Saturday, 26 April 2025

పహల్గాం అనంతర స్థితి: అంతర్యుద్ధాన్ని నివారించటమే జాతీయ విజ్ఞతకు సవాలు

పహల్గాం అనంతర స్థితి: అంతర్యుద్ధాన్ని నివారించటమే జాతీయ విజ్ఞతకు సవాలు

By The Wire Editorial Team on April 26, 2025

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల తర్వాత దేశవ్యాప్తంగా కమ్యూనిటీ వాట్పప్‌ గ్రూపుల్లో కోపోద్రేకాలతో కూడిన భావోద్వేగాలు ఎగసిపడుతున్నాయి. ఈ పరిస్థితులు పేట్రేగిపోయి దేశంలో హిందూ ముస్లింల మధ్య చీలికను మరింత ఉధృతం చేసి వేగవంతం కానీయకుండా చూడటం ఇప్పుడు రాజధర్మం లక్ష్యం. లక్షణం. ఒక జాతీయ విపత్తు నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలన్న కుత్సిత బుద్ధితో ప్రచారమవుతున్న ఓ వాట్సప్‌ పోస్టును చూడండి :

శ్రద్ధాంజలి

వాళ్లు చేసిన పనే నేటి నుంచీ మొదలు పెట్టండి

పేరడగండి, పొట్టలో తన్నండి

పేరడగండి, పనిలోంచి పీకేయండి

పేరడగండి, సరుకులు కొనకండి

పేరగండి, టాక్సీ బుకింగ్‌ రద్దు చేసుకోండి

పేరడగండి, పూర్తిగా బహిష్కరించండి

ఒకటి రెండు వారాలు ఇబ్బంది కలగొచ్చు

కానీ, ఫలితాలు ఎంతో బాగుంటాయి.

భారత రాజ్యాన్ని, అనుభవజ్ఞులైన పరిపాలన దక్షులను ఇటువంటి వాళ్లు సవాలు చేయటం ఇదే మొదటిసారి కాదు. కానీ ఇప్పుడు ఎదురవుతున్న సవాలు గతంలో లాంటిది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకోవాలనుకుంటున్న వాళ్లు యావత్‌ పరిపాలనలో 56 అంగుళాల లోతైన గుంతలు తవ్వారు. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపియేతర ప్రభుత్వాలు పాకిస్తాన్‌ పట్ల కఠినంగా వ్యవహరించలేకపోయాంటూ ఏడున్నర దశాబ్దాలుగా చేస్తున్న విమర్శలు ఇప్పుడు బిజెపి ప్రభుత్వంపై పెద్ద భారాన్ని మోపుతున్నాయి. కనీసం బాలాకోట్‌ లాంటి ప్రతిస్పందన అయినా ఈ ప్రభుత్వం నుండి ఆశిస్తున్నాయి. మెరుపుదాడులు ప్రస్తుత పాలకపక్షం ప్రత్యేక గుర్తింపుగా మిగిలింది కేంద్రమంత్రివర్గంలో సీనియర్‌ మంత్రులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో చొరబడతామని కూడా ప్రకటించారు. అదేదో పొద్దున్నే వ్యాహ్యాళికి వెళ్లిరావటం అన్నట్లు.

ఏప్రిల్‌ 23న జరిగిన భధ్రతా వ్యవహారాలపై మంత్రివర్గ ఉపసంఘం పహల్గాంకు స్పందనగా దౌత్యపరమైన మెరుపుదాడులు చేయాలని నిర్ణయించింది. కానీ ఏడున్నర దశాబ్దాలుగా ప్రత్యేకించి గత దశాబ్దమున్నర కాలంగా పాకిస్తాన్‌ గురించి ఆరెస్సెస్‌, జనసంఘ్‌, బిజెపిలు చేసిన ప్రచారంతో భావోద్వేగాలు తలకెక్కించుకున్న వాళ్లు మాత్రం దౌత్యపరమైన స్పందనను మించిన స్పందన ఈ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు.

