Monday, 14 November 2022

Life Style of Laddafs - Dr Shaik Ibrahim IIIT Ongole

Life Style of Laddafs

దూదేకుల జీవన విధానం

 

దూది నుండి విత్తనాన్ని వేరు చేసి, దూదిని శుభ్రపరిచి, దూదిని ఏకి, దూదితో పరుపులు, దిండ్లు తయారు చేసి బతుకు జీవనాన్ని కొనసాగించే వారు దూదేకులు. భారతదేశమంతటా కూడా దూదేకులు రకరకాల పేర్లతో మనకు కనబడుతుంటారు. దూదేకులను మన తెలుగు రాష్ట్రాలలో నూర్ బాషీయులనీ, పింజారిలనీ, లద్దాఫ్ లనీ, దూదేకులనీ పిలుస్తారు. మిగతా రాష్ట్రాలైనా కర్నాటకలో పింజారిలనీ, నద్దాపులనీ, తమిళనాడులో పాంజికొట్టులనీ, పంజారిలనీ, గుజరాత్లో పాయిజారీలనీ, మధ్యప్రదేశ్లో నద్దాపులనీ, కాశ్మీర్లో దున్ లనీ, బెంగాల్లో మన్సూరీలనీ, బీహర్ లో ధునియాలనీ, మోమీన్ లనీ, ఉత్తరప్రదేశ్లో బెహనస్ లనీ, అన్సర్ లనీ, మోమీన్ లనీ, ఒరిస్సాలో పంజిరాలనీ దూదేకులను పిలుస్తారు. ఇలా వివిధ రాష్ట్రాలలో పేరుతో పిలువబడినప్పటికీ దాని అర్థం దూదిని ఏకే దూదేకులనే అర్థం.

 

వృత్తులు మాయమైనా  కుల వాసనలు దూదేకులకు నీడలా నేటికి వెంటాడుతున్నాయి. ఒక్క దూదేకులకు మాత్రమే కాదు యావత్తు అన్ని మతాలలో అణగారిన కులాలపై వివక్షపు నీడలు వెంటాడుతునే ఉన్నాయి. ద్రావిడ జాతికి, సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉన్న సింధూ నాగరికత పతనం తర్వాత అనేక మతాలు మన భారతదేశంలోకి వచ్చాయి. వాటిలో మెజారిటీ సాధించిన మతం హిందూ మతం. ప్రతీ మతంలోను కులాల విభజన జరిగింది. అయితే నాడు హిందూ మతంలోని కుల వివక్ష వలన, కుల విభజన వలన అణగారి కులాలు బడికి, గుడికి దూరమై అంటరానివారుగా మిగిలిపోయారు. వారిని హిందూ మతంలోని కొన్ని ఉన్నత కులాలు మాకు సేవ చేయడం కోసమే మీరున్నారు అని బదులిచ్చేవారు. వివక్ష, వెట్టిచాకిరి నుండి బయటపడడానికి అణగారిన కులాలైన ఎస్.సి, ఎస్.టి, బి.సి మొదలగువారు నిరీక్షించారు. కాలక్రమేణా పర్షియా దేశం నుంచి సూఫీ గురువులు భారతదేశంలోకి వచ్చారు. వారు వస్తూ వస్తూనే అమూల్యమైన మానవీయ విలువలతో వచ్చారు. ఎక్కడెక్కడ అయితే వివక్షకు గురి అయిన కులాల వారు ఉంటారో అక్కడికి వెళ్లి వారికి ఒక భరోసాను కల్పించారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నారు. సూఫీ గురువులు ఏర్పాటు చేసిన ప్రార్థన మందిరాల్లో కూడా వారికి స్థానం కల్పించి భుజానికి భుజానికి జత చేసి ప్రార్థనలు వారితో కలిసి చేసి సూఫీ గురువులు వారి హృదయాలతో అలాయి బలాయి తీసుకున్నారు. చివరికి వివక్షకు గురి కాబడిన వ్యక్తులకు కాలికి దెబ్బ తగిలి పురుగులు పాకుతున్న సరే కాలిని సూఫీ గురువులు వారి ఒడిలోకి తీసుకుని శుభ్రం చేసి గాయానికి మందులు పూసేవారు. ఇటువంటి మానవీయ గుణాలు, సూఫీ గురువుల బోధనలు వారు పడుతున్న వివక్షను కాల రాశాయి. దీనితో కుల వివక్షకు గురి అయిన అనేక మంది సూఫీ గురువుల అమూల్యమైన మానవీయ విలువలకు ఫిదా అయ్యి ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

