Monday, 10 April 2023

జాతీయోద్యమం - ఆర్ఎస్ఎస్ పాత్ర.

 జాతీయోద్యమం - ఆర్ఎస్ఎస్ పాత్ర.

   __ నళిని తనేజా.


మహాత్మాగాంధీ హత్యానంతరం దేశమంతటా వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని నాటి నిషేదం ఎత్తివేయించుకోవడానికి, అప్పటికే ప్రజల్లో దెబ్బతిన్న ప్రతిష్టని దృష్టిలో ఉంచుకుని ఆర్ఎస్ఎస్ తనను తాను రాజకీయ సంస్థకాదు. నిజానికి ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ అని ప్రకటించుకోవలసి వచ్చింది. 


ఇది ముఖ్యంగా అనేక రాజకీయ అనుబంధాలున్న ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ. దాని ఫాసిస్టు ఎజెండా అయిన హిందూ రాష్ట్ర స్థాపనకు పునాది దాని రోజువారి నిర్వహించే సాంస్కృతిక క్రియాశీలత.


ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఈ దేశాన్ని హిందూరాజ్యంగా మార్చడం ద్వారానే సంపూర్ణ స్వాతంత్య్రం సాధించినట్లు లెక్క, ఈ లక్ష్యం తోనే 1925లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. 'రాజ్యం పౌరుల రాజ్యం' అనేది నానుడి. కాని ఆర్ఎస్ఎస్ దృష్టిలో రాజ అంటే బ్రాహ్మణాధిపత్యంలో సాగే వర్ణాశ్రమ ధర్మ స్థాపనయే.


'జాతి' అంటే ఆర్ఎస్ఎస్ దృష్టిలో సైనికీకరణ చెందిన దేశం.. సంపూర్ణంగా అగ్రవర్ణాల అధిపత్యంతో కూడిన కులీన దృక్పధమే.



 స్వాతంత్య్రం రాకముందు నుండే వారి ప్రాపంచిక అవగాహన అలా ఉండేది. కాలం మారినా దాని దృక్పధంలో ఏ మార్పు లేకపోవడానికి నిదర్శనం


 పండగలు, తతంగాలలో అది మతాన్ని జొప్పించడం; ఆవుని జనాభా లెక్కలని, మతమార్పిడులను, ఆహార అలవాట్లను, ఆలయాలని అన్నింటినీ వివాదాస్పదం చెయ్యడం; లౌకిక దృక్పధం కలిగిన చరిత్రను అవహేళన చెయ్యడం వంటి అన్ని కార్యకలాపాలలో మనం గమనించవచ్చు. జాతీయోద్యమ కాలం అంతటా ఈ మత శక్తులు ఇదే ధోరణితో పనిచేసాయి. 


వీటి ఆధారంగానే మితవాద హిందూత్వశక్తులు ఉవ్వెత్తున జాతీయోద్యమం సమయంలో ప్రజలను సంఘటితం చేసాయి.


 20వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో అటు దుందుడుకు జాతీయవాదం

ఇటు సోవియట్లో కార్మిక వర్గ విప్లవం జయప్రదమైన నేపథ్యంలో మనదేశంలో

ఆర్ఎస్ఎస్ ఊపిరి పోసుకుంది. 


ఆనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక వలసదేశాల్లో

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, స్వాతంత్య్ర ఉద్యమాలూ ఊపందుకున్నాయి.


అదే కాలంలో పచ్చి నియంతృత్వ, ఫాసిస్టు ధోరణులూ ప్రబలంగా ముందుకొచ్చాయి.


 అయితే 1917లో రష్యాలో జయప్రదమైన అక్టోబర్ మహావిప్లవం చారిత్రకంగా చాలా ప్రభావం కలుగచేసింది. 


భగత్సింగ్, తన సహచరులు, ఇతరేత అభ్యుదయ శక్తులు, సోషలిస్టు కమ్యూనిష్టు గ్రూపులు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోని కొన్ని సెక్షన్లు కూడా రష్యన్ విప్లవంతో ప్రభావితం అయ్యాయి.


