PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..
ABN , Publish Date - May 16 , 2024 | 03:30 AM
‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్‌ఎన్-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.
PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..
అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు!
మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్లం.. ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు
‘గోద్రా’ తర్వాత నా ప్రతిష్ఠను దెబ్బతీశారు
ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం.. ఇక పాలనలో ఎలా సక్సెస్ అవుతారు: మోదీ
న్యూఢిల్లీ, మే 15: ‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్‌ఎన్-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు. ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటే దానర్థం వారు ముస్లింలు అనేనా? వారి పట్ల అంత అన్యాయంగా ఎలా వ్యవహరిస్తారు? కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి పోషణ, విద్య, వస్త్రాల కొనుగోలు మొదలైనవి కష్టమవుతాయి.
మతంతో సంబంధం లేకుండా పేదలందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అని తెలిపారు. చిన్నతనంలో తమ ఇరుగుపొరుగున ముస్లిం కుటుంబాలు ఉండేవని.. వారి ఆచార వ్యవహారాలను దగ్గరగా చూసి అర్థం చేసుకున్నానని చెప్పారు. ‘ఇతర పండుగల్లాగే మా ఇంట్లో ఈద్ కూడా జరిపేవాళ్లం. ఆ రోజున ఇంట్లో వంటచేసేవాళ్లు కాదు. పొరుగున ఉన్న ముస్లింల ఇళ్ల నుంచి భోజనం వచ్చేది. మొహర్రం ఊరేగింపులకు వెళ్లేవాళ్లం. తజియా (మహ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హసన్ సమాధి ప్రతిరూపం)ను మోసేవాళ్లం. అలాంటి సమాజంలో నేను పెరిగాను. నాకు పలువురు ముస్లిం స్నేహితులు ఉన్నారు. కానీ ఈ కోణాన్ని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా నాకు మద్దతిచ్చే ముస్లింలు చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఇది చేయాలి.. ఇది చేయాలంటూ వారిని నిర్దేశించే శక్తి వేరే ఉంది. 2002లో గోద్రా ఘటన తర్వాత నా ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారు’ అని అన్నారు.
నేను ప్రజాస్వామ్యవాదిని..
తాను ప్రజాస్వామ్యవాదినని.. 2014 నుంచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా.. అందులో అతి పెద్ద విపక్షానికి చెందిన నేతను వివిధ కమిటీల్లో నియమించేలా చట్టం తీసుకొచ్చానని మోదీ తెలిపారు. అలా చేయకపోయినా ఇబ్బంది లేదని.. కానీ చేశానని చెప్పారు. 400కిపైగా సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షం బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అయితే బలమైన ప్రతిపక్షమని అంటే.. పార్లమెంటు జరక్కుండా రచ్చరచ్చచేయడం కాదు. అది అప్రజాస్వామికం. దురదృష్టవశాత్తూ.. గత పదేళ్లలో ఆయా పార్టీలు తమ విపక్ష పాత్రను సక్రమంగా పోషించడంలో విఫలమయ్యాయి. ప్రతిపక్షంగానే విఫలమైనవారు పాలనలో ఎలా విజయవంతమవుతారు’ అని నిలదీశారు. భారత్‌కు దృఢమైన ప్రజాస్వామ్యం ఉండాలని.. ఇందుకోసం పటిష్ఠ ప్రతిపక్షం ఉండాలని అన్నారు. అందుకే చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రె్‌సలో విలీనం కావాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మంచి సలహాయే ఇచ్చారని.. ఇదే జరిగితే గౌరవప్రదమైన విపక్షం ఏర్పడుతుందని చెప్పారు. ‘అయితే విలీనమైతే.. ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడం సాధ్యం కాదు. గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా ఆవిర్భవించడానికి తగినన్ని సీట్లు వాటికి రావు’ అని ప్రధాని స్పష్టం చేశారు.
Updated Date - May 16 , 2024 | 03:31 AM
https://www.andhrajyothy.com/2024/national/pm-modi-said-that-he-has-resolved-not-to-do-hindumuslim-politics-1254848.html
వంద అదనమా? వంద పతనమా?
ABN , Publish Date - May 16 , 2024 | 05:58 AM
దిగ్భ్రాంతి చిన్నమాట. సర్వ జ్ఞానేంద్రియాలూ స్తంభించిపోయి, మనసుకు చీకట్లు కమ్మి, అవాక్కై ఉనికి ఉనికే కొయ్యబారిపోయిన అచేతనావస్థ. ఇన్నిరోజులు వింటున్నదేమిటి? వారణాసి నగరంలో పవిత్ర గంగానది మధ్యలో, ఆ పెద్దమనిషి ఇప్పుడు అంటున్నది ఏమిటి? ‘మహాశ్చర్యంబు చింతింపగన్’.