 

భారతదేశంలో ఉన్న ముస్లింలలో నూటికి తొంబై శాతం ఒకప్పటి ఎస్.సి, ఎస్.టి, బహుజనులే మతం మారినారు. అందుకే మతం మారినా వీరి జీవన విధానం, మూలాలు మారలేదు

 

        ప్రతీ మతంలోను కుల విభజన ఉన్నట్లే, ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారిలోను కుల వివక్ష లేకపోలేదు. వీరిలో షేక్, సయ్యద్, పఠాన్, ఖాన్, మహమ్మద్ అనే కులపు వర్గాలున్నాయి. కులపు వ్యక్తుల్లో చాలా అరుదుగా మాత్రమే మనస్పర్థలు ఉంటాయి. అయితే షేక్, సయ్యద్, మహమ్మద్, పఠాన్, ఖాన్ మొదలగు వర్గాల వారికి దూదేకులు అంటే చులకన భావన, చిన్న చూపు. ఏదో వారే మనుషులు అన్నట్లుగా.! కానీ ఇస్లాం మతం సర్వ మానవాళి పట్ల సమానత్వాన్ని ప్రదర్శించాలి గానీ, అసమానతను, వివక్షను చూపరాదని నొక్కి చెప్పింది. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే వారు మనుషులే కాదని కూడా ఇస్లాం చెప్పింది. అయినప్పటికీ కొంతమంది మత ఛాందసవాదులు వివక్షను చూపుతునే ఉంటారు. పైకేమో అంతా ఒక్కటే అనే భావన. అంతర్గతంగా ఎవరికి కనబడకుండా వివక్షను చూపుతుంటారు. కొన్ని చోట్ల బాహటంగానే దూదేకులపై ముస్లింలు వివక్షను కనబరుస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే వివక్ష నుండి విముక్తి కోరుతూ ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ వివక్ష నుండి దూదేకులు బయటపడలేదు. సంతోషంతో తొలిరోజుల్లో సూఫీ గురువులు గుండె గుండెలకు జతచేసి అలాయి బలాయి ఇచ్చినప్పుడు కలిగిన సంతోషం ఎక్కువ కాలం పాటు అనవాలు మిగల లేదనే ఆవేదనతో బరువెక్కిన దూదేకుల హృదయాలు ఎన్నో ఎనెన్నో.! అయితే వారిలో కొద్దిమంది మతం కన్నా మనిషి ముఖ్యం, మనిషి బంధం ముఖ్యమని విశ్వసించే ముస్లింలు దూదేకులను వారితో సమానులుగా చూసిన వారు లేకపోలేదు. ఇటువంటివారు చాలా అరుదుగా మనకు ముస్లిం సమాజంలో కన్పిస్తుంటారు. అయితే ఎక్కువభాగం దూదేకులపై వివక్షను చూపే వారే.

 

         ముఖ్యంగా దూదేకులకు, ముస్లింలకు భాష పరంగా, సంస్కృతి పరంగా, సంప్రదాయాల పరంగా, ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా     భేదాభిప్రాయాలున్నాయి. అంతేగాక వక్ఫ్ బోర్డు మరియు మసీదులకు సంబంధించిన ఆర్ధిక పరమైన విషయాల్లో కావొచ్చు, పదవుల్లో కావొచ్చు     భేదాభిప్రాయాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా ముస్లింలు అందరూ ఉర్దూను మాట్లాడగలరేమో గానీ, కనీసం 30% అయినా ఉర్దూను రాసేవారు ఉండరు. అంతేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే సగం మంది ముస్లింలకు స్వచ్ఛమైన ఉర్దూను కూడా మాట్లాడేవారు లేరు. కానీ.! విషయంలో ముస్లింలు దూదేకులను మీకు భాష సరిగా మాట్లాడటం రాదని, చదవటం రాదని చులకన భావనతో వివక్షను చూపిస్తూ ఉంటారు. నేటికి కూడా వ్యత్యాసాన్ని మనం ముస్లిం సమాజంలో చూడవచ్చును.

