|
ముంబై వరుస పేలుళ్ల కుట్ర గురించి యాకూబ్‌కు పూర్త్తిగా తెలిసే వుంటుందా అనేది నిశ్చితంగా చెప్పలేము. సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును అమలుపరచడం జరిగిపోయినందున 1993 ముంబై పేలుళ్లలో యాకూబ్ పాత్ర కచ్చితంగా ఏమిటనే విషయమై చర్చకు స్వస్తి చెప్పి తీరాలి. సామూహిక నేరాల విషయంలో భారత రాజ్యవ్యవస్థ, నేర న్యాయవిచారణా వ్యవస్థల వివక్షాపూరిత వైఖరిలో మార్పు తీసుకు వచ్చేందుకు మనం తప్పక ప్రయత్నించాలి.
ముంబై పేలుళ్లు, 1992 డిసెంబర్- 1993 జనవరిలో అయోధ్య, ముంబైలలో సంభవించిన ‘సంఘటనల సమస్తానికి’ ప్రతిచర్యగా కన్పిస్తున్నాయని జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ నివేదిక వ్యాఖ్యానించింది. ఆ సంఘటనల కార్యకారణత్వాన్ని జస్టిస్ శ్రీకృష్ణ బాగా అర్థం చేసుకున్నారు. 1992-93లో ముంబైలో అల్లర్లు చోటుచేసుకోకపోతే 1993 మార్చిలో వరుస పేలుళ్లు సంభవించేవి కావు. అలాగే గోధ్రాలో రైలు బోగీల దగ్ధం జరగకపోతే 2002లో గుజరాత్ మారణకాండకు ఆస్కారముండేది కాదు. ఇందిరాగాంధీ హత్యకు గురికాకుండా ఉన్నట్టయితే 1984లో సిక్కుల ఊచకోత జరిగేది కాదు. మనం ఇంకా ఇలా వాదించవచ్చు: బాబ్రీ మస్జీదు కూల్చివేత జరిగి వుండకపోయినట్టయితే బాబ్రీ అనంతర అల్లర్లు జరిగేవికావు; అమృత్‌సర్ స్వర్ణాలయంపై దాడికి సైన్యాన్ని ఇందిర ఆదేశించికపోతే సిక్కు ఉగ్రవాదాన్ని మరింత ముందుగా అదుపు చేయడం సాధ్యమయివుండేది; అయోధ్యలో విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు కరసేవ చేసివుండకపోయినట్టయితే గోధ్రాలోగానీ, మరెక్కడైనాగానీ ఏ రైలుపైన దాడి జరిగివుండేది కాదు. ఏ హింసాత్మక చర్యకైనా ‘మూలకారణాలను’ శోధించడం ప్రమాదకరమైన విషయమవుతుంది. చర్య-ప్రతిచర్య సిద్ధాంతాలు మూలకారణాలను ఖచ్చితంగా కనుక్కోగలుగుతాయా? అంతిమంగా అవి హింసను హేతుబద్ధీకరణ చేయడానికి దారితీయవూ?
అయినప్పటికీ, జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నట్లు, ముంబై పేలుళ్లను వాటికి ముందు చోటుచేసుకున్న అల్లర్ల నుంచి విడదీసి చూడలేము. ఈ కారణంగానే ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్ మరణ శిక్షపై కథనం 1992-93 అల్లర్లను కూడా అనివార్యంగా ప్రతిబింబిస్తుంది. ముంబై మహీమ్ ప్రాంతంలో మెమన్ అండ్ మెహతా (గుజరాతీ హిందువు అయిన మెహతా ఈ సంస్థలో భాగస్వామి) అనే చార్టెర్డ్ అకౌంటెన్సీ సంస్థను విజయవంతంగా నిర్వహిస్త్తున్న యాకూబ్ ‘ముస్లింలు మాత్రమే’ ఉన్న భయంకర ఉగ్రవాద కుట్రలో ఎందుకు పాల్గొన్నాడు? బాబ్రీ కూల్చివేత అనంతరం చోటుచేసుకున్న మతతత్వ అల్లర్లలో బాగా నష్టపోయిన ప్రాంతాలలో మహీమ్ కూడా ఒకటి కావడమే యాకూబ్‌ను, ఆ కుట్రలో భాగస్వామి కావడానికి పురిగొల్పి వుంటుందా? అల్లర్లలో తన సోదరుడి కార్యాలయంపై దాడి జరగడం, కుటుంబానికి బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడం ‘పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలని’ మహీమ్ ప్రాంతంలోని ముస్లింలను స్థానిక శివసైనికులు బెదిరించడం ఇత్యాది అంశాలు యాకూబ్‌ను ఉగ్రవాద మద్దతుదారుగా మార్చివేసి వుంటాయా?
