Thursday, 16 May 2024

మతరహిత రిజర్వేషన్లకు చిరునామా ఎక్కడ?

 మతరహిత రిజర్వేషన్లకు చిరునామా ఎక్కడ?

ABN , Publish Date - May 17 , 2024 | 01:34 AM


               రిజర్వేషన్ల చుట్టూ ఎత్తులూ జిత్తులూ కొత్తకాకపోయినా ప్రస్తుత ఎన్నికల్లో అవే ప్రధానంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టటానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని మోదీ మొదలుకుని బీజేపీ నేతలందరూ ఆరోపణలతో హోరెత్తించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని పదేపదే చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించటం ద్వారా కాంగ్రెస్‌ దారుణానికి పాల్పడిందనీ ఆరోపించారు. అంతేకాదు బీసీ రిజర్వేషన్లలో కోత వేసి మరీ ఏపీలో వాటిని కల్పించారనీ విమర్శించారు. జరిగింది మాత్రం దీనికి భిన్నం. సత్యాసత్యాలతో పనిలేని ఆరోపణల పర్వంలోకి మన ప్రజాస్వామ్యం ఎప్పుడో దిగజారింది. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించటం బీజేపీ/సంఘ్‌పరివార్‌కు కొత్తకాదు. ఆ వర్గాన్ని ప్రత్యేకంగా చూడటం ఎప్పుడూ సమ్మతం కాదు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, హజ్‌యాత్రకు ఇచ్చే రాయితీల ఉపసంహరణలే అందుకు నిదర్శనం.

            ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ ఇంతగా విరుచుకుపడటానికి ఇప్పుడో నేపథ్యం ఉంది. బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామనీ ఇందుకోసం సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితినీ ఎత్తేస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. కులగణన వాగ్దానమూ అందులో భాగమే. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సర్వేను కూడా కులగణనతో పాటు చేపడతామని చెప్పింది. నవంబరు / డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ అంశాలతో బరిలోకి దిగినా తెలంగాణలో మాత్రమే గెలిచింది. అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో వీటికి మొదట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. రిజర్వేషన్లను మొత్తంగా రద్దుచేయటానికే 400 లోక్‌సభ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ ముమ్మరం చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ముస్లిం రిజర్వేషన్లతో పాటు ఇండియా కూటమి ప్రధాన వాగ్దానమైన సామాజిక–ఆర్థిక–కులగణన సర్వేపై బీజేపీ విమర్శలను గురిపెట్టింది. హిందువుల ఆస్తుల వివరాలను తెలుసుకుని వాటిని ముస్లింలకు కట్టబెడుతుందనే ఆరోపణలతో ప్రచారాన్ని తీవ్రం చేసింది.

        కులం, మతం, జాతి, భాషా, జన్మస్థలం ఆధారంగా విచక్షణ చూపకూడదని రాజ్యాంగం నిర్దేశించింది. ఆచరణలోకి వచ్చేసరికి వీటన్నిటికీ మినహాయింపులూ ఉన్నాయి. రిజర్వేషన్ల కల్పనే పెద్ద మినహాయింపు. ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో స్థానికులకు ప్రాధాన్యత దీని కిందకే వస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలులో నిషేధాలూ అలాంటివే.. ఇలా చెప్పుకొంటే జాబితా పెద్దదిగానే ఉంటుంది. ప్రస్తుత వివాదం ముస్లింల రిజర్వేషన్లు, హిందువుల ఆస్తుల పంపకం గురించే కాబట్టి, వాటి పరిశీలన ద్వారా సత్యాసత్యాల మధ్య విభజన రేఖలు స్పష్టంగా గుర్తించొచ్చు. హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచటం ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఏ లెక్క ప్రకారం చూసినా ముస్లింలు వెనుకబడే ఉన్నారు. ముఖ్యంగా ఆస్తులు, ఉద్యోగాల విషయంలో హిందూ మధ్య, ఎగువ తరగతితో పోల్చితే వారి స్థానం అట్టడుగునే ఉంది.