కాని ఆర్ఎస్ఎస్ ఇందుకు భిన్నంగా ఇటలీ, జర్మనీ దేశాలలో అధికారంలోకి వచ్చిన పాసిస్టు శక్తులని, వాటి నియంతృత్వ ధోరణులని, జాత్వహంకారాన్ని పుణికి పుచ్చుకుంది.


 గతవైభవాన్ని పునరుజ్జీవింప చెయ్యాలనే లక్ష్యానికి అనుగుణంగా - ఆర్యజాతి సిద్ధాంతాన్ని ముందు పెడుతూ పచ్చి తిరోగమన పూరితమైన సామాజిక - రాజకీయ అజెండాను తలకెత్తుకుంది. 


భారతీయ సమాజంపట్ల చరిత్ర పట్ల వలసవాదుల దృక్పథాన్ని అలంబనగా చేసుకుని జాతి పునురుజ్జీవనం కోసం కంకణబద్ధులైన మరికొన్ని సెక్షన్లు కూడా ఆర్ఎస్ఎస్ కలిసాయి. 


వామపక్షాల సామాజిక దృక్పథాలకు పూర్తిగా భిన్నమైన 'జాతి' భావనను ఆర్ఎస్ఎస్ ప్రచారంలోకి తెచ్చింది. ఈ 'జాతి' భావనలో దేశంలో 'మెజార్టీ'గా ఉన్న కార్మికవర్గానికి, కష్టజీవులకు సంబంధించి సముచిత ప్రస్తావనేలేదు. 


జాతీయోద్యమ కాలంలోనే దేశం నలు చెరగులా వెల్లువెత్తిన (ఆధిపత్య) కుల వ్యతిరేక ఉద్యమాలు, వామపక్ష భావజాలానికి పెరుగుతున్న ఆదరణలను కట్టడి చెయ్యడానికి, కులవ్యవస్థ-వర్ణాశ్రమ ధర్మాల కొమ్ముకాయడానికి పుట్టుకువచ్చిందే ఈ ఆర్ఎస్ఎస్.


1920-30వ దశకాల్లో వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు వెల్లువలా సాగాయి.


 సహాయనిరాకరణోద్యమం మొట్టమొదటి దేశవ్యాప్త ఆందోళనగా మనం చెప్పుకోవచ్చు. 1924లో స్థాపించబడిన హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థ పేరులో హిందూస్థాన్ ఉన్నప్పటికీ ఆ సంస్థ ప్రణాళిక విప్లవకర భావాలతోను, లౌకిక ఆ తత్వం పట్ల నిబద్ధతతోను ఉంది. 


కాని 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ అనుబంధ సంస్థలు లౌకిక గణతంత్ర రాజ్యానికి భిన్నంగా హిందూస్థాన్,అంటే కేవలం హిందువుల రాష్ట్రం, మనుస్మృతి రూపొందించిన కుల ప్రాతిపదికన అణచివేతలున్న ఒక ఆదర్శవంతమైన రాజ్యం ఏర్పాడాలని కోరుకుంది. హిందూమహా సభ హిందూ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. దేశంలో పౌరులందరూ సమానమే అన్న లౌకిక భావనను తిరస్కరించింది.


అంతేకాదు ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా ఉనికిలోకి వచ్చిన రోజు నుండి సామాజిక ఉద్రిక్తతలు రగిలించడానికి రోజుకొక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తడమే పనిగా పెట్టుకుంది.


గోరక్షణ సమితులను విస్తరిస్తూనే దాని పవిత్రతను కాపాడేందుకు పోరాడే భక్తులను సంసిద్ధం చేసింది. దౌర్జన్య భరితమైన, శక్తివంతమైన ఈ గోవధ వ్యతిరేక ప్రచారం ముస్లింల వ్యతిరేక ప్రచారంగా మారిపోయింది.


