Wednesday, 4 November 2015

షారుక్‌ది ఉగ్రవాద భాషే

షారుక్‌ది ఉగ్రవాద భాషే
Updated :05-11-2015 02:44:20
  • హఫీజ్‌ సయీద్‌కేం తీసిపోడు!
  • జనం చూడకుంటే ఆయన ఎక్కడ?
  • తట్టాబుట్టా సర్దుకొని పాక్‌కు... ఇప్పటికైనా ఆ పనిచేయాలి
  • బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు
  • బీజేపీ సహా రాజకీయ పార్టీల ఖండన
న్యూఢిల్లీ, నవంబరు 4: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌పై బీజేపీ శిబిరం నుంచి దాడుల పరంపర తీవ్రతరమైంది. ‘‘షారుక్‌ జాతి వ్యతిరేకి’’ అంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత విజయ్‌వర్గియా చేసిన వ్యాఖ్యలతో ఇరుకునపడి.. ఆయనపై కమలం నాయకత్వం కన్నెర్ర చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా బీజేపీ ఎంపీ తెరపైకి వచ్చి.. షారుక్‌పై పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ అగ్రనటుడిని ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో పోల్చి.. ఎంపీ ఆదిత్యనాథ్‌ కలకలం సృష్టించారు. దేశంలో అసహన వాతావరణం తీవ్రతరమైందంటూ షారుక్‌ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... కమలం నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ‘‘షారుక్‌ సినిమాలను జనం బహిష్కరిస్తే ఆయనెక్కడ ఉండేవాడు? ఈ దేశంలోని సగటు ముస్లింలాగే, ఆయనా రోడ్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. తట్టాబుట్టా సర్దుకొని పాక్‌కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. వీళ్లంతా ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నారు. షారుక్‌కూ, ముంబై దాడి కుట్ర సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కూ పెద్ద తేడా లేదు’’ అని ఆదిత్యానాథ్‌ దురుసు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అవార్డులు వెనక్కి ఇచ్చి నిరసనలు తెలుపుతున్న రచయితలనూ ఉగ్రవాదులతో పోల్చి తెగనాడారు. అటువంటి వారితో షారుక్‌ జత కట్టడం అత్యంత విచారకరమన్నారు. ‘‘ఇది నా దేశం. నా తల్లిదండ్రులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. నన్ను పాక్‌కు వెళ్లమనే హక్కు ఎవడికీ లేదు’’ అన్న షారుక్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దేశాన్ని అవమానించే షారుక్‌ వంటివారు తమ మూలాలను గుర్తెరగాలని, వారంతా పాక్‌కు వెళ్లిపోతే సంతోషిస్తామన్నారు. కాగా, మంగళవారం షారుక్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను విజయ్‌వర్గీయ వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పారు. ‘ఈ దేశానికి సహనమే లేనట్టయితే అమితాబ్‌ తరువాత అంతటి స్టార్‌హోదాని షారుక్‌కు కట్టబెట్టేవారా అనేది నా భావం. దాన్ని మీడియా వక్రీకరించింది’ అని వివరణ ఇచ్చారు. అయితే, వర్గీయపై బీజేపీ అగ్రనాయకత్వం ఆగ్రహంతో ఉన్నదని, దానివల్లనే వర్గీయ తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. వర్గీయ విషయంలోనే కాదు..ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యలపైనా బీజేపీ తగినంత దూరం పాటిస్తోంది. షారుక్‌నిగానీ, మరే భారతీయుడిని గానీ ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని ఆ పార్టీ ప్రతినిధి నళిన్‌ కొహ్లీ వివరించారు. వ్యక్తులపై విమర్శలు చేయడం బీజేపీ విధానం కానే కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాగా, షారుక్‌ కేంద్రంగా సాగుతున్న మాటల యుద్ధంపై శివసేన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ముస్లిం అయిన కారణంగానే షారుక్‌ని లక్ష్యం చేసుకోవడం సరికాదు’ అని తప్పుబట్టింది. వర్గీయ, ఆదిత్యానాథ్‌ల అరెస్టునకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ప్రధాని మోదీ ఇంకా మౌనం వహించడం సరికాదని ఏఐసీసీ నేత ఆనంద్‌ శర్మ పేర్కొన్నారు. గుజరాత్‌ నమూనాను దేశవ్యాప్తంగా పునరావృతం చేయాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీశ్‌ తివారీ దుయ్యబట్టారు. షారుక్‌ ఇక్కడ ఉండాలా లేక పాక్‌కు వెళ్లాలా అనేది మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. షారుక్‌ను చూసి గర్విస్తున్నానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.
 
భారత్‌కిక రాను: గులాం అలీ 
‘భారత్‌లో ఇకపై కాలుపెట్టను’ అని పాక్‌ ప్రసిద్ధ గజల్‌ గాయకుడు గులాం అలీ ప్రకటించారు. తన కచేరీలను రాజకీయం చేయాలని చూడటం ఎంతో బాధించిందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కుదుటపడేవరకూ భారత్‌లో కచేరీలివ్వనని అలీ స్పష్టం చేశారు. దీనిని సెన్సార్‌ బోర్డు సభ్యుడు అశోక్‌ పండిట్‌ స్వాగతించారు. ఇతర పాకిస్థానీ కళాకారులూ ఇదే బాట పట్టాలని సూచించారు.

No comments:

Post a Comment