Thursday 12 October 2023

Muslim Declaration - Telangana Salim Pasha

 #ఆత్మగౌరవ_పతాక_ముస్లిం_డిక్లరేషన్ ☘️

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు, ముస్లిం సమాజం కూడా బాగుపడుతుందని, జనాభా దామాషా ప్రకారం తమకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతాయని ముస్లింలు ఆశించారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. దానికి విరుగుడుగా రేపు భవిష్యత్తు ఎన్నికలలో ముస్లిం మైనారిటీల రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కారాలు ఏమిటి? రాజకీయ పార్టీలు ముస్లిం సమాజ సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎలాంటి చర్యలు చేపడితే పేద ముస్లింలు బాగుపడతారు? తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ముస్లిం ఆలోచనాపరులుగా, అనేక ధఫాలుగా మాకు మేమే ఒక అంతర్మథనం, మేథోమథనం చేసుకొని ‘ముస్లిం డిక్లరేషన్’ పేరు మీద ఒక డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. ఇలా రూపొందిన ‘తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ 2023’ అనేది ముస్లింల అస్తిత్వ పోరాటంలో ఒక భాగం.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల జీవితాలు బాగుపడతాయని ముస్లింలు నమ్మారు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు కూడా చేశారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు దక్కాల్సినంత సామాజిక న్యాయం దక్కలేదు, సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదు. పైగా రోజురోజుకు ఉన్న కాసింత రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరే ముస్లిం ఎమ్మెల్యే, ఒక్కరే ముస్లిం ఎమ్మెల్సీ ఉన్నారు. జిల్లాలలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతున్నది. అందుకే హైదరాబాదు పాతబస్తీ మినహాయించి, జిల్లాలలో ముస్లిం ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న కనీసం 10 నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని డిక్లరేషన్‌లో డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణలో ముస్లింలకు నామినేటేడ్ పదవులలో కూడా అన్యాయమే జరుగుతుంది. గత పదేళ్ల తెలంగాణలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా రాజ్యసభ స్థానం లభించలేదు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో ఒక్క ముస్లిం సభ్యుడు లేడు. రాష్ట్రంలోని 11 స్టేట్ యూనివర్శిటీలకు ఒక్క వైస్ ఛాన్సలర్ కానీ, ఒక్క రిజిస్ట్రార్ కానీ ముస్లిం లేడు. అనేక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల కూర్పులో ముస్లిం అభ్యర్థికి ప్రాతినిధ్యం ఉండటం లేదు. జిల్లా కో ఆప్షన్ సభ్యుల నియామకంలో, జిల్లా గ్రంథాలయ చైర్మన్ల నియామకంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యుల నియామకంలో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ముస్లింలకు న్యాయం లభించడం లేదనడానికి ఇవి ఉదాహరణలు.

 

ప్రస్తుతం దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే వేసిన సుధీర్ కమిషన్ కూడా తన నివేదికలో దాదాపు ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింల పేదరికాన్ని రూపుమాపడానికి ఒక్క ప్రత్యేక పథకం కూడా అమలు కాలేదు. గత పాలకుల లాగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తుంది. ఈ ధోరణి మారాలని తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీగా ప్రశ్నిస్తున్నాం. ప్రతీ పేద ముస్లిం కుటుంబానికి ‘ముస్లిం ఎంపవర్మెంట్ స్కీం’ కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసి, వారి సాధికారతకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

ఇక రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో మైనారిటీ బడ్జెట్ వాటా విషయానికి వస్తే కేటాయింపులు చాలా తక్కువ. మళ్లీ ఇందులో సగం ఖర్చు చేయరు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించినవి రూ.12 వేల కోట్లు అయితే, ఖర్చు పెట్టింది మాత్రం రూ.9 వేల కోట్లు. ఈ అత్తెసరు నిధులతో ముస్లింలలో ఉన్న కడు పేదరికం ఎన్ని వందల ఏళ్ళకు దూరమయ్యేను? అందుకే మైనారిటీల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.10వేల కోట్లు కేటాయించాలని, ఈ నిధులు పూర్తిగా గ్రీన్ ఛానల్‌లో పెట్టి ఖర్చు చేయాలని డిక్లరేషన్‌లో డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన మైనారిటీ గురుకులాలను స్వాగతిస్తున్నాం. కానీ శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించడం లేదు? శాశ్వత టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం ఎందుకు చేపట్టడం లేదు? అని నిలదీస్తున్నాం. ప్రస్తుతం బంగారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినీ విద్యార్థుల కొరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి ముస్లిం విద్యార్థినులకు, ఒకటి విద్యార్థుల కోసం మొత్తం 66 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కావాలని అడుగుతున్నాం. మేము చదువుకోవడానికి హాస్టళ్లు కావాలని అడగడం తప్పుకాదు కదా? వీటి ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు చాలా చిన్నదే. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.

