Friday, 15 September 2017

మరణ మృదంగం!

మరణ మృదంగం!
Sakshi | Updated: September 15, 2017 02:42 (IST)
మరణ మృదంగం!
రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యార్థుల బలవన్మరణాలు

► చంపాపేట్‌లో ఉన్న శ్రీగాయత్రి కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థి సంజయ్‌.. తనను కాలేజీ లెక్చరర్లు చితకబాద డంతో మనస్తాపం చెంది భవనం పైనుంచి దూకేశాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

► బీహెచ్‌ఈఎల్‌లోని రావూస్‌ హైస్కూల్లో పీఈటీ.. యూనిఫామ్‌ వేసుకురాలేదంటూ ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థినిని బాలుర టాయిలెట్‌ వద్ద నిలబెట్టి అవమానానికి గురిచేసింది.

►  వనపర్తిలో పద్యం చెప్పనందుకు ఆనంద్‌ అనే 3వ తరగతి విద్యార్థిని టీచర్‌ కొట్టారు. దీంతో ఆ విద్యార్థి తాను చనిపోతాననగా.. అక్కడే ఉన్న మరొకరు ఎలా చనిపోతావంటూ కిరోసిన్‌ పోశారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి నిప్పంటించుకుని మూడు రోజుల తరువాత కన్నుమూశాడు.

కాలేజీలు, స్కూళ్లలో చదువు కోసం తీవ్రంగా ఒత్తిళ్లు టీచర్లు, లెక్చరర్లు, తోటి విద్యార్థుల వేధింపులు చిన్న చిన్న తప్పులకు అవమానించేలా శిక్షలు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు

..రాష్ట్రంలో విద్యార్థులకు ఎదురవుతున్న అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు, వాటి పరిణామాలకు ఉదాహరణలివి. ఒక చోట టీచర్‌ వేధిస్తే.. ఇంకోచోట తోటి విద్యార్థుల వేధింపులు.. మరో చోట లెక్చరర్లు.. హాస్టళ్లలో సాటి విద్యార్థులు.. ఇలా వివిధ రకాల వేధింపులతో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవాలంటూ ఉపాధ్యా యులు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు విద్యార్థు లు.. టీచర్లు, ప్రిన్సిపాళ్లు కొడతారేమోనన్న ఆందోళనతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు పాఠశాలలు, కాలేజీల పరిధిలో జరుగు తున్న ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు. అసలు విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలకు అయితే లెక్కేలేదు. అలాంటి ఘటనలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నా.. అవి బయటికి రావడం లేదు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా  అటు విద్యాశాఖగానీ, ఇటు పోలీసు శాఖగానీ పకడ్బందీ చర్యలు చేపట్టలేకపోతున్నాయి.

ఫిర్యాదులు చేస్తే చర్యలు..
పాఠశాలల్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడుతున్నామని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఫిర్యాదులు ఎక్కువగా రావడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థుల సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌ (18004257462)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే స్కూల్‌ బయట జరిగే వేధింపులు మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తాయని, దానిపై ఆ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ (1098)కు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడిక, ప్రవర్తనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

21గత ఏడాది∙మృతి చెందిన విద్యార్థులుసంఖ్య
రాష్ట్రంలో గతేడాది దాదాపు 21 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ఎక్కువ మంది వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ గా.. కొందరు పిల్లలు స్కూల్‌ బస్సుల ప్రమాదాల్లో చనిపోయారు. ఈ ఏడాది గత నాలుగు నెలల్లోనే దాదాపు 8 మంది కన్నుమూశారు.

ఈ ఏడాది దుర్ఘటనలకు బలైన విద్యార్థులు
♦ కామారెడ్డిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 6వ తర గతి చదివే బాలిక హోంవర్క్‌ చేయలేదు. దాంతో టీచర్,  ప్రిన్సిపాల్‌ కొడతారేమోనన్న భయంతో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.



♦ హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ మదర్సాలో ఆరోతరగతి చదువుతున్న మహ్మద్‌ ఫయాజ్‌.. మదర్సాలో ఉపాధ్యాయులు కొట్టారన్న అవమానంతో ఉరివేసుకున్నాడు.

♦ ఘట్‌కేసర్‌లోని ఎస్‌పీఆర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందకుమార్‌ అనే విద్యార్థి.. టీచర్‌ కొట్టడంతో అవమానంగా భావించి ఉరివేసుకున్నాడు.

♦ కరీంనగర్‌లో మధు అనే 8వ తరగతి విద్యార్థిని టీచర్‌ వెంబడించడంతో స్కూల్‌ భవనం పైనుంచి దూకి మరణించాడు.

♦ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదివే లీల, వికారాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదివే సాయి అనే విద్యార్థులు కూడా టీచర్లు కొట్టారని ఉరి వేసుకొన్నారు.

పట్టించుకోని ఇంటర్‌ విద్యాశాఖ
బలవన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్న జూనియర్‌ కాలేజీల విద్యార్థులే. ముఖ్యంగా కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుల కోసం ఒత్తిళ్లు, లెక్చరర్లు, తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ దీనిపై ఇంటర్‌ విద్యాశాఖ స్పందించడం లేదు. కార్పొరేట్‌ కాలేజీల ముడుపులకు ఆశపడి ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

తల్లిదండ్రుల వైఖరే కారణం
‘‘ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, వేధింపులకు తల్లిదండ్రుల వైఖరే ప్రధాన కారణం. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసు కోకుండా, వారికి ఇష్టం లేని కోర్సుల్లో చేర్పిస్తుండటంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. దానిని తట్టుకోలేక, తల్లి దండ్రులు ఏమం టారోనన్న భయంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదవాలంటూ లెక్చరర్లు విద్యార్థులను కొడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి..’’
– చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త

కౌన్సెలర్లను నియమించడం లేదు
‘‘నిబంధనల ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో మానసిక వి«శ్లేషకులను, కౌన్సెలర్లను నియ మించాలి. కానీ అది అమలు కావడం లేదు. మార్కుల పోటీలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. వారికి కౌన్సెలిం గ్‌ ఇస్తే ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆత్మహత్యలను నివారించవచ్చు..’’
– పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

ప్రేమ, ఆప్యాయతలు ముఖ్యం
‘‘యుక్తవయసు పిల్లల్లో అడ్రినలిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో వారిలో క్షణికావేశం ఎక్కువగా ఉండి ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు సమయం కేటాయిం చకపోవడం, ప్రేమ, ఆప్యాయ తలతో మెలగకపోవడం వల్ల పిల్లలు తమ సమస్యను చెప్పుకోలే కపోతున్నారు. డిప్రెషన్‌ పెరిగిపోతోంది. అందువల్ల తల్లిదండ్రులు ప్రేమగా మసలుకుంటూ.. పిల్లల సమస్యలు తెలుసుకుని, మంచి చెడులను వివరించాలి..’’
– డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణుడు

No comments:

Post a Comment