Friday, 7 August 2015

తెలంగాణలో స్వరాజ్యం?: కోదండరామ్

తెలంగాణలో స్వరాజ్యం?: కోదండరామ్

ఆప్‌ తరహాలో జాప్‌!?.. కోదండ నేతృత్వంలో కొత్త శక్తి!  యోగేంద్ర యాదవ్‌తో చేతులు కలపనున్న ప్రొఫెసర్‌ 10న ఢిల్లీలో కీలక సమావేశం.. సంపూర్ణ తెలంగాణ సాధనకు కృషి
 
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అణగారిన వ్యక్తుల గొంతుకై మరో ‘స్వరాజ్యం’ ఉద్బవించనుంది. సంప్రదాయ రాజకీయాలకు తెరదించి ప్రజల ఆశలను నెరవేర్చేందుకు నవశక్తి నడుం బిగిస్తోంది. మరోసారి సకల జనులను ఐక్యం చేయడానికి ప్రయత్నం మొదలైంది. ఈ మేరకు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో కొత్త శక్తులు పురుడు పోసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆప్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ముఖ్య కారకుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్‌ తెలంగాణలో కోదండరాంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారని, ఈనెల పదిన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. వివరించాయి. ఆప్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత యోగేంద్ర యాదవ్‌ ‘స్వరాజ్‌ అభియాన్‌’ అనే కొత్త వేదికను ప్రారంభించారు. దీనిద్వారా ఆయా రాషా్ట్రల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనా యోగేంద్ర దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్‌ వెళ్లి కోదండరాంతో ఆయన భేటీ అయినట్లు తెలిసింది. వాస్తవానికి, ఆప్‌లో, అంతకుముందు సెఫాలజిస్టుగా ఉన్నప్పటి నుంచీ కోదండరామ్‌తో యోగేంద్ర యాదవ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
 
గతంలోనే ఆప్‌కు తెలంగాణ కన్వీనర్‌గా ఉండాలంటూ కోదండకు యోగేంద్ర యాదవ్‌ ఆఫర్‌ ఇచ్చారని, దానిని ఆయన తిరస్కరించారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం యోగేంద్రతో కలిసి పని చేయడానికి కోదండరాం సుముఖంగా ఉన్నారని, ఈనెల పదిన వీరిద్దరూ సమావేశం కానున్నారని ఆ వర్గాలు వివరించాయి. ఆరోజు జంతర్‌ మంతర్‌లో భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా స్వరాజ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు కోదండరాం హాజరవుతున్నట్లు పైకి చెబుతున్నా.. నిజానికి భవిష్యత్‌ ప్రణాళికా రచనకు శ్రీకారం చుడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. ‘ఇప్పుడు ప్రొఫెసర్‌గా ఉన్నా. రేపు ఏమి అవుతానో చెప్పలేను’, ‘సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తాం’ అంటూ ఇటీవల కోదండరాం చేస్తున్న ప్రకటనల వెనక ఎంతో అర్ధం ఉందని కూడా ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ వైఖరితో అసంతృప్తితో ఉన్న కోదండరాం తన సహచరులతో పలు విషయాలను పంచుకున్నట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ అవలక్షణాలైతే ఉండకూడద నుకున్నామో.. అవన్నీ ఇంత త్వరగా దాపురిస్తాయని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నాయి. ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకొనిపోయిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం అందరినీ పక్కన పెట్టడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడంపైనా కోదండరాం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది.
 
ప్రజా సమస్యలపై వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, అధ్యయనబృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పథకాలపై సర్వేకు పురమాయించినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణం లేదని, అణచి వేయాలనుకునే నాయకత్వం వచ్చిందని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. రాజకీయ, సాంఘిక సమీకరణాలను విశ్లేషించడంలో దిట్ట అయిన యోగేంద్ర యాదవ్‌ కోదండరామ్‌కు అండగా ఉండాలని నిర్ణయించారు. ఆప్‌ కోసం గతంలో ఢిల్లీలో నెరపిన మంత్రాంగాన్ని తెలంగాణలో కోదండరాం కోసం చేయనున్నారు. ఆప్‌ తరహాలో తెలంగాణలో జాప్‌ (జాయింట్‌ యాక్షన్‌ పార్టీ)ని ఏర్పాటు చేయాలని కూడా యోగేంద్ర సూచించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇంకా కోదండరాం తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాటను మాత్రం తోసి పుచ్చలేదని తెలిసింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు జాప్‌కు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment