Tuesday, 10 November 2015

టిప్పుసుల్తాన్‌ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత...వీహెచ్‌పీ కార్యకర్త మృతి

టిప్పుసుల్తాన్‌ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత...వీహెచ్‌పీ కార్యకర్త మృతి 
Updated :10-11-2015 13:17:15
కర్నాటక : కర్నాటకలో టిప్పుసుల్తాన్‌ జయంతి ఉత్సవాలు ఉద్రిక్తంగా మారాయి. కొడగుజిల్లా కేంద్రం మడికెరిలో జయంతి ఉత్సవాల నిర్వహణను వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత, భజరంగ్‌దళ్‌, హిందూజాగరణ వేదిక సంస్థలు ఆందోళన చేపట్టాయి. మంగళవారం జిల్లాలో బంద్‌కు పిలుపు ఇచ్చాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జీ జరిపారు. ఈ ఘటనలో వీహెచ్‌పీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటక సర్కారు నిర్వహించ తలపెట్టిన మైసూరు పులి టిప్పు సుల్తాన్‌ జన్మదిన వేడుకలను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ వేడుకలను పూర్తిగా బాయ్‌కాట్‌ చేస్తున్నామని.. తమ పార్టీ తరఫున ప్రతినిధులుగా ఎవ్వరూ హాజరు కాబోరని ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. టిప్పుసుల్తాన్‌ను మత దురభిమాని, కన్నడ వ్యతిరేకిగా ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి 44 మంది శాసనసభ్యులున్నారని.. సాధారణంగా ఇలాంటి వేడుకలకు స్థానిక శాసనసభ్యులను ఆహ్వానిస్తారని, కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ వాటికి వెళ్లవద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఆజ్ఞాపించానని చెప్పారు. బీజేపీనే కాదు.. మంగళూరు యునైటెడ్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ సహా కర్ణాటకలోని పలు సంస్థలు, పలువురు వ్యక్తులు కూడా.. ప్రభుత్వం తలపెట్టిన ఈ వేడుకలను వ్యతిరేకించడం గమనార్హం. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం టిప్పు జయంతి జరిపి తీరుతామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment