో విద్వేషాన్ని, అభద్రతను కావాలనే బిజెపి రెచ్చగొడుతోంది.
బిజెపి మార్కు జాతీయతావాదానికీ, ముస్లింల వెనుకబాటుతనానికీ మధ్య ఉన్న ఈ సంబంధం 2019 ఎన్నికల తర్వాత ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే.

- హిలాల్‌ అహ్మద్‌

No comments:

Post a Comment