మితవాద భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని స్పందిస్తే పాకిస్తాన్‌ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్న విషయంలో పాలకపక్షానికి మీమాంస లేకపోలేదు. పాకిస్తాన్‌ను గాయపర్చటం ఈ మితవాదుల నినాదంగా మారింది. కార్గిల్‌ యుద్ధకాలం నుండీ సైనికుల ప్రాణత్యాగాలను బిజెపి ఎన్నికల పెట్టుబడిగా మల్చుకుంటూ వస్తోంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించటంలో కరుకుదనం, రాజీలేని వైఖరి అన్న మాటలు బ్యాలట్‌ బాక్స్‌లో ఓట్ల పంట పండించాయి. ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు, ప్రోత్సాహకులకు తీవ్రమైన హెచ్చరిక పంపటంతో పాటు దేశీయంగా పెరుగుతున్న మితవాదుల డిమాండ్‌ను తీర్చటం కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సమస్య.

భారతదేశం పాకిస్తాన్‌కు కలిగించే గాయానికి బదులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు పాకిస్తాన్‌ సిద్ధపడుతుందా? అటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనే విషయాలను రక్షణ వ్యవహారాల నిపుణులకు వదిలేద్దాం. పాకిస్తాన్‌ భారతదేశం చెదురుమదురుదాడులకు పాల్పడినా రెండు దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షోభాన్ని చాపకిందకు నెట్టేయవచ్చు. అయినా, ఈ చెదురుమదురు ఘర్షణలు, దాడులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేవు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మౌలిక సమస్య హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న అగాధం. ఇద్దరు ముగ్గురు తీవ్రవాదులు చేసిన పనికే దేశమంతా గ్రామాలూ, పట్టణాలు, వాడలు హిందూ ముస్లింల వారీగా చీలిపోవటం అంటే ఈ దేశ ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించి దేశాన్ని బలహీనపర్చాలన్న ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే కదా. సామాజికంగా చీలికలు పేలికలు అయిన దేశం ఎన్నడూ గొప్ప దేశం కాలేదు.

సహజంగా ముస్లిం సమాజం స్పందనలో పరిణతి కనిపించింది. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన మనసులో ఉన్నా కశ్మీరీ ముస్లింలు అందరూ ముక్తకంఠంతో ఈ దాడులకు పాల్పడిన వారిని ఖండించారు. మితవాదుల విచ్ఛిన్నకర విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ముస్లిం మేధావులు, ముస్లిం సమాజంలో పని చేస్తున్న వివిధ సంస్థలు ఉగ్రవాదులను, వారి ఎజెండాను నిర్మొహమాటంగా ఖండించారు. విచ్ఛినకర చర్యలను ప్రోత్సహించటమే పనిగా పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలు దారితప్పిన ఒకరో ఇద్దరో మౌలానాలను టీవీ స్టూడియోల్లో కూర్చోబెట్టుకుని మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్చలకు పాల్పడదన్న గ్యారంటీ ఏమీ లేదు. వెయ్యి ముక్కల విధానాన్ని పాటించే పాకిస్తాన్‌కు మన దేశంలోని ముస్లింలకు సంబంధమే లేదని నిరూపించుకోవడానికి ఈ దేశంలోని ముస్లిం పౌరులు దశాబ్దాలుగా కష్టపడుతూనే ఉన్నారు. కానీ పహల్గాం లాంటి దాడులు, హిందూత్వను తలకెక్కించుకున్న సంఘపరివారం సోషల్‌ మీడియా యోధుల దాడుల నేపథ్యంలో ఈ పోరాటం రానురాను కష్టతరంగానూ, క్లిష్టతరంగానూ మారుతోంది.