 ఈ సంస్థలు ఆనాటి నుండి ఈ నాటి వరకు బ్రిటిష్ వలస ప్రభుత్వం తీసిన జనాభా లెక్కలలో ఉన్న మతగణాం కాలను ఆధారం చేసుకుని మతమార్పిడులు విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. 


హిందూమతం ప్రమాదంలో పడిపోయింది అని ప్రచారం చేస్తున్నాయి. ఇంకొన్నాళ్ళకి ఈ దేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం లంకించుకొని "శుద్ధి" కార్యక్రమాలు చేపట్టింది. 


ఇప్పటికి దాదాపుగా వందేళ్ళు గడిచాయి నాడు. ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ, ఆ తర్వాత జనసంఘ్ లు ప్రచారం చేసినట్టు దేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోలేదు. 


ఐనా 2011 జనాభా గణన వివరాలనుండి ఈ వాదనలకు అనుకూలమైన లెక్కల్లో కొన్ని మీడియాకు లీకు చేసి తిరిగి “ఘర్

వాపసీ" కార్యక్రమాన్ని ఎత్తుకున్నాయి ఆర్ఎస్ఎస్ అంటుకొమ్మ సంస్థలు. 


అలానే మత ఉద్రిక్తతలు సృష్టించడానికి సరిగ్గా మసీదులలో నమాజ్ చేసే సమయానికి ఆ మసీదు మీదుగా ప్రదర్శనలు తీయడం, మసీదు ముందు పెద్దగా బ్యాండ్ బాజాలు వాయించడం, మసీదులలోకి పంది కళేబరాలను, ఆలయాలలోకి ఆవు కళేబరాలను చేర్చి ఎదుటి మతం వారు చేసిందే అంటూ విషప్రచారం చేసి మత కలహాలు సృష్టించడం ఆర్ఎస్ఎస్ అనుంగు సంస్థలకి వెన్నతో పెట్టిన విద్య.


హిందువుల 'స్వర్ణయుగం' గురించి, మొఘల్ పరిపాలనా కాలంలో సాగిన ముస్లిమ్ అకృత్యాలను గురించి, ముస్లిం రాజుల కాలంలో ధ్వంసమైన ఆలయాల గురించి, 'విదేశీపరిపాలనకు వ్యతిరేకంగా వెయ్యేళ్ళపాటు (?)సాగిన పోరాటంలో అమరులైన వారి గురించి 1920లలో పెట్టిన గీతా ప్రెస్ నుండి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు అచ్చొత్తి వదులుతుంటారు. ఇక కరపత్రాలకు లెక్కేలేదు. హిందూపాంచే అనే పత్రిక వెలువరించారు. 1940ల నాటికి అనేక భాషలలో ఆర్ఎస్ఎస్ పత్రికలు వెలువడనారంభించాయి. 


ఆ తరువాత మొదలయిన వార్తా పత్రికల శకంలోనూ తమదైన ముద్ర చొప్పించేలా అన్నిరకాల కృషి చేసారు. హిందీ- హిందూ హిందూస్థాన్ పదాల వాడకం ఎంత విరివిగా చలామణిలోకి తెచ్చారో ఉర్దూ-ముస్లిం-పాకిస్ధాన్ అనే నుడికారాన్ని అంతే విరివిగా విద్వేషపూరితంగా ప్రచారంలోకి తెచ్చారు.


 ఆర్ఎస్ఎస్ దృష్టిలో 'హిందూజాతి' అంటే ఏమిటో వివిధ తరగతుల ప్రజానీకంలోకి తీసుకువెళ్ళడానికి మహిళలకోసం ప్రత్యేకంగా రాష్ట్రీయ సేవికాసమితితో సహ అనేక విద్యార్థి యువజన విభాగాల అనుబంధ సంస్థలను ఏర్పాటుచేసింది. 


సంఘాలన్నీ నిచ్చెనమెట్ల కులవ్యవస్థని గట్టిగా సమర్దిస్తాయి. కులవ్యవస్థని గట్టిగా సమర్థిస్తూనే 'హిందూ ఐక్యత' ద్వారా ప్రయోజనాలు పొందాలనుకున్నారు.


