Sunday, 8 December 2019

పార్లమెంటుకు నేడే పౌరసత్వ సవరణ బిల్లు

పార్లమెంటుకు నేడే పౌరసత్వ సవరణ బిల్లు
09-12-2019 01:59:07

ప్రవేశపెట్టనున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఒక్కరోజులోనే చర్చ.. ఆమోదం కూడా
న్యూఢిల్లీ, డిసెంబరు 8: ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణకు రంగం సిద్ధమైంది. పౌరసత్వ (సవరణ) బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై అదే రోజు చర్చించి, బిల్లుకు ఆమోదం కూడా తెలపాలని నిర్ణయించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు.

వారికి భారత పౌరసత్వం కూడా ఇస్తారు. గతంలో 11 ఏళ్లపాటు దేశంలో ఉంటేనే పౌరసత్వం ఇచ్చేవారు. సవరణ చట్టంలో దానిని ఐదేళ్లకు కుదించారు. అక్రమ వలసదారులుగా వారిపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని బిల్లులో పేర్కొన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా పౌరసత్వాన్ని నిరాకరించడానికి లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు, పెద్దఎత్తున ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సవరణ చట్టం 1985లో కుదిరిన అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శక్తిమంతమైన నార్త్‌ ఈస్ట్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (నెసో) డిసెంబరు 10న 11 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.

అక్రమంగా వచ్చిన శరణార్థులను శాశ్వత నివాసులుగా పరిగణిస్తే, ఈ ప్రాంత జనాభా వివరాల్లో మార్పులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులకు భరోసా ఇచ్చేలా సవరణ చట్టంలో కేంద్రం నిబంధన విధించింది. ఈ సవరణ చట్టం అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలకు వర్తించదని, అవి ఇప్పటికే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో ఉన్నాయని తెలిపింది. అలాగే, ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ) అమల్లో ఉన్న ప్రాంతాలకు కూడా ఈ చట్టం అమలు కాదని వివరించింది.

పౌరసత్వం ఇవ్వడం మన విధి: రాం మాధవ్‌
పొరుగు దేశాల్లో మత పీడనకు గురై శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, దేశాన్ని మతపరంగా విభజించాలన్న నిర్ణయానికి వారంతా బాధితులని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును కొందరు విమర్శిస్తున్నారని, కానీ, 1950లో నెహ్రూ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్నే చేసిందని గుర్తు చేశారు. అణచివేతకు గురైన మైనారిటీలకు భారత్‌ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుందన్నారు

జిన్నా వైఖరిదే విజయమవుతుంది: శశిథరూర్‌
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే.. గాంధీ ఆలోచనా సరళి కంటే మహ్మద్‌ ఆలీ జిన్నా ఆలోచనా సరళి విజయం సాధించినట్లు అవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ విమర్శించారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇస్తే.. భారతదేశం పాకిస్థాన్‌కు హిందుత్వ వెర్షన్‌ అవుతుందని వ్యాఖ్యానించారు. ‘ఒక వర్గాన్ని’ వేరు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారు కూడా అణచివేతకు గురైనా ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆరోపించారు. ఒకవేళ, ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినా.. రాజ్యాంగ మౌలిక సూత్రాలను అత్యంత దారుణంగా ఉల్లంఘించిన ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులోని ఏ ధర్మాసనమూ అంగీకరించదని ధీమా వ్యక్తం చేశారు.

చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ కోటా పొడిగింపు బిల్లు నేడు లోక్‌సభలో
చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను పొడిగించాలన్న బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌ వర్గాలకు చట్టసభల్లో 70 ఏళ్ల పాటు రిజర్వేషన్‌ను కల్పించారు. ఇది 2020 జనవరి 25న ముగియనున్నాయి. ఆంగ్లో ఇండియన్లను మినహాయిస్తూ ఎస్సీ, ఎస్టీలకు మరో పదేళ్ల వరకు రిజర్వేషన్లను పొడిగించాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment