Thursday, 14 September 2017

ROHINGYAS Massacre

రోహింగ్యాలపై మారణకాండ

13-09-2017 04:20:08

ఓఐసీ ఏంచేస్తోందో, ముస్లిం దేశాధినేతలు ఎక్కడ ఉన్నారో అర్థంకావడం లేదు. సాధారణ ముస్లిం సమాజమూ చలించడంలేదు. వ్యక్తిగతంగా ఏమైనా కష్టనష్టాలు సంభవిస్తే, లేక తమ నేతలకు ఏమైనా జరిగితే వెంటనే రోడ్లెక్కుతారు. కాని ఒక జాతి జాతినే నిర్మూలించాలన్నంత రాక్షసత్వంతో మారణకాండ కొనసాగిస్తుంటే కనీసం చీమకుట్టినట్లు లేకపోవడం సిగ్గుచేటు.

మయన్మార్ (బర్మా)- ఆగ్నేసియాలోని ఓ చిన్నదేశం. రెండున్నర లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం. దీని రాజధాని నైపీడా. ఒక అంచనా ప్రకారం బర్మా దేశ జనాభా ఏడు కోట్లు. మెజారిటీ వర్గం బౌద్ధమతావలంబీకులు. మొత్తం పద్నాలుగు రాష్ట్రాలున్న బర్మాను 1989లో మయన్మార్‌గా పేరు మార్చారు. థీన్ సేన్ అనే సైన్యాధిపతి చాలాకాలంగా దేశంలో మార్షల్ లాను నెలకొల్పి, రాచరిక వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. అవినీతి, నియంతృత్వ సైనిక వ్యవస్థ, దోపిడీ దౌర్జన్యాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైంది. ఫలితంగా బర్మా ప్రపంచంలోని పేద దేశాల జాబితాలో చేరిపోయింది. నిజానికి ఒకదశలో ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే పెద్దదేశాల్లో ఒకటిగా పరిగణించబడేది. కాని పాలనా వైఫల్యం, అవినీతి తదితర కారణాల వల్ల వాణిజ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది.

అరాకాన్ అనేది బర్మాలోని ఒక పెద్ద రాష్ట్రం. అక్కడ ముస్లిమ్ జనాభా ఎక్కువ. వీళ్ళే రోహింగ్యా తెగ ముస్లిములు. ఒక కాలంలో అరాకన్ పూర్తిస్థాయి స్వేఛ్ఛాయుత ఇస్లామీయ రాజ్యంగా ఉండేది. 1784లో బర్మా రాజు అరాకన్‌పై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాడు. బలవంతంగా బర్మాలో కలిపేసుకున్నాడు. 1886 నుంచి 1948 వరకు బర్మా ఆంగ్లేయుల ఏలుబడిలో ఉంది. అరాకన్ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన చాట్ గామ్ సమీపంలో ఉంది. 1948లో స్వాతంత్ర్య సమయాన అరాకన్ ముస్లిములు తమను పశ్చిమ పాకిస్థాన్‌లో ఒక భాగం చెయ్యమని మొరపెట్టుకున్నారు. కానీ ఆంగ్ల పాలకులు, బర్మా బుద్ధిస్టులు దీనికి అంగీకరించలేదు. మొన్నమొన్నటి వరకు బర్మాలో నియంతృత్వ రాచరిక పాలనే కొనసాగింది.

2010లో అంతర్జాతీయంగా పెరిగిపోయిన ఒత్తిళ్ళకు తలొగ్గి సైనిక నియంత ఎట్టకేలకు ఎన్నికలు జరిపించాడు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షానికి చెందిన మహిళ ఆంగ్ సాన్ సూచీ విజయం సాధించింది. ఈమె బర్మా ముస్లిముల పట్ల కాస్త సానుభూతి వైఖరితో ఉన్నట్లు కనిపించింది. కానీ చాలామంది ముస్లిమ్ నాయకులు అదొక కపట ప్రేమగా, రాజకీయ ఎత్తుగడగా పరిగణించారు. అనుకున్నట్లుగానే రాజకీయ ప్రసంగాలకే పరిమితమైన సూచీ ఆచరణాత్మకంగా ముస్లిములకు ఏమీ చేయలేకపోయింది. సూచీ తండ్రి ఆంగ్ సాన్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు. ఆయనకు ముస్లింలు అన్నివిధాలా సహాయసహకారాలు అందించి అండగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ముస్లిములు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. అయినా వారికి ఏవిధమైన ప్రయోజనం చేకూరలేదు.

ఇప్పుడు బర్మాలోని రోహింగ్యా ముస్లిములు ఇంతవరకూ చరిత్ర చూడని భయానక దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు. భూప్రపంచంలోని ఏదేశంలో, ఏప్రదేశంలో కూడా అక్కడి మైనారిటీల పట్ల ఇంతటి క్రూరత్వం, అమానుషత్వం జరగలేదు. అక్కడి ముస్లిములు ఒకచోటి నుండి మరోచోటికి వెళ్ళాలంటే ఎన్నో కష్టనష్టాలను చవిచూడవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్ళాలంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ముస్లిముల విద్యాభ్యాసానికీ ద్వారాలు మూసుకుపొయ్యాయి. సర్కారు కొలువులకూ దిక్కులేదు. చివరికి వారు వివాహం చేసుకోవాలన్నా కత్తిమీద సామే, ప్రాణాలతో చెలగాటమే. పెళ్ళికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. వధూవరులను ప్రభుత్వాధికారుల ముందు హాజరుపరచాలి. వారి వెకిలి చేష్టలను భరించాలి. ఎన్నో అవమానాలను దిగమింగుకోవాలి. ఇలాంటి దుర్మార్గాలు అనేకం జరుగుతున్నా, ముస్లింల నిర్మూలనే ధ్యేయంగా దారుణ మారణకాండ కొనసాగుతున్నా ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ నోరుతెరిచిన పాపాన పోలేదు. ఏ మానవ హక్కుల సంస్థ పెదవి విప్పలేదు. మానవ హక్కుల ధ్వజ వాహకులమని చెప్పుకునే సంస్థలకు కనీసం చీమకుట్టినట్లయినా లేదు. జాతీయ మీడియా పూర్తి మౌనం పాటిస్తోంది. కనీసం ముస్లిం దేశాధినేతలు, ఆయా దేశాల మీడియా సంస్థలు కూడా రెండు సానుభూతి వచనాలైనా పలకలేదంటే వారికి ఏదైనా విషపురుగు ముట్టడమో, నోట్లో వ్రణం పుట్టడమో జరిగి ఉంటుంది. ఒక్క టర్కీ ప్రధాని తయ్యిబ్ ఏర్దొగాన్ తప్ప ఏ ముస్లిం దేశాధినేతా పెదవి విప్పలేదంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు.

ఇదిలా ఉంచితే, 2010లో జరిగిన ఎన్నికల్లో సూకీ విజయం సాధించడం, అసెంబ్లీలో ముస్లింలు పద్నాలుగు స్థానాలను గెలుచుకోవడం చూసి చాలా మంది సైనిక ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని భావించారు. కాని ఇదొక వికృతమైన రాజకీయ కుట్ర అని తెలుసుకోలేకపోయారు. కొన్నాళ్ళపాటు కొంతమంది ముస్లిములు ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళినా ఎటువంటి ఇబ్బందులు, అవరోధాలు ఎదురుకాలేదు.

బర్మాలోని ముస్లిములు కూడా తమ ధార్మిక కార్యక్రమాలను కాస్తంత ముమ్మరం చేశారు. నియంతృత్వ సైనిక పాలనలో దుర్మార్గాలకు భయపడి మతం మార్చుకున్న కొన్ని కుటుంబాలు తిరిగి ధర్మపరివర్తన చెందాయి. అలా మారిన వారిలో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముస్లింల రక్తపిపాసులైన బుద్ధిస్టులు ఈ ఇద్దరు మహిళలను దారుణంగా హత్యచేశారు. పథకం ప్రకారం ముస్లింలే వీళ్ళను చంపారని గోబెల్స్‌ను మించిన దుష్ప్రచారం మొదలుపెట్టి, మళ్ళీ మత కలహాల మారణకాండకు తెరతీశారు. అరాకన్‌లోని ప్రధాన పట్టణం తన్ గూక్ జామె మస్జిద్‌లో ఇజ్తెమాలో పాల్గొనడానికి బస్సులో వస్తున్న37 మంది ముస్లింలను బౌద్ధ దుండగులు బస్సును అటకాయించి అక్కడికక్కడే పదిమందిని చంపేశారు. మిగతా 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విధంగా మతకలహాల మారణకాండ బర్మా అంతటా వ్యాపించింది. నిర్దాక్షిణ్యంగా ముస్లింల ఊచకోత ప్రారంభమైంది. మహిళల గౌరవం మంటగలిసింది. నడిచేటప్పుడు కూడా చీమల్లాంటి అల్పప్రాణులు పాదాల కింద నలగకుండా సున్నితంగా నడవాలని చెప్పుకునే బుద్ధిస్టుల చేతుల్లో కేవలం నెలరోజుల స్వల్పవ్యవధిలో సుమారు ఇరవై ఐదు వేల మంది ముస్లింలు చంపబడడమో, మాయం కావడమో జరిగింది. వందలాది మహిళలు అత్యాచారాలకు బలయ్యారు. ఇళ్ళు, ఊళ్ళు కాల్చబడ్డాయి. నిస్సహాయులైన అభాగ్యులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బంగ్లాదేశ్‌కు వలస వెళ్ళే క్రమంలో కూడా అనేక అవరోధాలు, ప్రమాదాలు.