 కాంగ్రెస్ పార్టీ వేదకాలపు భారత్ను సాకారం చెయ్యలేదని బలంగా నమ్మారు. భారతదేశ చరిత్ర పట్ల వలసవాద దృక్పధానికే వంత పాడుతూ వచ్చిన ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ సైన్సు నుండి సంస్కృతి వరకు అన్నీ మనదేశంలోనే పుట్టాయనే వాదన వ్యాప్తి చేస్తా ఉన్నాయి.


స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ క్యాడర్గాగానీ, హిందూమహాసభగానీ ఏనాడూ భాగస్వామిగా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలో ఉన్న ముస్లింలలో మెజార్టీ ప్రజానీకం దేశ స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు.


 అయినా గానీ హిందూత్వ శక్తులు ఆనాటి నుండి ఈనాటి వరకు ముస్లిమ్లను ఈదేశానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నాయి. 


1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో గానీ, సహాయ నిరాకరణోద్యమంలో గానీ, శాసనోల్లంఘన ఉద్యమంలోగానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో గానీ లక్షలాది మంది ముస్లిమ్లు పాల్గొనడమేకాదు వేలాదిమంది జైలుజీవితం అనుభవించారు. మరెంతో మంది ప్రాణాలు అర్పించారు. 


1857 సిపాయి తిరుగుబాటు తర్వాత చోటు చేసుకున్న అతి పెద్ద తిరుగుబాటు 1915 సింగపూర్ తిరుగుబాటు. 'గదర్' ఉద్యమంతో ప్రేరణ పొందిన ముస్లింలతో కూడిన 15వ పదాతి దళం ఈ తిరుగుబాటులో ప్రధానంగా పాల్గొన్నారు. ఈ తిరుగుబాటులో పాల్గొన్న 49 మందిని ఎలాంటి విచారణ లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం అతి కిరాతకంగా కాల్చి చంపేసింది.


 ముజఫర్ అహ్మద్, అష్వాఖుల్లాఖాన్, హజత్ మెహానీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆసఫ్ అలీ, సైపుద్దీన్ కిచ్ల్యూ, బద్రుద్దీన్ త్యాబ్రి వంటి ముస్లిం ప్రముఖుల పేర్లు ఇవాళ ప్రతి ఇంటా చిరపరిచయం కావడానికి స్వాతంత్ర్యోద్యమంలో వారు పోషించిన అనన్యసామాన్యమైన పాత్రయే కారణం.


కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్రోద్యమంలో బ్రిషిష్ పాలనకు వ్యతిరేకపోరాటానికే పరిమితం కాకుండాకార్మికులని, రైతులని సంఘటితం చేసి ఆ పీడక శక్తులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంటు పోరాటాలు నిర్వహించిన కమ్యూనిష్టులను వాస్తవానికి దేశద్రోహులుగా ప్రచారం చేస్తుంది ఆర్ఎస్ఎస్. 


ఆ స్వాతంత్రోద్యమంలో ఎన్న దగ్గ పాత్ర పోషించారు. ఆ కమ్యూనిష్టులు. 1921లో అహమ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో కమ్యూనిష్టులయిన మౌలానా హజ్రత్ మొహానీ, స్వామి కుమారానందలు ఇరువురే 'సంపూర్ణ స్వరాజ్యం' కావాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


 తెభాగా, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాలకు, వర్లి ఆదివాసుల తిరుగుబాటుకు నాయకత్వం. వహించింది కమ్యూనిష్టులే.


కమ్యూనిష్టుపార్టీ ఆవిర్భావ దశ నుండే బ్రిటిష్ వలస ప్రభుత్వ అణచివేతకు గురయిన పార్టీ. 1920వ దశకంలో కమ్యూనిస్టుల మీద అనేక కుట్ర కేసులు బనాయించారు. మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్రకేసు అందులో ప్రధానమైనవి.