        ముస్లిం రిజర్వేషన్ల సమస్యను నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అందరికీ తెలిసిన మండల్‌ కమిషన్‌ సిఫార్సులను చూద్దాం. దేశంలో ఓబీసీలు (అదర్‌ బాక్‌వర్డ్‌ క్లాసెస్‌) 52 శాతం ఉంటారని కమిషన్‌ అంచనా వేసింది. ఈ 52 శాతంలో ఉన్న వారందరూ హిందువులు కారు. హిందూయేతర మతాల్లో ఉన్న 8.40 శాతం ఓబీసీలను కూడా 52 శాతంలో కలిపే చూపించింది. హిందూ ఓబీసీలను 43.60 శాతంగానూ. హిందూయేతర ఓబీసీలుగా 8.40 శాతంగానూ లెక్కగట్టింది. 82 ముస్లిం గ్రూపులను ఓబీసీలుగా గుర్తించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించాలని సిఫార్సు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని 1980ల నాటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, 7.5 శాతం చొప్పున రిజర్వేషన్లు అప్పటికే అమలవుతున్నాయి. మండల్‌ కమిషన్‌ జనతా ప్రభుత్వం హయాంలో ఏర్పాటైంది. ఆ ప్రభుత్వంలో జన్‌సంఘ్‌ పార్టీ (బీజేపీకి పూర్వరూపం) కూడా భాగస్వామి. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఆమోదించటం అంటే ఓబీసీ వర్గంలో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించటానికి అంగీకరించటమే! మండల్‌ సిఫార్సులపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో కూడా ముస్లింలను ఓబీసీలుగా పరిగణించటాన్ని సమస్యగా లేవనెత్తలేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా ముస్లింలను ఓబీసీలుగా భావించటాన్ని తప్పుపట్టలేదు. ఇక 1955లో ఏర్పాటైన కాకా కలేల్కర్‌ బీసీ కమిషన్‌ కూడా ‘మోస్ట్‌ బాక్‌వర్డ్‌’ కేటగిరిలో ముస్లింలలోని వెనుకబడిన వర్గాలను చేర్చింది.

            మండల్‌ కమిషన్‌ కంటే ముందే కొన్ని రాష్ట్రాలు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాయి. వాటి వర్గీకరణనూ చేపట్టాయి. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లూ కల్పించాయి. మండల్‌ కమిషన్‌ వీటిని పరిగణనలోకి తీసుకుంది. అందుకే కేంద్ర ఓబీసీ జాబితాలో వెనుకబడిన ముస్లిం వర్గాలు/కులాలు/ సమూహాలు చాలానే చేరాయి. 2011 నాటికి రాష్ట్రాల వారీగా కేంద్ర ఓబీసీ జాబితాలో 2,423 కులాలు ఉంటే అందులో 411 కులాలు/వర్గాలు ముస్లింలకు చెందినవి. వీరందరికీ మతంతో సంబంధం లేకుండా వెనుకబాటుతనమే గీటురాయిగా జాబితాలో చోటు కల్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముస్లిం కులాలూ కేంద్ర జాబితాలో ఉన్నాయి. ముస్లింలకు కల్పించిన అన్ని రిజర్వేషన్లూ మతప్రాదిపదికగానే జరిగాయని రాజకీయంగా వాదించొచ్చు. వాస్తవ దృష్టితో చూస్తే ఆ వాదన నిలబడదు. కాంగ్రెస్‌ ముస్లిం బుజ్జగింపు విధానంలో భాగంగా వాటిని కల్పించారని సర్దిచెప్పుకోటానికీ ప్రయత్నించొచ్చు. చారిత్రక దృష్టితో చూస్తే ఆ వాదనా నిలబడదు. బ్రిటిషు పాలననాటి స్వదేశీ సంస్థానాలకు బుజ్జగింపు అవసరాలు ఉన్నాయని భావించలేం. అప్పటికి ఓట్ల రాజకీయాల్లేవు. వివిధ వర్గాల సర్దుబాటు అవసరాలు ఉన్నాయి. ట్రావన్‌కోర్‌ (కేరళ), మైసూరులు హిందూ సంస్థానాలే. 1874లోనే మైసూరులో పోలీసు ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ట్రావన్‌కోర్‌లో 1937లో ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇచ్చారు. 1956లో ప్రత్యేక కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులతో వాటిని కొనసాగించారు. ప్రస్తుతం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అక్కడ ఉన్నాయి.

        లాటిన్‌ క్యాథలిక్కులతో పాటు ఎస్సీల నుంచి క్రైస్తవంలోకి మారిన వారికీ రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకలో 1972లో హవనూర్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం, బాగా వెనుకబడిన కులాల కేటగిరిలో 4 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు అమలు చేస్తున్నారు. తమిళనాడులో 95 శాతం ముస్లింలు ఏదోఒక బీసీల కేటగిరిలో ఉన్నారు. ముస్లింలను ప్రత్యేక కేటగిరిగా భావించి రిజర్వేషన్లు ఇవ్వటం కేరళ, కర్ణాటకలో మాత్రమే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పద్ధతిలో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి 2004 తర్వాత జరిగిన ప్రయత్నాలకు కోర్టులు అంగీకరించలేదు. 5 శాతం రిజర్వేష్లను 4 శాతానికి తగ్గిస్తూ (మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా) ముస్లింల్లో వెనుకబడిన 14 కులాలు / వర్గాలకు వాటిని పరిమితం చేసినా రాష్ట్ర చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. తాత్కాలికంగా వాటిని కొనసాగించటానికి మాత్రం సుప్రీంకోర్టు 2010లో అనుమతి ఇచ్చింది. ఈ 14 కులాలు/వర్గాలకు కేంద్ర ఓబీసీ జాబితాలో ఇప్పటికీ చోటు లభించలేదు. మొత్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లో, 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీలుగా పరిగణించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.

