Wednesday 16 March 2022

ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?

 ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?


ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారామా? కాదా? అన్నది కాదు కదా ఇక్కడ అసలు సమస్య?  ఇస్లాంలో తప్పనిసరైన మతాచారం ఏది? ఏది కాదు? అన్నది తేల్చటానికి వేరేగా ఇస్లామిక్  పండిత వర్గం ఉంది ఆ గొడవ వాళ్లది తప్పితే అది తేల్చాల్సింది కోర్టు కాదు. 


భిన్న మతాల, సంస్కృతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఒక చోట చదివేటప్పుడు వారి వారి మతాలకు చెందిన చిహ్నాలనో, సంస్కృతినో అనుసరించుకుంటూనే అందరూ ఒకే రకమైన యూనిఫాంతో స్కూలుకు రావచ్చా? రాకూడా? అన్నది ఇక్కడ అసలు మాట్లాడుకోవలసిన పాయింట్.


రావచ్చు.. తప్పులేదన్నప్పుడు మల్లా వేరేగా ముస్లిం విద్యార్థినులు యూనిఫాం పాటిస్తూనే తలపై ‘హిజాబ్’ లేదా ‘హెడ్ స్కాఫ్’ ధరించి రావచ్చా? రాకూడదా? అన్న ప్రశ్నపై వేరేగా చర్చించే అవసరం ఉండదు.


ఒకవేళ “ముస్లిం విద్యార్థినులు యూనిఫాం పాటిస్తూనే హిజాబ్ ధరించి రాకూడదు” అని తీర్పు ఇస్తే..  అదే స్కూల్లో చదివే భిన్న మతాల, సంస్కృతులకు చెందిన ఇతర విద్యార్థినీ, విద్యార్థులు సైతం వారి వారి మతాలకు చెందిన చిహ్నాలను, సంస్కృతిని రూపుమాపేసుకుని స్కూలుకు రావాలన్న రూలు అందరికీ కలిపి పెట్టటం సరైన న్యాయం చెయ్యటం అవుతుంది.   


పోనీ, హిజాబ్ ధరించి వస్తున్న ఆ ముస్లిం విద్యార్థినులు యూనిఫాంను ఏమైనా వ్యతిరేకించారా? అంటే కాదు కదా! ఇతర మతాలకు చెందిన విద్యార్థులు తమ తమ మతపరమైన చిహ్నాలు ధరిస్తూ స్కూల్ యూనిఫాంలో వస్తున్నప్పుడు ఒక్క ముస్లిం విద్యార్థినులు మాత్రమే తలకు హిజాబ్ చుట్టుకు వచ్చినంత మాత్రానా “స్కూల్ యూనిఫాం”కు ఏ రకంగా విఘాతం కలుగుతుందో ఇప్పటికీ హిజాబ్ ను వ్యతిరేకించేవారికి ఓ క్లారిటీ లేని అంశమే. 


కాబట్టి భిన్న మతాల, సంస్కృతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఒక చోట చదివేటప్పుడు వారి వారి మతాలకు చెందిన చిహ్నాలనో, సంస్కృతినో అనుసరించుకుంటూనే అందరూ ఒకే రకమైన యూనిఫాంతో స్కూలుకు రావచ్చా? రాకూడా? అన్న ఒక్క పాయింటు తప్ప వేరే ఏ పాయింట్ పై డిస్కస్ చెయ్యటమైన కోర్టు తన విలువైన సమయాన్ని నష్టపరచుకోవటమే అవుతుంది.  


అయితే “భిన్న మతాలకు చెందిన విద్యార్ధులు తమ తమ మతపరమైన చిహ్నాలను, సంస్కృతులను పాటిస్తూనే స్కూలుకు వస్తున్నప్పుడు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరిస్తూనే యూనిఫాంలో రావటంలో తప్పేముంది? అన్న ప్రశ్నను ఇప్పుడు దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. కనీస లాజిక్ ఉన్నోళ్లెవరైనా తప్పులేదనే చెబుతారు.  

