హిందుత్వ అమ్ముల పొదిలో ఉమ్మడి పౌర స్మృతి
Sakshi | Updated: October 16, 2016 14:55 (IST)
హిందుత్వ అమ్ముల పొదిలో ఉమ్మడి పౌర స్మృతి
అవలోకనం
నేడు దేశానికి నేతృత్వం వహిస్తున్న పార్టీ హిందుత్వ అని పిలిచే భావజాలాన్ని కలిగిన పార్టీ. ఆ భావజాలం డిమాండ్లు మూడు. ఒకటి భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం. రెండు అయోధ్యలో రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించడం. మూడు ఉమ్మడి పౌర స్మృతిని అమలుపరచడం. ఈ మూడు డిమాండ్లూ మైనారిటీ మతస్తులు ఎంతో కొంత వదులుకోవాలని కోరు తున్నవే. కశ్మీర్‌లో మెజారిటీగా ఉన్న ముస్లింలు రాజ్యాంగబద్ధమైన తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని వదులుకోవాల్సి వస్తుంది. ఆలయానికి వస్తే, ముస్లింలు తమ మసీదును వదులుకోవాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి పౌర స్మృతి కోసం వారు తమ సొంత పౌర స్మృతిని విడనాడాల్సి ఉంటుంది.
ఈ కారణంగానే ఈ డిమాండ్లు సానుకూలమైనవి కావనీ, ప్రతికూలాత్మక మైన అధిక సంఖ్యాకవాదం నుంచి పుట్టుకొచ్చినవనీ భావించడం సాధ్యం అవు తోంది. అంటే పైకి కనిపిస్తున్న దానికి భిన్నంగా ఆ మార్పులు సదుద్దేశాలతో కూడినవి కావని అనిపిస్తోంది. హిందుత్వ శక్తులు అయోధ్యలోని మసీదును కూల గొట్టడంతోనే ఆలయ నిర్మాణ ఉద్యమానికి ఏ గతి పట్టిందనేదే ఈ వాదనకు విశ్వ సనీయతను కల్పించింది. ఆలయ ఉద్యమం మరింత ఎక్కువ ప్రతికూలాత్మక మైనది కావడంతో కుప్పకూలింది. అంటే ఆ ఉద్యమం ఆలయ నిర్మాణానికి అనుకూలమైనదిగా కంటే ఎక్కువగా మసీదుకు వ్యతిరేకమైనదని అనిపించింది.
అధికరణం 370కి సంబంధించి... జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా విలీనం చేసే విష యంలో న్యాయపరమైన సమస్యలెన్నో ఉన్నాయి. అయినా అధికార భావజాలం అసలు ఉద్దేశమేమిటో నేటి కశ్మీర్ పరిస్థితిలో బహుశా చూచాయిగా గ్రహించ వచ్చు. పాకిస్తాన్‌లో మన సైనిక చర్యపై అతి జాతీయాభిమాన ప్రదర్శనలోని ప్రస్తుత ఘట్టం కశ్మీర్ ఘటనలను కప్పేసింది. కానీ ఆలస్యంగానైనా అక్కడి పరిస్థితిని ఎలా సంబాళించుకు రావాలనే దానిపై మనం దృష్టి సారించక తప్పదు.
ఉమ్మడి శిక్షా స్మృతి డిమాండు ఇప్పుడు ఊపందుకుంటోంది. రెండు దశలుగా అది జరుగుతోంది. అందులో మొదటిది పురుషులు ఆధిపత్యం వహించే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కొనసాగాలని కోరుతున్న మూడు తలాక్‌ల వ్యతిరేక కార్యా చరణ. మూడుసార్లు తలాక్ అనడమనే ఈ పద్ధతి అతి త్వరితంగా విడాకులు తీసుకోడానికి మగాళ్లను అనుమతించే పద్ధతి. పాకిస్తాన్ సహా చాలా ముస్లిం దేశాలు దీన్ని అనుమతించవు. ప్రభుత్వం దాన్ని చట్ట విరుద్ధమైనదిగా చేయాలని అనుకుంటోంది, కోర్టులు దాని పక్షానే ఉన్నాయి. అదే జరిగితే, పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడాన్ని చూడాల్సి ఉంటుంది.
ఇక రెండవది బహు భార్యత్వం సమస్య. హిందుత్వ అసలు ప్రయోజనం అందులోనే ఇమిడి ఉంది. హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ వేగంగా పునరుత్పత్తి చేస్తున్నారని, ఆ కారణంగా ఎప్పుడో ఒకప్పుడు వారు మెజారిటీగా మారిపోతారని అది భావిస్తోంది. నిజానికి బహు భార్యత్వం ముస్లింలలో కంటే హిందువులలోనే ఎక్కువని గణాంక సమా చారం తెలుపుతోంది. కానీ, ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్‌ను ముందుకు నెట్టేంత ప్రబలంగా ఈ భావన హిందుత్వలో వేళ్లూనుకుని ఉంది.