‘‘నేనెప్పుడన్నాను? చొరబాటుదారులని నేను వాళ్లను అనలేదే? అధికసంతానులంటే ముస్లిములని ఎవరు చెప్పారు? ఎందుకు వాళ్ల గురించి అన్యాయంగా ఆలోచిస్తారు? నేను పేదవాళ్లను దృష్టిలో పెట్టుకుని అన్నాను. హిందూ ముస్లిం అన్న తేడాలను నేను తీసుకువస్తే, నేనసలు ప్రజాజీవితానికి పనికేరాను’ అన్నారు నరేంద్రమోదీ. ముస్లిములతో ఇరుగుపొరుగు జీవితం గురించి, ఈద్ వేళల్లో తమ ఇంటికి కానుకగా వచ్చే భోజనాల గురించి, మొహర్రం ఊరేగింపులో తాను పాల్గొనడం గురించి మోదీ ఎంతో తన్మయంతో చెప్పారు. తాను కఠినుడిని కానని, తనలోపల ఒక తడిహృదయం ఉన్నదని, తనను ఇంతవాడిని చేసింది జనమేనని, తనలో ఏవైనా లోపాలుంటే సరిచేసుకుంటానని ఆయన మనసు విప్పిమాట్లాడారు. తనకూ ముస్లిములకూ మధ్య ప్రతిపక్షాలు అపార్థాలను కల్పించాయని చెబుతున్నప్పుడు ఆయన గొంతు పూడుకుపోయింది.
కాశీలో నామినేషన్ వేళ, సాధారణ ఎన్నికల అయిదో దశ పోలింగ్‌కు పూర్వరంగంలో ఈ అపరిచితుడి ఆవిష్కరణ జరిగింది. రెండో దశ పోలింగ్ తరువాత మారిన స్వరానికి, ఇప్పుడు నాలుగోదశ తరువాత మారుతున్న స్వరానికి తేడాలు గమనించిన వారికి, అందుకు కారణాలు కూడా ఊహించడం కష్టం కాకపోవచ్చు. ఇంకా పోలింగ్ జరగవలసి ఉన్న 163 లోక్‌సభ నియోజకవర్గాలలో మునుపటి మంగళసూత్రాలూ, ముస్లిం రిజర్వేషన్లూ పెద్ద అవసరం లేకపోవచ్చు.
ఇంతకూ దశల వారీగా ఎన్నికల ప్రచారాంశాలను, శైలిని మార్చుకోవడం ముందే రూపొందించుకున్న ప్రణాళికా బద్ధ వ్యూహంలో భాగమా? లేక, ఈ కొత్త రాజకీయ సంవాదాలు, గడచిన దశల పోలింగ్ సరళుల ఆధారంగా తీసుకుంటున్న ఆపద్ధర్మ దిద్దుబాట్లా?
తాను సొంతంగా 303, ఎన్‌డీఏ కూటమి మిత్రులతో కలిసి 353 గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ, ఈసారి 370, 400 అన్న లక్ష్యాన్ని ప్రకటించుకుని రంగంలోకి దిగింది. ఆ పార్టీ ధీమాను, ఎదుటి పక్షాన్ని బెదరగొట్టాలనే ధోరణిని ఆ సంఖ్యలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. మొదటి రెండు దశల దాకా, ఆ నినాదానికి ప్రతినినాదమే లేదు. మునుపటి కంటె మెరుగైన ప్రచారశక్తితో ప్రయత్నించడం తప్ప ఇండియా కూటమి ప్రారంభదశలో దూకుడు ప్రదర్శించింది లేదు. ముస్లిం వ్యతిరేక ప్రచారాంశాలను సాక్షాత్తూ ప్రధానమంత్రి ధాటిగా మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత, ఇండియా కూటమి ఆలోచనలో పడింది. ప్రతికూలపవనాలు వీస్తున్నాయని తెలిసి, తెగింపుతో సాక్షాత్తూ ప్రధానమంత్రి ముస్లిం వ్యతిరేక ప్రచారానికి ఒడిగట్టారని భావించి, సమాధానమివ్వడం మొదలుపెట్టింది. మోదీకి ప్రతికూలత పెరిగిందన్న అభిప్రాయాన్ని, అంకెలలోకి అన్వయించసాగింది. బీజేపీ కూటమికి 400 స్థానాలు అసాధ్యం అన్న మాటతో మొదలై, క్రమంగా, సాధారణ మెజారిటీకే ఆమడ దూరంలో ఆ పార్టీ ఆగిపోతుందన్న దాకా ఇండియా కూటమి నేతలు మాట్లాడారు. అందుకు వివరణగా, ఉత్తరాదిలో అంతా తరుగేనని, దక్షిణాదిలో వస్తుందనుకున్న పెరుగుదల రాదని ఒక వాదన కూడా ప్రచారంలో పెట్టారు. పోయిన ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన రాష్ట్రాలన్నిటిలో ఈసారి గణనీయమైన కోత తప్పదని చెబుతూ వచ్చారు.
