Monday 4 September 2017

TDP - Muslims

ఫరూక్‌కే పట్టం
05-09-2017 03:09:15

శాసనమండలి చైర్మన్‌గా నియామకం: సీఎం
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌గా మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారమిక్కడ హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో ఆయన ప్రకటించారు. ఈ పదవి వరుసగా రెండోసారి కర్నూలు జిల్లాను వరించడం విశేషం. నిన్నటిదాకా చైర్మన్‌గా అదే జిల్లాకు చెందిన చక్రపాణి ఉన్నారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఆ పదవి ఖాళీ అయింది. నంద్యాలకు ఉప ఎన్నిక రావడంతో అదే నియోజకవర్గానికి చెందిన ఫరూక్‌ను మండలి చైర్మన్‌ను చేసే ఆలోచన ఉన్నట్లు ఎన్నికల ముందు చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఉప ఎన్నికలో ఘన విజయం సిద్ధించడంతో ఇప్పుడు ఫరూక్‌ పేరును బహిరంగంగా ప్రకటించారు.

ముస్లిం మైనారిటీల్లో రాజకీయ నాయకత్వాన్ని పెంపొందించడంలో భాగంగా నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మండలి చైర్మన్‌ పదవిని, నౌమాన్‌కు ఉర్దూ అకాడమీ పదవిని ఇచ్చామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ‘నంద్యాలలో ముస్లిం మైనారిటీలు టీడీపీకి బలంగా మద్దతు ఇచ్చారు. వారిలో ఎనభై శాతం ఓట్లు మనకే పడ్డాయి. వారి విశ్వాసాన్ని నిలుపుకొంటాం. వారి ఆర్థిక, సామాజిక ప్రగతికి బాసటగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. ఫరూక్‌ గతంలో మంత్రిగా, శాసనసభ ఉప సభాపతిగా పనిచేశారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆయనకు ఇప్పుడు పదవీయోగం కలగడం గమనార్హం. ఈ ప్రకటన తర్వాత ఫరూక్‌ అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ముస్లిం మైనారిటీలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని, నంద్యాల, కాకినాడ ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పారు. ‘టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందువల్ల ముస్లిం మైనారిటీలు, దళితులు వ్యతిరేకంగా ఉన్నారన్న అభిప్రాయం సరికాదు. ఈ రెండు వర్గాలు నంద్యాల, కాకినాడల్లో పూర్తిగా టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. దానిని టీడీపీ ఇస్తోంది. అందుకే మా వైపు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించారు. హ్యాపీ రిసార్ట్స్‌లో తనకు హ్యాపీనెస్‌ కలిగించే ప్రకటనను ముఖ్యమంత్రి చేశారని, ఆయనకు ధన్యవాదాలని ఫరూక్‌ చెప్పారు.

No comments:

Post a Comment