 ముజఫర్ అహ్మద్ తదితర కమ్యూనిష్టు నాయకులకు జీవితఖైదు శిక్షలు పడ్డాయి. అదే కాలంలో హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ గణనాయకులు, క్యాడర్ పోషించిన పాత్ర ఏమిటి? ఆర్ఎస్ఎస్ ప్రచురించి పంపిణీ చేసే విద్యాభారతి పాఠ్యపుస్తకాల్లో వినాయక్ దామోదర్ సావర్కర్ను 'వీర సావర్కర్'గా ప్రస్తుతిస్తూ అనేక కథనాలు అచ్చొత్తారు.


 అలాంటి 'వీరుడు' బ్రిటిష్ పాలకులకు 'క్షమాపణపత్రం' రాసిచ్చిందే గాక వారితో షరీకయ్యాడు కూడా. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఒక పుస్తకం రాస్తూ (1907లో ప్రచురణ) “శతాబ్దాల తరబడి నెలకొని ఉన్న ఘర్షణకు, విదేశీ (ముస్లిమ్) పాలనకు వ్యతిరేకంగా హిందూ-ముస్లిమ్లు ఒక్కటయిన సందర్భం ఇది” అని వివరించారు. అదీ 'వీర' సావర్కర్ అవగాహన.


 స్వాతంత్రోద్యమంతో తెగతెంపులు చేసుకున్నట్లు 1913లో అధికారికంగా బహిరంగ ప్రకటన చేసాయి. ఈ హిందూత్వశక్తులు. అండమాన్ జైలునుండి విడుదల కావడానికి 'ఇహ మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటామని' బేషరతు క్షమాపణ పత్రం రాసిచ్చాడు 'వీర' సావర్కర్.


 'అండమాన్ లో కఠిన శిక్షలు' పేరిట ఆర్.సి. మజుందార్ రాసిన పుస్తకంలో ఇందుకు సంబంధించిన పూర్తి పాఠం ఉంది. (1995 ఏప్రిల్ 7 'ఫ్రంట్ లైన్' సంచిక 94వ పేజిలో ఉత్తరం కాపీని ముద్రించారు. 


1924లో రాసిన 'హిందూత్వ' పుస్తకంలో అడుగడుగునా ముస్లిమ్ మైనార్టీలను శత్రువులుగా చిత్రీకరిస్తూ రాజకీయాలని, సైన్యాన్ని హిందూత్వ బాట పట్టించాలని పిలుపునిచ్చాడు. బ్రిటిష్ పాలకులతో షరీకయిన మూలానే స్వాతంత్రోద్యమంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను వ్యతిరేకించే వైఖరి చేపట్టారు. 


కాంగ్రెస్ పట్ల రాజకీయంగా తమకు ఉన్న వ్యతిరేకతను అందుకు కారణంగా చెప్పుకునేవారు. 


హిందూమహాసభ సదస్సులో అధ్యక్షోపన్యాసం చేస్తూ 'ద్విజాతి' సిద్ధాంతాన్ని బలపరచడానికి గర్వపడుతున్నానని ప్రకటించారు. 


గాంధీజీ హత్యకేసులో ముద్దాయి ఈ 'వీర' సావర్కర్ తగిన సాక్ష్యాధారాలు లభించని కారణాన శిక్ష పడకుండా తప్పించుకున్నాడు.


 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన 'క్విట్ఇండియా' ఉద్యమకాలంలో వాజ్పాయ్ కూడా ఇలానే 'అప్రూవర్'గా మారి చాలా మంది స్వాతంత్రోద్యమ నాయకుల కార్యకర్తల అరెస్టుకు సహకరించారు. (చూడండి ఫ్రంట్ లైన్ వాల్యూం 15.నెం.ఐ 1998 ఫిబ్రవరి 7 సంచికలో మానిని ఛటర్జీ -వికె రామచంద్రన్ల వ్యాసం)