కానీ ఈ ప్రశ్నకు “తప్పులేదు” అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫాసిస్టు ప్రభుత్వాలుండే దేశాల్లో అలాంటి న్యాయమైన తీర్పులకు అవకాశం ఉండదు కాబట్టి. అందుకే ఎవరూ ఊహించని విధంగా “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అనే ఓ కొత్తరకమైన తీర్పును వినాల్సి వచ్చింది. 


పోనీ, కోర్టు “మేము ఖురాన్, హదీసులు పూర్తిగా స్టడీ చేసి “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అని ఫలానా చోట కనుగొన్నాము? అని ఆధారసహితంగా చెబుతుందా? అంటే కాదు కదా. ఎందుకంటే అలాంటి స్టేట్మెంట్ ఖురాన్, హదీసుల్లో ఎక్కడా భూతద్దం పెట్టి వెదికినా దొరకదు. 


మరి కోర్టు దేని ఆధారంగా “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదని” తీర్పివ్వగలిగింది? అన్నదే అస్సలు అర్థం కాని పాయింట్.   


“అబ్బే ఖురాన్, హదీసుల్లో ఎక్కడా అలాంటి స్టేట్మెంట్ లేదు, కాకపోతే ఖురాన్ లో ఎక్కడా హిజాబ్ ధరించమని రాసి లేదు కదా! అందుకు ఆ రకమైన తీర్పు చెప్పాల్సి వచ్చిందంటే.. అది అస్పష్టమైన ఆధారాలతో ఇచ్చిన తీర్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. 


ఎందుకంటే ఖురాన్ స్పష్టంగా "విశ్వాసులైన స్త్రీలు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలి 33:59" అని ఆదేశిస్తుంది. అచ్చం ఇలాంటి ఆదేశమే ఖురాన్ 24:31 లో “స్త్రీలు తలపై నుండి ఛాతీ వరకు వస్త్రాన్ని ధరించాలి” అని స్పష్టంగా మరో చోట కూడా చెబుతుంది. దీనినే సామాన్య పరిభాషలో ‘హెడ్ స్కాఫ్’ అంటారు. అలాంటప్పుడు “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అని చెప్పటం ఎంతవరకు అవగాహనాసహితమైన తీర్పన్నది విజ్ఞత కల పాఠకులే ఆలోచించాలి. 


“అవునండీ! కచ్చితంగా ముస్లిం స్త్రీలు హిజాబ్ ధరించాల్సిందే’ అని ఖురాన్ గట్టిగా చెప్పటం లేదు కదా? అని కొందరు ప్రశ్నించవచ్చు. ఖురాన్ దేన్నైనా ఆదేశిస్తుందే తప్ప కచ్చితంగా పాటించాల్సిందే అని బలవంత పెట్టదు. స్వయంగా ఖురానే “ధర్మంలో ఎటువంటి బలవంతమూ లేదు” అని చెబుతుంది. 


కాబట్టి, భిన్న మతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు తమ తమ మతాచారాలను బట్టి బొట్లు, తిలకాలు, నామాలు పెట్టుకొచ్చినా, లాకెట్లు వేసుకొచ్చినా, జంధ్యం వేసుకొచ్చినా, టర్బన్ చుట్టుకొచ్చినా, హిజాబ్ చుట్టుకొచ్చినా అందరూ యూనిఫాంతో  స్కూల్ కు రావచ్చా? రాకూడదా? అన్న అంశంపై చర్చ చెయ్యటం, తీర్పు ఇవ్వటమే ప్రస్తుతం అవసరమైనది. తప్పితే ఏ యే మతాచారాలు ధార్మిక గ్రంథాల్లో రాసి ఉన్నాయి? ఏవి రాసి లేవు? అన్నది తేల్చటం కోర్టు పని కాదు. పైగా అలాంటి పనులు ఉన్నత న్యాయస్థానాలకు ఎంతమాత్రం శోభించవు కూడా.       


Md Nooruddin

No comments:

Post a Comment