యాకూబ్‌కు మరణశిక్షను అమలుపరచడం ఉగ్రవాదులను నిరోధించడానికి ఎంతైనా తోడ్పడుతుందని, వరుస పేలుళ్లలో 257 మంది మృతుల కుటుంబసభ్యులకు అంతిమ ఊరటనిస్తుందని టీవీ చర్చల్లో పాల్గొన్నవారిలో చాలామంది నొక్కి చెప్పడం జరిగింది. అయితే చాలా కొద్దిమంది మాత్రమే ముంబై అల్లర్లకు పాల్పడిన వారిని కూడా అంతే కఠినంగా శిక్షించాలని కోరారు.
ఆ అల్లర్లలో 900 మందికి పైగా చనిపోయారు. కేవలం ముగ్గురికి మాత్రమే ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోగా మిగతా ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. అయినప్పటికీ ముంబై అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న వారిని ‘జాతి-వ్యతిరేకులు’గా ముద్ర వేస్తున్నారు. 1993 మార్చి 12(వరుస పేలుళ్లు సంభవించిన రోజు)కి ముందు జరిగిన సంఘటనలను చాలా సులభంగా మరచిపోతున్నారు. ఎవరైనా ఆ వరుస పేలుళ్ల పూర్వరంగాన్ని గుర్తు చేసుకుంటే వారిని ‘ఉగ్రవాదులకు’ సంజాయిషీదారులని ఆరోపిస్తున్నారు. మతం పేరిట బాకులతో అల్లర్లలో పాల్గొనే వారిని ఆర్‌డీఎక్స్‌తో దాడులు జరిపే ఉగ్రవాదులతో పోల్చకూడదని వాదిస్తున్నారు.
విజ్ఞతాయుతంగా ఆలోచించే ఉదారవాదులకు తమ అభిప్రాయాలను సమర్థించుకోవాల్సిన అగత్యమేర్పడింది. ఈ కారణంగానే యాకూబ్ వ్యవహారంలో వ్యక్తమవుతున్న అసమ్మతిని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు హైజాక్ చేస్తున్నారు. ఓవైసీ ఉదారవాది కాదు. రాజకీయ వేత్త. ‘ముస్లింల ప్రయోజనాలను’ పరిరక్షించే వాడిగా పేరు పొందడానికి ఆయన ఆరాటపడుతున్నారు. బాల్ ఠాక్రే వ్యవహరించిన తీరుకు ఇది భిన్నమేమీ కాదు. 1992-93 అల్లర్లు, హింసాకాండ సందర్భంలో బాల్ ఠాక్రే తనను తాను హిందువుల ‘పరిరక్షకుడు’గా భావించుకున్నారు; అలా వ్యవహరించారు. 1995 మహారాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో శివసేన విజయానికి ఇది ఎంతైనా తోడ్పడింది. అలాగే ప్రవీణ్ తొగాడియా, నరేంద్ర మోదీల విషయాన్ని చూడండి. 2002లో వారు తమను తాము హిందూ హృదయ్ సమ్రాట్‌లుగా, గుజరాత్ అస్మిత పరిరక్షకులుగా ప్రచారం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే వ్యవహరించలేదూ? 1984 సార్వత్రక ఎన్నికల సందర్భంగా సిక్కులపై ఉగ్రవాదులనే ముద్ర వేస్తూ కాంగ్రెస్ కపట ప్రచారం చేసింది.