జాతీయోద్యమకాలంలో ఆర్ఎస్ఎస్ పోషించిన పాత్ర అంతా వీలయినన్ని చోట్ల మత కలహాలు, అల్లర్లు సృష్టించడమే. తమ ద్విజాతి సిద్ధాంతానికి అనుగుణంగా 'అంతర్గత శత్రువుల' (ముస్లింమైనార్టీలు)కు వ్యతిరేకంగా భావజాల రంగంలో నిరంతరం కలుషిత ప్రచారానికి తెగబడేది. ఇదంతా చరిత్రలో నమోదయిన ఆర్ఎస్ఎస్ అసలు రూపం. ఇవాళ అది వేషం, భాషలు మార్చినా దాని అసలు రూపం దాచాలనుకున్నా దాగని వాస్తవం.


మూంజీ, మదన్మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, యస్.బి. ఖరే తదితరులు అటు కాంగ్రెస్లోను, ఇటు హిందూమహాసభలోను ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నారు. 


కాంగ్రెస్ పార్టీలో హిందూత్వ దృక్పధాన్ని, హిందూత్వవాద పరపతి పెరిగేలా కృషి చేసిన మితవాద పక్షంగా పనిచేసారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ ప్రభావాన్ని, సోషలిస్టుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 


మహారాష్ట్రలోని నాసిక్-నాగపూర్ ప్రాంతంలో 1937లో భోంస్లా సైనిక స్కూలు స్థాపించడంలో ఆర్ఎస్ఎస్, హిందూమహాసభలు కీలకంగా వ్యవహ రించాయి. హిందూత్వ క్యాడర్ను తయారు చేసుకోవడంతో పాటు హిందువులను బ్రిటిష్ సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సైనికస్కూలు పనిచేసింది. 'ప్రినీ స్టేట్స్'గా ఉన్న రాజ్యాలను చేజిక్కించుకోవడం, సైన్యంలో జొరబడటం వ్యూహంగా ఈ స్కూలుని నడిచింది. ఫాసిస్టు నాజీలను పోలిన శిక్షణ గడిపింది. మీలో ఎవరైనా గోల్వాల్కర్ రచనలలో 'మనము మన జాతీయత నిర్వచనం', 'పాంచ జన్యము' అన్న పుస్తకాలు చదివి ఉంటే - హిట్లర్ ముస్సోలినీల ఆలోచనలే ఈ పుస్తకాలకి స్ఫూర్తి అని ఇట్టే పసిగట్టేయగలరు. 


నిజానికి ఆర్ఎస్ఎస్ జర్మనీ, ఇటలీ దేశాలలోని ఫాసిస్టు సంస్థలతో సంబంధాలు నెలకొల్పుకుంది. 'ప్రిన్స్లో స్టేట్స్ ఉన్న రాష్ట్రాల్లో ముస్లిమ్లపై అమానుష హత్యాకాండలు, చోటు చేసుకున్నాయి. ఈహత్యాకాండలు అన్నింటా ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభల హస్తం ఉందని అనేకమంది. పరిశోధకులు నమోదు చేసారు. (హైదరాబాద్, జమ్ము, అల్వార్ -భరతవ్వుద్-మేవార్, పటియాలా తదితర చోట్ల రేగిన మతకలహాలు) ఢీల్లీలో ఈ శక్తుల ఉనికి బలంగా ఉండడంతో దేశవిభజనకు ముందే ఈ ప్రాంతంలో వేలాది ముస్లిమ్లను ఊచకోతకోసి, మిగిలిన వారిని భయభ్రాంతులను చేసి వారు దేశం విడిచి వెళ్ళేలా చేసారు. పోలీసు, అధికార యంత్రాంగంతో కుమ్ముక్కయిన హిందూత్వ శక్తులు ఇంతకు బరి తెగించాయి.


 ఢిల్లీ లోనే కాదు బెంగాల్, పంజాబ్ ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ మూకలు ముస్లిమ్ల ఊచకోతకు పాల్పడ్డాయి. ధన్వంతరి-పిసిజోషిలు ఉభయులూ రక్తమోడుతున్న పంజాబ్ చేస్తున్న హెచ్చరిక పేరిట రూపొందించిన నివేదికలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను అక్షర బద్ధం చేసారు. 