 

నమాజ్ చదవడానికి మసీదుకు కూడా సరిగారారనే వివక్ష కూడా దూదేకులపై ఉంది. నిజానికి దూదేకుల్లో కూడా పాండిత్యం మేళవించిన వారు లేకపోలేదు. ముస్లింలలో ఉన్న ఖాజీలు, ముల్లాలు, మౌల్వీలు కన్నా గొప్ప పాండిత్యాన్ని అభ్యసించిన దూదేకులు కూడా ఉన్నారు. ముస్లింల కన్నా గొప్పగా సంస్కృతి సంప్రదాయాల పాటించే దూదేకులు కూడా ఉన్నారు. అయితే మసీదులకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో కూడా దూదేకులకుపై వివక్ష చూపడం జరుగుతున్నది. ఎక్కడోకచోట దూదేకులపై కాస్త మానవత దృక్పథంతో ఆర్ధిక లావాదేవిల్లో చోటిచ్చే సంఘటనలు చాలా అరుదు. వక్ఫ్ బోర్డు లాంటి విషయాల్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇకా

 

పెళ్లిళ్ల విషయాల్లో అయితే దూదేకుల పిల్లలకు ముస్లిం పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం అస్సలు ఉండదు. ఇకా ఎవరైనా దూదేకుల్లో బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నా లేదా ఇస్లాం పాండిత్యాన్ని బాగా చదివిన వారువుంటే అప్పుడు వారిపట్ల కాస్త ఆలోచించి ముస్లింలు దూదేకులకు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రస్తుతం కాస్త ముందడుగు వేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమేనని చెప్పవచ్చును. కానీ నిజ జీవితంలో భారతీయ ముస్లిం సమాజంలో ఎటువంటి వివక్షలు, అసమానతలు ఉండవని మిగతా సమాజాలు, మిగతా మతాలు అపోహపడుతుంటాయి. నిజ జీవితం వీటికి భిన్నంగా ఉంది. ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పురుషునికైనా, స్త్రీ కైనా మరియు ఇస్లాం మతంలోని అన్ని వర్గాల్లోను అసమానతలు ఉండకూడదు. అలా ఎవరైనా అసమానతలు చూపిస్తే వారు అసలు ముస్లిమే కాదని ఇస్లాం చెబుతుంది. కానీ దూదేకులు ముస్లింలలోనే కలిసిపోయి ఉన్నప్పటికి వారిపై వివక్షను చూపించడమనేది బాధాకరమైన సంఘటన. వివక్ష కూడా ఎక్కువభాగం మిగతా మతాలు గుర్తించని విధంగా ముస్లింలు దూదేకులపై అంతర్గతంగా వివక్షను కనబరుస్తుంటారు. కొన్ని చోట్ల బహిర్గతంగానే వివక్ష కనబడుతుంది. అయితే దూదేకులు పూర్వం ఇస్లాం మతాన్ని స్వీకరించనప్పుడు అప్పటి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ముస్లింలు కావొచ్చు, సూఫీ గురువులు కావొచ్చు దూదేకులపై చూపించినంత ప్రేమ, అప్యాయత, అనురాగాలు, మానవీయ గుణం ఎక్కువకాలం మిగలలేదు. అనతికాలంలోనే సూపీ గురువుల కాలం చెల్లిన తర్వాత ఆదరణ స్వార్థంతో మటుమాయమై దూదేకులను తీవ్రమైన దిగ్భ్రాంతిలో పడేసింది.

 

            నేటికి కూడా మనం పల్లె ప్రాంతాల్లో నివాసముంటున్న దూదేకుల జీవన విధానాన్ని పరిశీలిస్తే వారు కొన్ని దశాబ్దాల నుండి భిన్నమైన సంస్కృతి, భిన్నమైన సంప్రదాయాలు వారితో పెనవేసుకున్నట్లు మనకు స్పష్టంగా కన్పిస్తుంది. దూదేకులు మతం మారినప్పటికి వీరి జీవన విధానం, మూలాలు మారలేదు. అందుకే వీరి రోజువారి జీవన విధానంలో భిన్నత్వంతో కూడిన హిందూ, ముస్లిం సంస్కృతి మిళితమైన భిన్నత్వం మనకు కన్పిస్తుంది. దూదేకుల్లో సంస్కృతి ఎక్కువగా మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారిలోనే కన్పిస్తుంది. బహుశా సందర్భంగానే వీరు ఇరు మతాల హిందూ,ముస్లిం సంస్కృతులకు దగ్గరై సగం తురకోడు, సగం సాయిబు, సగం తెలుగోడు అని హేళనగా ఇరు మతాల చులకనకు గురవుతున్నారు.