ఈ రోజు యూరప్, అమెరికా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో క్రూరమృగాల సంరక్షణకు సంస్థలు ఏర్పడి పనిచేస్తున్నాయి. సంతోషం. కానీ ఎక్కడైతే ముస్లింల రక్తం ఏరులై పారుతోందో, అక్కడ అది ఆయా దేశాల అనుమతి, అభీష్టం మేరకే పారుతుందన్న విషయాన్నీ మనం గమనించాలి. ఎందుకంటే, వాటికి అసలు సమస్య ఇస్లామ్, ముస్లిం సమాజం.

ఓఐసీ ఏంచేస్తోందో, ముస్లిం దేశాధినేతలు ఎక్కడ ఉన్నారో అర్థంకావడం లేదు. కనీసం సాధారణ ముస్లిం సమాజం కూడా చలించడం లేదు. వ్యక్తిగతంగా ఏమైనా కష్టనష్టాలు సంభవిస్తే, లేక తమ నేతలకు ఏమైనా జరిగితే వెంటనే రోడ్లెక్కుతారు. కాని సమాజానికి ఇంత హాని జరుగుతుంటే, జాతి జాతినే నిర్మూలించాలన్నంత రాక్షసత్వంతో మారణకాండ కొనసాగిస్తుంటే కనీసం చీమకుట్టినట్లు లేకపోవడం సిగ్గుచేటు. వేదికలెక్కి ముస్లింల ఐక్యత, పరాధీనత గురించి గొంతుచించుకునే పండితవర్గం కూడా నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. అంతర్జాతీయ స్థాయిలో టర్కీ ప్రధాని తయ్యిబ్ఎర్దొగాన్ రోహింగ్యాల పక్షాన గర్జించడం, జాతీయస్థాయిలో జమాతె ఇస్లామీ హింద్ సంస్థ స్పందించి, మిగతాసంస్థలు, సంఘాలతో కలిసి ఐక్యకార్యాచరణకు పూనుకోవడం ఎంతైనా అభినందించదగ్గ విషయం.

ఇకపోతే, మీడియా – ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా అమెరికా అనుమతిస్తేనే తప్ప గళం విప్పదు. పాక్ మీడియాపై అమెరికా, తనహక్కు అన్నంత స్థాయిలో పెత్తనం చేస్తోంది. దేశంలోని మరే మీడియా సంస్థ కూడా బహుశా ఇంతగా దిగజారిపోలేదేమో! భారత ప్రధాని మోదీ, మయన్మార్ శాంతిదూత సూచీ ముస్లింల ఊచకోత తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అందుకని రోహింగ్యా ముస్లింలు కేవలం దైవాన్ని మాత్రమే నమ్ముకోవాలి. దైవంపై భరోసాతో శక్తిని కూడగట్టుకొని బౌద్ధ టెర్రరిస్టులపై, దుష్ట సైన్యంపై తిరగబడాలి. దైవం తప్పకుండా వారికి తోడ్పడతాడు. ఒక్క టర్కీ తప్ప, ముస్లిం దేశాలు కూడా కళ్ళు తెరుస్తాయన్న ఆశ ప్రస్తుతానికైతే లేదు. తమ అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి, అమెరికాకు ఎలా ఊడిగం చెయ్యాలి అన్న ధ్యాస తప్ప వారికి మరోధ్యాస లేదు. వారి అధికారం పాశ్చాత్య దేశాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

ఏదిఏమైనా దౌర్జన్యం ఎల్లకాలం సాగదు. విర్రవీగితే వినాశం తప్పదు. దేవుని దగ్గర ఆలస్యం ఉందేమోగాని, అంధకారం లేదు. దుర్మార్గాల అంతానికి తప్పకుండా ఓ ప్రత్యామ్నాయ తార ఉదయిస్తుంది. సత్యాసత్యాల మధ్య ఓ నిరర్ణయాత్మకమైన ఘర్షణ తప్పదు. అమెరికా నమ్మిన బంట్లుగా, వారి మోచేతి కింద నీళ్ళుతాగే ముస్లిం దేశాధినేతలు తీవ్ర పరాభవంతో, ఘోరమైన పరాజయం మూటకట్టుకునే రోజులు సమీపంలోనే ఉన్నాయి.

రోహింగ్యా అభాగ్యులపై జరుగుతున్న దారుణ మారణ కాండ సమసిపోవాలని ఆశిద్దాం.
యండి. ఉస్మాన్ ఖాన్
అక్షర సాహితి అధ్యక్షులు

No comments:

Post a Comment