సాధారణ పరిస్థితుల్లో కూడా మన దేశంలో సామాజిక సంతులత, సుహృద్భావం పెళుసుగానే ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో ఈ పెళుసుతనం మరింత పెరిగింది. హిందువులందరినీ ఏకం చేయాలన్న ఆరెస్సెస్‌ విధానంలో భాగంగా హిందూమతంలో కులాలవారీ చీలికలను అధిగమించకుండా జాతీయ ఐక్యత సాధ్యం కాదని అవగాహనతో కృషి చేస్తోంది. మరోవైపున మోహన్‌ భాగవత్‌ ప్రతి ఊళ్లో ఒకే గుడి, ఒకే బావి, ఒకే స్మశానం అని ఇస్తున్న పిలుపులు క్షేత్రస్థాయిలో కనిపించని శతృవుకోసం వెతుకులాటను ప్రేరేపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే బిజెపి ఎన్నికల వ్యూహం, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ ఎన్నికల వ్యూహం ముస్లింలను పూర్తిగా వెలివేసే దిశగా సాగుతోంది. చీలిపోతే ముక్కలవుతాము అన్న నినాదం గుర్తుంది కదా మనకి? ఈ నినాదం ఎన్నికల్లో బిజెపికి విజయం సాధించి పెట్టవచ్చు కానీ దేశంలో వివిధ సామాజిక తరగతుల మధ్య అగాధాన్ని మాత్రం మరింతగా పెంచేసింది. సంఖ్యాధిపత్యం కలిగిన వారిలో భయాందోళనలు మరింతగా పెంచి పోషించటానికి కొత్తకొత్తగా పుట్టుకొచ్చిన కార్పొరేట్‌ బాబాలు షర్బత్‌ జీహాద్‌ అంటూ అర్థంపర్థం లేని సమస్యలు తమకున్న (అ)జ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి బిజెపి శ్రేణులు ఎక్కడికక్కడ రాజకీయ ప్రయోజనాలు, ప్రత్యేకించి ఎన్నికల ప్రయోజనాలు పొందటం కోసం పహల్గాంను ఎన్ని రకాలుగా వ్యాఖ్యానిస్తారో, వక్రీకరిస్తారో అర్థం చేసుకోటం తేలికే.

రోజురోజుకూ పెరిగిపోతున్న హిందూ ముస్లిం చీలిక ముందు ముందు జాతీయ భద్రత, అభివృద్ధికి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో పాలకపక్షంలో కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేయటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశం. ఎందుకంటే పాలకపక్షంలోనూ ఆలోచించే మెదళ్లు, ఆందోళన చెందే మనసులు ఉన్నాయని అర్థం అవుతుంది కాబట్టి. బహుశా ఇటువంటి వారి ప్రభావంలోనే పోయిన నెలలో ప్రధానమంత్రి మోడీ సౌగత్‌ ఏ మోడీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటువంటి చర్యలు ఎంత ఉదాత్తమమైనవైనా ప్రభుత్వం వ్యవహారం నిప్పుకోడిలా తలని నేలలో పాతేసి చుట్టూ జరిగే విషయాలను పట్టించుకోకపోవటం సరికాదు. పాలకపక్షంలోని ఇటువంటి సున్నిత మనస్కులు సైతం పహల్గాం పరిణామాల నేపథ్యంలో ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తోంది.

పహల్గాం ఉదంతం దేశానికి సవాలు విసిరింది. కేవలం రాజకీయ నిబద్ధత వంటి బోళా మాటలు, కుదించుకుపోయిన మనస్తత్వాల పరిధిని అధిగమించాలన్నదే ఆ సవాలు. మన పౌరుల మధ్యనే మీరు మేమూ అన్న చీలిక తెచ్చి అంతర్గత ఘర్షణలను శాశ్వతం చేసేలా పాకిస్తాన్‌ రెచ్చగొడితే రెచ్చిపోవటం వలన మనకు ఒరిగేదేమీ ఉండదు. పాకిస్తాన్‌ నడిపిస్తున్న ఆట వెనక ఉన్న వ్యూహాన్ని గుర్తించి దేశ సమైక్యత, సమగ్రతలకు భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం దార్శనికత ప్రదర్శిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. 

హరీష్‌ ఖరే

అనువాదం : కొండూరి వీరయ్య

No comments:

Post a Comment