 

సుధీర్ కమిషన్ తన నివేదికలో రాష్ట్రంలోని ముస్లింలలో 75శాతం మంది స్వయం ఉపాధి రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొంది. రోడ్ల పక్కన పండ్ల బండీలు, పంక్చర్ షాపులు, పాన్ షాపులు లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించేది వీరే. వీరికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి భరోసా అందడం లేదు. కరోనా మహమ్మారి తర్వాత వీరి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి వారిని గుర్తించి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.2లక్షలతో కూడిన పూర్తి సబ్సిడీ లోన్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. సుధీర్ కమిషన్ రాష్ట్రంలోని 43శాతం ముస్లిం కుటుంబాలకు సొంత ఇండ్లు లేవని, కిరాయి ఇండ్లలోనే జీవనం గడుపుతున్నారని పేర్కొంది. అందుకే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో జనాభా దామాషా ప్రకారం 12శాతం ప్రత్యేక కోటా ఇవ్వాలని అడుగుతున్నాం.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు దాదాపు రూ.10లక్షల కోట్లు విలువ చేసే వక్ఫ్ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఈ ఆస్తులు గత ప్రభుత్వాల హయాంలో అన్యాక్రాంతం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్యాక్రాంతం అయిన ఈ వక్ఫ్ భూములను, ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని, కబ్జాకోరులను కఠినంగా అణచివేయడానికి జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ అధికారంలోకి రాగానే ఈ హామీని తుంగలో తొక్కారు. అంతటితో ఆగక గతంలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయని విధంగా హజ్ హౌస్‌లోని వక్ఫ్ ఆస్తుల దస్తావేజులు ఉన్న గదిని సీజ్ చేశారు. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తుల ఒరిజినల్ దస్తావేజులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దీంతో కబ్జా కేసుల్లో వక్ఫ్ ట్రిబ్యునల్‍లో, కింది కోర్టుల్లో గెలిచిన కేసులను, పై కోర్టులలో వక్ఫ్ బోర్డు ఓడిపోతుంది. దీనికి కారణం ఒరిజినల్ దస్తావేజులు కోర్టుకు సమర్పించకపోవడమే. జిల్లాలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక చోట్ల వక్ఫ్ భూములను కబ్జాలు చేశారు. అందుకే ముస్లింలకు వారసత్వంగా వచ్చిన లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులను రక్షించాలని డిక్లరేషన్ ద్వారా అడుగుతున్నాం. వక్ఫ్ బోర్డును కమిషనరేట్ పరిధిలోకి తెచ్చి, జ్యుడీషియల్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వక్ఫ్ ఆస్తులను సరిగా పరిరక్షించి, వాటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను పెంచాలని, ఇలా వచ్చిన ఆదాయాన్ని ముస్లింల విద్య, వైద్యం కొరకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే ప్రభుత్వాల మీద ముస్లింలు ఆధారపడడం తగ్గిపోతుంది. ఇలా ముస్లింల రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో ముడిపడిన మొత్తం 22 డిమాండ్లను ముస్లిం డిక్లరేషన్‌లో పొందుపర్చాము.

 

ఎంతసేపూ మతతత్వ పార్టీలను బూచీగా చూపెట్టి తమను తాము సెక్యులర్‌గా చెప్పుకొనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అయితేనేమీ, ముస్లింల ప్రతినిధి అని చెప్పుకొనే ఎమ్ఐఎమ్ అయితేనేమీ గంపగుత్తగా ముస్లింల ఓట్లు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఎండగట్టడమే ముస్లిం జేఏసీ లక్ష్యం. ముస్లిం సమాజంలోని ఆలోచనాపరుల మనోభావాలను పట్టించుకోకుండా, ముస్లిం పేద వర్గాలకు ఏమీ చేయకుండా, గతంలో‌ లాగా ఈసారి 2023 ఎన్నికలలో కూడా ముస్లింల ఓట్లను గంపగుత్తగా ఎగరేసుకుపోయే చరిత్ర పునరావృతం కావద్దనేదే మా ప్రయత్నం.

 

రాబోయే ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మేము రూపొందించిన 22 డిమాండ్లను అమలుచేస్తామని ప్రకటించాలి. వారి మానిఫెస్టోలో ఈ డిమాండ్లను చేర్చాలి. వీటిని అమలు చేస్తామని హామీ ఇవ్వాలి. లేదా వీటికంటే మెరుగుగా ముస్లింల అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచించి అమలు చేస్తామని భరోసా ఇవ్వాలి. ఇలా చేసిన వారికే ముస్లింల మద్దతు, తెలంగాణ ముస్లిం జేఏసీ మద్దతు!

 

#సయ్యద్_సలీమ్_పాష

కన్వీనర్‌, తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ

No comments:

Post a Comment