            రాజకీయాలు వాస్తవాలను ఎలా మరుగుపరుస్తాయో తెలుసుకోవాలంటే ఇటీవలే భారతరత్న ప్రకటించిన బిహారీ దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ వ్యవహారాన్ని కొంత తెలుసుకోవాలి. ఉత్తరాదిన బీసీలకు రిజర్వేషన్లను సమగ్రంగా ఇవ్వటానికి కసరత్తు చేసింది కర్పూరీ ఠాకూరేనని చెప్పాలి. ముస్లింల్లో వెనుకబడిన వర్గాలకు కూడా బీసీ రిజర్వేషన్లలో చోటు కల్పించారు. దాని గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. కర్పూరీకి భారతరత్న ఇచ్చినందుకు జేజేలు కొట్టినవారే అప్పుడు ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి అక్కడ ప్రభుత్వం పడిపోయేటట్లు చేశారు.

        ఇప్పటికీ కులం ప్రాతిపదికగానే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సంపన్నశ్రేణిలోకి వచ్చే వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తించని మాట నిజమే. కానీ ఆ పరిధిలోకి వచ్చేవారి సంఖ్య చాలాచాలా స్వల్పం. కుల వ్యవస్థ అనేది హిందూ మతానికే పరిమితమనే భావన వాస్తవ పరిశీలనకు నిలబడదు. కులానికి సంబంధించిన అవలక్షణాలన్నీ దేశంలోని ఇతర మతాల్లోనూ కనపడతాయి. ముస్లింలను పరిశీలిస్తే తెలిసేది అదే! ముస్లింలలో ప్రధానంగా నాలుగు సామాజిక విభాగాలు ఉన్నాయి. 1) అష్రఫ్‌లు: వీళ్లు తమ మూలాలను అరబ్బు, ఇరాన్‌, టర్కీ, అఫ్గనిస్తాన్‌ల్లో చూసుకుంటారు. 2) హిందూ అగ్రకులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారు కూడా తమని అష్రఫ్‌లుగానే భావించుకుంటారు. 3) అజ్‌లఫ్‌లు: ఎక్కువగా వృత్తి పనివారు, మధ్య కులాల నుంచి వచ్చినవారు ఇందులో చేరతారు. 4) అర్జల్‌లు: అంటరాని కులాల నుంచి ఇస్లాంలోకి మారినవారు ఇందులో ఉంటారు. ఈ విభాగాలు ఇలా ఏర్పడటానికి కులవ్యవస్థ ప్రభావమే ప్రధాన కారణం. అందుకే వివాహాలు కూడా ఈ విభాగాల మధ్య చాలా తక్కువ. మత సిద్ధాంత పరంగా ఇస్లాంలో కులాలకు గుర్తింపు లేదు. అలాగే క్రైస్తవంలోనూ లేదు. కానీ కమ్మ, రెడ్డి, మాల, మాదిగ క్రైస్తవుల మధ్య కులాలు సృష్టించిన సామాజిక విభజనలు అలాగే కొనసాగుతున్నాయి. ముస్లింల్లోనూ అదే నడుస్తోంది.

         కులమే రిజర్వేషన్లకు ప్రాతిపదికైతే ఆ కులానికి సంబంధించిన అన్ని దారుణాలకు ఇంకా లోనవుతున్న తమకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని ఈ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నకు సామాజిక న్యాయ దృష్టితో జవాబివ్వటం అంత తేలికకాదు. కులాలకు హిందూమతంలో సమర్థనే లేకపోతే అవి ఇన్నేళ్లుగా నిలబడేవే కావు. కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లను ఇవ్వాల్సిన అవసరం మతంపేరుతో నిర్దేశితమైన కట్టుబాట్లు, ఆచారాల నుంచే ప్రధానంగా ఉత్పన్నమైంది. అందుకే రాజ్యాంగంలో ఫలానా మతం వారికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకూడదనే నిబంధన ఎక్కడా కనపడదు. సామాజిక, విద్యా వెనుకబాటే అందులో ప్రధాన ప్రాతిపదికగా ఉంది. దీని వర్తింపులో మైనారిటీలను మినహాయించలేం!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - May 17 , 2024 | 01:34 AM

https://www.andhrajyothy.com/2024/editorial/where-is-the-address-for-nonreligious-reservations-1255296.html

No comments:

Post a Comment