తెభాగా భూపోరాటం, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, వొర్లి ఆదివాసుల తిరుగుబాటు, నావికాదళ తిరుగుబాటు, పున్నప్ర వాయలార్ వంటి సమరశీల పోరాటాలు ముందుకొచ్చి “విప్లవం వర్ధిల్లాలి" అన్న నినాదం దేశం నలుచెరగులా విస్తరిస్తున్న నేపధ్యంలో 'దేశభక్తుల ఆగడాలు అల్లర్లు' వారు సృష్టించిన మతకల్లోలాలు చోటు చేసుకోవడం యాదృచ్ఛిక పరిణామలేమికాదు. 


దేశంలో ముస్లింలీగ్ కూడా విస్మరించలేని ఒక రాజకీయశక్తిగా ముందుకు రావడంతో దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు కొంతకాలం విభజన రాజకీయాలు ముందుకు రావడం, పాకిస్థాన్ ఏర్పాటు కోసం డిమాండు ఊపందుకోవడం గడిచిన చరిత్ర.


1946-51 మధ్య కాలమంతా ఆర్ఎస్ఎస్ ముస్లిమ్ల పట్ల విద్వేషాన్ని రగిలిస్తూ, దేశవిభజనకు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లు, కమ్యూనిస్టులే కారణమనే నిందా ప్రచారాన్ని సాగించింది.


1951లో జనసంఘ్ న్ను ఏర్పాటు చెయ్యడం ద్వారా ఆర్ఎస్ఎస్ తన రాజకీయ దుకాణం తెరిచింది. గాంధీ హత్యానంతరం హిందూత్వ శక్తులపై ప్రజలలో నెలకొన్న ఏహ్యత మూలంగా స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్కు పెద్దఎత్తున పట్టం కట్టారు. ఈ ఎన్నికలలో కమ్యూనిష్టులు ద్వితీయ శక్తిగా ముందుకు వచ్చారు.


20వ శతాబ్దం అంతటా దక్షిణాసియా దేశాలలో మతఛాందసశక్తులు అనేక రూపాల్లో చలామణి అయ్యాయి-అయితే మనదేశంలో 'హిందూరాజ్యాన్ని' స్థాపించే పేరిట పనిచేస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్ విస్తృతిలో కాని, పరిమాణం లోగానీ వాటన్నిటిని. తలదన్నేంత స్థాయిలో కొనసాగుతుంది. 


హిందూత్వ శక్తులు ఇచ్చేది 'ఆఖండ భారత్' నినాదం. ఆ నినాదం సాకారం కావడమంటే ఈ దేశం మరొసారి విభజనకు గురికావడమే.


 గణతంత్ర్య లౌకిక రాజ్యంగా అవతరించిన మనదేశం ఆధునిక భారతదేశంగా ముందుకు పోవాలంటే ఆర్ఎస్ఎస్ని, దాని హిందూత్వ భావజాలాన్ని మట్టికరిపించాల్సిందే.


 ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం మతవిద్వేషాలు, మత విభజనలతో కూడినదే. దేశ ప్రజానీకం కుల, మత, ప్రాంతీయ, భాషా బేధాలన్నింటినీ అధిగమించి గరిష్ఠ ఐక్యతతో స్వాతంత్ర్య సాధన కోసం కృషిచేస్తున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ మతప్రాతిపదికన ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు నానాగడ్డి కరిచింది. 


ఒక్క మాటలో చెప్పాలంటే భిన్నజాతుల, విభిన్న సంస్కృతుల సమాహారమైన భారతదేశం అంటేనే ఆర్ఎస్ఎస్కు గిట్టదు. అటువంటి మతోన్మాధ ఫాసిస్టు శక్తులకు ఎంత త్వరగా తగిన గుణపాఠం నేర్పిస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది.

_____________

No comments:

Post a Comment