 

దూదేకులు కొన్ని తరాలుగా బాధను, దుఃఖాన్ని దిగమింగుకుని జీవనవిధానాన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఎమైనా హిందూ మతాన్ని ఆచరించే తెలుగు వారు కావొచ్చు, ఇస్లాం మతాన్ని ఆచరించే ముస్లింలు కావొచ్చు దూదేకుల భిన్నత్వాన్ని, మిళితమైన సంస్కృతి చూసి సగర్వంగా గర్వపడాలి. కానీ.! చులకన చేయరాదు. ఎందుకంటే భారతదేశంలోని వ్యక్తులైన సరే ఇతర మతాలను, ఇరు మతాల సంస్కృతిని గౌరవిస్తారు. కానీ.! పాటించరు. ఏక కాలంలో ఇరు మతాల ఆచారాలను, సంస్కృతిని గౌరవించడం, ఆదరించడం మాత్రమేగాక, మతాల సంస్కృతిని, ఆచారాలను కట్టుదిట్టంగా పాటిస్తూ మన దేశంలో జీవనం కొనసాగిస్తున్నవారు దూదేకులు మాత్రమేనని చెప్పవచ్చును. ఒక్క సంఘటన చాలు దూదేకులు మన భారతీయ లౌకికతకు నిలువుటద్దమని చెప్పడానికి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలలో నివసించే దూదేకుల్లో భిన్నత్వం, లౌకికత మనకు నేటికి కనబడుతుంది

 

                   దూదేకుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు వీరు ఇస్లాం మత పండుగలైనా రంజాన్, బక్రీద్, మిలాదున్ నబీ పండుగలతో పాటు, హిందువుల పండుగలైనా వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి మొదలగు పండుగలతో పాటు, ఇరు మతాల సంస్కృతికి నిలయమైన మొహర్రంను కూడా సంతోషంగా జరుపుకుంటారు. దాదాపుగా పల్లె ప్రాంతాల్లో నివసించే దూదేకులు శుభ కార్యక్రమాల్లో కావొచ్చు, వివాహ కార్యక్రమాల్లో కావొచ్చు, గృహ ప్రవేశంలో కావొచ్చు పక్కగా ఇరుమతాల సంస్కృతులను పాటిస్తారు. దూదేకులు హిందూ మతంలో భాగమైన మూఢనమ్మకాలు, శకునాలు, రోజు మంచి రోజునా కాదా? రాహుకాలం ఏమైనా ఉందా.? అమావాస్యనా.? అని క్యాలెండర్ని తుచతప్పకుండా పాటించడం లాంటి విషయాలను నేటికి కూడా మనం చూడవచ్చును. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు దాదాపుగా ఇస్లాం సంస్కృతికికి అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ఏదీ ఏమైనా దూదేకుల వారు గర్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే ఇరు మతాల సంస్కృతిని పాటిస్తూ భారతీయ లౌకికతకు ప్రతీకగా ఉన్నారు కాబట్టి. కానీ.! ఇతరుల చూపే చులకన భావాన్ని పట్టించుకోకూడదు. నిజానికి చులకనకు గురికావాల్సింది చులకన చేసినవారే. మనిషికి మంచితనం, చేయూత ఇచ్చే మానవీయ గుణాన్ని కలిగి ఉండాలి. అదే మనిషికి కొలమానం అవ్వాలి. సామాజిక స్పృహ, గుణం లేనివారు అసలు మనుషులే కాదు.

 