పోలింగ్ సరళి సమాచారం ప్రతిపార్టీకి సొంత యంత్రాంగం ద్వారా అందుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుబాటులో ఉండే పార్టీలకు మరింత లోతైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌పై బీజేపీకి అందిన కూపీలేమిటో తెలియదు. ఆ పార్టీ సరళిని బట్టి ఊహించవలసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత ఎటువంటి మాటలైనా మాట్లాడించడం, అసత్యాలనిపించే ప్రకటనలు కూడా చేయించడం, గద్గద స్వరంతో భావోద్వేగాలను కూడా ప్రదర్శింపజేయడం చూస్తుంటే, లక్ష్యాన్ని సాధించలేకపోవడం గురించిన నిస్పృహాభావం బీజేపీ ప్రచారనిపుణులలో కలిగిందా, ఆ ఆత్రుత, ఉత్కంఠ నుంచే ఆపద్ధర్మ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్న సందేహాలు కలుగుతాయి.
ఇప్పుడు లక్ష్యాన్ని 272కు దించుకోవాలా? అన్న అంశం మీద, నాలుగోదశ పోలింగ్ ముగిసిన రోజు రాత్రి రాజ్‌దీప్ సర్దేశాయి ఇండియాటుడే టీవీలో చర్చ నిర్వహించారు. 2019 ఎగ్జిట్ పోల్స్‌లో చాలా సమీపస్థాయిలో ఫలితాలను ఊహించగలిగిన యాక్సిస్ మై ఇండియా సారథి ప్రదీప్ గుప్తా, అనేక రాజకీయ పార్టీలకు వ్యూహనిపుణుడిగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్, ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక శాస్త్రవేత్త యోగేంద్రయాదవ్ పాల్గొన్న ఈ చర్చ మీడియాలో మరింత విస్తృత సంవాదాలకు కారణమైంది. 2019 నాటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి పెద్ద తేడా ఏమీ లేదని, బీజేపీ బలం తగ్గిపోతుందని చెప్పేవాళ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో తరుగుదల ఉంటుందో చెప్పాలని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. 2004 నాటి అనుభవాన్ని చెబుతూ, బీజేపీ పరాజయావకాశాలను చర్చిస్తున్న యోగేంద్రయాదవ్ మాత్రం పరిస్థితిలో మార్పు ఉన్నదని అన్నారు. సీట్లసంఖ్య జోలికి పోను గానీ, గత ఎన్నికలకు ఇప్పటికీ ఓటింగ్ సరళిలో పెద్ద తేడా కనిపించడం లేదని ప్రదీప్ గుప్తా అంటున్నారు. అనేక దశల పోలింగ్‌లో మధ్య దశల నుంచి గాలిమారే అవకాశం లేదని ఖాయంగా చెబుతున్నారు.
ఈ ఇద్దరిలో కనీసం ప్రదీప్ గుప్తా దగ్గర గడచిన మూడు దశల పోలింగ్ ధోరణి గురించిన సమాచారం ఉండవచ్చు. ప్రశాంత్ కిశోర్‌కు ఇప్పుడు సొంతంగా యంత్రాంగం లేదు కానీ, అనుభవం నుంచి, విధాన విశ్లేషణ నుంచి ఫలితాలను ఊహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఘోరంగా ఓడిపోతారని ఆయన చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నుంచి తొమ్మిది లోపు స్థానాలు వస్తాయని చెబుతున్నారు. జాతీయస్థాయిలో యథాతథ స్థితే ఉంటుందని, ఉత్తరాదిలో ఏమైనా కోల్పోయిన పక్షంలో అవి తక్కినచోట్ల భర్తీ అవుతుందని ఆయన అంటున్నారు. వీరందరూ 2019 కంటె ఇప్పుడు రాష్ట్రాలలో ఎన్నికల సర్దుబాట్లు భిన్నంగా జరిగాయని, కొత్త సమీకరణలు ఏర్పడ్డాయని గుర్తించారా? మోదీ జాతీయస్థాయి ఎన్నికల యుద్ధం చేస్తుంటే, ప్రతిపక్ష కూటమి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లెక్కన పోరాడుతోందని గ్రహించారా?