అప్పటికీ ఇప్పటికీ ఏమిటి తేడా? ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థల అంతర్జాతీయ ‘జిహాద్’ బెడద అప్పుడు లేదు. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థల ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ముస్లిం యువత ఆ ప్రభావానికి లోనై ప్రధాన స్రవంతికి దూరమవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాల పట్ల ‘ప్రతీకార’ చర్యలకు పాల్పడుతున్నారు. రాజ్య వ్యవస్థ న్యాయబద్ధంగా వ్యవహరించాలని, అందరికీ సమానావకాశాలు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో కంటే మతతత్వ అల్లర్ల కేసులో సాక్ష్యాధారాలను సేకరించడం చాలా కష్టం అని 1992-93 అల్లర్ల కేసులపై దర్యాప్తు సరిగ్గా జరగకపోవడానికి సాకు చెప్పడం ఇంకెంత మాత్రం సబబు కాదు.
హిందూ ఉగ్రవాద బృందాల ప్రమేయమున్న మాలేగావ్, అజ్మీర్ పేలుళ్ల కేసుల్లో సాక్షులు పలువురు ప్రతికూలురుగా మారుతున్న దృష్ట్యా ముంబై పేలుళ్ల కేసులో తీర్పును ఉగ్రవాదాన్ని రాజ్య వ్యవస్థ ఎంత మాత్రం సహించదనడానికి చిహ్నంగా ఎలా భావించగలం? ముంబై పేలుళ్ల కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న ఉజ్వల్ నికమ్ ప్రజల దృష్టిలో హీరోగా ఉండగా మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రాసిక్యూటర్లు ఎందుకు బెదిరింపులకు గురవుతున్నారు? 42 మంది ముస్లింలు కాల్చివేతకు గురైన హషింపురా ఘటన కేసులో మూడు దశాబ్దాల తరువాత తీర్పు వెలువడింది. ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గోధ్రాలో రైలు బోగీల దగ్ధం కేసులో నిందితులుగా ఉన్న వారు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్షకు గురికాగా నరోదా పటియా లాంటి గుజరాత్ అల్లర్ల కేసులలోని నిందితులు బెయిల్‌పై ఎలా విడుదలయ్యారు? వారికి మరింత కఠిన శిక్షలు విధించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఎందుకు కోరడం లేదు? వివిధ వర్గాలుగా చీలిపోయి వున్న సమాజంలో ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తడం ‘జాతి-వ్యతిరేకులు’ అనే ఆరోపణకు గురికావడానికి దారితీస్తోంది. పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలనే బెదిరింపులను ఎదుర్కోవలసి వస్తోంది. అయితే వీటిని మరో దృష్టి కోణంలో చూడండి. ఈ ప్రశ్నలు వాస్తవంగా ‘ఇబ్బందికరమైన సత్యాలు’. ఏ పరిణతి ప్రజాస్వామ్యమైనా వీటిని ఎదుర్కొని తీరాలి. అలా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనమూ మరో పాకిస్థాన్ కాబోమనే భరోసా కలుగుతుంది.
తాజా కలం: 1993లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఎదుట మూడురోజుల పాటు సాక్ష్యమిచ్చాను. మూడో రోజు కోర్టు నుంచి నిష్క్రమిస్తుండగా శివసైనికుడు ఒకరు నన్ను ఆపి ‘బాలా సాహెబ్ మా దేవుడు, మా రక్షకుడు, ఏ న్యాయస్థానమూ ఆయన్ని దోషిగా రుజువు చేయలేదు. ఇది మరచిపోవద్దు’ అని హెచ్చరించాడు. అతను సరిగానే మాట్లాడాడని రుజువయింది. 1995లో ముంబైలో బీజేపీ-శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శ్రీకృష్ణ నివేదికను చెత్తబుట్ట పాలుచేసింది. 2012లో బాలే ఠాక్రేకు కాంగ్రె్‌స-ఎన్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
|
No comments:
Post a Comment