దూదేకుల ఆర్ధిక జీవితానికి సంబంధించిన విషయానికొస్తే వీరు అధికంగా గ్రామీణ ప్రాంతాలలోనే నివసించడం వలన కులవృత్తినే నమ్ముకుని వెనుకబడిపోయారు. అందువలన దాదాపుగా వీరు శారీరక శ్రమ పైనే ఆధారపడటం వలన వచ్చే ఆదాయంతో కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితులలో కూరుకుపోయారు. బహుశా దీని కారణంగానే వీరి పిల్లలు కూడా చదువుకు దూరమై శారీరక శ్రమకు అల్లుకుపోయారు. పూర్వం నుంచి నేటి ఆధునికయుగం వరకు కూడా వీరు పత్తి నుండి విత్తనాల్ని వేరుచేసి దూదిని శుభ్రపరిచి, దూదిని ఏకి పరుపులు, దిండ్లు తయారు చేసేవారు. అయితే గత రెండు, మూడు దశాబ్దాల నుండి ప్రపంచమంతా ఆధునికమై ఒక కుగ్రామంలా మార్పు చెందడం వలన దూదేకుల జీవన విధానంలో భాగమైన కుల వృత్తిలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచం ఆధునిక వెలుగులో హంగులతో ప్రపంచీకరణను ఆహ్వానించడం వలన దూదేకుల కులవృత్తిని ఆధునిక యంత్రాంగం, పరిశ్రమలు ధ్వంసం చేశాయి. ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన పరిశ్రమలు, యాంత్రీకరణ వీరి కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇటువంటి వాతావరణంలో దూదేకులు బతుకు భారాన్ని కొనసాగించడానికి వివిధ రకాల వృత్తులను, వివిధ రకాల పనులను ఎన్నుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఎక్కడన్నా కొన్నిచోట్ల నేటికి ఇంటి దగ్గరికి వెళ్ళి పరుపులు, దిండ్లు కుట్టి జీవనాధారం కొనసాగించే దూదేకులు లేకపోలేదు. అయితే నేడు దాదాపుగా పల్లె ప్రాంతాలలో కూడా ప్రపంచీకరణ కోరలు చాచడం వలన అవి కూడా కొనేవారు కరువయ్యారు.

 

                 ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన ఆధునిక యంత్రాంగం దూదేకుల జీవనాన్ని బలంగా దెబ్బ కొట్టినది. వందమంది ఒక రోజులో చేసే పనిని జిన్నింగు మిల్లులు ఒక గంటలో చేసేవి. జిన్నింగు మిల్లుల వలన అనేకమంది దూదేకులు దూది ఏకే వృత్తికి దూరమై రోడ్డున పడ్డారు. దూది ఏకే వృత్తి గల్లంతు అవ్వడంతో కొంతమంది దూది ఏకేవృత్తికి స్వస్తి పలికి టైలరింగ్ పనులు, ఎంబ్రాయిడరింగ్ పనులు, గోళీ సోడాలు తయారు చేయడం, రోజువారి దినసరి కూలీ పనులతో కుటుంబ భారాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే పనులను చేసే దూదేకుల జీవితాలపై కూడా ఆధునిక యంత్రాలు కోలుకొని దెబ్బకొట్టాయి. రెడీమేడ్ వ్యవస్థ టైలరింగ్ పనులు, ఎంబ్రాయిడరింగ్ పనులు చేసే వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. తోపుడు బండ్లపై గోళీ సోడాలు అమ్ముకునే దూదేకుల జీవితాలపై మిషనరీ సోడా యంత్రాంగం రావడం వలన వీరి జీవితాలు మళ్లీ ప్రశ్నార్థకంలో పడ్డాయి. వ్యవసాయ పనుల్లోను ఆధునిక యంత్రాలు ప్రవేశించాయి. దీనితో దాదాపుగా వ్యవసాయ పనులు చేసే దినసరి కూలీల బతుకులు కూడా గందరగోళంలో పడ్డాయి. రిక్షాల తొక్కి జీవనధారం కొనసాగించే వారిపై కూడా ఆటోలు, CABలు గుదిబండలా మారాయి. మరికొంత మంది దూదేకులు మేస్త్రీలుగా, బెల్దారులుగా, డ్రైవర్లుగా, డబ్బున్నోళ్ల ఇళ్ల దగ్గర పరిశ్రమల దగ్గర సెక్యూరిటీ గార్డుల్లా, కార్ఖానాల్లో దినసరి కూలీలుగా బతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొంతమంది దూదేకులు రోడ్లపై చిన్న చిన్న చిల్లర షాపులు, మెకానిక్ షాపులు, టీ కొట్టులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, టిఫెన్ సెంటర్లు పెట్టుకుని కుటుంబ భారాన్ని మోసేవారున్నారు.