చరిత్రకారుడు రామచంద్ర గుహ కొంత కాలం క్రితం... ఉదారవాదులు, వామపక్షవాదులు ఉమ్మడి పౌర స్మృతికి ఎందుకు మద్దతు పలకాలో, బహు భార్యత్వాన్ని ఎందుకు వ్యతిరేకించాలో పేర్కొన్నారు. ఈ హిందుత్వ డిమాండు పట్ల వామపక్షవాదుల వ్యతిరేకతకు కారణం ఈ ఏడు అంశాలలో ఒకటన్నారు:
1. 1950లలో హిందూ పౌర స్మృతికి చేసిన సంస్కరణలు చెప్పుకున్నంత ప్రగతిశీలమైనవేమీ కావు. 2. నేటి హిందువులు రివాజుగా పాటిస్తున్న నియ మాలు, ఆచారాలు తరచుగా ప్రతీఘాతుకమైనవి. ఉదాహరణకు ఖాప్ పంచాయ తీలు. 3. సంస్కరణలు జరగని ముస్లిం పౌర స్మృతిలోని చట్టాలు చెబుతున్నంతగా ప్రతీఘాతుకమైనవి కావు. 4. ముస్లింలు పాటించే ఆచారాలు చెబుతున్నంత చెడ్డవేమీ కావు. కాబట్టే హిందూ బహు భార్యత్వంలో వలే ముస్లింల బహు భార్యత్వం రెండవ లేదా మూడవ భార్య పట్ల వివక్ష చూపదు. 5. ఉమ్మడి పౌర స్మృతి డిమాండు బీజేపీ రాజకీయ ఎజెండాతో ప్రేరేపితమైనది. 6. ఉమ్మడి పౌర స్మృతిని కోరే అధికరణం 44... మత ప్రచార స్వేచ్ఛకు హామీనిచ్చే అధికరణం 25తో ఘర్షిస్తుంది. 7. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణాలు పరిపూర్తి కాకుండానే ఉండిపోగా, దీనిపైనే ఎందుకు ఇంత రభస చేస్తున్నారు?
గుహ ఒక అంశాన్ని, అదీ ఒక ముఖ్య అంశాన్ని విస్మరించారని నా అభి ప్రాయం. అది, కొందరు ఉదారవాదులు (వ్యక్తుల హక్కుల కోసం ఉద్యమించే వారు) ఈ సంస్కరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది. అది, రెండో భార్యగా లేదా రెండో భర్తగా ఉండటానికి (బహు భర్తృత్వం మన దేశంలో కొన్ని జాతులలో అమలులో ఉంది) స్త్రీకి లేదా పురుషునికి ఉండే హక్కు కాబట్టి. 90 శాతం ముస్లిం మహిళలు బహు భార్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాట నిజమే. అయితే 90 శాతం ముస్లిం మహిళలు ఏక పత్నీ వివాహ బంధాలలోనే జీవిస్తున్నారు కూడా. కాబట్టి బహు భార్యత్వ వివాహ బంధంలో ఉన్నవారు ఈ ఆచారాన్ని ఎలా చూస్తున్నారనే అంశంపై జరిపే అధ్యయనం ఆసక్తికరంగా ఉంటుంది.
గుహ, బహు భార్యత్వం ‘‘హేయమైనది,’’ తప్పక ‘‘నిషేధించాల్సినది’’ అంటున్నారు. ఇది నైతికపరమైన తీర్పని నా అభిప్రాయం. స్వలింగ సంపర్కం గురించి భారత చట్టం, వరుసగా వచ్చిన వివిధ ప్రభుత్వాలు అదే విషయాన్ని చెబుతూ వచ్చాయి. కానీ ఉదారవాదులు ఈ సందర్భంలో కూడా వ్యక్తి స్వతంత్రా నికి మద్దతుగా నిలుస్తారు. ఇదంతా చెప్పిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం... ప్రస్తుతం ఈ సమస్యపైకి హిందుత్వ దృష్టి కేంద్రీకరణ మరలింది. ఇక తదుపరి హిందుత్వ తన పునాదిని పటిష్టం చేసుకోడానికి బరిలోకి దిగేది మూడు తలాక్‌లు, బహు భార్యత్వాలపైనే అని నా అంచనా. గతంలో ఇలా జరిగిన ఇతర సమస్య ల్లాగే ఈ విషయంలోనూ మనం సమస్య తలెత్తనున్నదనే ముందు చూపుతో ఉండాలి.
వ్యాసకర్త: ఆకార్ పటేల్
aakar.patel@icloud.com
No comments:
Post a Comment