- ఏడేళ్లలో పది లక్షల మందికి పైగా వృద్ధి
- విద్యాధిక్యతలోనూ మనవాళ్లే గ్రేట్.. ‘పీ’ సంస్థ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్, మే13 : అమెరికాలో హిందువుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. గడచిన ఏడేళ్లలోనే దాదాపు పది లక్షలకు పైగానే హిందువుల సంఖ్య పెరిగినట్లు ‘పీ’ సంస్థ తాజా సర్వేలో వెల్లడైంది. 2007 నాటికి అమెరికా మొత్తం జనాభాలో 0.4 శాతంగా ఉన్న హిందువుల సంఖ్య, 2014 నాటికి 0.7 శాతానికి చేరిందని సర్వే పేర్కొంది. విద్యాధికత, వార్షికాదాయం విషయంలో హిందువులు యూదులకు ఏమాత్రం తక్కువగా లేరని సర్వే నివేదిక చెబుతోంది. అమెరికాలో నివసిస్తున్న హిందూ జనాభాలో 77 శాతం మంది గ్రాడ్యుయేట్లు కాగా, యూదుల్లో 59 శాతమే గ్రాడ్యుయేట్లున్నారని సర్వే వెల్లడించింది.
అమెరికా మొత్తంగా చూసినా, అడల్ట్ గ్రాడ్యుయేట్లు 27 శాతమే. ఇక వార్షికాదాయం విషయానికి వస్తే, 44 శాతం యూదులు, 36 శాతం హిందువులు ఏడాదికి లక్ష అమెరికన్ డాలర్లకు పైబడి సంపాదిస్తున్నట్లు తేలింది. అమెరికా మొత్తంలో 19 శాతం మందికే లక్ష డాలర్ల వార్షికాదాయం ఉందని సర్వే వెల్లడించింది. పెళ్లిళ్ల విషయంలోనూ హిందువులు తమ మతానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వే గుర్తించింది.
అమెరికాలోని హిందువుల జనాభాలో 91 శాతం సొంత మతానికి చెందిన వధూవరులనే ఎన్నుకుంటున్నట్లు పేర్కొంది. 90 శాతం తాము హిందువులుగానే ఎదిగామన్నారు. అమెరికాలో అత్యధిక జనాభా విషయంలో, హిం దువులు, ముస్లింలు, యూదులు మాత్రమే స్థిర వృద్ధిని కనబరుస్తున్నట్లు సర్వే తెలిపింది.
No comments:
Post a Comment