ఈ నిపుణుల అనుభవాన్ని గౌరవించవలసిందే కానీ, ఈ చర్చ, ఈ దశలో ఎందుకు అవసరమవుతోంది? అన్నది ప్రశ్న. బీజేపీ 400 లక్ష్యాన్ని చెప్పినప్పుడు, ఈ గుప్తా, కిశోర్ వంటివారు, అదనంగా 100 స్థానాలు ఎక్కడ గెలుస్తారు అని అడిగారా? ఇప్పుడు మాత్రం బీజేపీ 100 స్థానాలు ఎక్కడ కోల్పోతుందో చెప్పమని ఇండియా కూటమిని నిలదీస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 220 మించి రాకపోవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే, మమతాబెనర్జీ ఇండియా కూటమికి 315 స్థానాలు దక్కవచ్చునని అంటున్నారు. తాజాగా ఖర్గే కూడా గొంతు కలిపి, నాలుగుదశల తరువాత ఇండియా కూటమి బలం పెరిగిందని అన్నారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మరొక అడుగు ముందుకు వేసి, బీజేపీకి 200 స్థానాలేనని, ఇండియా కూటమి మమతా బెనర్జీని పక్కకు బెట్టి కాంగ్రెస్‌కు నాయకత్వం అప్పగించాలని మాట్లాడారు. బీజేపీ 400 వాదనకు ఇవి పోటీవాదనలు మాత్రమేనా? ఆత్మవిశ్వాసాన్ని దట్టించిన ప్రకటనలతో బీజేపీని బెదరగొట్టడానికేనా? కేవలం వ్యూహమే అయితే, వాస్తవం కాకపోతే, మరి ఇండియా కూటమిలో కొంత కొత్త ఉత్సాహం, బీజేపీలో ఉత్కంఠ ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రతిపక్ష కూటమి చెబుతున్న గాలిమార్పు వాదనను ఖండించే ఆత్మరక్షణలో ఎందుకు పడిపోయారు? రాహుల్ శివశంకర్ వంటి అస్మదీయ జర్నలిస్టులు పనిగట్టుకుని, 2004కు, 2024కు పోలికే లేదని, మోదీ తిరిగి ఘనవిజయం సాధిస్తారని ఎందుకు కొత్తగా విశ్లేషణలు చేయవలసి వస్తోంది?
మతవిభజన ముద్రను ఉన్నట్టుండి తుడిపేసుకోవాలని మోదీ ఎందుకు చూస్తున్నారు? ఇటీవలి ప్రచారం మోతాదు మించిందని, జనం హర్షించడం లేదని సంకేతం అందిందా? సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ చివరి మూడు దశలకు ఎందుకు అవసరమైంది? జూన్ ఒకటో తేదీ లోగా, మోదీ మరిన్ని అవతారాలు ప్రదర్శించబోతారా? సామాజిక మాధ్యమాలలో బీజేపీ వర్గీయులు ఎందుకు గోరువెచ్చగా మారిపోయారు? విమర్శక వీడియోలకు యూట్యూబ్‌లలో కోట్లాది వీక్షణలు ఎందుకు లభిస్తున్నాయి? న్యాయవ్యవస్థలో కొంత ధైర్యం పెరిగిందని వినిపిస్తున్న వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? (కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక సదుపాయం లభించిందని బాహాటంగా అమిత్ షా విమర్శించడం దేనికి సూచిక?)
చివరకు వాళ్ల 400, వీళ్ల 220 రెండూ మానసిక యుద్ధతంత్రంలో భాగమే కావచ్చు. అదీ ఇదీ కూడా అసాధ్యమైన సంఖ్యనే కావచ్చు. ఇంకా 163 స్థానాల పోలింగ్ ఉన్న మిగిలిన దశలను మనసులో పెట్టుకుని, ఈ ఎత్తుగడలు సాగుతూ ఉండవచ్చు. కానీ, ఒకరిలో పెరుగుతున్న అధైర్యం, మరొకరిలో కనిపిస్తున్న ఉత్సాహం ఎందువల్ల అన్న సందేహం మిగిలే ఉంటుంది. తనకు ఇష్టమైన ఊహలో ఉండడానికి ఓటరుకు ఇరవైరోజుల అవకాశం ఉంది. బరిలో ఉన్నవారి సంగతి వేరు, అధికారం చేజిక్కుతుందని కొందరి ఆశ. చేజారుతుందని కొందరి భయం.
కె. శ్రీనివాస్
Updated Date - May 16 , 2024 | 05:58 AM
https://www.andhrajyothy.com/2024/editorial/sandarbham/is-a-hundred-too-much-a-hundred-falls-1254920.html
No comments:
Post a Comment