 

                  దూదేకులు జనాభా పరంగా అధికారిక లెక్కల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు, మూడు లక్షల చొప్పున 6లక్షల మంది దాకా ఉన్నారు. కానీ.! వీరి జనాభా నిజానికి 15లక్షలు పై మాటే.! వీరు కొంతమంది హిందూ మతానికి అనుగుణంగా రెవిన్యూశాఖ పరంగా ధృవ పత్రాలు తీసుకొవడం, మరికొంత మంది ఇస్లాం మతానికి అనుగుణంగా రెవిన్యూశాఖ నుంచి ధృవ పత్రాలు అందుకోవడం వలన వీరి జనాభాపై ప్రభుత్వాలకు స్పష్టత లేదు. అందువలన పక్కాగా దూదేకులు అనేవారి లిస్ట్ ఆధారంగానే వీరి జనాభా లెక్కలు ప్రభుత్వాల దగ్గర ఉన్నందు వలన ప్రభుత్వాల నుంచే అందే పథకాలు గానీ, రుణాలు గానీ, విద్య, వైద్య పరంగా అందే సదుపాయాలు పొందలేకపోతున్నారు. అయితే దూదేకులు ఎక్కువ భాగం దాదాపుగా 80% ముస్లింలు ఆచరించే సంప్రదాయాలతో పాటు వారి జీవనవిధానానికి అనుగుణంగా ఉండే సంప్రదాయాలను పాటిస్తుంటారు

 

               కళా రంగంలో భాగమైన నాదస్వరానికి పెట్టిన పేరు దూదేకులు. దాదాపుగా నాదస్వర విజ్ఞానంలో దేశం మెచ్చుకోదగిన వ్యక్తుల్లో వంద మందికి పైగా ఉన్నారు. అయితే వీరిలో చిన పీరు సాహెబ్, షేక్ ఆదం సాహెబ్, పద్మశ్రీ షేక్ చిన మౌలా! (కరవది గ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గరలో), చిన ఖాసీం.సాహెబ్, గోపవీడు హసన్ సాహెబ్ లాంటి వారు దేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందారు. దూదేకులు అని పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ప్రముఖులు, దూదేకుల జాతి అణిముత్యాలు దూదేకుల సిద్దప్ప, కబీరు, దాదూ దయాల్, పద్మశ్రీ షేక్ నాజర్, పద్మశ్రీ షేక్ చిన మౌలా!, నాగూర్ బాబు మొదలగువారని ఖరాఖండీగా చెప్పవచ్చును. సాహిత్య రంగంలో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్, నూర్ బాషా రహంతుల్లా, సయ్యద్ సలీం, ఖాజా, షాజహానా మొదలగు వారిని చెప్పవచ్చును. చిత్రకళా రంగంలో ప్రముఖంగా అక్బర్, అబ్దుల్ విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో వన్నూరు బాషా అనే పరిశోధక విద్యార్థి దూదేకుల సాహిత్యంపై సమగ్రమైన పరిశోధన చేస్తున్నారు. త్వరలో రికార్డు రూపంలో తొలి సాహిత్య పరిశోధన గ్రంథంగా మనందరి ముందుకు రాబోతున్నది. దూదేకుల చరిత్రను రికార్డు చేయడంలో . దావూద్ గారిని ప్రముఖంగా చెప్పవచ్చును. తెలుగులో . దావూద్ గారు "నూర్ బాషీయులు చరిత్ర సంస్కృతి" అనే రచన దూదేకుల చరిత్రకు మచ్చుతునకగా చెప్పవచ్చును.

 

             అయితే దూదేకుల అభ్యున్నతి గురించి చివరగా రెండు మాటలు ప్రస్తావించాలి. ఒకటి వీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా, విద్య, వైద్య, ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు. వీటిని అధిగమించేందుకు దూదేకులు, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా ఆలోచించి ముందడుగు వేయాలి. మరొక విషయం ఇరు మతాల నుంచి పడుతున్న వివక్షను పారదోలాలి. ముఖ్యంగా మరొక విషయం దూదేకుల సామాజిక ఉద్యమకారులు, ఇతర సంస్థల వారు, సంఘాల వారు ముఖ్యంగా నేడు చేయవల్సింది ఒక్కొక్క జిల్లాలో వీరి జనాభా ఎంత ఉంది, ఎంత మంది నిరక్షరాస్యులున్నారు, ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వారున్నారు, ఎంతమంది ఉద్యోగులున్నారు, ఎంతమంది సహాయం కోసం ఎదురుచూసే వారున్నారనే విషయాలపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో వారి అభివృద్ధికి బంగారు బాటలు వేసినవారవుతారు.

 

డా. షేక్ ఇబ్రహీం,

అసిస్టెంట్ ప్రొఫెసర్,

.పి ...టి : ఒంగోలు.

సెల్ : 95333 36227

No comments:

Post a Comment